నెగ్గేదెవరు? | Who are going to win in Khammam District | Sakshi
Sakshi News home page

నెగ్గేదెవరు?

Published Wed, Nov 28 2018 5:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Who are going to win in Khammam District - Sakshi

ఖమ్మం మెట్టు... ఈ పేరు వింటేనే విప్లవం గుర్తుకొస్తుంది. రాజకీయ, సామాజిక చైతన్యం స్ఫురిస్తుంది. అందమైన అటవీ ప్రాంతం...కల్మషం తెలియని ఆదివాసీల జీవనచిత్రం... నల్లబంగారు సింగరేణి... గలగల పారే గోదారి... వయ్యారపు కిన్నెరసాని... ఆపదమొక్కుల భద్రాద్రి రామయ్య యాదికొస్తారు. వామపక్ష రాజకీయాలకు ఒకప్పటి పెట్టని కోట ఇది. తెలంగాణ తొలి దశ ఉద్యమ స్టార్టింగ్‌ పాయింట్‌ ఇక్కడే.  రాజకీయమంటే ఇక్కడి ప్రజలకు ప్రాణం... ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ గడ్డ అదనపు బలం.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తనదైన గుర్తింపు గల విప్లవాల ఖిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల బరిగీసిన యోధుల్లో అంతిమ విజేతలెవరో? స్థానిక అంశాల ప్రాతిపదికగా నియోజకవర్గానికో రాజకీయ ముఖచిత్రం ఉన్న ఈ జిల్లాలో గులాబీ గుబాళిస్తుందా... సైకిలెక్కిన చేయి.. కారు కన్నా స్పీడు పోతుందా..? ఎర్ర పార్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుంది..? అసలు ఇక్కడి ఓటరు దేవుడి అంతరంగమేంటి..? 

భద్రాచలం: ‘స్థానిక’ సమరం
లోకల్, నాన్‌లోకల్‌ అంశాలపై ఇక్కడ ఎన్నికల యుద్ధం నడుస్తోం ది. స్థానికంగా మంచి డాక్టర్‌గా గుర్తింపు పొందిన తెల్లం వెంకట్రా వు (టీఆర్‌ఎస్‌), ములుగు నియోజకవర్గం నుంచి వచ్చిన పొదెం వీరయ్య (కాంగ్రెస్‌)  మధ్య∙ప్రధా న పోటీ నెలకొంది. సీపీఎం అభ్యర్థి మిడియం బాబూరావు కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. అయితే, పొదెం వీరయ్య స్థానికేతరుడు కావడం కొంత మైనస్‌గా మారింది. డాక్టర్‌గా ప్రజల్లో తనకున్న సంబంధాలను సద్వినియోగం చేసుకునేందు కు వెంకట్రావు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు సంస్థాగతంగా బలంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (బీజేపీ) వర్గం ఏ మేరకు ఓట్లు చీలుస్తుందనేది కూడా ఆసక్తికరం.

కొత్తగూడెం: కొంచెం అనుకూలం.. ఇంకొంచెం..
ముక్కుసూటి మనిషిగా పేరున్న జలగం వెంకట్రావు (టీఆర్‌ఎస్‌), రాజకీయ అనుభవజ్ఞుడు వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్‌) తలపడుతున్న కొత్తగూడెం నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. జలగం హయాంలో చందాలు, దందాలు లేవనే సానుకూల అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వినిపిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల ప్రభావం కూడా స్పష్టంగానే ఉంది. అయితే, ప్రజాసంబంధాల విషయంలో వెనుకబడ్డారనే వాదన జలగం పట్ల నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు్ల, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కొత్తగూడెం భూముల క్రమబద్ధీకరణ వంటి అంశాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. వనమా విషయానికి వస్తే ఆయన తోడల్లుడు, చిరకాల ప్రత్యర్థి ఎడవెల్లి కృష్ణ బీఎల్‌ఎఫ్‌ తరఫున బరిలో ఉన్నారు. ఆయన చీల్చే ప్రతి ఓటు వనమాకు నష్టం చేయనుంది. కానీ, ప్రజాసంబంధాల విషయంలో వనమాకు మంచి పేరుంది. ఓడిపోయి ఉన్నారని, ఇదే చివరి ఎన్నిక అనే సానుభూతి కూడా చర్చనీయాంశం అవుతోంది. 

ఇల్లెందు: ముగ్గురి మధ్య పోటీ పసందు
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఇల్లెందులో కోరం కనకయ్య (టీఆర్‌ఎస్‌), హరిప్రియ నాయక్‌ (కాంగ్రెస్‌)  మధ్య గట్టి పోటీ నెలకొంది. కోయ సామాజిక వర్గానికి చెందిన కనకయ్య, లంబాడీ సామాజిక వర్గానికి చెందిన హరిప్రియ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. కనకయ్య నియోజకవర్గంలో కొంత అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలతో సం బంధాలు కొనసాగించడంలో విఫలమయ్యారనే వాదన ఉంది. ఆయన చుట్టూ కోటరీ ఏర్పాటు చేసుకున్నారనే అపవాదు కూడా ఉంది. అయితే, లంబాడా నాయకురాలిని స్థానిక గిరిజనేతరులు ఏ మేరకు ఆదరిస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నాయకురాలిగా రెండు పార్టీ ల్లోని సంబంధాలు ఆమెకు ఉపకరించనున్నాయి. అయితే, ఇక్కడ సీపీఐఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) తరఫున బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారు. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉన్న గుమ్మడికి మంచి నేతగా గుర్తింపు కూడా ఉంది. మరి, ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచి చూడాల్సిందే.

నీళ్లు.. నిధులు.. పోడు..బొగ్గు..
- రాజకీయంగా తెలుగుదేశం, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐల పొత్తు ఇక్కడ ఎంత మేరకు సఫలీకృతం అవుతుందనేదే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయించనుంది
టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణం, అభ్యర్థుల వ్యక్తిగత వ్యవహారశైలి చర్చనీయాంశాలుగా మారాయి
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనేతరులు ప్రభుత్వ కార్యక్రమాలపై సంతృప్తిగానే కనిపిస్తున్నారు
సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కొత్తగూడెం భూముల క్రమబద్ధీకరణ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, సీతారామ ప్రాజెక్టు, పోడు భూముల సమస్య, ఖమ్మం కలెక్టరేట్‌ తరలింపు, భక్తరామదాసు ప్రాజెక్టు, వైరా రిజర్వాయర్, జాలిమూడి ప్రాజెక్టు, పోలారం చెరువు, రైతుబంధు, నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కళాశాలల ఏర్పాటు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల అభివృద్ధి నిధుల కేటాయింపు తదితర అంశాలు ఈసారి ఎన్నికలలో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నది ఇక్కడి ప్రజల భావనగా ఉంది. 

ఖమ్మం: ఇద్దరూ ఇద్దరే..
జిల్లా కేంద్రమైన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రసకందాయంగా మారింది. ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌), మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు (టీడీపీ)ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధితో పాటు పార్టీ సంస్థాగతంగా బలపడడం అజయ్‌కు కలిసి వస్తుండగా, నేతల మధ్య సమన్వయలోపం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తు ప్రతిబంధకాలుగా మారుతాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కలెక్టరేట్, వ్యవసాయ మార్కెట్‌ తరలింపు ప్రతిపాదనలు అధికార పార్టీకి నష్టం చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఒకే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఆర్థికంగా ఇద్దరూ పరిపుష్టులే కావడంతో ఖమ్మం మెట్టులో పోటీ ఖరీదయిపోయింది. ఈ ఖరీదైన పోటీలో విజయం ఎవరు సాధించినా మెజార్టీ మాత్రం చాలా స్వల్పంగానే ఉండే అవకాశాలున్నాయి. 

పాలేరు..  గెలుపు నల్లేరు?
ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (టీఆర్‌ఎస్‌) ఇక్కడి నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. తుమ్మల అంటేనే అభివృద్ధి అనే పేరును ఆయన ఈసారి కూడా సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టును అందుబాటులోకి తేవడం, మారుమూల గ్రామాలకూ రోడ్లు వేయించడం కలిసిరానున్నాయి. అయితే, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న కందాల ఉపేందర్‌రెడ్డి కూడా క్రమంగా బలపడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలంగా ఉండడం, తెలుగుదేశం శ్రేణులు కూడా కలిసి వస్తుండడం ఈయనకు అనుకూలాంశాలే. సీపీఐ కొన్ని గ్రామాల్లో కలసిరావడం లేదు. ఇక్కడ సీపీఎం కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. మొత్తంమీద పాలేరులో పోటీ, ఫలితం రెండూ ఆసక్తికరంగానే ఉండబోతున్నాయి. 

మధిర: విక్రమార్క వర్సెస్‌ పొంగులేటి
ఇక్కడ పోటీ భట్టి విక్రమార్క వర్సెస్‌ పొంగులేటిగా మారింది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపిం చాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. పల్లెనిద్ర పేరుతో దళిత వాడల్లో ఉండి మరీ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నేత భట్టి విక్రమార్క కూడా విక్రమార్కుని తరహాలోనే నియోజకవర్గంపై తన పట్టు జారకుండా చూసుకున్నారు. గతంలో రూ.1500 కోట్లతో తాను చేసిన అభివృద్ధి, గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే తాను కీలక హోదాలో ఉంటాననే ప్రచారం ఆయనకు కలిసి రానున్నాయి. జాలిమూడి ప్రాజెక్టు పూర్తి, మధిర రహదారి విస్తరణ అంశాలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారనున్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోవడంతో డాక్టర్‌. కోట రాంబాబు బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీచేస్తున్నారు. ఈయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చే అవకాశాలున్నాయి. మధిరలో గెలిచేది భట్టి విక్రమార్కనా...? పొంగులేటా? అనేది నియోజకవర్గంలో సర్వత్రా చర్చనీయాంశమైంది.

వైరా: ఆ ఇద్దరి మధ్యే హోరాహోరీ
ఈ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బానోతు మదన్‌లాల్‌ (టీఆర్‌ఎస్‌), లావుడ్యా రాములు నాయక్‌ (కాంగ్రెస్‌ రెబల్‌) హోరాహోరీ తలపడుతున్నారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమంతోనే రాములు నాయక్‌ బలంగా రంగంలోకి వచ్చారు. కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఆయనకే పనిచేస్తున్నాయి. టికెట్‌ మళ్లీ రాలేదనే సానుభూతి కనిపిస్తోంది. కూటమి తరఫున బరిలో ఉన్న విజయాబాయి (సీపీఐ) ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది. కొణిజర్ల, జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో పోడుభూములు, వైరా రిజర్వాయర్‌ కాల్వల లెవలింగ్, కాకతీయుల కాలం నాటి పోలారం చెరువు పునరుద్ధరణ, వైరా మున్సిప ల్‌ నిధులు లాంటి అంశాల్లో ఇక్కడి ప్రజల్లో తాజా మాజీ ఎమ్మెల్యేపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అయితే, సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఆయనకు సానుకూలంగా కనిపిస్తున్నాయి.  ఇక్కడ బీజేపీ నుంచి సినీ తార రేష్మా రాథోడ్‌ కూడా పోటీలో ఉండటంతో పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.  

అశ్వారావుపేట: గెలుపు గుర్రం ఎవరు?
టికెట్‌ కోసం మహాకూటమి నేతలు క్యూ కట్టిన అశ్వారావుపేట నియోజకవర్గం లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్‌ గుర్తు లేకపోవడం కొంత ఇబ్బందిగానే ఉంది. అయితే, టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బలమైన సామాజిక వర్గం ఆ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్‌ నేతలంతా ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. అయితే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై గిరిజనేతరుల్లో సానుకూలత కనిపిస్తోంది. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సానుకూల పరిస్థితి ఉంది. ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో కేడర్‌ దూరం కావడం, జలగం ప్రసాదరావు సహకారం బహిరంగంగా కనిపించకపోవడం, పొంగులేటి వర్గీయులూ అదే బాటలో ఉండడం తాటికి కొంత ఇబ్బందికరంగా మారాయి. మరి గిరి‘జనం’ ఏం తీర్పునిస్తారో?.

‘పిన’పాకలో పెద్ద పోటీ
ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పా యం వెంకటేశ్వర్లు దూసుకుపోతున్నారు. పినపాక, కరకగూడెం, బూర్గంపాడు మండలాల్లో మొగ్గు కనిపిస్తోంది. సౌమ్యుడనే పేరు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివా సరెడ్డి సహకారం, భూరికార్డుల ప్రక్షాళనతో గిరిజనేతర రైతులకు దక్కిన హక్కులు, అభివృద్ధి పనులు ఆయనకు కలిసొస్తాయనే చర్చ జరుగుతోంది. రేగా కాంతా రావు (కాంగ్రెస్‌).. ప్రజల మధ్యనే ఉండటానికి తోడు పార్టీ బలంగా ఉండడంతో గట్టిపోటీ ఇస్తున్నారు. సీపీఐ, టీడీ పీ పూర్తిగా సహకరిస్తే ఈయన వెంకటేశ్వ ర్లుకు గట్టి పోటీనివ్వడం ఖాయం.

సత్తుపల్లి: సత్తా ఎవరిది?
నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బలంగా కనిపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, అభివృద్ధిపై దృష్టి సా రించడం ఆయనకు సానుకూలం గా మారాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్న పిడమర్తి రవి అభ్యర్థిత్వంపై నెలకొన్న గం దరగోళం ఆయన్ను ప్రచారంలో వెనుక పడేసింది. గత ఎన్నికల్లో  ఓడిపోయాక ప్రజలకు అందుబా టులో లేరనే విమర్శలున్నాయి. టికెట్‌ ఆశించిన డాక్టర్‌ మట్టా దయానంద్‌ చివరకు సర్దుకున్నారు. మంత్రి తుమ్మల  ప్రభావంపైనే రవి ఆధారపడ్డారు. 

రైతు కష్టాలు తీర్చే వారికే.. 
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రాంబాయి. ఊరు వైరా. చిన్నకారు రైతు. ఈమెకు ఎన్నికలు, ఓట్లు, రాజకీయాలు పెద్దగా తెలియవు. తెలిసిందల్లా భూమిని నమ్ముకుని వ్యవసాయం చేయడమే. ఈ మహిళా రైతు బాధంతా సాగునీటి గురించే. చివరి భూముల వరకు నీళ్లందించే నాయకుడే తమ ప్రజాప్రతినిధి కావాలంటున్నారీమె. వైరా రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి సద్వినియోగం చేసుకోవాలనేది ఈమె ఆకాంక్ష. రైతులను ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదన్న రాంబాయి.. రైతు కష్టాలు తీర్చే వ్యక్తికే ఓటేస్తామని కుండబద్దలు కొట్టింది. 

మేలు చేసే పథకాలు
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌ కృషి ఎనలేనిది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప«థకాలు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయి. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలిచ్చారు. రైతులకు ఉచిత వ్యవసాయ కరెంట్, రుణ మాఫీ, పెట్టుబడి సాయం, గురుకులాల అభివృద్ధి, షాదీముబారక్, పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తారనే విశ్వాసం ఉంది.
– రేగు వెంకటేశ్వర్లు, పాల్వంచ

అభివృద్ధి చేసే  వారే..
అశ్వారావుపేటలో ఆర్టీవో, ట్రెజరీ కార్యాలయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు సాధించే సత్తా ఉండాలి. జాతీయ రహదారి మళ్లింపును అడ్డుకుని అశ్వారావుపేట అభివృద్ధికి పాటుపడే నాయకుడు కావాలి. ఈ ప్రాంత సమస్యలు తెలిసి పరిష్కరించే సమర్థుడై ఉండాలి. 
– పృథ్వీ, విద్యార్థి,అశ్వారావుపేట

‘సత్తుపల్లి’ జిల్లా కావాలి
సత్తుపల్లి జిల్లా ఏర్పాటుకు ఎవరు కట్టుబడి ఉన్నారో స్పష్టంగా ప్రకటించాలి. జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో 129 రోజులు దీక్షా శిబిరాన్ని నిర్వహించాం. ఈ ఎన్నికలలో గెలిచేవారు సత్తుపల్లి జిల్లా ఏర్పాటే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలి. ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న ప్రభుత్వ కార్యాలయాలను సత్తుపల్లిలోనే ఉంచగలగాలి. దీనిపై అభ్యర్థులు స్పష్టమైన హామీనివ్వాలి. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేసే వారికే ఓటేయాలి. 
– బి. మధుసూదనరాజు, సత్తుపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement