ఎన్నికల మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చే అహేతుకమైన హామీల పత్రం కాదు. అలవికాని హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి కొన్ని పార్టీలు తమ శక్తియుక్తులను ఉపయోగించడం కనిపిస్తుంది. అయితే ప్రజలు ఇటువంటి పార్టీలను గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెబుతారు. ఇందుకు మంచి ఉదాహరణ 2014లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన విధానాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టడమే. దీన్ని సద్వినియోగం చేసుకొని వైసీపీ 99 శాతం హామీలను నెరవేర్చి మరో విజయం వైపు దూసుకుపోతోంది.
ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు తాము ఏం చేస్తామో చెబుతూ ఒక రాజకీయ పార్టీ తన సిద్ధాంతాలు, ఉద్దేశాలు, విధానాలను ప్రతిబింబిస్తూ ఇచ్చే హామీ పత్రమే ఎన్నికల మేనిఫెస్టో. దీని ఆధారంగా, తమ అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ఏ పార్టీ మేనిఫెస్టో ఉందో ప్రజలు నిర్ణయించుకొని ఓటువేయడానికి వీలవుతుంది. అందువల్ల, రాజకీయ పార్టీ హామీలు స్పష్టంగా ఉండాలి.
అమలులో ఎలాంటి అస్పష్టతకు ఆస్కారం ఇవ్వకూడదు. భారత ఎన్నికల సంఘం 2013 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ కింద మార్గదర్శకాలను రూపొందించడానికీ, వారు చేసిన వాగ్దానాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలపై చర్చించడానికీ, రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ వాటిపై స్పష్టత రాలేదని చెప్పాలి.
చట్ట ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు అవినీతి అక్రమాల కిందకు రావని అందరికి తెలిసిన విషయమే. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పార్టీల మధ్య సమాన పోటీ స్థాయిని నిర్ధారించ డానికీ, ఎన్నికల స్వచ్ఛతనూ, ప్రజలకు చేసిన వాగ్దానాలనూ కాపా డటం కోసం మాత్రమేనని నిర్ధారించడమైనది.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం సర్వసాధారణం. అమెరికాలో, ఇది ఆర్థిక, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనా సంస్కరణలు, పర్యావరణ సమస్యలు, వలసలు వంటివాటిపై వారు చేయబోయే పనులను తెలియచేస్తుంది. అనేక పశ్చిమ ఐరోపా దేశాలలో, మేనిఫెస్టోలు మరింత నిర్దిష్ట విధాన ఎంపికలు, బడ్జెట్ చిక్కులను ప్రస్తావిస్తాయి.
2022లో ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ కె. ఝా రాజ్యసభలో మాట్లా డుతూ, ఎన్నికల మేనిఫెస్టోకు చట్టబద్ధత కల్పించాలని, ఎన్నికల తర్వాత, రాజకీయ పార్టీలు తాము చేసిన వాగ్దానాలను మరచిపోయి ఆడంబరమైన వాదనలు చేయకుండా చట్టం ఉండాలని చెప్పిన విష యాలను గుర్తు చేసుకోవడం సముచితం. మేనిఫెస్టో ఔచిత్యం తగ్గు తోందని వారు ఆవేదన పడుతూ, 1952, 1957, 1962 ఎన్నికలప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలను ఉటంకించారు. పార్టీలు చేయదగిన అంశాలను మాత్రమే ఆ యా మేనిఫెస్టోల్లో చేర్చేవారని పేర్కొన్నారు.
తెలుగు దేశం పార్టీ 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోను, ‘దశ–దిశ చూపించే ఒక పవిత్ర పత్రం’గా అభివర్ణించారు ఆ పార్టీవారు. దీనిలో ‘కష్టాలలో ఉన్న రైతులను రుణ మాఫీతో ఆదుకొంటాం’ అని చెప్పారు. రుణమాఫీ గురించి ఇంతకు మించి వివరణ మేనిఫెస్టోలో కనపడదు. అనగా ఏ తారీఖు వరకున్న రుణాలు, ఎంత మేరకు మాఫీ చేస్తారనే విషయం ఎక్కడా లేదు. ఈ విషయమై ఆ పార్టీ అధ్యక్షులు బహిరంగ సభలలో చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టోలో లేవు. గెలిచిన తర్వాత ఈ వాగ్దానం అమలును ‘మమ’ అనిపించడానికి పార్టీ పెద్దలు చాలా శ్రమించారు.
ప్రొఫెసర్ కె.వి. రమణారెడ్డి, ఇదే పత్రికలోనూ, డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలోనూ తెలుగుదేశం పార్టీ ఈ విషయమై రైతులను ఏవిధంగా మభ్య పెట్టిందో తన పరిశోధన ద్వారా విశదంగా వివరించారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రూ 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతువారి ఇన్సూరెన్స్’ వంటి హామీలనూ ఇదే మేనిఫెస్టోలో పెట్టారు. కానీ గెలిచాక, వీటి ఊసే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘రైతుభరోసా కేంద్రా’లను ఏర్పాటు చేసి, రైతుకు కావలసినవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచడంతో బాటు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం, ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధర అందించడం, పంటనష్ట నివారణకు ఇన్సూరెన్స్ అమలుచేసి రైతుకు అండగా నిలవడం వంటి నిర్మాణాత్మక పనులు చేసింది.
తెలుగుదేశంవారు ‘మహిళా సాధికారత కోసం డ్వాక్రా రుణాల రద్దుతో బాటు, వారి అభివృద్ధికి, భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణ యించారు.’ కాని, వాస్తవానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలలో ఏమి జరిగిందో మహిళలకు తెలుసు. ౖవైసీపీ ప్రభుత్వం వచ్చినాక, డ్వాక్రా రుణాలను వడ్డీతో బాటు మాఫీ గావించారు. ఇలా ఎన్నికల వాగ్దానాలను పార్టీలు మరచిపోతే, ప్రజలు మరచిపోతారు లేదా క్షమిస్తారనుకోవడం పెద్ద పొరబాటు. తెలుగు దేశం తన పార్టీ మేనిఫెస్టోలో, ‘రానున్న అయిదేళ్ళలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం/ ఉపాధి అవకాశం కల్పిస్తా’మని మాటిచ్చింది. కానీ దాని గురించి ఏమీ పట్టనట్లు ఐదేళ్లు గడిపేసింది. యువత 2019లో జరిగిన ఎన్నికల్లో, ఎలా గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిందే.
‘గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికీ తారు రోడ్డు, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు, ప్రతి ఇంటికి ఉచితంగా మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చుట’ వంటి హామీలూ తెలుగుదేశం ఇచ్చింది. అయిదేళ్లు ప్రభు త్వంలో ఉండి, ఎన్ని ఇండ్లు కట్టించారో, మిగతా హామీలు ఏమిచేశారో తెలిసిన విషయమే. ఈ విషయమై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు, కట్టిస్తున్న కాలనీల గురించి, పచ్చ పత్రికలకు కనబడక పోయినా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంది. అలాగే పేద పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనీ, హెల్త్ కార్డ్ ద్వారా అన్నిరకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రభుత్వ ఆసు పత్రులలో ఉచిత వైద్యం అందిస్తామనీ మాటిచ్చి గెలిచాక టీడీపీ అమలు చేయలేదు.
కానీ వైసీపీ ప్రభుత్వం పదహారు ప్రభుత్వ ఆసు పత్రులను నిర్మించడంతో బాటు డాక్టర్ల నియామకాలు గావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్రం సైతం కొనియాడింది. ఈ మధ్యకాలంలో ప్రారంభించిన ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్ష చేయడంతో పాటు ఇతర సేవలందించడం వంటి కార్య క్రమం ఇండియాలోనే ఆరోగ్యరంగంలో ఒక విప్లవం లాంటిది. పేద లకు చదువే ఒక స్థిరమైన ఆస్తిగా గుర్తించి ‘నాడు–నేడు’ ద్వారా చదు వులో తీసుకొచ్చిన సంస్క రణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
తెలుగుదేశం 2012లో ప్రకటించిన బీసి డిక్లరేషన్ ప్రకారం 100 శాసనసభ స్థానాలు వారికి కేటాయించడం, వారికి ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్–ప్లాన్ పెట్టి అమలు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రక టించారు. గెలిచాక ఇవన్నీ మూలబడ్డాయి. బీసీలకు ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అందరికీ తెలుసు.
వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న అనేక సేవలు గుర్తుకు వస్తే, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్నదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం తన మేనిఫెస్టోలో, ‘ప్రతి ఒక్క హామీనీ, పథకాన్నీ, చిత్తశుద్ధితో అమలు చేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం’ అని చెప్పింది.
కానీ ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేక పోయింది. కానీ వైసీపీ నాయకత్వం 2019లో ప్రకటించిన మేని ఫెస్టోను ప్రజలకిచ్చిన ‘బాండు పేపరు’గా పరిగణించి నూటికి 99 శాతం అమలుచేసి... చిక్కుముడులు విప్పి, ఆ ఒక్కశాతం కూడా అమ లుకు ప్రయత్నిస్తామని ప్రజలకు చెబుతోంది. సహజంగా అటువంటి నాయకులను ప్రజలు ఆదరిస్తారు, చిరకాలం గుర్తుపెట్టుకొంటారు.
ఎన్నికైన ప్రభుత్వానికి వారిచ్చిన మేనిఫెస్టో కీలకంగా ఉండాలి. వాస్తవిక ఎన్నికల మేనిఫెస్టో కోసం, రాజకీయాలను మరింత జవాబు దారీగా, పారదర్శకంగా చేయడానికి ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్‌కు పదును పెట్టి ప్రజలికిచ్చిన హామీలను కనీసం మూడు వంతులైనా పాటించేట్లుగా నిబంధనలు పెట్టాలి. లేని పక్షంలో, ప్రజల కిచ్చిన మాట తప్పినట్లుగా పరిగణించి తగిన శిక్ష విధించాలి. అలా కానిచో పార్టీల మధ్య సమాన పోటీ స్థాయి ఉండదు. ఓటర్ల నమ్మ కాన్ని వమ్ము చేసినట్లవుతుంది.
డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి
వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు
‘ prudhvikar@cess.ac.in
Comments
Please login to add a commentAdd a comment