అభిప్రాయం
బెజవాడను వరద ముంచెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యల్లో ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన గడచిన ఐదేళ్ల పాలనలో జరిగిన మంచిని అడుగడుగునా గుర్తుచేసింది. ఇదే ఇప్పుడు చంద్రబాబు సహా కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ప్రజల్లో తమకు లేని ఆదరణ జగన్‌కు వస్తుంటే కడుపు మంట రెట్టింపైంది.
జగన్ ఇడుపులపాయ నుండి వస్తుంటే మార్గమధ్యంలో కృష్ణలంక వాసులు ఆయన కారును ఆపేసి రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్లే తాము బతికి ఉన్నామంటూ దండాలు పెట్టారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. అదేరోజు మధ్యాహ్నం జగన్ సింగ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటి వరకూ బోట్లలో తిరుగుతూ కాలక్షేపం చేసిన చంద్రబాబు... జగన్ నీటిలోకి దిగి ప్రజలతో మమేకమయ్యేసరికి ఉండ బట్టలేక పోయారు.
జగన్ నీళ్లలోకి దిగాడని తాను కూడా నీళ్లలో దిగి ఫీట్లు చేయడానికి పడరాని పాట్లు పడ్డారు. ఇక జగన్ ఈ క్రమంలోనే అడిగిన అనేక ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పలేక ఇప్పటి వరకూ ఊరుకుని... ఇప్పటికిప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనను తెరపైకి తీసుకొచ్చారు. అసలు వీడియోలే లేవంటూ ఆడపిల్లల ఆందోళనను అవమానించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయడం వల్ల సింగ్‌నగర్, పాయకాపురం, ఆర్‌ఆర్ పేట, కండ్రిక... ఇలా అనేక ప్రాంతాలు కేవలం రెండు గంటల వ్యవధిలో చెరువుల్లా మారి పోయాయి. శనివారం సాయంత్రం నుండి ఈ పరిస్థితి ఉంటే సోమవారం సాయంత్రం వరకూ సహాయక చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి.
ఆయా ప్రాంతాలకు వెళ్లిన టీవీ రిపోర్టర్ల వద్ద ప్రజల నుండి ఆగ్రహవేశాలు వ్యక్తమవడం చూసిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నిన్నమొన్నటి వరకూ రేషన్ సరుకులు సరఫరా చేసే వ్యాన్లను వద్దంటే వద్దన్న బాబు అండ్ కో ఇప్పుడా వ్యాన్లలోనే ఫుడ్ ప్యాకెట్లను సరఫరా చేసింది. సచివాలయాలను నిర్వీర్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడదే సచివాలయాలను కేంద్రంగా చేసుకుని సహాయక చర్యలను చేపట్టింది.
ఇదిలా ఉంటే సహాయక చర్యల్లోనూ ముమ్మా టికీ అవినీతే కనిపిస్తోంది. పడవ పంపాలంటే రూ. 2 వేల నుండి రూ. 10 వేల వరకూ డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఇక ఆహారం కూడా చివరి ప్రాంతాలకు అందలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చిన ఆహారం కూడా పురుగులు, కుళ్లిన వాసన వస్తోందని మండిపడ్డారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండమే పునరావాస కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయలేకపోవడానికి కారణమని అర్థమవుతోంది.
చంద్రబాబు తన నివాసమే కృష్ణా నదిలో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయారు. శనివారం నుండి వరద ఉధృతి ఉంటే బుధవారం తన ఇంటిపై అప్పుడెప్పుడో రెండు రోజుల క్రితం జగన్ ఆరోపించిన అంశాలను లేవనెత్తడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. అందరి ఇళ్లు మునిగిపోయినట్లే తన ఇల్లూ మునిగిపోయిందని చంద్రబాబు ఎందుకన్నారన్న ప్రశ్నకు కనీసం ఆయన దగ్గర కూడా సమాధానం దొరకుతుందో లేదో! అందరి ఇళ్లు ప్రభుత్వం నీటిని విడుదల చేయడం వల్ల మునిగాయి.
కానీ, చంద్రబాబు ఇల్లు మాత్రం కృష్ణా నదిలో ఉన్నందువల్ల మునిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను యథేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు... బుడమేరు ఆక్రమణదారులను కఠినంగా శిక్షిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరీ ముఖ్యంగా బుడమేరు 2019 నుండి ఆక్రమణలకు గురైందంటూ వైసీపీ మీదకు నెట్టేందుకు పన్నాగం పన్నారు. నిజానికి చంద్రబాబు పాలనా కాలంలోనే బుడమేరు ఆక్రమణలకు గురయిందన్నది బహిరంగ రహస్యం.
ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రా తరహా సంస్థను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరహా సంస్థలు నెలకొల్పితే ముందు చంద్రబాబు నాయుడి నివాసం నుండి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ మేరకు పవన్ కల్యాణ్‌కు ధైర్యం ఉందా అనేది చూడాలి. జన సైనికులు తమ నేత ప్రశ్నించాల్సిన సమయంలో నిశ్శబ్దంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98484 05455
Comments
Please login to add a commentAdd a comment