పొత్తుకు బ్రేక్‌.. బీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు | Sakshi
Sakshi News home page

పొత్తుకు బ్రేక్‌.. బీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు

Published Sun, Mar 17 2024 4:36 AM

BSP backtracks on election alliance with BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్‌ఎస్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్‌ పడింది. బీఆర్‌ఎస్‌తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం నందినగర్‌లో కేసీఆర్‌తో ప్రవీణ్‌కుమార్‌ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్‌ఎస్, కేసీఆర్‌తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి.

బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్‌ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్‌కు బీఆర్‌ఎస్‌లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్‌
కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్‌ఎస్‌తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు.

పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించాను.

రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు.

ఆది నుంచీ ఊగిసలాటే...
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్‌ఎస్‌ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్‌తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్‌ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్‌ మాట్లాడారని కూడా పేర్కొన్నారు.

రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్‌ ప్రకటించి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.ఐపీఎస్‌ అధికారి నుంచి...
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు.

గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్‌’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్‌కుమార్‌ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్‌కుమార్‌ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమా­లను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు.

ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్‌ఎస్‌తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement