మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి క్యూ కట్టాల్సిందే.. | RS Praveen Kumar joined BRS | Sakshi
Sakshi News home page

మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి క్యూ కట్టాల్సిందే..

Published Tue, Mar 19 2024 6:18 AM | Last Updated on Tue, Mar 19 2024 11:52 AM

RS Praveen Kumar joined BRS - Sakshi

ప్రవీణ్‌కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేసీఆర్‌

నాలుగేళ్ల తర్వాత 100 సీట్లతో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టీకరణ

వంద రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత

నీళ్లు, కరెంటు సరఫరా చేయలేని దుస్థితి

బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం వల్ల మంచే జరిగిందన్న కేసీఆర్‌

గాడిద వెంబడి పోతేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్య

బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

గజ్వేల్‌/సాక్షి, హైదరాబాద్‌: అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి గురించి ఆలోచించబో మని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజా వ్యతి రేకత పెరిగి, నాలుగేళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి, బీఆర్‌ఎస్‌ వంద సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన నేతలే తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అలాంటి వాళ్లను చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్‌.. మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వ్యక్తులను తిరిగి చేర్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన అనుచరులతో కలిసి సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు.

చంద్రబాబు రైతుల్ని ఇబ్బంది పెట్టారు
‘వంద రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. నేను అకుంఠిత దీక్షతో మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. కానీ ప్రస్తుతం మిషన్‌ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అర్థం కావడం లేదు. కరెంటు సరఫరా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాటి ఉమ్మడి పాలనలో తెలంగాణపై కరెంటు సహా అన్ని రంగాల్లో వివక్ష కొనసాగింది.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచ బ్యాంకు పిచ్చితో ఆర్థిక సంస్కరణల పేరిట రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబుకు ఏమీ తెలియదు. అన్నీ తెలిసినట్లు నటించే వారు. విద్యుత్‌ కష్టాల నేపథ్యంలో చంద్రబాబును సైతం ఎదిరించా. తెలంగాణ ఉద్యమంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలేదు. నాపై దండకాలు రాసి పత్రికల్లో వేశారు. మరోవైపు రూ.5 వేల కోట్లు, కేంద్ర మంత్రి పదవి ఆఫర్‌ ఇచ్చి ఉద్యమం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయినా ఏనాడూ తెలంగాణ ఉద్యమాన్ని వీడలేదు..’ అని కేసీఆర్‌ వెల్లడించారు.

ఓటమి పార్టీకి మంచిదే..
‘అగాథంలో ఉన్న తెలంగాణకు బీఆర్‌ఎస్‌ పాలనలో ధైర్యం వచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడిన ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ హామీలను నమ్మి అధికారాన్ని అప్పగించారు. కానీ కొద్ది రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్‌ పాలన అర్థమైంది. బీఆర్‌ఎస్‌ ఒక్కసారి ఓడిపోవాలని నేను కూడా భావించా. ఈ ఓటమి పార్టీకి మంచే చేస్తుంది. ఒక్కసారి ఓడితే నష్టమేమీలేదు. గాడిద వెంబడి పోతేనే కదా... గుర్రం విలువ తెలిసేది.

దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి
దళితబంధు వల్ల ఓడిపోయామనే భావన ఎన్నికల ఫలితాల సమీక్ష తర్వాత బయటకు వచ్చింది. దళిత వర్గాలకు ఎలాంటి బ్యాంకు ష్యూరిటీలు లేకుండా రూ.10 లక్షల చొప్పున అందజేసి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపడం తప్పా? దళిత సమాజం దీనిని సానుకూలంగా ఎందుకు తీసుకోలేకపోయిందో విశ్లేషించాల్సిన అవసరముంది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరును పెట్టడమేగాకుండా భారీ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..’ అని కేసీఆర్‌ తెలిపారు.

ప్రవీణ్‌కుమార్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాం
‘ప్రవీణ్‌కుమార్‌ నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయనను బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే ప్రకటిస్తాం. భవిష్యత్‌లోనూ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రవీణ్‌తో కలిసి దళిత శక్తిని ఏకం చేసేందుకు, బలహీన వర్గాలను ఏకతాటి మీదకు తెచేందుకు ఎజెండా తయారు చేయాల్సిన అవసరముంది. ఈ విధానం దేశానికే టార్చ్‌ బేరర్‌గా మారాలి..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత పేర్కొన్నారు. 

అలాగైతే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతా: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
తెలంగాణ వాదం, బహుజన వాదం వేర్వేరు కాదని ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. వివక్షకు, అణిచివేతకు వ్యతిరేకంగా ఈ రెండు ఉద్యమాలు పుట్టుకొచ్చాయని తెలిపారు. తాను ప్యాకేజీ తీసుకుని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకునే వ్యక్తినే అయితే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు.  

రేవంత్‌ బెదిరింపులు మానుకోండి
‘సీఎం రేవంత్‌రెడ్డి నన్ను పొగుడుతూనే సుతిమెత్తగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. నేనూ పాలమూరు బిడ్డనే, నడిగడ్డ తిండి తిన్నవాడినే. మీ దారికి రాని వారికి బెదిరింపులు మానుకోండి. వార్నింగులు ఇచ్చి మీ హోదాను తగ్గించుకోవద్దు..’ అని ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లేముందు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవి చేపట్టాల్సిందిగా నన్ను సీఎం రేవంత్‌ ఆహ్వానిస్తే నేను తిరస్కరించిన మాట నిజమే. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుని ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించా.

అయితే నేను బీఆర్‌ఎస్‌లోకి వెళ్తే సమాధానం చెప్పాలని రేవంత్‌ అంటున్నారు. అయితే ఏ వేదిక మీద పనిచేయాలో చెప్పే స్వేఛ్చ తెలంగాణ ప్రజలకు లేదా. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్ధపరులు గొర్రెల మందలా వస్తున్నారు. కానీ నిజాయితీ కలిగిన నేను ఆ గొర్రెల మందలో ఒకడిని కాలేను. నేను ప్యాకేజీ తీసుకునే వాడినే అయితే రేవంత్‌ గేటు వద్ద ఉండే వాడిని. నేను దొంగ ఆస్తులు రక్షించుకునేందుకు వచ్చే పిరికిపందను కాను. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం వచ్చా’ అని ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. 

కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారు
‘తరతరాల అణచివేతకు గురైన తెలంగాణకు విముక్తి కల్పించి వెలుగు వైపు నడిపించింది కేసీఆర్‌. ఆయన దురదృష్టవశాత్తూ అధికారంలో లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు బహుజన వాదులు కేసీఆర్‌ వెంట నడవాలని అనుకుంటున్నారు..’ అని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

చిన్నారికి శ్రీయా ఫూలేగా నామకరణం
కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకురాలు అకినేపల్లి శిరీష–ప్రవీణ్‌ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా కేసీఆర్‌ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement