బాలినేనిని అరెస్టు చేస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలులో అధికార పార్టీ దౌర్జన్యకాండకు దిగింది. నగర పరిధిలోని కమ్మపాలెంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ శ్రేణులను అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుని దౌర్జన్యానికి దిగారు. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలోనే చెప్పులు, రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా బాలినేనితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసి టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఒంగోలు నగర పరిధిలో కొత్తపట్నం బస్టాండు సమీపంలోని కమ్మపాలెంలో సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఏర్పాటు చేయనిచ్చేది లేదని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేశారు. ఉదయం నుంచే బాలినేనితో పాటు ఆ పార్టీ నేతలను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఒంటిగంట సమయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు.
టీడీపీ కార్యకర్తలు సైతం రోడ్డుపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏఎస్పీ లావణ్య లక్ష్మి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా తొడలు కొట్టి, మీసాలు మెలివేసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫ్లెక్సీలు చూపిస్తూ సవాళ్లు విసిరారు. తేల్చుకుందామంటూ రెచ్చగొట్టారు. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు చూస్తుండి పోయారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తామని, తనతోపాటు స్థానిక నేతలను మాత్రమే అనుమతించాలని బాలినేని పదేపదే విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ సమయంలో ఒక్కసారిగా అధికార పార్టీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడులకు దిగారు. మరో వైపు పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లాఠీలతో చితకబాదారు. పోలీసుల అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను చెదరగొట్టి మాజీ మంత్రి బాలినేనితో పాటు మిగిలిన నేతలను అరెస్టు చేసి టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత సొంత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు. బాలినేని అరెస్టుకు నిరసగా వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. షేక్ సాధిక్ అనే కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఆదిలోనే బాలినేనిని అడ్డుకునే కుట్ర
తొలుత ఉదయాన్నే బాలినేని కమ్మపాలెం వెళ్లేందుకు సిద్ధమవ్వగా సీఐలు రాంబాబు, గంగా వెంకటేశ్వర్లు, సుబ్బారావు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. అనుమతి తీసుకుని కార్యక్రమం పెట్టుకున్నామని, కార్యక్రమాన్ని వాయిదా వేసేది లేదని బాలినేని తేల్చి చెప్పారు. దీంతో బాలినేనిని హౌస్ అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే వేలాదిగా కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
టీడీపీ తొత్తులుగా పోలీసులు
కమ్మపాలెం ఘటనలో అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలు నియంతృత్వ పోకడతో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఏర్పాటుపై ఆంక్షలు పెట్టడం, బాలినేని ఫ్లెక్సీలను సైతం ముందు రోజు రాత్రి తొలగించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దౌర్జన్యానికి దిగారు. శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలను పోలీసులు పల్లెత్తు మాట అనలేదు. టీడీపీ కార్యకర్తలు సాక్షాత్తు 2టౌన్ పోలీస్ స్టేషన్ గేటులోనే తొడలు కొట్టి, మీసాలు మెలివేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నా పట్టించుకోలేదు. దీంతో వారు రెచ్చిపోయి చెప్పులతో దాడికి దిగారు. వివాదంలో ఆద్యంతం పోలీసులు టీడీపీ కార్యకర్తలకు మద్దతుగా నిలవడం విమర్శలకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment