మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ క్రమంలో దొంగ ఓట్ల అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఓటర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే దొంగ ఓట్లకు సంబంధించి పోటాపోటీగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు దొంగ ఓట్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారన్న దానిపై పలు కోణాల్లో అనేక మంది విశ్లేషణలు చేశారు.
అయితే, ఎవరైనా దొంగతనం చేసినప్పుడు భయపడటం పరిపాటి. అదే పరిస్థితి తెలుగుదేశం ఎదుర్కొంటోంది. టీడీపీ పాలన కాలం నుంచి తమకు తెలియకుండా తమ ఇంటి నెంబరుతో కొన్ని ఓట్లు చలామణిలో ఉండటాన్ని ఇప్పుడు తెలుసుకుని ఇంటి యజమా నులు విస్తుపోతున్నారు. ఇదెలా సాధ్యమంటూ ముక్కున వేలేసు కుంటు న్నారు. ‘ఓటర్ల జాబితాల్లో అక్రమాలు’ అంటూ గావు కేకలు పెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చడం అనుమానా లకు తావిస్తోంది.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడం కోసం పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన వందల మంది పేర్లను తన నియోజకవర్గంలో చేర్పించారన్న అపవాదు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ నకిలీ ఓటర్ల అంశం తెరపైకి రావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయనీ, వాటిని సరిదిద్దాలనీ, ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్లను కలసి ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో కలెక్టర్లకు వైసీపీ నుండి ఫిర్యాదులు అందాయి.
ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని తమకు తెలిసిందనీ, వీటిని సరిదిద్దాలనీ వైసీపీ కోరింది. 2019కు ముందు నుంచే ఒకే డోర్ నెంబర్‌లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని వైసీపీ ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా ఒకే వ్యక్తి ఏపీలోనూ, తెలంగాణ లోనూ రెండుచోట్లా ఓటుహక్కు కలిగి వున్నారని వివరించింది. ఒకే వ్యక్తికి మున్సిపల్ ఏరియాలోనూ, గ్రామంలోనూ, వేరు వేరు నియోజకవర్గాల్లో కూడా ఓటుహక్కు ఉందని పేర్కొంది. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయనీ, ఆ చిరునామాలలో ఉంటున్న వారిని అడగగా తమకు ఈ విషయం తెలియదని చెబుతున్నారనీ వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఉద్దేశ్యపూర్వకంగా దొంగ ఓట్లను చేర్చారనీ, ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి ఓట్ల అవకతవకలు, బోగస్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా తుదిజాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచారణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈసీ ఉపక్రమించబోతోందని తెలుస్తోంది.
ఓటర్ల ఓట్లను ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం చట్ట విరుద్ధం. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాక టీడీపీ యాప్‌లో సేకరించిన సమాచారాన్ని ఎక్కించే మిషతో టెలిఫోన్ నెంబర్ తీసుకుని ఓటీపీ సైతం అడుగు తున్నారని అన్నమయ్య జిల్లాలో ప్రజలు వాపోతున్నారు. ఓటీపీ కాని, వ్యక్తిగత సమాచారం కాని ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా అనేక మంది చెబుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి.
రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఓ ఇంట్లోకి వెళ్లి సమాచారం అడగటం... వారు ఇవ్వటానికి ఇష్టపడక పోవడంతో వారిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి సమాచారం అడిగారనీ, 2024లో టీడీపీ ప్రభుత్వం రానుందని ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తున్నారని అనేక చోట్ల ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టడం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందున్న తక్షణ కర్తవ్యం. అలా చేసినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.
దొంగ ఓట్లను అరికట్టడానికి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ఉత్తమమైన మార్గం. ఈ విధానాన్ని ఇటీవలికాలంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రారంభించింది. అయితే, మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి, దొంగ ఓట్ల గోల పోవడానికి ఇది ఎంతో మేలు చేకూర్చే అంశం. వైసీపీపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీని భుజాన వేసుకుని మోసే మీడియా కానీ ఈ ప్రతిపాదనపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావట్లేదు. ఇలా కోరడానికి కూడా నిజంగా ధైర్యం ఉండాలి.
తాము తప్పు చేయనప్పుడు భయమెందుకు అన్న రీతిలోనే వైసీపీ అధినేత జగన్ ఈ కార్యక్రమానికి తెరతీశారు. ఆ ధైర్యం మాత్రం తెలుగుదేశం పార్టీ అధి నేత చేయలేకపోతున్నారంటే ఏమను కోవాలి. ఆయనే దొంగ ఓట్లను ప్రోత్స హిస్తున్నారనుకోవాల్సి వస్తోంది. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అటు తమిళనాడు, ఇటు కర్ణాటకల నుండి పెద్ద ఎత్తున (వేలల్లో) ప్రజల పేర్లను చేర్పించిన తాను తన కేడర్‌కు ఏం చెబుతారన్నది బహిరంగ రహ స్యమే. ‘ఆవు చేలో మేస్తే .. దూడ గట్టున మేస్తుందా’ అన్న సామెత ఇందుకు అతికినట్లు సరిపోలుతుంది.
వివేకవంతులైన ఓటర్లు ఈ తంతు అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి నుండే వారి వారి ప్రాంతాల్లో నివాసం లేని అనేకానేక మంది పేర్లను గుర్తించి బహిరంగ పరుస్తున్నారు. ఇది నిజంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం. ప్రజల్లో ఈ తరహా చైతన్యం రావడం స్వాగతించదగ్గ పరిణామం. గ్రామాలు, వార్డులు, పట్ట ణాలు ఇలా... అన్ని చోట్లా తమకు తెలియని ఓటర్లు ఉంటే వెంటనే గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా ప్రజలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్: 98481 05455
దొంగ ఓట్ల దొంగలెవరు?
Published Sun, Dec 3 2023 4:50 AM | Last Updated on Sun, Dec 3 2023 4:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment