సాక్షి, గుంటూరు: వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం కనీస అవరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు చనిపోతే ఏపీ ప్రభుత్వానికి కనీసం పట్టింపులేదని వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.
‘‘రెండు రోజులుగా విజయవాడ అల్లాడిపోతోంది. కాలనీలు, ఇళ్లు నీట మునిగిపోయాయి. ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. కనీసం తక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. రెండు రోజులు అతలాకుతలం అయిపోతే ఈరోజు మంత్రులు వస్తున్నారు. విజయవాడలో అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కనీసం భోజనం కూడా ప్రజలకు అందించలేదు. ఎవ్వరినీ పునరావాస కేంద్రాలకు తరలించలేదు’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కొండ చరియలు విరిగిపోయి ఐదుగురు చనిపోయారు. కనీసం అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించలేదు. కరెంట్ లేదు, తిండి లేదు, నిత్యావసర వస్తువులు అందించలేదు. అమ్మాయిల పేరుతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. కానీ వరదల్లో ఉన్న ప్రజలను అడుకోలేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. ప్రజలను అప్రమత్తం చేయలేదు’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు.
‘‘సచివాలయ, వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్ జగన్ ముందు చూపుతో రిటైనింగ్ వాల్ కట్టారు. అందుకే లంక ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కొండ చరియలు పడి ఐదుగురు చనిపోతే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వాళ్ళ దగ్గరకి వెళ్ళారా..?. సుజనా చౌదరి ఎక్కడ..?. బోండా ఉమా ఎక్కడ..?. కేశినేని చిన్ని ఎక్కడ..?. గద్దె రామ్మోహన్ రావు ఎక్కడ..?. ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.
‘‘కనీసం చంద్రబాబు సమీక్ష చేయలేదు. సీఎం సమీక్ష చేస్తే.. ఆ ఫోటో ఏది..?. డిప్యూటీ సీఎం ఎక్కడ..వారి తాలూకా వాళ్ళు ఎక్కడ..?. వీకెండ్ వస్తే..చాలు అందరూ వ్యక్తిగత పర్యటనలకు వెళ్లిపోతున్నారు. నష్టపోయిన ప్రజలందరికీ పరిహారం అందించాలి’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment