ఎన్నో ఆటుపోట్లను భరించి ఒంటరిగా రాజకీయ పార్టీని స్థాపించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కరోనా వల్ల రెండేళ్లు కలిసిరాక పోయినా ప్రజల్ని కంటిరెప్పల్లా కాపాడుకున్నారు. మిగిలిన కాలంలోనే పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారు. పేద తల్లిదండ్రులకు అద్భుతమైన ఆరోగ్య సేవలను అందించారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తెచ్చారు. పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలు వచ్చేట్టు చూశారు. ఒక్కమాటలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. అందుకే జగన్ అంటే జనాల్లో అంత ఆదరణ! జగన్ అంటే ఒక నిజం, ఒక భావోద్వేగం, ఒక విజయ సంకేతం.
వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ పది సంవత్సరాలు ఆటుపోట్లతో నడిచింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాజకీయంగా కాకలు తీరిన, కుట్రలు కుతంత్రాలు తెలిసిన నాయకులను ఎదిరించి ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్‌కు బీజం పడింది. తరువాతి కాలంలో సోనియా గాంధీ కుట్రలకు బలైపోయి పదహారు నెలలు జైలు జీవితం గడిపారు.
2017 జూలైలో తూర్పు గోదావరి జిల్లా, వైరా మండలం చాపరాయి గ్రామంలో పదహారు మంది ఆదివాసీలు విషజ్వరాలతో వైద్య సదుపాయం అందక మరణించిన విషయం తెలిసిందే. అప్పుడు జగన్ పది కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో పోలీసు రక్షణ కూడా లేకుండా నడక దారిన వెళ్లి ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. పేదల పక్షాన శాసనసభలో గళం వినిపించారు.
ఇక జగన్ రాజకీయ జీవితంలో మరువలేని ప్రధాన ఘట్టం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,648 కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు చూసి చలించి ‘నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా అశేష జన వాహిణి మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న యాభై ఎనిమిది నెలల పాలనా కాలంలో కరోనాతో 24 నెలలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవడంలోనే గడిచింది. మిగిలిన దాదాపు మూడు సంవత్సరాల కాలంలో తన మేనిఫెస్టోలోని పథకాల ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఈ పథకాల ద్వారా మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. వై.ఎస్.ఆర్. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో పేద ప్రజల బతుకులలో వెలుగులు ప్రసరించాయి. వడ్డీ లేని రుణాలు ఇప్పించడం వలన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక పుష్టి కలిగింది. ముప్పై ఒక్క లక్షల మంది నిరుపేద మహిళలకు జగన్ ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది.
అందులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో పదహారు లక్షల ఇల్లు... రోడ్లు, డ్రైనేజి, నీటి వసతి, వీధి దీపాలు వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఇంటి విలువ స్థలంతో కలిపి పది లక్షలనుండి పదుహైదు లక్షల వరకు చేరి, పేదవారికి సొంత ఇంటి కల నెరవేరింది.
జగన్ సుపరిపాలనలో మరో ముందడుగు 2019 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమైన వలంటీర్ వ్యవస్థ. ఇక 2019 అక్టోబర్ 2న ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయాలు ఒక సువర్ణ అధ్యాయం. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. సచివాలయాల ద్వారా ప్రజలకు రెవెన్యూ రికార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే సేవలు, ఆరోగ్యసేవలు ఏమాత్రం వ్యయ ప్రయాసలు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వేగవంతంగా లభిస్తున్నాయి. గ్రామ స్థాయిలో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర సామగ్రి సేవలు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుతున్నాయి.
వైద్య రంగంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పైసా ఖర్చు లేకుండా అందించడం. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ హాస్పిటల్స్‌ను ఆధునీకరించారు. మహానేత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.ఇరవై ఐదు లక్షలకు పెంచారు. చికిత్స సేవలు 1,059 నుంచి 3,250 వరకు పెంచారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా ప్రజలకు గడప గడపకు వైద్య సేవలు అందు తున్నాయి. ఇవి కాక శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా వంశధార నది నుంచి 100 కిలోమీటర్లు పైప్‌లైన్ ద్వారా 807 గ్రామాలలోని ఏడు లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం జరుగుతోంది.
పలాసలో జగన్ తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ మరియు కిడ్ని పరిశోధన హాస్పిటల్ నిర్మించడంతో అక్కడి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేనాటికి రాష్ట్రంలో 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఆయన శ్రీకాకుళం, కడప, ఒంగోలులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే నంద్యాల, ఏలూరు, రాజ మండ్రి, మచిలీపట్నం, విజయనగరంలలో ప్రారంభించారు. మిగిలిన 12 వైద్య కళాశాలలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
పేద పిల్లల అభివృద్ధికి విద్య అత్యవసరం అని జగన్ విశ్వసించారు. ఈ దిశగా జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోని అధి కారులతో స్థిరమైన ఆర్థికాభివృద్ధిపై చర్చలో పాల్గొనడం సామాన్య మైన విషయం కాదు.
పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే సులభతర విధానంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏపీకి రూ.32,800 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ప్రస్తుత ప్రభుత్వంలో రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోటర్ల పల్లె గ్రామం దగ్గర స్మార్ట్ డీవీ ప్రాజెక్ట్, అనకాపల్లి అచ్యుతా పురం దగ్గర టైర్ల తయారీ కంపెనీ, తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం దగ్గర బిర్లా క్యాస్టిక్ సోడా యూనిట్, వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్ దగ్గర సెంచ్యురీ ప్యానల్స్ లాంటి పరిశ్రమలు వచ్చాయి.
ఇంకా, అరబిందో, దివీస్ సంస్థల విస్తరణలతో కాకినాడ ఫార్మా యూనిట్‌గా ఎదుగుతోంది. విశాఖపట్నంలో ఇన్పోసిస్, విప్రో, భారత్ ఎలక్టాన్రిక్స్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్ర రాష్ట్రానికి 972 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్నా కొత్తగా పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్‌లు గానీ ఇదివరకు రాలేదు. ప్రస్తుతం జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి వలన మత్స్యకార కుటుంబాల వారు చేపల వేటకు గుజరాత్ తీర ప్రాంతానికి వలసలు పోనవసరం లేదు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తన పాలనలో పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. తన ప్రభుత్వం వలన తమ కుటుంబాలకు మంచి జరిగితేనే తనకు తోడుగా నిలవమని అడుగుతున్నారు. జగన్ ఒక సంఘ సంస్కర్తగా, ప్రజారంజక పాలకుడిగా పేరు పొందిన మాట వాస్తవం. ప్రజలతో జగన్ బంధం భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అందుకే సిద్ధం యాత్రలో లక్షలాది మంది పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు ఎర్రటి ఎండల్లో కూడా జగన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన కనబడితే కేరింతలు కొడుతూ జై జగన్ అని నినాదాలు చేస్తున్నారు. ఇవి జగన్ విజయానికి సంకేతాలు.
– అమూరు రాఘవరెడ్డి ‘ జె.డి.ఎస్.డబ్ల్యూ. (రిటైర్డ్),
– జి.సాంబశివారెడ్డి ‘ రిటైర్డ్ ప్రిన్సిపల్,యోగి వేమన యూనివర్సిటీ, కడప
Comments
Please login to add a commentAdd a comment