tribals
-
ఆదివాసీల వింత సంప్రదాయం.. 2 కిలోల నూనె తాగిన మహిళ
-
గోండు భాషలో ప్రాథమిక విద్య
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలకు గోండు భాషలో ప్రాథమిక విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలను సంఘాల నేతలు సీఎం వద్ద ప్రస్తావిస్తూ వినతులు సమర్పించారు. ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలురాష్ట్రంలోని ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టాం. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతివనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని అప్పట్లోనే నిర్ణయించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేశాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్షిప్లను క్లియర్ చేస్తాం. ఆదివాసీ గూడేల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేస్తాం. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేస్తాం. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందిస్తాం’ అని సీఎం వారికి హామీనిచ్చారు. -
గిరిజనులకు సికిల్‌సెల్ స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: ప్రాణాంతకమైన సికిల్‌సెల్ వ్యాధిని పూర్తిగా నివారించి, గిరిజనులను దాని బారినుంచి కాపాడటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలోని గిరిజన ప్రాంతాల్లో ‘మిషన్ టు ఎలిమినేషన్ సికిల్‌సెల్ ఎనీమియా 2023–24’ను నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరిగే 2047 నాటికి గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్ అనేది లేకుండా చేసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా స్క్రీనింగ్(నిర్ధారణ పరీక్షలు) నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ హాయంలోనే కార్యాచరణ..రాష్ట్రంలో 40 ఏళ్లలోపు గిరిజనులు 19,90,277 మంది ఉన్నట్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ మూడేళ్లలో (మూడు దశల్లో) రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసి రోగ లక్షణాలున్నవారిని గుర్తించాలని ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలోనే తొలిదశ రోగ నిర్ధారణ పరీక్షలు గతేడాది చేపట్టారు. ఇప్పటి వరకు 9,38,007 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేíÜ 4,36,556 సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశారు. మరో 10,52,270 మందికి 2025 మార్చి నాటికి పరీక్షలు పూర్తి చేసేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.బాధితులకు భరోసా ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంతొలిదశలో రాష్ట్రంలోని ఏజెన్సీ జిల్లాల్లో అత్యధికంగా సికిల్‌సెల్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధిక పరీక్షలు నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో సికిల్‌సెల్ రోగులు, క్యారియర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సికిల్‌సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు గొప్ప భరోసా ఇచ్చింది. గిరిజనుల్లో 1,913 మంది సికిల్‌సెల్, 1,707 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు గత ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ అందించడంతోపాటు ఉచిత వైద్యం అందించింది. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు సామాజిక భద్రతా పెన్షన్ పెంచి మరీ ఇచ్చారు.గిరిజనుల్లోనే తీవ్రత ఎందుకంటే..సికిల్‌సెల్, తలసేమియా రెండూ రక్తసంబంధ వ్యాధులే. ఇవి రెండూ గిరిజనుల్లోనే ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రక్త సంబంధీకుల మధ్యే వివాహాలు ఎక్కువగా జరగడమని గుర్తించారు. మైదాన ప్రాంతాల్లో బయటి వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే గిరిజన ప్రాంతాల్లో గూడెం, ఊళ్లలో అతి తక్కువ జనాభా ఉండటం, వాటి పరిధి తక్కువగా ఉండటంతో వాళ్లలో వాళ్లే మేనరికపు వివాహాలు చేసుకుంటారు. రక్త సంబంధీకుల మధ్యే తరచూ వివాహాలు జరగడంతో జన్యుపరమైన సమస్యలతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకుల నిర్ధారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోగ లక్షణాలున్న ఇద్దరు వివాహం చేసుకోకుండా అవగాహన కల్పిస్తారు. దీనివల్ల భావితరాలకు సికిల్‌సెల్ సోకుండా అడ్డుకట్ట వేస్తారు. అప్పటికే రోగ లక్షణాలున్నవారికి పెన్షన్‌తోపాటు వైద్యసేవలు అందించి వారి జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తారు.రోగ లక్షణాలను బట్టి కార్డులు⇒ సికిల్ సెల్ రోగ లక్షణాలు (బాధితులు), రోగవ్యాప్తికి కారకులుగా (క్యారియర్స్)ఉన్నవారిని గుర్తించి తగు వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. ⇒ చదువురాని వారికి సైతం అర్థమయ్యే రీతిలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఈ కార్డుల్ని డిజైన్ చేశారు.⇒ క్యారియర్స్‌గా ఉన్నవారికి ప్రాణాపాయం లేకపోయినా వారి ద్వారా పిల్లలకు ఆ రోగం సంక్రమించే అవకాశం ఉంది.⇒ సికిల్‌సెల్, తలసేమియా వ్యాధుల తీవ్రతను తెలిపేలా తెలుపు, పసుపు రంగుల్లో వాటిని రూపొందిస్తున్నారు.⇒రోగ నిర్ధారణ పరీక్షల అనంతరం సంబంధిత వ్యక్తికి సికిల్‌సెల్, తలసేమియా వంటి రోగ లక్షణాలు ఉన్నాయో? లేదో? తెలిపే కార్డులు ఇస్తారు.⇒ రోగ లక్షణాలు లేకపోతే పూర్తిగా తెలుపు, లక్షణాల తీవ్రతను బట్టి తెలుపు నుంచి ముదురు పసుపురంగు వరకు ఉండేలా కార్డులు ఇస్తారు. -
కొండకోనల్లో నృత్య సౌందర్యం
మాటలు లేని కాలంలో ఆదివాసీలు లయబద్ధంగా వేసిన గెంతులే నేడు ప్రపంచదేశాల్లో గొప్ప నృత్యంగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. కోయ జాతి గిరిజనులు మాత్రమే చేసే ఈ నృత్యం దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ నృత్యం పేరు చెబితే చింతూరు మండలంలోని కోయజాతికి చెందిన కళాకారులు గుర్తుకువస్తారు.చింతూరు: సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయజాతికి చెందిన గిరిజన కళాకారులు. ఈ నృత్యం పేరు చెబితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తుకొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. 20 బృందాలు... తుమ్మలతోపాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 బృందాల వరకు ఉన్నాయి. ఈవెంట్‌ను బట్టి ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది మహిళలు, పురుషులు ఉంటారు. ⇒ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్ చుట్టుకుని అందులో ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషుల డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది. ⇒ నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు గుద్దుకోవడం ప్రత్యేక ఆకర్షణ. దుస్తుల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు. సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. ⇒ మన్యంలో చిత్రీకరించే కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనకు చోటు దక్కింది. పుష్ప–2, గేమ్‌చేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే.. శ్లోకం వంటి చిత్రాల్లో తమ ప్రదర్శనకు అవకాశం వచ్చినట్టు నృత్య కళాకారులు తెలిపారు.⇒ రోజుకు రూ.వెయ్యి: ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఒకొక్క కళాకారుడు ఏడాదికి సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతుంటారు. ⇒ ఎంతో ఖ్యాతి పొందినా కళాకారులు మాత్రం వ్యవసాయం, కూలిపనులపై కూడా ఆధారపడుతుంటారు.ప్రస్థానమిలా..చింతూరు మండలం తుమ్మ లకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంత మంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసి వివిధ పాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన మృతి అనంతరం అతని కుమారుడు రమేష్ సంప్రదాయ వృత్తిగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ సహకరించాలి కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న తమకు సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే తాము ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. – పట్రా రమేష్, కొమ్ముకోయ కళాకారుడు, తుమ్మల ఎంతో ఆదరణ ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో తాము నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తాము తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు పూర్తిస్థాయిలో సహకారంఅందించాలి. – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి -
Vippa Puvvu: విప్ప పువ్వు.. కల్పతరువు
గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో విప్ప పువ్వు ఒకటి. మన్యంలో విరివిగా లభించే ఇవి గిరిజనులకు మంచి ఆదాయ వనరు. ఇప్పటివరకు సీజన్లో మాత్రమే సేకరించి ఆదాయం పొందేవారు. ఇక నుంచి వీటితో ఏడాది పొడవునా అనుబంధ ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే దిశగా గిరి మహిళలు అడుగులు వేస్తున్నారు. చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది. చెట్లు కలిగిన గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ విప్పపూలు (Vippa puvvu) రాలుతున్న సమయంలో సువాసన వెదజల్లుతుంది. ఇంటిల్లిపాదీ కలసి చెట్టు వద్దకు చేరుకుని బుట్టలు, చేటలతో పూలను సేకరిస్తారు. వీటిని నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. ఏడాది పొడవునా అమ్మకాలు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో విరివిగా విప్పచెట్లు ఉన్నాయి. కొన్ని గిరిజన కుటుంబాలు వీటిపై వచ్చే ఆదాయంతో ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నాయి. సేకరించిన పూలను ఎండబెట్టి చింతూరు, ఏడుగురాళ్లపల్లి, కుంట మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. భద్రాచలం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక చెట్టుకు సుమారు 150 కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది. దీనిని ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో రూ.50 నుంచి రూ.60 ధరకు విక్రయిస్తున్నారు. విప్పకాయలు కిలో రూ.30కు అమ్ముతున్నారు. ఈ చెట్లు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతినిండా ఆదాయం వస్తోంది. పోషకాలెన్నో.. : విప్పపూలలో ఎన్నో పోషక గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగాలను హరించే ఔషధ గుణాలు కూడా విప్పపూలలో ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయంచేసే గుణంతోపాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వారు చెబుతున్నారు. విప్పకాయలతో చేసిన నూనెతో మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయని వారు పేర్కొంటున్నారు. స్వీట్ల తయారీ దిశగా అడుగులువిప్ప పూలను సారా తయారీ, ప్రసాదాల్లో మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్చచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్ల తయారీపై మహిళలు దృష్టి పెట్టారు. చింతూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విప్ప పూల సేకరణ, స్వీట్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి తినుబండారాల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపా ధిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి విప్పపువ్వుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటితో స్వీట్లు తయారీపై శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. చింతూరు డివిజన్లోని గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాం. తాము అందిస్తున్న సహకారం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. – సుభాని,కార్యదర్శి, ఆశా స్వచ్ఛంద సంస్థ, చింతూరువిప్పపువ్వుతో ఆర్థికాదాయం ప్రతి వేసవిలో ఇంటిల్లిపాదీ కలసి విప్పపూలు సేకరిస్తాం. వాటిని ఆరబెట్టి చింతూరు, మోతుగూడెం సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు మా సంస్కృతిలో భాగంగా విప్పపువ్వుతో సారా కూడా తయారుచేసి సేవిస్తాం. – పూసం మహేష్,లక్కవరం, చింతూరు మండలంశిక్షణ ఎంతో ఉపయోగం విప్పపువ్వుల సేకరణతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వీట్ల తయారీలో శిక్షణ పొందుతున్నాం. తయారు చేసే విధానంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విప్పపూల సేకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. – వెట్టి కన్నమ్మ,తెరపాడు, చింతూరు మండలం -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
ఆదివాసీ కళకు ఆయువు పోసినవాడు!
ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు. నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే... ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు. వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు. దండారీలో గుస్సాడీలు, పోరిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2014లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.– గుమ్మడి లక్ష్మినారాయణ,ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ ‘ 94913 18409 -
గిరిజనుల ఆరోగ్యంపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారు లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసి స్తున్న ప్రజలు అరగంట లోపలే చేరుకునేలా ఐటీ డీఏల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్ ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీ ఏల పరిధిలో ఉన్న ఆసుపత్రులు, వైద్య సౌకర్యా లు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హైదరా బాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ప్రత్యేక వార్డులు.. బర్త్ వెయిటింగ్ రూంలు..ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, రోడ్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గర్భిణి, ఆమెతోపాటు వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం, మంచినీరు ఇతర వసతులు కల్పించాలన్నారు. 108 అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న ప్రిమిటివ్ ట్రైబ్స్ కోసం ఆదిలాబాద్ రిమ్స్ వంటి పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వారి భాషలో మాట్లాడగలిగే వైద్య సిబ్బందిని ఆ వార్డుల్లో నియమించాలని సూచించారు. -
రైలొస్తేనే బతుక్కి పట్టాభిషేకం
ఆ గ్రామాలు, గిరిజన తండాలన్నీ రైల్వే పట్టాల వెంబడే ఉంటాయి.. అందుకే వారి జీవన ప్రయాణం రైలు పరుగులపై ఆధారపడి ఉంటుంది. విధివంచితులు.. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి.. కుటుంబ భారం మీదపడి పిల్లలను పోషించుకునేందుకు కొందరు.. జీవనోపాధి లేక మరికొందరు.. రైళ్లలో పల్లీ, బఠాణీలు, సీజన్ పండ్లు అమ్ముకొని వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రైలు బండి నడిస్తేనే.. కుటుంబానికి తిండి దొరుకుతుంది. - సాక్షి, మహబూబాబాద్ రైలులోనే ప్రయాణం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, తాళ్లపూపల్లి, కేసముద్రం స్టేషన్ల పరిధిలోని తండాలతోపాటు, అటు విజయవాడ, ఇటు సికింద్రాబాద్, బల్లార్షా వరకు ఉన్న తండాల్లో మహిళలకు వ్యాపారమే ప్రధానాధారం. పండించిన పల్లీలు, తమ గ్రామాలు, తండాల పరిసరాలలో దొరికే సపోటా, ఈతపండ్లు, తాటిముంజలు, జామకాయలు ఇలా సీజన్ల వారీగా సేకరించి వాటిని విక్రయించి కుటుంబాలను పోషించుకునేందుకు గిరిజన మహిళలు రోజూ రైలులో ప్రయాణిస్తారు. ఇలా రోజూ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వీరి ప్రయాణం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.ఒక్కోరోజు రాత్రి 12 గంటల వరకు సరుకులు అమ్ముకొని ఇంటికి వస్తారు. కొన్ని సందర్భాల్లో రైల్వేస్టేషన్లలో తలదాచుకొని మర్నాడు ఇంటికి చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రోజూ 200 మంది వరకు ఈ వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు.గుర్తింపు కార్డులివ్వాలి.. నా భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి పల్లీలు అమ్ముకుంటూ నాకున్న ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కుమారులను కష్టపడి సాదుకుంటూ వచ్చా. పొట్టకూటి కోసం పల్లీలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైలు బండి నడిస్తేనే తిండి దొరుకుతుంది. పెద్దసార్లు దయ ఉంచి గుర్తింపు కార్డులు ఇస్తే భయం లేకుండా వ్యాపారం చేసుకుంటాం. – బానోతు హచ్చి, బడితండా, కేసముద్రం మండలంబొగ్గు బండి ఉన్నప్పటి నుంచి.. నలభయ్యేళ్లుగా రైలులో పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చా. బొగ్గు బండి ఉన్నప్పటి నుంచి పల్లీలు అమ్మడం మొదలుపెట్టా. పల్లి గ్లాసు.. పైస నుంచి అమ్మిన. రైలులో ఎన్నోమార్లు ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. కోర్టులో జరిమానా కట్టి వచ్చేవాళ్లం. ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్న ప్రతిసారీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. పొట్టకూటికోసం పల్లీలు అమ్ముకుంటూ ఇబ్బందులు పడుతూ వచ్చాం. నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పల్లీలు అమ్మి అందరి పెళ్లిళ్లు చేసిన. మగ పిల్లలను చదివించిన. – బానోతు చాంది, బడితండా, కేసముద్రంవితంతువులే అధికం మహబూబాబాద్ జిల్లాలో ఏ తండాను కదిలించినా కన్నీళ్లే ఉబుకుతాయి. గుడుంబాకు బానిసలు కావడం, తండాలను కబళించే వింత వ్యాధులతో పాతికేళ్లు నిండక ముందే మృత్యువాత పడిన మగవారు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే వివాహాలు చేసుకొని ఇద్దరు, ముగ్గురు పిల్లలతో 20 ఏళ్లు కూడా నిండని భార్యపై పిల్లలు, వృద్ధ అత్తామామల భారం పడుతుంది. ఈ సంసార సాగరాన్ని దాటేందుకు రైళ్లలో వ్యాపారం చేసుకోవడం సాధారణమవుతోంది. ఇలా పల్లీలు, బఠాణీలు, పండ్లు అమ్ముకొని పిల్లలను పెద్ద చదువులు చదివించి ప్రభుత్వ కొలువుల్లో చేరి్పంచిన వారు కొందరైతే.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి భారం తీర్చుకున్నవారు మరికొందరు ఉన్నారు. అవమానాలు.. ఆప్యాయతలు నిత్యం రైలులో ప్రయాణం చేసుకుంటూ సరుకులు అమ్మే మహిళలకు అవమానాలు.. అ ప్యాయతలు ఎదురవుతుంటాయి. టికెట్ లేదని కేసులు పెట్టి జైలుకు పంపిన రైల్వే అధికారులు ఉన్నారు. మహిళలు కావడంతో ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపులు కూడా చవిచూడాల్సి వస్తుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం రోజూ ప్రయాణం చేసే వారి ఆప్యాయత కూడా ఉంటుందంటున్నారు. దశాబ్దాలుగా రైలునే నమ్ముకొని జీవించే తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
గిరిజనుల భూమి గిరిజనులకే!
ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయిఅనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. అయితే స్వతంత్ర భారతదేశంలో గిరిజనుల కోసం చేసిన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు. ఆదిమ జాతీయులకు వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ప్రభుత్వాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించి ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర చెబుతోంది.మాతృమూర్తైనా, మాతృభాషైనా, మాతృదేశమైనా పలికేటప్పుడు వేరువేరుగా వినిపించినా ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే బంధం. తల్లి గర్భాల యంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలి అడుగు మోపే నవజాత శిశువుకు ఈ మూడింటి అస్తిత్వం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒక జాతికి కూడా ఉంటుంది. అదే మూలవాసీ సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకు న్నాయి అనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది.సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో’ అన్న సినీ గేయం కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అడవి తల్లి తన గిరిజన సంతానాన్ని ఆత్మ గౌరవ బావుటా ఎగురెయ్యాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరి కలను స్పష్టం చేసేవిధంగా ఈ పాట సాగింది. వారి హక్కుల కోసం వారే ఉద్యమించాలనే ఉద్వేగాన్ని నింపుతుంది. ఈ పాట ప్రతి గిరిజనుడిని అగ్ని కణంలా వెంటాడింది. దేశంలో గిరిజన ప్రాంతా లున్న అన్ని రాష్ట్రాలలో వారి భాషలోకి తర్జుమా చేసి వినిపించాలనే ప్రణాళికతో అక్కడి నాయకులు ముందుకుపోతున్నారు. ‘మన సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద నా పోరాటం’ అన్నారు బిర్సా ముండా. నూరేళ్ళ జీవితానుభవంతో 25 ఏళ్లు బతికి ధిక్కార హెచ్చరికను వినిపించి, బ్రిటిష్‌వాళ్ల గుండెల్లో ఫిరంగులు పేల్చాడు. ఆయన జయంతి నవంబర్ 15న ‘జన్ జాతీయ దివస్’గా జరుపుకొంటున్నాం. బిర్సా ముండా చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉంచడంతో పాటు, రాంచీ విమానాశ్ర యానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆ వీరుని పేరు పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. బ్రిటిష్ పాలనలో మొత్తం 75 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయంటే వారి చైతన్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. తెలంగాణా గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ఈ మధ్యన తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పర్యటించడం ముదావహం. గిరిజనులకు బాస టగా నిలవడానికి ‘యాక్ట్ 1/70’ని రూపొందించుకున్నాం. అందులో ఉన్న సెక్షన్ 3(1)(ఎ) ప్రకారం, వివాదాలు తేలేంతవరకు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న భూమి గిరిజనులదిగానే భావించబడుతుంది. ఈ మధ్యన గవర్నరు పర్యటించిన ప్రాంతం ఆ కోవకే చెందుతుంది. వారికి అధికారులు ఏ మేరకు పరిస్థితులను విశదీకరించారో గానీ, రాజ్యాంగంలోని ‘షెడ్యూల్ 5’ ప్రకారం గవర్నరుకు విశేషాధికారాలు ఉంటాయి. ఇది వజ్రాయుధం లాంటిది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్లైతే అది కూడా చెడ్డది కావడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్లైతే అది కూడా మంచిదవటం అంతే ఖాయం’ అన్నారు. మన రాజ్యాంగ సంవిధాన మౌలిక నిర్మాణం ఎంతో గొప్పది. సామాజిక అణచివేతకు గురైనవారి అభ్యున్నతి కోసం తోడ్పడడమే రాజ్యాంగంలోని రిజర్వే షన్ల లక్ష్యం.స్వాతంత్య్రానంతరం పాలకులు ఆదివాసీలను చేరడానికి ముఖ్యంగా మూడు ఆలోచనలు చేశారు. ఏకాంతవాసం, కలిసి పోవటం, అభ్యున్నతి. 1958లో మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ కలిసిపోవటాన్ని ఎంచుకున్నారు. అంటే ఆదివాసీలతో కలిసి వారిని అభివృద్ధి పరచాలని. ఆదివాసీలను దోపిడీ నుంచి కాపా డాలని, రక్షణగా నిలవాలని, వారికి సంక్షేమ పథకాలు రూపొందింపజేయాలని భావించి ‘పంచశీల’ను ఎంచుకున్నారు. ఆ తరువాత యాక్ట్ డి.ఎఫ్. 1970 చట్టం తీసుకొచ్చారు. గిరిజనుల భూమిని, అటవీ సంపదను ఇది కవచంలాగా కాపాడుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ చట్టాలు నిర్వీర్యం అయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు.తెలంగాణాలో నిజాం కాలంలో దీనికోసం హైమన్ డార్ఫ్‌ని తన సలహాదారుగా నియమించుకున్నారు. ఎన్నో సంస్కరణలు చేశామను కున్నారు. కానీ 1948 అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. 1976, ’77లో ఆదిలాబాద్‌లోని ఉట్నూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్తుపోయే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. సంపన్నతే చుట్టరికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రా ప్రాంతాల నుండి వచ్చిన ధనికులు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని, అసలు హక్కుదారులైన గిరిజనులను అక్కడ నుండి తరిమేశారనీ, దాంతో వారు దూరంగా వచ్చి తలదాచుకున్నారనీ, ఇప్పుడు ఆ స్థలాల నుండి కూడా అటవీ అధికారులు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని బెదిరిస్తున్నారనీ గిరిజనులు చెప్పుకొచ్చారు.ఇదంతా వింటుంటే చరిత్రలోని చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ కథ గుర్తొస్తోంది. 1857 తిరుగుబాటు అణచివేయబడి బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన ఓడిపోయిన తరువాత రెండు గజాల భూమి తన భారతదేశంలో తనకు దొరకలేదనీ, ఆ బాధతోనే తన చివరి రోజుల్లో బర్మాలోనే గడుపుతూ అక్కడే ఖననం చేయబడ్డాడనీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గిలాని తన ఉపన్యాసంలో ఉట్టంకించటం గుర్తొస్తోంది. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఒకటుంది. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళ ద్వారా గవర్నర్లకు విశేష అధికారాలే కల్పించారు. వారి జీవన స్రవంతిని, సంస్కృతి, వైవిధ్యాలను రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో జీవించే విధంగా గవర్నర్లు రెగ్యులరైజేషన్ ద్వారా పరిపాలించే అధికారాలను ఈ అధికరణలు ఇవ్వడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గిరిజనులు, వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జె.ఎన్. గిర్‌గిలాని ఆనాటి శాసనసభకు సమర్పించారు. అందులో ఎన్నో భయంకర నిజాలు, గిరిజనేతరులు కబళించిన భూవివరాలు వెల్లడ య్యాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల కోసం ఐఏఎస్ మూర్తి గారిని నియామకం చేసింది ప్రభుత్వం. వీరి నివేది కలో కేంద్రంలో కొంతమంది ఉన్నతాధికారులు అసలు 5వ షెడ్యూ ల్నే రాజ్యాంగం నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఒక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నివే దికలు ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’ ద్వారానే బహిర్గతమయ్యాయి తప్ప, అసలు శాసనసభ మెట్లు ఎక్కలేదన్నది నిజం. తెలంగాణ గవర్నర్ పర్యటించిన ములుగు జిల్లా గోవింద రావు పేట మండలంలోని గిరిజనుల భూముల అన్యాక్రాంతం గురించి ప్రభుత్వం నియమించిన కమిటీ 25 సంవత్సరాల క్రితమే నివేదిక లిచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనాయనీ, వాటిని గిరిజనులకు అప్పగించాలనీ తీర్పులిచ్చినా చలనం లేదు. తరతరాల నుండి జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ‘ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006’ కూడా నిరర్థకంగా మారింది. బిహార్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ ఫెలిక్స్ పెడల్‌ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్ డార్విన్ మునిమనవడు. ఆయన నుండి స్ఫూర్తిని పొందాలి. ‘ఆజాద్ కా అమృతోత్సవ్’ దేశమంతటా జరుపుకొంటున్న శుభ వేళ ఆదిమ జాతీయులకు మాత్రం వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ఏ చర్యలు తీసుకున్నామని వివిధ ప్రభు త్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, వివిధ రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి. దృఢ సంకల్పంతో ఒక ఆమోద యోగ్యమైన కార్యాచరణను రూపొందిచుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర స్పష్టం చేస్తోంది.సి.హెచ్. విద్యాసాగర్‌రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
భూంకాల్ పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసంక్ర మణ సిద్ధాంతం, సైన్యసహకార పద్ధతి వంటి కుట్రపూరిత విధానాలతో బస్తర్ రాజ్యాన్ని కూడా ప్రిన్సిలీ స్టేట్‌గా బ్రిటీషర్లు మార్చారు. రాజును నామమాత్రం చేస్తూ పరోక్షంగా పాలన సాగించా రు. ఈ క్రమంలో 1878లో బ్రిటీష్ ప్రభుత్వం రిజ ర్వ్ ఫారెస్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తర్ అడవుల్లో 66 శాతం భూభాగంపై ఆదివాసీ లు హక్కులు కోల్పోయారు. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రదేశాల్లో కర్ర పుల్ల తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరోవైపు బ్రిటీ షర్ల కాలంలో బస్తర్ పాలకుడిగా ఉన్న భైరామ్ దేవ్ కుష్ఠువ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దూరంగా ఉంచి అతని కొడుకైన రుద్ర ప్రతాప్‌దేవ్‌ని 1891లో రాజుగా బ్రిటీష్ సర్కార్ గుర్తించింది. అయితే మేజర్ అయ్యేంత వరకు ఆయనకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు. అలా రాజుతోపాటు రాజకుటుంబంలో ప్రధాన పదవుల్లో ఉన్నవారు తమ అ«ధికారాలు కోల్పోయారు. ఇలా బ్రిటీషర్ల ఆధిపత్య ధోరణి కారణంగా ఇటు రాజవంశానికే కాక అటు ఆదివాసీలకు ఇక్కట్లు మొదలయ్యాయి. తిరుగుబాటుకు పిలుపు1909 అక్టోబర్‌లో జరిగిన దసరా వేడుకల్లో రిజర్వ్ ఫారెస్ట్ చట్టం, దాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ బస్తర్ రాజ్య మాజీ దివాన్ లాల్ కాళీంద్రసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పేరున్న ఆదివాసీ నేత గుండాధుర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఫారెస్ట్ చట్టం కారణంగా తాము పడుతున్న బాధలను ఊరూరా ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు ప్రజలను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటి నుంచి ఒకరు పోరాటానికి రావాలని, ఆయుధాలు పట్టలేనివారు రాళ్లు, కర్రలు, కారం పొడి అయినా అందించాలని స్ఫూర్తి నింపారు. 1909 అక్టోబర్ నుంచి 1910 ఫిబ్రవరి మొదటివారం నాటికి బస్తర్‌లో అటవీ గ్రామాలన్నీ పోరాటానికి సంసిద్ధమయ్యాయి. ముఖ్యంగా బస్తర్‌లో ఉత్తర ప్రాంతమైన కాంకేర్ నిప్పు కణికలా మారింది.మూడు రోజుల్లోనే....1910 ఫిబ్రవరి 4న కుకనార్‌లో గుండాధూర్ నాయకత్వంలో ఆదివాసీలు బ్రిటీష్ అధికార కార్యాలయాలు, గోదాములు, మార్కెట్, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై మెరుపుదాడులు జరిపారు. కేవలం మూడురోజుల్లోనే బస్తర్‌లోని 84 పరగణాల్లో 46 పరగణాలు తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చాయి. కాంకేర్ ప్రాంతంలో బ్రిటీష్ అధికారులు, వ్యాపారులు ఇళ్లు వదిలి పారిపోయారు. దండకారణ్యంలో భూకంపం లాంటి తిరుగుబాటు వచ్చిందని తక్షణ సాయం అవసరమంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పటి మహారాజు రుద్ర ప్రతాప్‌దేవ్ టెలిగ్రామ్ పంపారు. దీంతో ఈ పోరాటానికి భూంకాల్ పోరాటమని పేరు వచ్చింది. గుండాధూర్ చిక్కలేదుభూంకాల్ విప్లవాన్ని అణచివేసే పనిని కెప్టెన్ గేర్‌కు బ్రిటీష్ సర్కార్ అప్పగించింది. పదిరోజులు బ్రిటీష్, బస్తర్ స్టేట్ సైన్యాలు అడవుల్లో గాలించినా విప్లవకారుల్లో కేవలం 15 మందినే పట్టుకోగలిగారు. మరోవైపు తనను పట్టుకునేందుకు వచ్చిన కెప్టెన్ గేర్‌పైనే నేరుగా దాడి చేసి బ్రిటీషర్ల వెన్నులో గుండాధూర్ వణుకు పుట్టించాడు. తృటిలో కెప్టెన్ గేర్ ఆ దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడు కున్నాడు. దీంతో బెంగాల్, జైపూర్ రాజ్యాల నుంచి అదనపు బలగాలను బస్తర్‌కు రప్పించారు. ఆ తర్వాత గుంఢాదూర్‌కు నమ్మకస్తుడైన సోనుమాంఝీ ద్వారా కోవర్టు ఆపరేషన్ జరిపి 1910 మార్చి 25 రాత్రి గుంఢాధూర్ ఆయన సహచరులు బస చేసిన అటవీ ప్రాంతంపై బ్రిటీష్ సైన్యం దాడి జరిపింది. ఇందులో 21 మంది చనిపోగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. కెప్టెన్ గేర్ ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ పోరాట యోధుడు గుండాధూర్ మాత్రం చిక్కలేదు. మెరుపు తిరుగుబాటుతో బ్రిటీషర్లకు చుక్కలు చూపించిన బస్తర్ ఆదివాసీలు ఆ తర్వాత తమ హక్కుల కోసం స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వంతోనూ ఘర్షణ పడ్డారు. ఈ పోరులో తాము దైవంగా భావించే మహారాజునే కోల్పోయారు. -
గిరిజనులకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ నిలిపివేత
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ఇకపై ఇంటి వద్దకు రేషన్ సరకులు రావు. గిరిజనులు రేషన్ షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ విషయం వెల్లడించారు. మంత్రి మంగళవారం గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తామని, ఇకపై రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు (ఎండీయూ) వల్ల సమస్యలు ఉన్నాయన్నారు.అందువల్ల గిరిజనుల సౌలభ్యం కోసం ఏజెన్సీలోని 962 రేషన్ డిపోల ద్వారానే సరుకులు అందిస్తామని చెప్పారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీ అవుట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరించి, డిమాండ్‌ను మరింతగా పెంచుతామన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అందించే తేనె, ఇతర ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెడతామని చెప్పారు. జీసీసీ పరిధిలోని 16 పెట్రోల్ బంకులు, 18 గ్యాస్ డిపోలు, 12 సూపర్ మార్కెట్ల ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు వస్తున్నాయని, వాటిలో 2 వేలకుపైగా పోస్టులు గిరిజన ప్రాంతాల్లో భర్తీ అవుతాయని చెప్పారు. దీంతో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందన్నారు. గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం 554 ఏఎన్ఎంలను డిప్యుటేషన్‌పై నియమిస్తున్నట్టు తెలిపారు. గిరిజన వసతి గృహాల్లో స్డడీ అవర్స్ పెడతామన్నారు. గిరిజన విద్యాలయాల్లో బాలికల రక్షణ కోసం ఫిర్యాదుల బాక్స్ పెడతామన్నారు. ఫిర్యాదు చేసిన విద్యారి్థని పేరు గోప్యంగా ఉంచుతామని, వేరే ప్రాంత అధికారులతో విచారణ చేయిస్తామని చెప్పారు. గిరి శిఖర గ్రామాల ప్రజలకు తక్షణ వైద్య సేవల కోసం ఫీడర్ అంబులెన్స్‌లు, ప్రసవం అనంతరం సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. -
చెంచుల అడ్డాలో లక్ష్మీగడ్డ
పెద్దదోర్నాల: భూచక్ర గడ్డ.. ఇది నల్లమల అభయారణ్యంలో దొరికే ఓ దుంప. లక్ష్మీగడ్డ.. లచ్చిగడ్డ.. మాగడ్డ పేర్లతోనూ పిలిచే ఈ మధుర దుంపలో ఎనలేని ఔషధాలు ఉన్నాయని చెబుతారు. తీగ జాతి మొక్క కాండంగా భూమి అడుగు భాగంలో ఇది పెరుగుతుంది. కేవలం అడవుల్లో మాత్రమే.. తక్కువ ఎత్తులో పెరిగే అరుదైన తీగ జాతి మొక్క. దీని పూలు ఆకర్షణీయంగా తెల్లగా, మంచి సువాసన కలిగి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలంలోని నల్లమల అభయారణ్యంతోపాటు భద్రాచలం అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క భూమి అంతర్భాగంలో సుమారు 6 నుంచి 15 అడుగుల లోతులో 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెరుగుతుంది. దుంప పైభాగమంతా ఎర్రగా ఉండి.. లోపలంతా తెల్లగా, అత్యంత రుచి కలిగి ఉంటుంది. భూచక్ర గడ్డ ఉన్న ప్రాంతంలో భూమి పైభాగంలో తెల్లపూలు కలిగిన ఓ రకమైన తీగ ఉంటుందని, ఇది ఓ రకమైన మత్తుతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుందని ఈ గడ్డను సేకరించే చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ వాసనను పసిగట్టిన చెంచు గిరిజనులు గడ్డ కోసం వేట మొదలు పెడతారు. తీగ ఆధారంగా గడ్డ ఇక్కడే ఉంటుంది అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గడ్డ కోసం తవ్వకం మొదలు పెడతారు.చెంచులకు అవినాభావ సంబంధం చెంచు గిరిజనులకు భూచక్ర గడ్డతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చెంచులు ఈ గడ్డను లచ్చిగడ్డ, లక్ష్మీగడ్డగా పిలుచుకుంటారు. భూచక్ర గడ్డతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గడ్డ వాడకం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి, మధురంగా ఉండే ఓ దుంప జాతి గడ్డ. – మంతన్న, కో–ఆర్డినేటర్, ఆర్ఓఎఫ్ఆర్, పెద్దదోర్నాలఎన్నో ఔషధ గుణాలు భూచక్ర గడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ గడ్డను ఫ్రిజ్‌లో నిల్వ పెట్టుకుని ఔషధంలా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా తింటే మంచిదని, దాహం అనిపించినప్పుడు ఇది ఎక్కువగా తినటం వల్ల దప్పిక వేయదని వారు పేర్కొంటున్నారు. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినటం వల్ల వేడి, వాతం, కడుపులో మంట, కడుపులో గడ్డలు, రాళ్లు ఉన్నా కరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు. అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, షుగరు, బీపీ వ్యాధులకు ఈ గడ్డ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ గడ్డను వారం రోజులు పరగడుపున తింటే కడుపులో గ్యాస్ సమస్యలు ఉండవని, క్రమం తప్పకుండా నెల రోజులు తింటే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు పూర్తిగా నయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ గడ్డను శ్రీశైలంతోపాటు పెద్దదోర్నాలలోని శ్రీశైలం రహదారిలో విక్రయిస్తుంటారు. -
కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ
తాంసి: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం. కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు న్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుంటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయేంతగా..! విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురు కిడ్నీ (మూత్రపిండాలు) సంబంధిత వ్యాధుల బారిన పడటం, ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. గడిచిన మూడేళ్లలో ఈ వ్యాధి బారిన పడి 12 మంది మృత్యుఒడికి చేరారు. గ్రామంలోని చేద బావులు, చేతిపంపుల నీటిని తాగడం వల్లే తమ కిడ్నీలు పాడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్న భీంపూర్ మండలం కమట్వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవింద్పూర్ గిరిజనులంతా గ్రామాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లిపోయారు. హామీలిచ్చి మరిచిపోయారు ఆదిలాబాద్ జిల్లా గోవింద్పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు చేద బావుల నీటినే గిరిజనులువినియోగించే వారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. యువకులు సైతం వ్యాధుల బారిన పడుతుండటంతో ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన ‘సాక్షి’ 2022 నవంబర్ 4న ‘ఊరొదిలిపోతున్నారు..’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో కొందరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని భరోనా ఇచ్చారు. కానీ హామీలేవీ నెరవేరలేదు. క్రమంగా జబ్బుపడే వారి సంఖ్య, మరణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఊరు ఖాళీ చేసి పక్కనే ఉన్న అడవి సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గుడ్డి దీపాలతో నెట్టుకొస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాల కోసం పక్కనున్న చెరువు, వాగు నీటిని వినియోగిస్తున్నారు. నీటిలో అధికంగా భార మూలకాలు ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భీంపూర్ వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల రక్త, మూత్ర నమూనాలు, గ్రామంలోని చేతిపంపుల నుంచి నీటిని సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. నీటిలో భార మూలకాల శాతం అధికంగా ఉందని, ఈ కారణంగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయని అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అప్పట్నుంచీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రత చెప్పినా పట్టించుకోలేదు బోరు బావి నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని అధికారులకు మొర పెట్టుకున్నాం. దీంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – జమునబాయి, మాజీ సర్పంచ్, గోవింద్పూర్ భార్యను బతికించుకోవాలనుకున్నా కానీ.. నా భార్య కుమ్ర భీంబాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పరిక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు రెండేళ్ల కిందటే మా గ్రామాన్ని వదిలేసి పక్కనే ఉన్న జెండా గూడకు వలసవెళ్లాం. కానీ కొన్నాళ్లకే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి చనిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు గ్రామానికి దూరంగా ఉంటూ, వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచే చేసుకుంటున్నా. – కుమ్ర పరశురాం, గోవింద్పూర్ గ్రామస్తుడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తాం గోవింద్పూర్ గ్రామాన్ని వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. స్థానికులు గ్రామాన్ని విడిచివెళ్లిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. గతంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశాం. మరోసారి నీటి పరీక్షలతో పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – నిఖిల్ రాజ్, భీంపూర్ మండల వైద్యాధికారి -
పోలీసులు X గిరిజనులు
సత్తుపల్లి: గిరిజన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సత్తుపల్లి పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఘటన పూర్వాపరాలిలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని 400 హెక్టార్లలో కొంతకాలంగా స్థానిక గిరిజనులు, స్థానికేతర గిరిజనుల మధ్య పోడు వివాదం నడుస్తోంది. గిరిజనులకు నేతృత్వం వహిస్తున్న కూరం మహేంద్రను అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సీఐ టి.కిరణ్ పిలిపించి విచారించి పంపించారు. ఈక్రమంలో చంద్రాయపాలెంకు చెందిన గిరిజనులు ఆదివారం ఉదయం డయల్ 100కు ఫోన్ చేసి స్థానికేతర గిరిజనులు తమ భూముల్లోకి వస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఎస్సై రాజు, ముగ్గురు పోలీసు సిబ్బంది వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాచారంతో సీఐ టి.కిరణ్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి చేరుకున్నారు. సీఐ కిరణ్‌పై మెరుపుదాడి.. అదే సమయంలో గిరిజన నేత కూరం మహేంద్ర ఫోన్లో మాట్లాడుతుండగా, ‘నిన్ననే కదా నీతో మాట్లాడి పంపించింది.. మళ్లీ గొడవ ఏమిటి’ అంటూ సీఐ కిరణ్ ఆయన ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇంతలో ఒక్కసారిగా గిరిజన మహిళలు కోపోద్రిక్తులై సీఐ కిరణ్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుళ్లు పి.నర్సింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణ, నరేష్ కలిసి సీఐ కిరణ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో చుట్టూ రక్షణ కవచంలా నిలిచి పోలీస్ వ్యాన్ వైపు తీసుకొస్తుండగా గిరిజనులు కర్రలతో వెంబడించి దాడి చేశారు. అతి కష్టంమీద అక్కడి నుంచి సీఐ కిరణ్‌ను పోలీసులు తీసుకొని బయ టపడ్డారు. ఈ ఘటనలో సీఐ కిరణ్ చొక్కా చిరిగిపోయింది. పోలీస్ పికెట్ ఏర్పాటు విషయం తెలుసుకుని కల్లూరు ఏసీపీ రఘు, రూరల్ సీఐ వెంకటేశం, డివిజన్లోని ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సిబ్బంది చంద్రాయపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బుగ్గపాడు శివారులో పోలీసులపై దాడి చేసిన గిరిజనులు గుంపులుగా వస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. గిరిజనులు ప్రతిఘటించటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి కూరం మహేంద్రతో సహా గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
ఖమ్మం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. -
ఈ హోలీ రంగులను హాయిగా తినవచ్చు!
ముంబైకి చెందిన ఇద్దరు సోదరుల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గౌరంగ్, సౌరభ్ అనే సోదరులు ‘మాంక్స్ బూఫీ’ బ్రాండ్‌పై ‘అబీర్ హోలి కలర్స్’ పేరుతో సహజ రంగులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. పువ్వులు, మొక్కజొన్న పిండి... మొదలైన వాటితో భిల్ తెగ గిరిజనులు తయారు చేసిన ఈ రంగులను తినవచ్చు కూడా! -
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్‌లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
Lok Sabha polls 2024: ఎన్నికలప్పుడే పేదలు గుర్తొస్తారు
భోపాల్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కిపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు 400కు పైగా స్థానాలు లభిస్తాయని సాక్షాత్తూ ప్రతిపక్ష నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝాబూవా జిల్లాలో ఆదివారం గిరిజనుల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. ఆ పారీ్టకి గ్రామీణులు, రైతులు, పేదలు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల క్రితం దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరాముడితో సంబంధం ఉన్న ఆలయాలను దర్శించుకున్నానని, స్థానిక ప్రజల నుంచి తనకు అపరిమితమైన ప్రేమ లభించిందని చెప్పారు. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గ్రహించాయని, అందుకే దింపుడు కళ్లం ఆశతో కుటిల ప్రయత్నాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. టూటీ చేయడం, ప్రజలను విభజించడం.. ఇదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ము దోచుకోవడం, అధికారం పోయాక భాష, ప్రాంతం, కులం పేరిట విడదీయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిపోయిందన్నారు. అవినీతి, విభజన రాజకీయాలు అనే ఆక్సిజన్‌తో కాంగ్రెస్ బతుకుతోందన్నారు. ప్రజలకు నిజాలు తెలుసని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. గిరిజనులు, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందుకే ప్రతిపక్షాలు తనను దూషిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి బూత్‌లో అదనంగా 370 ఓట్లు గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీకి అదనంగా 370 ఓట్లు వేయాలని ప్రజలను నరేంద్ర మోదీ కోరారు. మొత్తం 543 లోక్‌సభ సీట్లకు గాను తమకు 370కిపైగా సీట్లు కట్టబెట్టాలన్నారు. మధ్యప్రదేశ్‌లో డబులు ఇంజన్ ప్రభుత్వం డబుల్ స్పీడ్‌తో పని చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రూ.7,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆక్షేపించారు. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రయతి్నంచిందని ధ్వజమెత్తారు. విలువలతో కూడిన విద్య కావాలి భారతీయ విలువల ఆధారిత విద్యా వ్యవస్థ తక్షణావసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా తాంకారాలో ఆదివారం వేడుకల్లో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. భారతీయ వ్యవస్థ వేదాల వైపు మళ్లాలంటూ దయానంద సరస్వతి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త అని కొనియాడారు. సమాజం నుంచి బానిసత్వం, మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారని తెలిపారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలోని పాఠశాలలు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో జాతి నిర్మాణం అనే బాధ్యత చేపట్టాలని ఆర్య సమాజ్‌కు విజ్ఞప్తి చేశారు. దయానంద సరస్వతి జని్మంచిన గుజరాత్లో తాను కూడా జని్మంచడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. -
గిరిజన గృహాల్లో విద్యుత్ వెలుగులు
సాక్షి, అమరావతి: అడవులు, కొండల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి గిరిజన గృహానికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ.140 కోట్లను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెలలో రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలపై అధ్యయనం చేశాయి. అడవులు, కొండ ప్రాంతాల్లోని గిరిజనుల గృహాలకు విద్యుత్ లైన్లు వేయడానికి సాంకేతికంగా, ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలను వీరు అధ్యయనం చేశారు. గిరిజనుల నుంచి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నంద్యాల జిల్లాలో 213 గిరిజన ఆవాసాల విద్యుదీకరణకు రూ.5 కోట్లు కేటాయించింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.24 కోట్లతో 1982 గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సర్విసులు అందిస్తోంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ.33.49 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. ఇంకా ఏవైనా విద్యుత్ అందని గిరిజన గృహాలను కూడా డిస్కంలు గుర్తిస్తున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల విద్యుదీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎంజేఏఎన్ఎంఏఎన్) పథకానికి కూడా మన రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం ద్వారా విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కాని ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అర్హులైన గిరిజన లబ్దిదారులందరికీ ప్రభుత్వం సబ్సిడీతో నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలు, ట్రూ–అప్, ఎఫ్‌ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్టీ వినియోగదారుల రాయితీ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి ఉండేది. 100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల సర్విసులకు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 200కు పెంచింది. ఎస్టీల విద్యుత్ సబ్సిడీ గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. దీంతో సర్వీసులూ పెరిగాయి. 5 లక్షలకు పైగా ఎస్టీ కుటుంబాలకు ఇప్పుడు ఉచిత విద్యుత్ అందుతోంది. ప్రతి ఆవాసానికీ విద్యుత్ ఈపీడీసీఎల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సదుపాయం లేని 271 గిరిజన మారుమూల హాబిటేషన్స్ను గుర్తించాం. 4944 గిరిజన కుటుంబాలకు విద్ద్యుదీకరణ చేయడానికి రూ.29.96 కోట్లతో గతంలో ప్రతిపాదనలు రూపొందించాం. తాజాగా 1,474 గిరిజన ఆవాసాల్లో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ. 33.49 కోట్లతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఇంకా విద్యుదీకరణ చేయని 245 హాబిటేషన్స్లో 1,544 గృహాల విద్యుదీకరణకు పాడేరు డివిజన్లోని గిరిజన ప్రాంతాల్లో సర్వే చేశాం. ప్రతిపాదనలు కూడా రూపొందించాం. –ఎల్ మహేంద్రనాథ్, ఎస్ఈ, విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ -
మనసున్న ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు అత్యధికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ, ఆచార్య అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఆదివారం విజయవాడలో ‘గిరిజన శంఖారావం’ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాంనాయక్ మాట్లాడుతూ.. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు. ఏపీలో గిరిజనులకు జరుగుతున్నంత సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా అందడం లేదని చెప్పారు. అందుకే ఏపీలోని గిరిజనులు జగన్‌ను దేవుడిగా అభిమానిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పపూలు ఏరుకుని బతికే కుటుంబానికి చెందిన తాను ఉమ్మడి ఏపీలో మొదటి పీహెచ్డీ చేసిన గిరిజన వ్యక్తినని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతంగా ఎదుగుతామన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను మరింతగా పెంచాలనే తపనతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల మాట వినే ప్రభుత్వం ఉందని, దాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం జగన్ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీలుగా గిరిజనులకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను సీఎం జగన్ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకొని.. మరింతగా అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు. జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు జి.మల్లిఖార్జున నాయక్, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజునాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే గిరిజన తండాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం.. తదితర సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో పెత్తందారులతో జరుగుతున్న యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా, అగ్రవర్ణ పేదల నాయకుడైన సీఎం జగన్‌ను గెలిపించుకుందామని కోరారు. గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రామలక్ష్మి, జె.లిల్లీ, నెల్లూరు నగర మేయర్ పొట్టూరి స్రవంతి, కదిరి రూరల్ జెడ్పీటీసీ కృష్ణ నాయక్, పలు కార్పొరేషన్ల డైరెక్లర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ బంజార కళాకారుడు బిక్షు నాయక్ బృందం ప్రదర్శించిన గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. -
‘పీఎం జన్ మన్’తో గిరిజనుల అభివృద్ధికి కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు)తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని.. వారిని ఇప్పటివరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023–24 నుంచి 2025–26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా రూ.8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మలీ్టపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌లకు రాజీవ్ గౌబ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగుడ, పాత బల్లుగుడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్‌లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నతాధికారులు కె.విజయానంద్, బి.రాజశేఖర్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, జి.జయలక్షి్మ, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, లక్ష్మీశా, జె.వెంకట మురళి, బాలూ నాయక్, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. -
గిరిజన ఉపాధిలో వికాసం
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలు(వీడీవీకే)లతో గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తోంది. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్‌తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. విక్రయిస్తున్న ఉత్పత్తులివీ.. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్‌చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం. రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్‌కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు -
ఆ పల్లెను చూసింది నలుగురు ఎమ్మెల్యేలే!
రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు. సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది. ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్‌లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్‌పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి. కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి. 2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు. రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట చదువు ఆపేశాను నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్‌రెడ్డి, వీరారెడ్డిగూడెం -తాండ్ర కృష్ణగోవింద్