
సందర్భం
కార్మికుల పండగ దినం ‘మే డే’. ప్రపంచంలోని కార్మికులందరూ తమ హక్కుల సాధన దినోత్సవంగా మే 1వ తేదీని జరుపుకొంటారు. 1886 ముందు కార్మికులు వెట్టి చాకిరితో మగ్గిపోతూ రోజుకు 18 గంటల పాటు పనిచేసేవారు. దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని చికాగో నగ రంలో జరిగిన కార్మికుల ప్రదర్శనపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణకాండను ప్రపంచమంతా ఖండించింది. ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల ద్వారా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసే హక్కును కార్మికులు దాదాపు అన్ని దేశాల్లోనూ సాధించు కున్నారు. ఈ విజయానికి సూచిక గానే మే డేని జరుపుకుంటున్నారు కార్మిక సోదరులు.
భారతదేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలు జరి పిన పోరాటాల ఫలితంగా వెట్టి చాకిరీ నిర్మూలన జరిగింది. వేతన సవరణకు సంబధించిన ఒప్పందాలకు అంకురార్పణ జరిగింది. సెలవులు, ఇంక్రిమెంట్లతోపాటు కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలను పని ప్రదేశంలో సాధించడంలో కొంతవరకు కృత కృత్యులమయ్యాము.
అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంకానీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ మళ్లీ వారిని పాత కాలపు కష్టాల పాలు చేయడానికి ప్రయత్ని స్తున్నాయి. కేంద్రం కార్మిక చట్టాలన్నంటినీ నాలుగు కోడ్‌ల కిందికి తీసుకురావడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.
కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్ని ఆందో ళనలు చేపట్టినా ప్రభుత్వ పెద్దలఆలోచనా విధానంలో మార్పు రానందున మే 20వ తేదీనాడు పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్లమీదికి వచ్చి ఉద్యమం చేయనున్నది. మే డే స్ఫూర్తితో కార్మిక లోకం ఉవ్వెత్తున ఎగసిపడనున్నది. మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారు. అందుకే ఆయన మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు.
కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా వారికి మేలు చేకూర్చే కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది. ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి అనేక ప్రయోజనాలు కలుగ జేసింది. ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్న ఉద్యోగులను పర్మినెంట్ చేశారు నాటి సీఎం జగన్. ఇదే తరుణంలో ఆటో కార్మికులకు రూ. 10,000, దర్జీలు, దోబీలు, నాయి బ్రాహ్మణులు, బెస్త కార్మికులు వంటివారికీ 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయ టం తెలిసిందే.
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకూ కృషిచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తలంచితే దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు జగన్. అసెంబ్లీలో ప్రైవేటీకర ణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన కార్మికుల పక్షపాతి జగన్. ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలూ ఖండించాలి. మే డే స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగవలసిన అవసరం ఉంది.
పూనూరు గౌతమ్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు
మొబైల్: 98481 05455
(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే)