మరో ఇద్దరికి బీఆర్‌ఎస్ గ్రీన్‌సిగ్నల్
ఇప్పటివరకు మొత్తం 13 మంది ఖరారు
పెండింగ్‌లో నల్లగొండ, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలు
మెదక్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్‌ఎస్ శుక్రవారం ప్రకటించింది. మెదక్ నుంచి ఎమ్మెల్సీ పరిపాటి వెంకట్రామిరెడ్డికి, నాగర్‌కర్నూల్ నుంచి ఇటీవలే బీఎస్పీ నుంచి చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనితో మొత్తంగా బీఆర్‌ఎస్ 13 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. మరో 4 సీట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
వంటేరు పేరు వినిపించినా..
మెదక్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరును బీఆర్‌ఎస్ దాదాపు నెల రోజుల క్రితమే ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ప్రకటన జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి తనకు పోటీచేసే ఉద్దేశం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జాయింట్ కలెక్టర్‌గా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ విజయం సాధించడంతో రాజీనామా చేసి సీఎం పదవి చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెదక్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆర్థిక బలం కలిగిన వెంకట్రామిరెడ్డి వైపు మొగ్గుచూపినట్టు సమాచారం.
పెండింగ్‌లో మరో నాలుగు సీట్లు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 11 సీట్లలో అభ్యర్థులను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఇద్దరి కలసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన స్థానాల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను ఇంకా నాలుగు సీట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాలకు కసరత్తు కొనసాగుతోందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. పెండింగ్ సీట్లకు రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపాయి.
30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, వేలేటి రాధకృష్ణశర్మ తదితరులు దీనికి హాజరయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తిరుమలకు వెళ్లడంతో భేటీకి రాలేదు. ఈ సందర్భంగా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఆలోగా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను పూర్తి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు సూచించారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు.
బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా: వంటేరు ప్రతాప్‌రెడ్డి
మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో.. గజ్వేల్ నియోజకవర్గ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన ప్రతాప్‌రెడ్డి.. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో సన్నిహితంగా ఉండేవారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేశారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
నాకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి: వెంకట్రామిరెడ్డి
మర్కూక్ (గజ్వేల్): తనను మెదక్ అభ్య ర్థిగా ప్రకటించడం పట్ల కేసీఆర్, హరీశ్‌రావులకు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా ఏడున్నరేళ్లు ఈ జిల్లాలో పనిచేశానని, తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దీనిని గుర్తించి తనకు అవకాశం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment