
ప్రకాశం జిల్లా నరజాముల తండాను వదిలి వెళ్లాలంటూ ఆదేశాలు
హైవే నష్టపరిహారాన్ని తమ ఖాతాలో జమచేసుకున్న అటవీ శాఖ
అడుగడుగునా ఆంక్షలతో బిక్కుబిక్కుమంటూ గిరిజనుల జీవనం
ప్రాణం పోయినా సరేఇక్కడినుంచి వెళ్లేది లేదంటున్న సుగాలీలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆ ఊరికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. నాలుగు తరాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఇళ్లు.. ప్రభుత్వ పాఠశాల.. చెరువు.. ఆయకట్టు కింద పొలాలూ ఉన్నాయి. అయినా, సరే ఇప్పుడిది మీ ఊరు కాదంటున్నారు అటవీ శాఖ అధికారులు. చెట్టు.. పుట్ట, ఇళ్లు, పొలాలన్నీ మీవి కావు. దీనిమీద మీకు హక్కులు లేవు. ఇది అటవీ శాఖకు చెందిన సంపద అని అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో కోల్పోయిన భూములకు వచ్చిన నష్ట పరిహారాన్ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారు. అడుగు తీసి అడుగేయాలన్నా అనుమతి తీసుకోవాలంటున్నారు.
ఇలా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరజాముల తండా వాసులపై కొంతకాలంగా జులుం ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంకు 20 కిలోమీటర్ల దూరంలో.. జాతీయ రహదారి పక్కనే ఉండడం ఈ తండాకు తంటాలు తెచ్చిపెడుతోంది. మారుమూల అటవీ ప్రాంతంలోని నరజాముల తండాలో 290 కుటుంబాలకు పైగా జీవిస్తున్నాయి. అందరూ సుగాలీలే. పశువులను మేపుతూ, కట్టెలు కొడుతూ యర్రగొండపాలెంలో అమ్ముతూ పొట్ట పోసుకుంటుంటారు. కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు.
అయితే, ఆదివాసీలకు జరిగే అన్యాయాన్ని సరిచేసే పేరుతో తెచ్చిన అటవీ హక్కుల చట్టం–2006 ఇప్పుడు వీరి నెత్తిన కత్తిలా వేలాడుతోంది. వేసవిలో మంచినీటి బోర్లు వేసుకోవడానికి లేదు.. పొలాలకు వెళ్లనీయరు.. జీవాలను మేపుకొనేందుకు అడవిలోకి వెళ్తే కేసులు పెడుతున్నారు.. పాములు, క్రూర జంతువుల నుంచి ఆత్మరక్షణకు గొడ్డలి తీసుకెళ్తే లాక్కుంటున్నారు. ఆఖరికి పశువులనూ స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలోని మౌలిక సమస్యలను ఉద్దేశపూర్వకంగానే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
రెండెకరాల పరిహారం అటవీ శాఖ ఖాతాలోకి..
గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో రెండు ఎకరాలు హైవే నిర్మాణంలో పోయింది. పరిహారం కోరితే అటవీ శాఖ భూమి అని అంటున్నారు. మా భూమికి వారు డబ్బులు తీసుకోవడం ఏం న్యాయం? – నరసింహనాయక్, నరజాములతండా
గిరిజనులపై ఆంక్షలు పెరిగిపోయాయి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లమల అడవుల్లో జీవించే గిరిజనులపై ఆంక్షలు, దాడులు పెరిగిపోయాయి. వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఇళ్ల నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం చేస్తున్నారు. కాయ కష్టంతో పండించిన పంటను అమ్ముకోనీయకుండా కూటమి ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతోంది. గిరిజనుల బాధలను గుర్తించిన వైఎస్ అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదుకున్నారు.
ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనులపై అటవీ అధికారులను ఉసిగొల్పుతోంది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఈ దారుణాలు కనిపించడం లేదు. మొద్దు నిద్ర వీడి గిరిజన ప్రాంతాలను సందర్శించి స్థానికుల బాధలు తెలుసుకుని పరిష్కరించాలి. – తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, యర్రగొండపాలెం
హైవేతో పెరిగిన సమస్యలు
నాలుగేళ్ల క్రితం యర్రగొండపాలెం–హైదరాబాద్ రహదారి నేషనల్ హైవే 565 అయింది. మల్లాపాలం దాటాక 5 కిలోమీటర్ల నుంచి దావపల్లి వరకు 20.09 కిలోమీటర్ల మేర దండకారణ్యం ఉంది. అటవీ ప్రాంతానికి అవతల వరకు హైవే నిర్మాణమైంది. అనుమతులు రావడంతో ఇటీవల అడవిలోనూ పనులు మొదలుపెట్టారు.
నరజాముల తండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, పొలాలు హైవేలో పోయాయి. స్థానికులతో చర్చించకుండా, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా అటవీ శాఖ కొట్టుకుని తీసుకుపోయింది. ఈ మేరకు నష్ట పరిహారం చెల్లించాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఏమయ్యారు?
నరజాముల తండాలో 400 ఎకరాల రెవెన్యూ స్థలం ఉంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 47 సెంట్ల నుంచి 10 ఎకరాల వరకు పొలాలకు పట్టాలు ఇచ్చారు. పాస్ పుస్తకాల ద్వారా గిరిజనులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు.
1972లో 250 ఎకరాలలో చెరువు నిర్మించగా ఆయకట్టు కింద 800 ఎకరాలు సాగవుతున్నాయి. 50 ఏళ్ల కిందటే ప్రభుత్వ పాఠశాల, అనుబంధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం నిరి్మంచారు. ఇలా అన్ని సౌకర్యాలను కల్పిoచినపుడు అటవీ అధికారులు ఎక్కడకు పోయారని గిరిపుత్రులు నిలదీస్తున్నారు.
ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు
కన్నతల్లిలాంటి ఊరిని కాపాడుకునేందుకు సుగాలీలు సిద్ధమవుతున్నారు. గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతూ.. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ ఇళ్లు, పొలాలను రెవెన్యూ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment