సీసీ కెమెరాల్లో కనిపించిన సంచారం
భయాందోళనలో జనం
మహానంది: మహానంది గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చిరుతపులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ ఏఈఓ ఓంకారం వెంకటేశ్వరుడు, సిబ్బంది వెంటనే నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దినేష్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ హైమావతి, ఎఫ్‌బీఓ ప్రతాప్‌లకు సమాచారం అందించారు. వారు మహానంది గోశాల వద్దకు చేరుకుని చిరుతపులి సంచరించిన ప్రదేశం, పాదముద్రలను గుర్తించారు.
ఇదిలా ఉండగా.. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని శిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో మంగళవారం ఓ మహిళ మృతి చెందిన విషయాన్ని మరువక ముందే తాజా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఘటనతో పచ్చర్ల వద్ద నల్లమలలో అటవీశాఖ అధికారులు చిరుతపులి కోసం బోను, పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే.
అయితే అటుగా సంచరించే చిరుతపులి అంతటా తిరుగుతుందని, బోనులోకి మాత్రం రావడం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. గతంలోనూ మహానంది, పచ్చర్ల ప్రాంతాల్లో చిరుతలు సంచరించగా.. ఈ గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయనే విషయాలపై అటవీశాఖ అధికారులు ఇప్పటికీ గోప్యత పాటిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశంలో చిక్కిన చిరుత
ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు
ప్రకాశం జిల్లా దేవనగరం సమీపంలో ఘటన
గిద్దలూరు రూరల్: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం సమీపంలో ఓ చిరుతపులి స్థానికులకు కంటబడడంతో భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు చిరుతపులిని బంధించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుతపులి దేవనగరం గ్రామ శివారులో మేకలు మేపుకునేవారి కంటపడింది. దీంతో వారు కేకలు వేయడంతో చిరుతపులి అక్కడే ఉన్న ఓ పాడుబడిన బావిలోకి దిగింది.
దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ డైరెక్టర్ వై.వి.నరసింహారావు, రేంజి ఆఫీసర్ కుమార్‌రాజ రెస్క్యూ టీమ్ సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకుని బావి చుట్టూ వలచుట్టి చిరుతను బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను బోనులో బంధించి అడవిలో వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment