చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
గతంలో ఎన్నడూ చూడని విపత్తు.. బాధితులను వారి ఖర్మకు వదిలేశారు
గత నెల 28నే కృష్ణా బేసిన్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది
శ్రీశైలం, సాగర్, పులిచింతల ఖాళీ చేసి ఫ్లడ్ కుషన్ ఉంచడంలో ప్రభుత్వం విఫలం
కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే అర్ధరాత్రి వెలగలేరు 11 లాకులు ఎత్తివేశారు
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి.. తక్షణమే బాధితులను ఆదుకోవాలని డిమాండ్
సాక్షి, అమరావతి: భారీ వరదలకు విజయవాడ మునిగిపోవడానికి మానవ తప్పిదాలే (మ్యాన్ మేడ్ ఫ్లడ్స్) కారణమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు సర్కారు ఘోర తప్పిదం వల్లే విజయవాడ నగరం విలవిల్లాడుతోందని.. గతంలో ఎన్నడూ ఇంత విపత్తు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కనీసం మంచినీరు కూడా సరఫరా చేయడం లేదని.. పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయలేదని.. ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టడం లేదని మండిపడ్డారు.
రెండు రోజులుగా వరద బాధితులకు కనీసం ఆహారం కూడా అందడం లేదని.. వారిని తరలించేందుకు తగిన సంఖ్యలో బోట్లు కూడా సమకూర్చలేదని పేర్కొన్నారు. నిజంగా ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతకుముందు ఇప్పటికన్నా ఎక్కువ వర్షాలు కురిశాయని.. కానీ ఏరోజూ ప్రజలు ఈ స్థాయిలో బాధ పడలేదని గుర్తు చేశారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. వరద బాధితులకు తక్షణమే క్షమాపణలు చెప్పి సహాయ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు.
ఫ్లై ఓవర్ మీదుగా వాహనంలో సింగ్ నగర్ వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వైఎస్ జగన్ నడుచుకుంటూ సింగ్‌నగర్, ముత్యాలంపాడు, ప్రకాశ్‌నగర్ ప్రాంతాలకు వెళ్లారు. నడుం లోతు నీళ్లలో కూడా నడుచుకుంటూ వెళ్లి వరద బాధితులను వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కష్టాలు.. అందిన సాయాన్ని ఆరా తీశారు. తిండి, నీరు లేక రెండు రోజులుగా తాము నానా ఇబ్బందులు పడుతున్నా.. కనీసం పట్టించుకున్న వారు లేరని, ఎక్కడికైనా వెళ్లిపోదామంటే, బోట్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ వరద బాధితులు వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు సావధానంగా విన్న వైఎస్ జగన్ ఓదార్చారు. మీ తరఫున పోరాడుతానని వరద బాధితులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో ఏమన్నారంటే...
చంద్రబాబు ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత నెల 28న ఐఎండీ (వాతావరణ శాఖ) హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. 20 సెం.మీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అది అత్యధిక వర్షపాతం. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. అతి భారీ వర్షాల కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో వరదను నియంత్రించేలా జలవనరులు, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు కనీసం సమీక్ష కూడా జరపలేదు. దిగువ ప్రాంతాలే కాకుండా ఎగువన తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని.. కర్ణాటక, మహారాష్ట్రాల్లోనూ అదే రీతిలో వర్షాలు పడతాయని.. దాని వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే ప్రమాదం ఉందని ముందస్తు సమాచారం అందినా కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు.
బాబు ఇంటికి ముంపు తప్పించడం కోసమే..
బుడమేరులో వరద పోటెత్తడంతో.. కనీసం ప్రజలను అప్రమత్తం చేసేలా హెచ్చరికలు జారీ చేయకుండా శనివారం అర్ధరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11 లాక్‌లు ఎత్తేశారు. దీంతో వరద నీరు విజయవాడను ముంచెత్తింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడం కోసమే.. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించి విజయవాడను ముంచేశారు.
తక్షణమే బాధితులకు క్షమాపణ చెప్పాలి..
నేను ప్రతి ప్రశ్న లాజికల్‌గా అడుగుతున్నా. ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదట ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత వారికి ఏం చేయబోతున్నామన్నది చెప్పాలి. ఆ తర్వాతే సమాధానం చెప్పాలి. ఇప్పటికీ తగినన్ని సహాయ శిబిరాలు ఏర్పాటు చేయలేదు. నిన్నటిదాకా ఓ 6 క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. వరదల్లో లక్షల మంది మునిగి ఉంటే ఆ క్యాంప్‌లు ఏ మూలకు సరిపోతాయి? నిజానికి ఆ రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయన్న సమాచారం వరద బాధితులకు ఇవ్వలేదు.
గతంలోనూ భారీ వర్షాలు కురిసినా..
నిజానికి 11.30 లక్షల క్యూసెక్కుల వరద ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. సుమారు 120 ఏళ్ల క్రితం 1903లో 11.90 లక్షలు, 2009లో 11.10 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చింది. మా ప్రభుత్వ హయాంలో కూడా 2019 నుంచి వరుసగా మూడేళ్లు ఇలాంటి వర్షపాతం నమోదైనా.. ఈ స్థాయిలో 11 లక్షల క్యూసెక్కుల పైగా వరదనీరు, ప్రజలు ఇన్ని బాధలు పడడం జరగలేదు. అందుకు కారణం పక్కాగా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవడం. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇప్పుడు మేం అధికారంలో లేకపోయినా మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలంతా సహాయ చర్యల్లో పాల్గొంటారు. స్థానిక ప్రజాప్రతినిధులూ పాల్గొంటారు. వాళ్లు చేయగలిగినంత సహాయ చర్యలు చేపడతారు.
మా హయాంలో అందరికీ సహాయం..
మా ప్రభుత్వ హయాంలో విపత్తులు సంభవించినప్పుడు ఏ ఒక్క బాధితుడూ సహాయం అందలేదని అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అప్పట్లో వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ పక్కాగా పని చేసేది. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేది. ఎప్పుడు, ఏ విపత్తు సంభవించే అవకాశం ఉన్నా ముందే అప్రమత్తం కావడం, ప్రజలకు జాగ్రత్తలు సూచించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం ఇవన్నీ సంతృప్తకర స్థాయిలో జరిగేవి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తుపాన్ వస్తే కలెక్టర్‌కు ఒక్కటే చెప్పేవాడిని. ‘నేను మీకు వారం రోజులు టైమ్ ఇస్తున్నా.
వారం తర్వాత వస్తా. వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమై అడుగుతా. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు మంచి జరగలేదనే మాట వినపడకూడదని చెప్పేవాడిని. ముందుగా చెప్పిన ప్రకారం వారం రోజుల తర్వాత నేనే వెళ్లేవాడిని. అప్పటికే వలంటీర్ల సైన్యం అక్కడ ఉండేది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ అక్కడే ఉండేవారు. వాళ్లంతా కలసి ప్రతి గడపకూ వెళ్లి సహాయ సహకారాలు అందించేవారు. ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించింది కూడాఒక్క జగన్ హయాంలోనే.
ఎవరిని కదిపినా కన్నీరే..
అదే ఇప్పుడు పరిస్థితి చూస్తే.. ప్రతి వరద బాధితుడు మాట్లాడింది మీరు (మీడియాను ఉద్దేశించి) కూడా విన్నారు. ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే.. తెలియదు సార్.. తెలియదన్నా.. మా బంధువుల ఇళ్లకు పోవాలి!! అంటున్నారు. కనీసం ఒక్క బాధితుడైనా రిలీఫ్ క్యాంపులకు పోతున్నాం. అక్కడ ఏర్పాటు చేశారనే మాట చెప్పారా? ‘రెండు రోజుల్లో కనీసం ఏదైనా సహాయం అందిందా? ఇంటికి వచ్చి ఎవరైనా డబ్బులిచ్చారా?’ అని బాధితులను అడిగా. డబ్బులు కథ దేవుడెరుగు.. మంచి నీళ్లు ఇచ్చే నాథుడు కూడా లేడనే మాటలు బాధితుల నుంచి వినిపించాయి. వరద బాధితుల మాటలు మీరంతా (మీడియా ప్రతినిధులను ఉద్దేశించి) విన్నారు. ఇది ప్రభుత్వ తప్పిదమే. ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్ మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment