
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో సీఎం చంద్రబాబు హెచ్చరిక
వాళ్లకు ఎలాంటి లబ్ధి జరగకూడదని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆదేశం
నిండు సభలో సీఎం వ్యాఖ్యలపై విస్తుపోయిన జనం
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం తగదన్న విశ్లేషకులు
ఆదాయం లేదంటూనే 12.9% వృద్ధి సాధించానని లేని గొప్పలు
పేదరాలింట మంచి నీళ్లు తాగడానికి ససేమిరా
చూశారా.. ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడానో! తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు.. సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది.. తనకు ఓటు వేయని వారిని పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది.. తన వాళ్లకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది.. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ బాగుండాలని అనుక్షణం పరితపించిన తీరు ఒకరిది.. ఎదుటి వాళ్లపై కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కుతంత్రం మరొకరిది.. తను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా మంచి చేయాలన్న ఆరాటం ఒకరిది.. మనవాళ్లు కాని వారందరినీ అణచి వేయాలన్న కుట్ర మరొకరిది..
చిత్తూరు అర్బన్/ సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అధికారులు, టీడీపీ నేతలను హెచ్చరించడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విస్మయ పరిచింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని గత సీఎం వైఎస్ జగన్ పరితపిస్తే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం విస్తుగొలిపింది.విజనరీనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీ వారికి ఎలాంటి లబ్ధి చేకూరకూడదని బహిరంగంగా ఆదేశించడంపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు విస్తుపోతున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరిగి ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రమాణం చేసి.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం సబబేనా అనే చర్చ మొదలైంది. సీఎం స్థానంలో ఉంటూ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సిందిపోయి ఇలా మాట్లాడటం తగదంటున్నారు.
నాడు వైఎస్ జగన్ కూడా ఇలానే ఆలోచించారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేయడం మీరు గమనించలేదా.. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరూ మనవాళ్లేనని వైఎస్ జగన్ పదేపదే చెప్పడం గుర్తు లేదా అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జగన్ పథకాల వల్ల తాము ఎంతగానో లబ్ధి పొందామని ఊరూరా అందరితోపాటు టీడీపీ వారు సైతం అప్పట్లో స్వచ్ఛందంగా చెప్పుకున్నారని చెబుతున్నారు.
ఏం చేయాలో దిక్కు తెలియడం లేదట!
ఓ వైపు రాష్ట్రంలో ఆదాయం లేదని, ఏం చేయాలో దిక్కు తోచడం లేదని చెప్పుకొచి్చన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైపు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించేశానని లేని గొప్పలు చెప్పడం విస్తుగొలుపుతోంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో దిక్కు తెలియడం లేదని అంటూనే వృద్ధి రేటు పెంచేశానని చెప్పుకోడం పచ్చి అబద్ధమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆదాయం అంతా తన చుట్టూ ఉన్న వారికి కమిషన్ల రూపంలో దోచిపెట్టి.. ‘నీకింత.. నాకింత’ అని పంచుకోవడానికే సరిపోతోందని అంటున్నారు.

నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతూ, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తూ.. వాటిలో కమిషన్లు కొట్టేస్తూ ఆదాయం లేదనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆద్యంతం వైఎస్సార్‌సీపీ నేతలను తిట్టిపోశారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పుల నుంచి ఎలా బయట పడాలో తెలియడం లేదని.. తానొక్కడినే పరుగెడుతూ ఉన్నానని చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారి బాగోగులను చూసే బాధ్యత తనదన్నారు. సూపర్ సిక్స్ హామీల సంగతి చెప్పవయ్యా అంటే.. ఆకాశానికి నిచ్చెన వేసేలా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం అన్నారు.
చిన్న పిల్లల తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేస్తారా?
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తాను ఏం చేస్తున్నాననే విషయం విస్మరించారు. ఎనిమిది, పదేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడ పిల్లల్ని సభలో తన పక్కన కూర్చోబెట్టుకుని అధికారులు, మీడియా ఎదుట వారి తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలను వెల్లడించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ల నాన్న మరో మహిళతో వెళ్లిపోయాడు.. వీళ్ల అమ్మ మరో వ్యక్తి వెంట వెళ్లిందంటూ మాట్లాడటం విస్తుగొలిపింది. తద్వారా ఆ పిల్లల మనస్సును ఎంతగా గాయ పరిచారో సీఎం తెలుసుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం.. వాసు, సెల్వి దంపతుల ఇంట్లోకి వెళ్లి పింఛన్ డబ్బులిచ్చారు. ‘సార్ కాస్త నీళ్లు తాగండి..’ అంటూ సెల్వి ఆప్యాయంగా అడగ్గా.. ‘అవి వద్దమ్మా.. నా వద్ద ఉన్న నీటినే తాగుతాను’ అంటూ హిమాలయ కంపెనీ నీళ్ల బాటిల్ చూపిస్తూ అందులోని నీళ్లు తాగారు. సర్పంచ్ వి.సి. సుబ్రమణ్యం యాదవ్ వైఎస్సార్‌సీపీకి చెందిన వారని వేదికపై చోటు కల్పించలేదు.
Comments
Please login to add a commentAdd a comment