సాక్షి, ఒంగోలు టౌన్: ఒంగోలు మున్సిపాలిటీగా ఆవిర్భవించి 144 సంవత్సరాలు.. ఇన్నేళ్లలో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా చైర్‌పర్సన్‌గా అవకాశం రాలేదు. ఒంగోలు నగర పాలక సంస్థగా ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తయింది. కానీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నెల 23వ తేదీన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలిసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. మేయర్ అభ్యర్థిత్వాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు లభించిన అరుదైన గౌరవంగా ఒంగోలు నగరంతోపాటు జిల్లాకు చెందిన మహిళామణులు భావిస్తున్నారు.
మహిళా ఓటర్లే అధికం
ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 1,81,558 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 93,951 మంది కాగా, 87,573 మంది పురుషులు, 34 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. ఒంగోలు నగరంలో పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు 6,378 మంది అధికంగా ఉన్నారు. ఒంగోలు మేయర్ పదవిని మహిళలకు రిజర్వ్ చేయడం వెనుక ఈ గణాంకాలను కూడా ఎలక్షన్ అథారిటీ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిగణనలోకి తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
పార్టీల అన్వేషణ
ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఎవరిని బరిలోకి దించాలన్న విషయమై ప్రధాన రాజకీయ పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మేయర్ పదవి కోసం ప్రధానంగా పోటీపడనున్నాయి. జనసేన, బీజేపీ కలిసి ఓ అభ్యర్థిని పోటీకి నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వామపక్షాలు కూడా ఉమ్మడిగా అభ్యర్థినిని నిలబెట్టే విషయమై చర్చిస్తున్నాయి. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుండటం, సమయం కూడా తక్కువగా ఉండటంతో రాజకీయ పార్టీల నాయకులు ఎస్సీ మహిళా నాయకురాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థినుల విషయంలో అన్ని పార్టీల నుంచి స్పష్టత రానుంది.
ఒంగోలు కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
ఒంగోలు టౌన్: ఒంగోలు నగర పాలక సంస్థలో ఎన్నికల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పోల భాస్కర్ ఖరారు చేశారు. ఎస్టీ జనరల్‌కు ఒక డివిజన్, ఎస్సీ మహిళలకు నాలుగు డివిజన్లు, ఎస్సీ జనరల్‌కు ఐదు డివిజన్లు రిజర్వ్ చేశారు. బీసీ మహిళలకు ఏడు డివిజన్లు, బీసీ జనరల్‌కు ఎనిమిది డివిజన్లు, జనరల్ కోటాలో మహిళలకు 14 డివిజన్లు రిజర్వ్ చేశారు. 11 డివిజన్లను అన్ రిజర్వ్‌డ్ కింద ప్రకటించారు.
ఏ డివిజన్ ఎవరికి దక్కిందంటే..
ఎస్టీ జనరల్‌కు 16వ డివిజన్, ఎస్సీ మహిళలకు 1, 13, 30, 42వ డివిజన్లు, ఎస్సీ జనరల్‌కు 8, 10, 11, 18, 40వ డివిజన్లు, బీసీ మహిళలకు 3, 4, 5, 29, 31, 39, 43వ డివిజన్లు, బీసీ జనరల్‌కు 6, 12, 17, 21, 23, 27, 49, 50వ డివిజన్లు, జనరల్ మహిళలకు 2, 9, 20, 22, 24, 28, 32, 33, 36, 41, 45, 46, 47, 48వ డివిజన్లు, అన్ రిజర్వ్‌డ్‌గా 7, 14, 15, 19, 25, 26, 34, 35, 37, 38, 44వ డివిజన్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment