చెరిగిపోని చరిత్రకు సాక్ష్యం ఉదయగిరి దుర్గం
ఉదయగిరి చుట్టూ చూడదగ్గ ప్రదేశాలెన్నో
పర్యాటక అభివృద్ధి కోసం పడిగాపులు
గత ప్రభుత్వ హయాంలో అటవీశాఖతో ఎకోటూరిజం కోసం ప్రతిపాదనలు
ప్రభుత్వం మార్పుతో ప్రతిపాదనలు బుట్టదాఖలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చట్టూరా ప్రకృతి సోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు, ప్రాచీన పుణ్యక్షేత్రాలు, కళ్లు తిప్పుకోనివ్వని శిల్పాలతో నిర్మాణాలు, తిరుమల గిరులను పోలిన ఎత్తయిన పర్వత శ్రేణులు.. అడుగడుగున కనిపించే అలనాటి రాచ మందిరాలు.. ఒకటేమిటి ఎన్నో విశిష్టతలతో నిండిన ఉదయగిరి ప్రాంతం పర్యాటక శోభకోసం ఎదురుచూస్తోంది. గత ప్రభుత్వంలో సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపింది .. ఈ లోపే ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కోండ నవాబులు ఏలిన ఈ ప్రాంతం ఒకప్పుడు వైభవోపేతంగా విలసిల్లింది. కాలక్రమేణా తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది.
ప్రస్తుతం అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా కనిపించే మొండి గోడలు, శిథిల రాజభవనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి వందకిలోమీటర్ల దూరంలో, నీటి వసతిలేని మెట్ట ప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది.
తొలి సూర్యకిరణాల పడే గిరి..
ఉదయగిరి కోట సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత గరిష్టంగా 20 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ వ్యాసార్ధంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చని పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ఇక్కడ ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయ సూర్యుని తొలికిరణాలు ఈ కొండపైనే ముందుగా పడుతుండటంతో దీన్ని ఉదయగిరిగా విజయనగరం రాజలు పేరుపెట్టారు. ఈ ఉదయగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలు ఉండి పాలన సాగించారు.
చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి
విజయనగర రాజులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిరి్మంచారు. శ్రీకృష్ణ దేవరాయలు నిరి్మంచిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణీ మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేరులు, సొరంగ మార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ చూపరులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి విగ్రహం ఉదయగిరి నుంచి తరలించిందే కావటం విశేషం.
శ్రీకృష్ణ దేవరాయల పాలనకు గుర్తుగా ఉదయగిరి ట్యాంక్‌బండ్ సమీపంలో కల్యాణ మండపం, కోనేరు అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటిచెబుతాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్‌రోడ్డులో పాదచారుల కోసం రాతిలో తవ్విన బావి నేటికీ తానాబావిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిరి్మంచిన ప్రార్థనా మందిరం, తహసీల్దారు కార్యాలయ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
చూడదగిన ప్రదేశాలు
ఉదయగిరికి 33 కి.మీ దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ఘటిక సిద్ధేశ్వరం శైవక్షేత్రం ఉంది. అగస్త్య మహాముని తపోపీఠమైన ఈ క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధకాలంలో దుర్గంకు దారి చూపించింది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ దూరంలో ప్రకృతి సోయగాల నడుమ పయనిస్తూ ముందుకు వెళితే 7, 8 శతాబ్దాల్లో పల్లవుల కాలంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఒకే రాతిపై దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాలు, నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/image_445.png)
ఇక్కడ ఏడాది పొడవునా జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.. అక్కడి నుంచి మరో 24. కి.మీ ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి మరో పది కి.మీ దూరంలో హనుముని కొండ ఉంది. అక్కడి నుంచి మరో 25 కి.మీ ముందుకు వెళితే వెంగమాంబ దేవాలయాన్ని సందర్శించవచ్చు.
అభివృద్ధిని మరచిన పాలకులు
ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమయ్యారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/image_444.png)
ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆనాటి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుష్మాస్వరాజ్‌ను ఉదయగిరి పిలిపించి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అప్పట్లో ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఆ హామీలు నెరవేరలేదు.
ప్రతిపాదనలు చేసి..
తిరుమల కొండలను మరిపించే పర్వతశ్రేణులు, పచ్చని ప్రకృతి రమణీయతను పుణికి పుచ్చుకున్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం అటవీశాఖ ద్వారా ప్రణాళిక సిద్ధం చేయించింది.
చిన్నపిల్లల ఆటలకు అనువుగా పార్కులు, తాగునీటి వసతి, సేదతీరేందుకు గదులు, గార్డెన్స్, జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతి అందాలు వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా ఒక్కో ప్రాంతంలో 45 రకాల పనులకు రూ.2.78 కోట్ల చొప్పున అంచనాలతో గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు పంపించారు. ఆసమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మనసుపెట్టి పనులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
వెయ్యేళ్ల చరిత్ర
ఉదయగిరి దుర్గానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలు కాగితాలకేపరిమితమవుతున్నాయి. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్దిచేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్దిచెందుతుంది.– ఎస్‌కె.ఎండి.ఖాజా, చరిత్ర కారుడు, ఉదయగిరి
Comments
Please login to add a commentAdd a comment