సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల గిరిజనులు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల (ఐటీడీఏ) పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు గిరిపుత్రుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచాయి.
2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మొత్తం రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రతి గిరిజనులకు రెండుకు మించిన పథకాల ద్వారా లబ్ధి కలిగింది. ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) ఇప్పటివరకు గిరిజనులకు రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఆదివాసీలకు ఇంత భారీస్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు.
వైద్య రంగానికి సంబంధించి..
గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.746.30 కోట్లను మంజూరు చేసింది. రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తున్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ గిరిజన ప్రాంతాల్లో గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న కేవలం రూ.400 జీతాన్ని రూ.4 వేలకు పెంచారు.
నేడు సాలూరులో ఆదివాసీ దినోత్సవం
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని బుధవారం సాలూరులో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ముఖ్య అతిథిగా హాజరవుతారు. 20 రకాల గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
విద్యారంగంలో ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్ని నిర్వహిస్తూ.. 1,55,599 మంది విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.920.31 కోట్లు కేటాయించింది. నాడు–నేడు మొదటి దశలో రూ.140 కోట్లతో గిరిజన విద్యా సంస్థలను తీర్చిదిద్దింది. రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల భూమిని కేటాయించింది.
ఉపాధి పరంగా..
అర్హులైన ప్రతి ఎస్టీ కుటుంబానికి కనీసం రెండు ఎకరాల భూమిని అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. 2019 ఆగస్టు నుంచి 2,15,309
ఎకరాల విస్తీర్ణంలో 1,26,997 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 39,272 ఎకరాల విస్తీర్ణంలో 26,287 డీకేటీ పట్టాలను పంపిణీ చేసింది. ఈ భూముల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.రూ.3,796.39 కోట్లు కేటాయించారు. 3 వేలకు పైగా బోర్లు వేయడంతోపాటు 2.27 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, కాఫీ, మిరియాల సాగును అభివృద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment