‘ఛీ.. ఎన్టీఆర్‌ మాటకు తూట్లు పొడిచి మరీ! | KSR Comment, TDP Jana Sena Left Moral Values In AP Politics, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఛీ.. ఎన్టీఆర్‌ మాటకు తూట్లు పొడిచి మరీ!

Published Wed, Feb 5 2025 11:18 AM | Last Updated on Wed, Feb 5 2025 12:12 PM

KSR Comment: TDP Jana Sena Left Moral Values In AP Politics

1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన సందర్భంగా ఎన్టీ రామారావు ఒక స్పష్టమైన షరతు పెట్టారు. టీడీపీలో చేరాలనుకుంటే ఇతర పార్టీల వారెవరైనా అక్కడి తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ షరతుతో కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా ఆయారాం, గయారాం పరిస్థితి టీడీపీలో ఉండదని ప్రజలూ హర్షించారు. మేధావులు కూడా ఎన్టీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీలోకి చేరేందుకు నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిద్ధమైనా.. ముగ్గురు తమ పదవులు వదులుకోవడానికి సిద్ధపడలేదు. 

నాదెండ్ల భాస్కరరావు మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరారు. తరువాతి కాలంలోనూ ఎన్టీఆర్‌ ఇదే పంథాను కొనసాగించారు. 1991లో పీవీ నరసింహరావు కేంద్రంలో తన పదవిని కాపాడుకునేందుకు జేఎంఎంతోపాటు టీడీపీ ఎంపీలనూ చీల్చారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు నాయుడులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే ‘‘ఛీ.. ఇది ఒకప్పటి టీడీపీనేనా?’’ అనిపిస్తుంది. 

చంద్రబాబు పెద్దగా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు పట్టించుకోరు. పూర్తి అవకాశవాది. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలయ్యారు. విశేషం ఏమిటంటే ఈయన ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను  కొనుగోలు చేస్తోందని విమర్శిస్తారు. అధికారంలోకి రాగానే యథా ప్రకారం పార్టీ ఫిరాయింపులు, బేరసారాలు  చేయిస్తుంటారు. ఆయన ఎన్టీఆర్‌ అల్లుడు, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీని కబ్జా చేసిన  నేత కనుక అంతేలే అని అనుకుంటారు. కానీ.. 

స్వయాన ఎన్టీఆర్‌ వారసుడైన నందమూరి బాలకృష్ణ సైతం టీడీపీ మూల సిద్దాంతాలను గాలికి వదలివేసి తన తండ్రి ఆశయాలను మంటగలిపారు. ఆయన ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపూర్ మున్సిపాల్టీని టీడీపీ పరం చేయడానికి అనుసరించిన  దిక్కుమాలిన రాజకీయాలు ఎన్టీఆర్‌ ఆత్మకు క్షోభను మిగుల్చుతాయని చెప్పాలి. బాలకృష్ణకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ప్రకటించింది. ఆడపిల్లలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడి పలువురి విమర్శలకు గురైన బాలకృష్ణకు ఈ బిరుదు ఎలా ఇచ్చారో తెలియదు. అంతేకాక గతంలో ఆయన తన ఇంటిలో సినిమా రంగం వారు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘట్టం ఉండనే ఉంది. సినీ పరిశ్రమలో ఏభై ఏళ్ల చరిత్ర అని చెబుతారు కాని, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కావడం ఒక ప్రధాన అర్హతగా తీసుకుని పద్మభూషణ్ బిరుదును కేంద్రం ప్రకటించిందన్న భావన ఏర్పడింది. ఎలాగోలా బిరుదు వచ్చింది.. దానికి తగ్గట్లు పద్దతిగా ఉంటారులే అనుకుంటే బాలకృష్ణ మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించి పరువు పోగొట్టుకున్నారు.  

గత ఎన్నికల్లో హిందుపూర్‌ మున్సిపాలిటీలోని 38 వార్డులలో 30 వార్డులు వైసీపీ గెలుచుకుంది. అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం సాధించడంతో ఆ  పార్టీల దృష్టి స్థానిక సంస్థలపై పడింది. వీలైన చోట్ల ఇప్పటికే కొందరు మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చంద్రబాబు, లోకేష్‌లు ఎమ్మెల్యేల ద్వారా ప్రలోభపెట్టి ఆకర్షించారు. ఈ తరుణంలో  ఖాళీగా ఉన్న  మున్సిపల్  చైర్మన్,  వైస్ ఛైర్మన్ ఉప  ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని టీడీపీ తలపెట్టింది. దీనికి మంత్రి లోకేష్  రెడ్  బుక్ రాజ్యాంగం ఉపయోగపడింది. చంద్రబాబు తీసుకు వచ్చిన రాజకీయ రాక్షస పాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉన్న చోట కూడా తాము గెలవడం కోసం రెడ్ బుక్ ను ప్రయోగించడం ఆరంభించారు. కార్పొరేటర్లను, కౌన్సిలర్లను భయపెట్టడం, కిడ్నాప్ లు చేయడం, పోలీసులే  ఇందుకు నాయకత్వం వహించడం, దాడులు చేసి కౌన్సిలర్ల కుటుంబాలను భయభ్రాంతులకు లోను చేయడం వంటి నీచమైన  చర్యల ద్వారా టీడీపీ, జనసేనలు స్థానిక ఎన్నికలలో గెలిచే యత్నం చేశాయి. హిందుపూర్‌లో స్వయాన బాలకృష్ణ ప్రలోభాలు, బెదిరింపులకు తెరదీసి అక్కడ మున్సిపల్  ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి.  

తిరుపతిలో మరీ ఘోరం. టీడీపీకి ఒక్క కార్పొరేటరే ఉన్నప్పటికీ, ఉప మేయర్ పదవిని కైవసం చేసుకుంది. వైసీపీ పక్షాన పోటీ చేయడానికి సిద్దపడ్డ ఒక కార్పొరేటర్ ఇల్లును  కూల్చడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు అధికారులు తరలివెళ్లారు. అక్కడ మేయర్ అభ్యంతరం చెప్పినా వారు ఆమె మాట వినకపోవడం స్థానిక సంస్థల ఛైర్ పర్సన్ లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న విలువ  ఏమిటో అర్థమవుతుంది. బస్‌లో వెళుతున్న వైసీపీ కార్పొరేటర్లను కిడ్పాప్ చేయడం, బస్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టడం, తిరుపతి  ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి ఘట్టాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. మరుసటి రోజు అధికారులు, పోలీసుల అండతో టీడీపీ అభ్యర్ది ఉప మేయర్ ఎన్నికలో విజయం సాధించిన తీరు స్థానిక ఎన్నికల అధ్వాన్న నిర్వహణకు అద్దం పడుతుంది. 

టీడీపీ భయపెట్టి ఓట్లు వేయించుకున్న కొందరు కార్పొరేటర్లు, ఆ వెంటనే తిరిగి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని కలిసి తమను టీడీపీ ఎలా వేధించింది వివరిస్తూ రోదించిన సన్నివేశం ఒక్కటి చాలు.. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సర్కార్ సిగ్గుపడడానికి. నూజివీడులో మంత్రి పార్థసారథి వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించి మరీ టీడీపీని గెలిపించుకున్నారట. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పి.నారాయణ తన వంతు పాత్ర పోషించారనుకోవాలి. నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీకి బలం లేకపోయినా, డిప్యూటి మేయర్ పదవిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిపించుకున్నారు. స్థానిక సంస్థలలో ఫిరాయింపులను నిరోధించవలసిన మంత్రి నారాయణే ఇలా అరాచకంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ  నాసిరకం పాలనకు  నిదర్శనంగా కనిపిస్తుంది. పిడుగురాళ్లలో సైతం ఇదే తరహా పరిస్థితి. తుని మున్సిపల్ వైస్  ఛైర్మన్ ఎన్నికే జరిగే హాలును  టీడీపీ గూండాలు ఆక్రమించుకున్నారట. 

ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతుంటే, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఈ ఘటలను రిపోర్టు చేయకుండా పురపాలికల్లో కూటమి జెండా అని నిస్సిగ్గుగా కథనాలు ఇచ్చాయి.  ఈనాడు మీడియా అయితే టీడీపీ, జనసేన గూండాలు చేసిన విధ్వంసం గురించి విస్మరించడమే కాకుండా, గతంలో ప్రలోభాలు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని రాయడం ద్వారా తాను ఎలా దిగజారింది అడుగడుగునా రుజువు చేసుకుంటోంది. గత ఎన్నికలలో నిజంగానే ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయా అన్నది చూస్తే  అలాంటిది పెద్దగా ఏమీ లేదు. టీడీపీ గెలిచిన తాడిపత్రి, దర్శి మున్సిపాల్టీలలో ఎక్కడా వైఎస్సార్‌సీపీ ఇబ్బంది పెట్టలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి  ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఒకవేళ  నిజంగానే అప్పుడు ఏవైనా కొన్ని ఘటనలు జరిగాయని అనుకున్నా, ఇప్పుడు కూడా అలా చేయడం తప్పు కాదన్నట్లు ఎల్లో మీడియా రాస్తే వీరిది జర్నలిజం అంటామా? ఆ పేరుతో చేస్తున్న ఇంకేదో వ్యాపారం అని అంటామా అన్నది  ఆలోచించుకోవాలి. 

కేరళ హైకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ మారే కౌన్సిలర్ లు అనర్హులు కావాల్సిందేనని తీర్పు  ఇచ్చింది.  ఏపీలో ఇలా ఫిరాయించిన వీరంతా అనర్హులు అవుతారు. కాని వ్యవస్థలు అన్నీ చోట్ల ఒకేరకంగా వ్యవహరించడం లేదు. చిత్రమేమిటంటే లేస్తే  మనిషిని కాదు అంటే బెదిరించే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నా, తన పార్టీ వారి పాత్ర కూడా కనిపిస్తున్నా, నోరు మెదపడం లేదు. బీజేపీ ఎంపీ సి.ఎమ్.రమేష్ జమ్మలమడుగు క్లబ్‌లో అదే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో  సాగుతున్న జూదం గురించి జిల్లా అధికారులకు లేఖ రాయడం ఏపీలో ఏ రకమైన  పాలన జరుగుతోంది చెప్పకనే చెబుతోంది. 

రాష్ట్రంలో  దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు సాగుతున్నాయన్నది వాస్తవం. అయినా బాగా పాలన చేస్తున్నామని చంద్రబాబు, పవన్‌లు వారి భుజాలు వారే చరచుకుంటారు. ఈ క్లబ్ లు, లిక్కర్ దందాలపై ఉపయోగించవలసిన రెడ్ బుక్ ను లోకేష్  ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రయోగిస్తారు. మరో వైపు పవన్  సోదరుడు నాగబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కుక్కలతో పోల్చుతున్నారు. అధికారం తలకు ఎక్కితే ఎలా మాట్లాడతారో చెప్పడానికి నాగబాబు వ్యాఖ్యలే నిదర్శనంగా ఉంటాయి. గతంలో తాను ప్రశ్నిస్తానంటూ పవన్ స్థాపించిన  జనసేన అసలు స్వరూపం ఇది అన్నమాట.  ఏది ఏమైనా ఏపీలో రోజు, రోజుకు పరిస్థితి ఎంతగా దిగజారుతోంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూటమి పాలకులకు ప్రజలు  గుణపాఠం చెప్పకుండా ఉంటారా!. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement