అభిప్రాయం
ఇటీవల విశాఖపట్టణంలో ఓ దళిత మేధావుల సమా వేశంలో పాల్గొన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిపై చర్చ జరి గింది. ఈ సమావేశంలో 90 శాతం దళితులు, క్రైస్తవులు ఉన్నారు. జగన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చే విధంగా అసెంబ్లీ తీర్మానం చేసిన కారణంగా, ఎస్సీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఈ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. నయా మనువాది చంద్రబాబు నాయుడుకీ, అతని కూటమికీ ఓటు వేయకుండా తిరిగి రెండవసారి జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే దృక్పథంతో దళిత సమాజం ఉందనేది వారి మాటల సారాంశం.
విద్యా, వైద్య రంగాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు జగన్. ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, ఆ కుటుంబం ప్రభుత్వ రాయితీల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ భారం తగ్గిపోతుంది.
పదేళ్ల కాలంలో 40 శాతం, మరో పది సంవత్సరాల కాలంలో మరో 50 శాతం మొత్తం 20 సంవత్సరాల కాలంలో 90 శాతం సబ్సిడీ పథకం కింద లబ్ధిపొందే వారు, అభివృద్ధి పథకాల కింద లబ్ధిపొందే వారు అభివృద్ధి చెంది ఈ పథకాలను అంటే పెన్షన్ పథకం, సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి ఈ కుటుంబాలు ఎదిగి పోతాయి. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్‌లో 90 శాతం బడ్జెట్ తగ్గిపోతుంది.
సామాజిక న్యాయాన్ని దేశంలో ఏ ముఖ్య
మంత్రి అమలు చేయని విధంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.
తాజాగా ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ ప్రకటించిన ఎంపీ సీట్లలో 11 సీట్లనూ; అసెంబ్లీ సీట్లలో 48 సీట్లనూ బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొత్తం కలిపి 100 అసెంబ్లీ సీట్లు కేటాయించారు.
ఇది దేశంలోనే ఓ రికార్డు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంత ప్రాతినిధ్యం ఆ యా వర్గాలకు ఇవ్వడం కనిపించదు. అలాగే ఇటీవల 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించి చరిత్రను తిరగరాశారు.
గత ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహా విప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. నామినేటెడ్ పోస్టులలో 50 శాతాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. అలాగే కాంట్రాక్టు పనులలో వారికి 50 శాతం కోటా కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు.
56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్ల పోస్టులకు గాను మొత్తం 100 శాతం బీసీలకే కేటాయించారు. ఫలితంగా ఆ కులాలలో నాయకత్వ లక్షణాలు పెరిగాయి.
రాజ్యసభలో మొత్తం 9 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉంటే... అందులో నలుగురు బీసీలు. శాసనసభ స్పీకర్; శాసన మండలి చైర్మన్, డిప్యుటీ చైర్మన్ పదవుల కేటాయింపు కూడా జగన్ సామాజిక న్యాయ దృష్టికి నిదర్శనంగా నిలిచాయి. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
కానీ ఆ మేర బీసీలకు జరిగే నష్టాన్ని పూరించడానికి పార్టీ పరంగా అదనంగా 20 శాతం ఆ వర్గానికి పెంచి మొత్తం 44 శాతం స్థానాలను బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు.
చివరగా ముగించే ముందు మూడు రాజ ధానుల అంశం కూడా పరిపాలన విభజనలో భాగంగా నేను చూస్తాను. సంపద సృష్టి జరగా లన్నా, సంపద పంపిణీ జరగాలన్నా ఒకే ప్రాంతం / లేదా సిటీ అభివృద్ధి చెందితే జరగదు. అందుకే కోస్తాంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహణ రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును చేయాలని జగన్ సంకల్పించారు. అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి నమూనా కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలంటే జగన్‌మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ సామాజిక న్యాయ కోవిదులు కూడా ఆశిస్తున్నారు.
ప్రొ‘‘ గాలి వినోద్ కుమార్
వ్యాసకర్త ఉస్మానియా, తెలంగాణ విశ్వ విద్యాలయాల మాజీ డీన్–ఫ్యాకల్టీ ఆఫ్ లా
Comments
Please login to add a commentAdd a comment