ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు
జైల్లో పెట్టినా భయపడాల్సిన పనిలేదు
కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా..
మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు పరిపాలన చేస్తాం
ఈ 2.0 వేరేగా ఉంటుంది
కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా
తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను
వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను
ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా
అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తాం
సాక్షి, తాడేపల్లి: ‘‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
బుధవారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే...
ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి..
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెట్టినా భయపడాల్సిన పనిలేదు. కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా. మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు పరిపాలన చేస్తాం. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ 9 నెలల్లో సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయలేదు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని నేను ముందే చెప్పాను. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే. రాష్ట్ర బడ్జెట్, చంద్రబాబు హామీల ఖర్చుల గురించి ప్రజలకు వివరంగా చెప్పాను. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది.
..ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపు నడుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే వేలంపాటలో రూ.2 లక్షలకో, 3 లక్షలకో బెల్టుషాపులు పెట్టిస్తున్నారు. ఇసుక ధర రెట్టింపు అయింది. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ఏ పని జరగాలన్నా, ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా ముడుపులు చెల్లించే దుస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల దగ్గర్నుంచి చంద్రబాబు వరకు ముడుపులను పంచుకుంటున్నారు.
..రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం లీడర్ గా ఎదుగుతాం. ఒకసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి. నామీద టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టారు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతోనే దొంగకేసులు బనాయించారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!
‘‘విజయవాడ కార్పొరేషన్‌లో 64 స్థానాలుంటే 49 స్థానాలు అప్పట్లో మనం గెలిచాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్థానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలపెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘కారణం ఏమిటంటే.. ఏ కార్పొరేషన్, మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవి తీసుకున్నా.. ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిజల్ట్‌తో కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్వీన్ స్లీప్ చేయగలిగింది’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
..ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రతినెలా ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేసి.. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం, ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే.
కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా..
..ఆ రోజు కోవిడ్ లాంటి ఊహించని పరిణామాలు వచ్చాయి. ఇలాంటి విపత్తు ఒకటి ఉంటుందా, ఇలాంటిది వస్తే రాష్ట్రం, దేశం అతలాకుతలం అవుతుందన్న పరిస్థితులు ఎప్పుడూ ఊహకు కూడా అందిఉండవు. అలాంటిది వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్యలతో అనుకోని ఖర్చులు పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి. అయినా ఏ రోజూ కూడా మనం సాకులు చెప్పలేదు. ఏ రోజూ ప్రజలకు ఇవ్వకుండా ఉండడానికి కారణాలు వెదుక్కోలేదు. మన సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏరోజూ తప్పలేదని వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నాను. ప్రజలకు మంచే చేశాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువల కోసం నిలబడి ఉన్న పార్టీ. నా దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, నిలబడింది.
ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు..
..ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా కూడా ఈ రోజుకు కూడా మనం గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి వాళ్ల సమస్యలను వినగలుగుతాం. వాళ్లతో మమేకం కాగలుతాం. కారణం ఏ రోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. వాళ్లకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాత వాళ్లకు ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు.
ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు..
..కానీ. .ఎన్నికలు అయిన 9 నెలలు తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే దగ్గర నుంచి.. కార్యకర్త వరకు గడప, గడప అంటూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం ఏ గడపకు వెళ్లినా ఎన్నికలు ముందు వీళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్‌లు ప్రజలు వీళ్లకు చూపించి.. ఆ ఇంట్లో నుంచి ఇద్దరున్నా ముగ్గురు పిల్లలున్నా ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను నా రూ.రూ15వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. ఆ పిల్లల తల్లులు కూడా నా రూ.18 వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు నా రూ.45వేలు ఏమైందని ప్రశ్నిస్తారు.
..అదే ఇంట్లో 20 ఏళ్ల పిల్లవాడు నాకు నెల, నెలా రూ.3వేలు ఇస్తానన్నావ్.. నా రూ.36 వేలు ఏమైందని అడుగుతాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళితే కండువా వేసుకున్న రైతులు నా రూ.20 వేలు సంగతేంటని నిలదీస్తారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఆ రోజు మేం చేయకపోతే నా కాలర్ పట్టుకొండని అన్నాడు. కానీ ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు.
ఆ రోజే చెప్పా.. చంద్రబాబును నమ్మడం అంటే..
..ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎట్లో నా చెవిలో చెబితే నేను తెలుసుకుంటానంటున్నాడు. ఇదే మాటను ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పాను. మన మేనిఫెస్టోను, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను. రాష్ట్ర బడ్జెట్ ఇది.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి.. వీటికింత ఖర్చవుతుంది. మరో వైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నాడు.
ప్రజలను మోసం చేయడం ధర్మం కాదు..
..సూపర్ సిక్స్ మోసం, సూపర్ సెవెన్ మోసం అని చెబుతూ.. మనం ఏం చేయగలుగుతామో అన్నది కూడా ప్రజలకు అర్థం అయ్యేటట్టు చెప్పాం. ఆ రోజు కూడా మన ప్రజాప్రతినిధులు, మన శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనమూ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చెబుదామన్నారు. కానీ నేను ఒక్కటే చెప్పాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పాను. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పాను.
ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థమైంది..
..ఓడిపోయాం ఫర్వాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ ఫర్వాలేదు. మరలా అదే రోజుకు వెనక్కి తిరిగి వెళితే... ఇదే విధంగానే మరలా చెబుతాం.. కారణం రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అదే అర్ధం. జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే అప్పటికి ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థం అవుతుంది.
..ఎందుకంటే ఇవాళ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే... రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకమునుపు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ జరుగుతుంది. జగన్ ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిషు మీడియం వచ్చింది. నాడు-నేడుతో స్కూళ్లు బాగుపడ్డమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆరో తరగతి నుంచిప్రతి తరగతి గది డిజిటైజ్ అయింది.
..జగన్ ఉన్నప్పుడే 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపించేవి. మరో వైపు ప్రైవేటు బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్ధితి రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా గవర్నమెంటు బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి.
..మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి, తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపిస్తూ.. వాళ్లు ఎదగాలని, భావి ప్రపంచంతో పోటీపడాలని, ఏలాలని వాళ్ల చదువుల్లో మార్పులు తీసుకొచ్చిన రోజులు మన పాలనలో చూస్తే.. కేవలం 9 నెలల్లో ప్రభుత్వ స్కూళ్లు పరిస్థితి చూస్తే.. నాడు నేడు పాయే.. అమ్మఒడి పాయే. ఇంగ్లిషు మీడియం పాయే. ఆరోతరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులకు ఇచ్చే కార్యక్రమం పాయే. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ పాయే.వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశాను. గవర్నమెంటు బడులలో 70 శాతం బడులలో 70 శాతం పిల్లలు లేరు రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు.
..పేదవారికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ పేదవాడి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారయింది. నెట్ వర్క్ ఆసుపత్రులకు వెళితే పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్దితి లేదు. 1000 ప్రొసీజర్స్ నుంచి 3,300 ప్రొసీజర్లు పేదవాడికి ఉచితంగా వైద్యం అందించేటట్టుగా ప్రొసీజర్లు పెంచడమే కాకుండా, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. 900 నుంచి 2,400 ఆసుపత్రుల వరకు నెట్ వర్క్ ఆసుపత్రులను పెంచాం. గవర్నమెంటు హాస్పటళ్లలో వైద్యులు, నర్స్‌ల కొరత అన్నది పరిపాటే అన్న సాంప్రదాయాన్ని మార్చివేశాం.
మొట్టమొదటిసారిగా గవర్నమెంటు ఆసుపత్రుల రూపురేఖలను నాడు-నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ప్రభుత్వ ఆసుపత్రులుకు వెళితే మందులు దొరకని పరిస్థితి నుంచి.. మందుల కోసం వెలితే డబ్ల్యూ హెచ్ ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే దొరికేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్సీపీదే.
మొట్టమొదటసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. అక్కడ 105 రకాల మందులు సరఫరా చేస్తూ.. 24గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎంలు అందుబాటులోకి ఉండేటట్టు.. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేసేలా విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటుచేశాం. తొలిసారిగా పీహెచ్‌సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్‌సీలోను ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్ లో ఊర్లలో అందుబాటులో ఉండేలా చేసాం. ప్రతి మండలానికి రెండు పీహీచ్‌సీలను ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి... నెలలో కనీసం రెండు రోజులు ఆ ఊర్లకు వెళ్లేలా చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను అందుబాటులోకి వచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది.
కనీవీని ఎరుగని విధంగా..
కనీవీని ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది కూడా వైఎస్సార్‌సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయింది. విలేజ్ క్లినిక్‌లు పనిచేయడం లేదు. పీహెచ్‌సీలు కూడా పనిచేయడం లేదు. రూ.3వేల కోట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లలు చెల్లించలేదు. ప్రతి నెలా రూ.300 కోట్లు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైద్యం కోసం పేదవాడు ఆసుపత్రికి పోతే ఉచితంగా ఆరోగ్యశ్రీ అందించలేని పరిస్ధితి. ఇదీ మన ప్రభుత్వానికి వీళ్ల ప్రభుత్వానికి తేడా.
మొట్టమొదటిసారిగా రైతులకు ఆర్బీకేలు తీసుకుని రావడం, ఇ-క్రాప్ చేయడం, దళారీ వ్యవస్థ తీసివేసి ఆర్బీకే ద్వారానే రైతులకు కనీస గిట్టుబాటు ధర లభ్యమయ్యేలా కొనుగోలు చేయడం, అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కూర్చుని వ్యవస్థను మార్చేలా తీసుకున్న చర్యలన్నీ నాశనం అయ్యాయి. గ్రామంలో ప్రతి సేవకు సచివాలయం ఏర్పాటు చేసి.. ఎవరెవరు ఏ సేవలు చేయాలో నిర్ణయించాం. ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్‌ను తీసుకొచ్చి ప్రతి పథకం పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాలన్నీ ఇవాళ కొలాప్స్ అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి.
మరో వైపు ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపునకు రూ.2 లక్షలకో, రూ.3లక్షలకో ఎమ్మెల్యే దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు తీసివేసి ప్రైవేటు షాపులు తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: దొడ్డిదారిలో ‘డిప్యూటీ’
ఇసుక ఎక్కడ చూసినా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా.. ఇండస్ట్రీ నడపాలన్నీ, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నా కింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. ఇవాళ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజలకు మంచి వాళ్లగా కనిపిస్తున్నారు. ఆ స్థాయిలో 9 నెలల కాలంలోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారు.
రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. ఆ కష్టాలలో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే మనల్ని నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకొండి.
నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగకేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది. బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. మీకు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. మరో ముప్పై సంవత్సరాలు ఏలుతాం. ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. ఇది కచ్చితంగా చెబుతున్నాను.
జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయిండవచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను, ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment