తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్న ఎస్వీ వర్సిటీ సెనేట్ హాల్‌లో తమ కార్పొరేటర్‌ను లాక్కెళ్తున్న కూటమి సభ్యుడితో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల వాగ్వాదం
ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం
సంఖ్యా బలం లేకున్నా.. దాడులు, దౌర్జన్యాలతో పదవిని లాక్కున్న కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి అరాచకపర్వం.. వారికోసం వెళ్లిన
వైఎస్సార్‌సీపీ నేతలపైనా దాడులు.. రెండో రోజూ కార్పొరేటర్ల వాహనంపై దాడికి యత్నం
కూటమి గూండాల చిత్ర హింసలను తట్టుకోలేక తలొగ్గినట్లు కార్పొరేటర్లు కన్నీటి పర్యంతం
వైఎస్సార్‌సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోనూ చైర్‌పర్సన్ కుర్చీపై టీడీపీ తిష్ట
రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల ఎన్నికలు మరోసారి వాయిదా
ఒక్క సీటూ గెలవని చోట్ల కూడా బెదిరిస్తూ.. కుర్చీలో పాగా వేసే ఎత్తుగడలు
పిడుగురాళ్ల, పాలకొండలో కోరం లేక.. తునిలో ఉద్రిక్తతతో ఆగిన ప్రక్రియ
తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉంటే.. టీడీపీ గెలిచింది కేవలం ఒకే ఒక్కటి. 48 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ నెగ్గగా ఒక్క డివిజన్ ఫలితం కోర్టు పరిధిలో ఉంది. ఈ లెక్కన ఎలా చూసినా.. ఎప్పుడు ఎన్నిక నిర్వహించినా.. అది మేయర్ అయినా.. డిప్యూటీ మేయర్ అయినా కచ్చితంగా వైఎస్సార్‌సీపీకే దక్కి తీరాలి. కానీ కూటమి గూండాల విధ్వంసకాండ.. కార్పొరేటర్ల కిడ్నాప్‌లు.. పచ్చ ముఠాల కుతంత్రాల నడుమ మంగళవారం జరిగిన ఎన్నికలో ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్న టీడీపీ డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది!!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. ఏమాత్రం సంఖ్యాబలం లేని చోట్ల.. వైఎస్సార్‌సీపీ గుర్తుతో ఎన్నికల్లో నెగ్గిన వారిని బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి పీఠాలపై టీడీపీ కొలువుదీరింది! దాడులు, దౌర్జన్యాలు చేసినా.. అధికార దుర్వినియోగానికి పాల్పడినా... పోలీసుల నుంచి ఆర్డీవోల దాకా మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ మోహరించినా తమ ఎత్తుగడలు పారని చోట్ల ఎన్నికలను వాయిదా వేయించింది. తిరుపతి కార్పొరేషన్‌లో ఏమాత్రం మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు అధికార దుర్వినియోగంతో డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకున్నారు.
కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్న టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు తెగబడి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుని ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే కిడ్నాప్‌నకు గురైన కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. కూటమి గూండాల దుర్మార్గాలకు భయపడి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయక తప్పలేదని మీడియా ముందు మొర పెట్టుకోవడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోనూ చైర్ పర్సన్ పదవిని కేవలం ఆరు సీట్లలో నెగ్గిన టీడీపీ సంఖ్యా బలం లేకున్నా అధికారం అండతో దక్కించుకుంది.
రెండో రోజూ అదే అరాచకం..
సోమవారం నిర్వహించాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కూటమి గూండాల బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లు, కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి డిప్యూటీ మేయర్ పదవిపై కన్నేసిన నేపథ్యంలో టీడీపీ గూండాలు మొదటి రోజు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో ఉప ఎన్నిక సమావేశ మందిరానికి వెళ్తున్న బస్సుపై రాడ్లతో దాడి చేసి నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. దీంతో కోరం లేక ఉప ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
నడి రోడ్డులో ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పచ్చముఠాలు రెండో రోజు మరింత బరి తెగించాయి. ఉప ఎన్నిక వాయిదా పడిన వెంటనే అదే రోజు రాత్రి కిడ్నాప్‌నకు గురైన అనీష్ రాయల్ భార్య మమతను సైతం కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి.. అనీష్ రాయల్ నివాసానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కూటమి గూండాలు అక్కడికి కూడా చేరుకుని ఆమె ఉన్న నివాసం తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నించడంతో తొలుత 100కి ఫోన్ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో తిరిగి అభినయ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన అభినయ్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తిపై కూటమి గూండాలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో కౌశిక్, వాసుయాదవ్, అభినయ్ డ్రైవర్ గాయాలపాలు కాగా, ఓ కారు ధ్వంసమైంది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..
డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఓటు హక్కు వినియోగించుకోకుండా పథకం వేసిన కూటమి గూండాలు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆయన్ను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. ఉప ఎన్నికలో పాల్గొనకుండా నిర్బంధించారు. ఆయనతో బలవంతంగా ఓ వీడియోను చిత్రీకరించి టీడీపీ మీడియా కో–ఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ సెల్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉప ఎన్నిక ముగిసిన తరువాత సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ సుబ్రమణ్యంను విడిచిపెట్టడంతో ఆయన నేరుగా భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకుని జరిగిన విషయాన్ని వివరించారు.
క్షమించండి.. విలపించిన కార్పొరేటర్లు
కిడ్నాప్‌నకు గురైన నలుగురు కార్పొరేటర్లు అనీష్ రాయల్, అనిల్, అమర్‌నాథ్‌రెడ్డి, మోహన్‌కృష్ణ యాదవ్ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే నేరుగా భూమన నివాసానికి చేరుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి, అభినయ్‌రెడ్డి కాళ్లమీద పడి క్షమించమంటూ అనీష్ రాయల్ కన్నీరు మున్నీరయ్యారు. తమను కిడ్నాప్ చేసిన వ్యక్తులు చిత్రహింసలకు గురి చేశారని, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి వారికి అనుకూలంగా వీడియో చిత్రీకరించారని తెలిపారు.
భూమన, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీషను కలసిన కిడ్నాప్ అయినా కార్పొరేటర్లు
వారికి భయపడి ఓటు వేయాల్సి వచ్చిందని, తప్పు జరిగిపోయిందని వేడుకున్నారు. వైఎస్సార్‌సీపీ తమకు రాజకీయ జీవితాన్ని, గుర్తింపునిచ్చిందని, తాము ఎప్పటికీ జగనన్న వెంటే నడుస్తామని పేర్కొన్నారు. కూటమికి అనుకూలంగా ఓటు వేసేందుకు తాను నిరాకరించినట్లు అమర్‌నాథ్‌రెడ్డి వెల్లడించారు. ఉప ఎన్నికలో ఆయన ఎవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. వారిని ఓదార్చలేక భూమన కంట తడి పెట్టారు.
పాలకొండలో పారని పచ్చ పాచిక!
పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలో కూటమి నాయకుల పాచికలు పారలేదు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ఐక్యతతో వారి యత్నాలు బెడిసికొట్టాయి. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణతో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన మరో కౌన్సిలర్‌తో కలిపి నలుగురు మాత్రమే ఎన్నిక కోసం హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల కోసం నిరీక్షించినా ఎవరూ హాజరు కాకపోవడంతో కోరం లేక ఎన్నికను నిలిపివేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
పిడుగురాళ్లలో ఒక్కరు లేకున్నా...
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. రెండు రోజులుగా ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం, కోరం లేని కారణంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదని రిటర్నింగ్ అధికారి మురళీ కృష్ణ తెలిపారు. కూటమికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కేసుల పేరుతో తమ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.
విప్‌ను తిరస్కరించిన ఎన్నికల అధికారి
తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ జారీ చేసిన విప్‌ని ఎన్నికల అధికారి శుభం బన్సల్ తిరస్కరించారు. మంగళవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి విప్ లిస్ట్‌ను ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్‌కి అందచేసేందుకు యత్నించగా సమయం మించిపోయినందున తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశ మందిరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. విప్ లిస్ట్‌ని ఎన్నికల అధికారి తిరస్కరించటంతో విప్ జారీ చేయకుండానే తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికను నిర్వహించారు.
మూడు చోట్ల ఎన్నికలు వాయిదా
సాక్షి, అమరావతి: మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు మంగళవారం కూడా వాయిదా పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో పాటు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు ‘కోరం’ లేని కారణంగా వాయిదా పడగా.. కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ ఎన్నికను ఉద్రిక్త పరిస్థితులు కారణంగా వాయిదా వేసినట్లు స్థానిక జిల్లాల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమాచారమిచ్చినట్టు తెలిసింది.
రాష్ట్రంలో మూడు నగర, ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 12 డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం కేవలం ఐదు చోట్ల ఏడు పదవులకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన ఐదు చోట్ల ఐదు పదవులకు ఎన్నిక మంగళవారానికి వాయిదా, పడగా కేవలం రెండు చోట్ల మాత్రమే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నందిగామలో పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి మునిసిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.
పోలీసులపై దాడికి శాప్ చైర్మన్ యత్నం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం మంగళవారం ఉదయం భూమన కరుణాకరరెడ్డి నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో బయలు దేరిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల వాహనాన్ని అడ్డుకునేందుకు శాప్ చైర్మన్ రవినాయుడు యత్నించగా, పోలీసులు నిరోధించారు. రవినాయుడు తిడుతూ దాడికి యత్నించడంతో ఇద్దరు పోలీసులు కిందపడ్డారు.
నరకయాతనకు గురిచేశారు..
ఒక్కసారిగా మా వాహనంపై 300 మంది రౌడీలు దాడి చేశారు. నాతోపాటు మరో ముగ్గురు కార్పొరేటర్లను చితకబాది గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా హింసించారు. మా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామని బెదిరించడంతో ఆ పార్టీకి వంత పాడాల్సి వచ్చింది. ఇది క్షమించరాని నేరంగా భావిస్తున్నా. భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో నా ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తా.
– డాక్టర్ అనీష్ రాయల్, 45వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతి
భౌతిక దాడులను తట్టుకోలేక..
కూటమి నేతలు మమ్మల్ని కిడ్నాప్ చేసి శారీరకంగా హింసించి రహస్య ప్రాంతంలో బంధించారు. కూటమికి సపోర్ట్ చేయకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. భౌతిక దాడులకు తట్టుకోలేక వారు చెప్పినట్టే వినాల్సి వచ్చింది. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన భూమన కుటుంబం మాకు దైవంతో సమానం. – బోకం అనీల్ కుమార్, 50వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతి
రాజకీయ జీవితం వైఎస్సార్‌సీపీతోనే..
ఎలాగైనా డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవాలని మమ్మల్ని కిడ్నాప్ చేశారు. ప్రాణం పోయినా సరే వైఎస్సార్‌సీపీతోనే ఉంటా. కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేయడంతో వారికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.
– మోహన్‌కృష్ణ యాదవ్, 16వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతి
తటస్థంగా ఉన్నా..
నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీకి రుణపడి ఉంటా. నన్ను కిడ్నాప్ చేసి ఎన్ని చిత్రహింసలు పెట్టినా టీడీపీకి ఓటు వేసేది లేదని తటస్థంగా ఉన్నా. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారనే భూమన కరుణాకర్ రెడ్డి అన్న దగ్గరకు వచ్చి నా ఆవేదన చెప్పుకొన్నా.
– పుల్లూరు అమరనా«థ్ రెడ్డి, 5వ డివిజన్ కార్పొరేటర్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment