ఆ నియోజకవర్గం BSP కంచుకోటగా చెబుతారు. ఆ బహుజనుల కోట నుంచే పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్నికల బరలో దిగబోతున్నారా? అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రవీణ్‌కుమార్ భావించడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ప్రవీణ్ పర్యటన ఎన్నికల యాత్రేనా?
కుమ్రంబీమ్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి బలమైన స్థావరంగా భావిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లలో అనుహ్యంగా BSP రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టి నియోజకవర్గం నుండి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బరిలో దిగాలని భావిస్తున్నారట. అందులో బాగంగానే బహుజన రాజ్యదికార యాత్రను ఐదురోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రవీణ్ నిర్వహిస్తున్నారు.
ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లుతున్నారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం తెచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనేటి కోనప్ప విఫలం చెందారని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.
గుడ్బై ఐపీఎస్.. ఛలో అసెంబ్లీ
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ..ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికలే ఆయన ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు. సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ప్రవీణ్ అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో దళిత, గిరిజన, మైనారీటీ, బీసీ ఓటర్లు భారీగా ఉన్నారు. ఆయా వర్గాలే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి.
పైగా 2014లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే మళ్ళీ బలహీనవర్గాల ప్రజలంతా మద్దతిస్తారనే అంచనాతోనే ఈ స్థానంపై కన్నేసారని తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్. ఎమ్మెల్యేపై వ్యతిరేకత బిఎస్పీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. తాను ఎస్‌సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ...జనరల్ సీటులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు.
ఎంత పెద్ద నాయకులైనా రిజర్వుడు కేటగిరికి చెందినవారైతే..ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారు. కాని దానికి భిన్నంగా అందరివాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటునే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నా..పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment