సర్వే సర్వత్రా ! | Political Parties Are Doing Survey In Telangana | Sakshi
Sakshi News home page

సర్వే సర్వత్రా !

Published Fri, Sep 21 2018 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Political Parties Are Doing Survey In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రస్తుతం సర్వేల జపం చేస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం అధికార, ప్రతిపక్షాలు జల్లెడ పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు తాజా రాజకీయ పరిస్థితులు ఆకళింపు చేసుకోవడంలో, ప్రజానాడిని పసిగట్టడంలో ప్రజాభిప్రాయ సేకరణను కేంద్ర బిందువుగా చేసుకుంటున్నాయి. దీంతో ఈ సర్వేలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే 16–17 సర్వేలు నిర్వహించగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రస్తుతం సర్వే పనుల్లో బిజీగా ఉన్నాయి. పార్టీలకుతోడు వ్యక్తిగతంగా కొందరు నేతలు ప్రైవేటు సర్వేలు చేసుకుంటుండగా సోషల్‌ మీడియాలో కూడా పలు సంస్థల పేరిట సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థలు సైతం స్వీయ అధ్యయనాలు చేపట్టి ఫలితాలనూ ప్రకటిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు సర్వేలమయమయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే దూకుడుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏఐసీసీ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న సర్వేలో ఆశావహుల గుణగణాలు, ప్రత్యర్థి పార్టీలు, సామాజిక వర్గాల బలాబలాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో రెండుసార్లు సర్వేలు చేశాకే అభ్యర్థుల ఎంపికపై అభి ప్రాయానికి రావాలనే నిర్ణయం మేరకు తొలి సర్వే ఇప్పటికే ప్రారంభమైందని కాంగ్రెస్‌  
వర్గాలంటున్నాయి. సర్వే ఫలితాలు నేరుగా ఢిల్లీకే వెళ్తాయని, అక్కడ సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్రానికి సమాచారం పంపుతారని సమాచారం. బీజేపీ కూడా జాతీయస్థాయి వర్గాల ద్వారానే సర్వే నిర్వíß స్తోంది. బీజేపీ ఛీప్‌ అమిత్‌ షా పర్యవేక్షణలో ఉండే బృందం ద్వారా జరుగుతున్న ఫ్లాష్‌ సర్వేనే అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుందని బీజేపీ వర్గాలంటున్నాయి. ఈ రెండు పార్టీల జాతీయస్థాయి సర్వేలు పూర్తయ్యాక మళ్లీ రాష్ట్రస్థాయి నేతలు సర్వే నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఎంచుకున్న నియోజకవర్గాల్లో టీడీపీ అధ్యయనం...
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఆ పార్టీ కూడా సర్వే చేయిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాకుండా మహాకూటమిలో భాగంగా తాము పోటీ చేయాలని భావిస్తున్న చోట్ల ఈ సర్వేలు జరుగుతున్నాయి. ఐదు ప్రశ్నల ఫార్మాట్‌లో సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆ నియోజకవర్గంలో పార్టీ బలమెంత? తాము ప్రతిపాదిస్తున్న అభ్యర్థికి ప్రజల మద్దతు ఉంటుందా? మిగిలిన పార్టీల బలాబలాలెలా ఉన్నాయి? టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే విజయం సాధిస్తాడా లేదా? సామాజిక వర్గ సమీకరణాలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్నలతో ఏపీ ఇంటెలిజెన్స్‌ నిర్వహిస్తున్న ఈ సర్వే తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. సర్వే నివేదిక ఆధారంగా కచ్చితంగా గెలిచే సీట్లను తీసుకోవాలని టీడీపీ యోచిస్తోంది. ఒకవేళ ఆ స్థానాలను ఇచ్చేందుకు ఇతర పార్టీలు అంగీకరించకుంట సర్వే ఫలితాలను ఆయా పార్టీల ముందు పెట్టాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

కేడర్‌ నుంచి ‘లెఫ్ట్‌’ ఫీడ్‌బ్యాక్‌...
సర్వేలు ప్రత్యేకంగా చేయకపోయినా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై వామపక్ష పార్టీలు ఫీడ్‌బ్యాక్‌ తెప్పించుకుని ఒక అంచనాకు వస్తున్నాయి. రాష్ట్ర కార్యదర్శివర్గం, కార్యవర్గం, జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లో నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించుకొని ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై వామపక్ష నేతలు అభిప్రాయానికి వస్తున్నారు. కిందిస్థాయి కేడర్‌ ఇచ్చే సమాచారం ఆధారంగానే తాము పోటీ చేయాల్సిన స్థానాలను కూడా నిర్ణయించుకుంటున్నారు. అయితే పార్టీలకు అనుబంధంగా ఉండే ప్రచార మాధ్యమాల ద్వారా సర్వే చేయించే సంప్రదాయం ఉన్న వామపక్ష పార్టీలు త్వరలోనే ఇందుకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

సోషల్‌ మీడియాలోనూ జాబితాల చక్కర్లు...
గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలోనూ సర్వేల జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి. లగడపాటి సర్వే, ఉద్యోగుల సర్వే, నిరుద్యోగులు, విద్యార్థుల సర్వే, ఓయూ జేఏసీ సర్వేల పేరుతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఔత్సాహికులు సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ల ద్వారా చేర వేసే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలవారీగా నియోజకవర్గాల పేర్లు, గెలిచే పార్టీలు, అభ్యర్థుల పేర్లతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఈ సర్వేలకు ఎలాంటి ప్రాతిపదికా లేకపోయినప్పటికీ వాటి ఫలితాలు కొంత ఆసక్తి కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు కొన్ని మీడియా సంస్థలు కూడా సర్వేల పనిలో బిజీగా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు రద్దు ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందనే దానిపై రాష్ట్రానికి చెందిన రెండు మీడియా సంస్థలు ప్రస్తుతం సర్వే చేస్తున్నట్లు సమాచారం. అయితే ఒకట్రెండు జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థలు కూడా ఇప్పటికే సర్వే ఫలితాలను ప్రజల ముందుంచాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా? ఏ పథకం ఎలా అమలవుతోంది? ఏ పార్టీని మీరు ఎంచుకుంటారు? స్థానిక అభ్యర్థి లేదా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏ పార్టీకి, ఏ వ్యక్తికి ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నలతో ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి.

పార్టీలు, నేతల ఆసక్తి...
రాష్ట్రంలో సర్వత్రా సర్వేల మాటే వినిపిస్తుండటంతో అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు, ఆశావహులు వాటిపై దృష్టి సారించారు. తమ నియోజకవర్గాలు, జిల్లాలతోపాటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి.. ప్రజల నాడి ఎలా ఉంది.. ఏం చేస్తే ప్రజలకు మరింత దగ్గర కాగలుగుతాం అనే కోణంలో సర్వేలపై నేతలు ఆరా తీస్తున్నారు. పార్టీలకతీతంగా కొందరు నాయకులు విడిగా కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. తమ పరిస్థితి నియోజకవర్గంలో ఎలా ఉంది.. బయటపడతామా? ఏ మండలంలో పరిస్థితి ఎలా ఉంది? ఏ గ్రామంలో తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఏం చేస్తే వ్యతిరేకత ఉన్న చోట్ల ఓట్లు పడే అవకాశాలున్నాయనే కోణంలో ఇప్పటికే వందల మంది నాయకులు అధ్యయనం చేయించుకున్నారు.

అభ్యర్థులేం చేస్తున్నారు... కేసీఆర్‌ ఆరా?
అభ్యర్థుల ప్రకటన 105 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం అభ్యర్థులు ఏం చేస్తున్నారన్న దానిపై దృష్టి పెట్టింది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ నిత్యం ప్రగతి భవన్‌ నుంచే అభ్యర్థులను అప్రమత్తం చేసే పనిని నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులకు ఫోన్లు చేసి ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని తీసుకుని ఇంకా ప్రచారం మొదలుపెట్టని అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నారు. దూకుడుగా వెళ్లని అభ్యర్థులకు సలహాలు, సూచనలిచ్చే పనిలోపడ్డారు. అభ్యర్థులను ప్రకటించకుండా మిగిలిన 14 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పార్టీ నేతల్లో ఎవరైతే మేలు జరుగుతుందనే కోణంలో అభిప్రాయ సేకరణ జరుగుతోందని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి 105 మందితో తొలి జాబితా ప్రకటించన రోజే కేసీఆర్‌ ఓ విషయాన్ని మీడియాకు చెప్పారు. తాము ఇప్పటికే 16,17 సార్లు సర్వేలు నిర్వహించామని, ఆ సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పడం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు చేస్తున్న సర్వేల జపానికి నిదర్శనంగా నిలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement