రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌

Published Mon, Sep 9 2024 4:38 AM | Last Updated on Mon, Sep 9 2024 4:39 AM

YS Jagan fires on CM Chandrababu

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

సాయం అందించడంలో ఇంత చేతగానితనమా? 

మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది  

వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి 

ఐదారు లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా? 

ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం 

సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటాలే కారణం 

సర్వం కోల్పోయినవారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా? 

ప్రభుత్వం ఆదుకోకపోతే బాధితుల తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తాం

సాక్షి, అమరావతి: విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ సాయం అందడం లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని ధ్వజమెత్తారు. వరదలకన్నా చంద్రబాబు నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, ఆయన అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందన్నారు. 5 కోట్లమంది జనాభా, రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు. వరద సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ శనివారం ఎండగట్టారు. ఆయన పోస్టు పూర్తి పాఠం ఇది... 

1. ఇంత చేతగానితనమా..  
విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్లమంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? ఇంత చేతగానితనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబూ. 

2. 50 మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు..  
మూడు రోజుల్లో 30 సెం.మీ. పైగా వర్షం పడటం అసాధారణం ఏమీ కాదు. గతంలో చాలాసార్లు పడింది. కానీ ఈ మాదిరిగా 50 మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా.. అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం, బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అన్నది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఈ వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా, 4–5 రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణం. 

3. ఇదంతా మీ నిర్లక్ష్యం వల్లేగా చంద్రబాబూ.. 
అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబూ? శుక్రవారం (ఆగస్టు 30) నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని మీకు బుధవారమే (ఆగస్టు 28) అలర్ట్‌ వచ్చింది. అప్పటికే కృష్ణా నదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని కూడా మీకు తెలుసు. 

అలాగే పై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం కూడా ఉంది. బుధవారం నుంచి శుక్రవారం వరకూ రెండున్నర రోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు. నీటిపారుదల, రెవెన్యూ, హోం శాఖ కార్యదర్శిలతో సమీక్షించి.. వారికి బాధ్యతలు అప్పగించి.. దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా?  

4. ‘బుడమేరు’లో మీ నిర్వాకం వల్లే విపత్తు..  
ఆ సమీక్ష జరిగి ఉంటే నీటిపారుదల శాఖ కార్యదర్శి ఫ్లడ్‌ కుషన్‌ మీద ధ్యాస పెట్టేవారు కదా? కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి కొద్దికొద్దిగా నీటిని ముందుగానే విడుదల చేసి, తగ్గించుకుంటూ వస్తూ 60–70 టీఎంసీల ఫ్లడ్‌ కుషన్‌ ఏర్పాటు చేసి ఉండేవారు కదా? అప్పుడు పై నుంచి వచ్చే వరద నీటిని ఆయా జలాశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే.. పులిచింతల కింద కృష్ణా నదిలోకి వచ్చే వరద నీటిని సక్రమంగా నియంత్రించి భారీ వరద ముప్పును తప్పించేవారు. 

దీనివల్ల ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా? పై నుంచి వచ్చిన వరదను తగ్గించకపోవడం వల్ల కృష్ణానదిలో భారీ ప్రవాహానికి పులిచింతల దిగువ వరద కూడా తోడయ్యింది. దీంతోపాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం ఇంత విపత్తుకు దారితీసింది.  

5. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఉండి ఉంటే..  
అదే విధంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి షెల్టర్ల ఏర్పాటు, నిరాశ్రయులకు వసతుల కల్పనపై దృష్టిపెట్టేవారు. హోం శాఖ కార్యదర్శి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఈ షెల్టర్లలోకి తరలించి ఉండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఉండి ఉంటే వారితో కలిసి వీరంతా ఈ ముప్పును చాలా సమర్థవంతంగా, ప్రాణనష్టం లేకుండా ఎదుర్కొనేవారు. కానీ ఇవేమీ జరగలేదు. 

6. మీ ప్రచార ఆర్భాటాల వల్లే సమన్వయలోపం 
మీ ప్రచార ఆర్భాటాల వల్లే సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయ లోపం నెలకొంది. మీకూ, మీ కూటమి మంత్రి నాదెండ్లకూ మధ్య జరిగిన సంభాషణపై వైరల్‌ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. ట్రాక్టర్లు రాకపోవడం ఏంటి? 150 వాహనాలు మాత్రమే ఉండడం ఏంటి? 80 వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలిరోజు 15 వేల మందికీ ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి? వర్షాలు ఆగి ఐదు రోజుల అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? లక్షల ఉద్యోగులున్న యంత్రాంగం ఏమైపోయింది? ఇప్పటికీ ఇంటింటికీ జల్లెడపట్టి  ఎన్యుమరేషన్‌ చేసిన దాఖలాలేవీ కనిపించడంలేదు. 

మరి మీరిచ్చిన సహాయం కచ్చితంగా వారికి ఎలా చేరుతుంది? ఎమర్జెన్సీ సేవలను ఎలా అందించగలుగుతారు? విపత్తుల సమయంలో అసమాన సేవలందించిన, గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిరీ్వర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా?   

7. మా ప్రభుత్వ హయాంలో ఒక్క రోజులోనే డోర్‌ డెలివరీ 
బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలిసారి అన్నట్టుగా, దాన్నే ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వరదల వల్ల బాధితులైన వారికే కాదు, వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా రేషన్‌ సరుకులను ఒక్క రోజులోనే ఎండీయూ వాహనాల్లో డోర్‌ డెలివరీ చేశాం. 

అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్లు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశాం. కానీ విజయవాడలో పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా మీరిస్తున్న సరుకులు అరకొరే. తీరా అవికూడా డోర్‌ డెలివరీ పద్ధతిలో చేరడం లేదు. తీసుకున్న ఆ కొద్దిమంది, ఇళ్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఇంకా వారిని బాధపెట్టడం కాదా? 

8. సాయం చేయడంలో బీద అరుపులెందుకు? 
కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఒకరు, వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయి మరొకరు, ఉపాధిని కోల్పోయి ఇంకొకరు, ఇల్లు ధ్వంసమై మరొకరుం..ఇలా విజయవాడ వరదబాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా చంద్రబాబూ? ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో బీద అరుపులు ఎందుకు? చివరకు విరాళాలు ఇవ్వాలని డ్వాక్రా అక్కచెల్లెమ్మల దగ్గర నుంచి కూడా వసూళ్లకు దిగడం ఏంటి? బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి. మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement