
చిరుత కోసం ఎస్వీయూను జల్లెడ పట్టిన ఫారెస్ట్ అధికారులు
కానరాని చిరుత పిల్లల జాడలు
తిరుపతి సిటీ: చిరుత జాడ కోసం పెరంబులేషన్ పేరుతో తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, వర్సిటీ సెక్యూరిటీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీయూలో రెండు నెలలుగా చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు అమర్చి చేయి దులుపుకున్నారు.
అయితే మంగళవారం సాయంత్రం వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో చిరుత విద్యార్థుల కంట పడింది. వెంటనే వారు అటవీ, వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ఉలిక్కిపడిన అధికారులు చిరుతకు పిల్లలు ఉంటేనే తరచూ వర్సిటీలో సంచరిస్తోందన్న అనుమానంతో బుధవారం వంద మందితో నాలుగు బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయినా చిరుత పిల్లల ఆచూకీ లభించలేదు.
జిల్లా ఉప అటవీశాఖ అధికారి నాగభూషణం వర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ చిరుతను బంధించేందుకు నాలుగు రోజుల ముందు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదన్నారు. వర్సీటీ రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ హరిక్రిష్ణ, అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment