కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది గోండుల కోట. సిర్పూర్ ఒకప్పుడు గోండు (కోయ) రాజుల ఏలుబడిలో వున్న ప్రాంతం. దీనినే పూర్వ కాలంలో సూర్యపురంగా పిలిచేవారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు (కోయ) రాజు భీమ్ బల్లాలా పాలించాడు. ఈయన కాలంలోనే సిర్పూర్ కోట నిర్మితమైంది. ఈ రాజ్యానికి సరిహద్దుగా సిరోంచా, చంద్రపూర్, ఊట్నూర్, అహేరి, ఆసిఫాబాద్ కేంద్రాలుగా గోండు రాజ్యాలుండేవి. ముస్లిం, బ్రిటిష్ సైన్యాలు దండయాత్రలు చేసి ఈ రాజ్యాలను ఆక్రమించి కొల్ల గొట్టాయి. అయినా అలనాటి గోండు రాజ్యాల ఆనవాళ్ళు నేటికీ సజీవంగానే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఊట్నూర్, సిర్పూర్ టౌన్‌లలో ఉన్న కోటలు.
ఈ చారిత్రక కోటలు నేడు కబ్జాకోరల్లో చిక్కుకొని ఆనవాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. సిర్పూర్ టౌన్ కేంద్రంగా ఉన్న గోండు రాజుల కోట దాదాపుగా 10 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఉండేది. ప్రస్తుతం కోటగోడ, కోట స్థలంలో ఉన్న శిథిలావస్థకు చేరిన కొలను చూడవచ్చు. ఆ కోట భూములు రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ కోట నేడు భూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?)
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రభుత్వానికి మన చరిత్ర, సంస్కృతుల పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనం. అటువంటి ప్రభుత్వం ఉన్న కాలంలోనూ సిర్పూర్ కోట ఆక్రమణలకు గురవ్వడం బాధాకరం. ఇప్పుడు ఆ భూమిలో గ్రామ పంచాయితీ, హస్పిటల్, రోడ్లు, ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ళు ఉన్నాయి. కోటను భూకబ్జాదారుల నుంచి కాపాడి, రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణ కిందికి తేవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు)
– పోలేబోయి అశోక్
ఆదివాసీ చరిత్ర అధ్యయన వేదిక, సిర్పూర్ కాగజ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment