సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కీలకపాత్ర పోషించబోతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ కీలకం కానున్నదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని, రోజురోజుకూ పుంజుకుంటోందన్నారు. ఎన్నికల్లో చాలామంది ప్రత్యర్థులను ఓడించనున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పాలనపట్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, మార్పు కోసం బీజేపీకి మద్దతునిస్తారని అన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. జేపీ నడ్డా మంగళవారం ఇక్కడ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: బీజేపీ రాష్ట్రఎన్నికల ఇన్‌చార్జిగా నెలరోజు లు గా ఇక్కడి రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మీపార్టీకి ప్రజల నుంచి ఏ మేరకు మద్దతు ఉంది?
నడ్డా: బీజేపీకి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రజలు టీఆర్‌ఎస్, ప్రధానంగా కేసీఆర్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. హామీలు అమలుకాక మోసపోయా మనే భావన ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పటి తెలంగాణ ఆకాంక్షలు ఇప్పుడు ఒక కుటుంబం ఆకాంక్షలుగా మారిపోయాయి. ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్ అమలు చేయలేదు. అంతటా అసమర్థ పాలనే. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. యువత ఆగ్రహం గా ఉంది. కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మహాకూటమి ఓ అపవిత్ర కూటమి. దానిని ప్రజలు విశ్వసించరు. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన బహిరంగ సభలకు లక్ష మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల్లో పార్టీకి బలం పెరిగింది. మాది అఖిల తెలంగాణ(పాన్ తెలంగాణ) పార్టీ.
తెలంగాణ ప్రజలు మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి ?
అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరికీ చేయూత కోసం ఓటేయాలి. ఇక్కడి పాలనపట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.
మీరు ఇప్పుడు సబ్ కా సాత్..సబ్ కా వికాస్ అంటున్నారు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తూ నగరం పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్నారు. మీరెలా స్పందిస్తారు?
మేం అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళుతున్నాం.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అక్కడ కూడా చేస్తారా?
కర్ణాటకలో ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రుణాలు మాఫీ చేశాం. యూపీ, మహారాష్ట్రలో చేశాం. తెలంగాణలో కూడా చేస్తాం.
ప్రధానమంత్రి మోదీకి హిందూ–ముస్లిం రోగం ఉందని ఇటీవల సీఎం కేసీఆర్ ఆరోపించారు. మీ స్పందన ఏమిటి ?
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మా నినాదం. ఈ మాట చెప్పడం ద్వారా కేసీఆరే తొలుత మతపర అంశాలను లేవనెత్తారు. ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అందువల్లే ముస్లిం మతవాద కోణంలో రాజకీయాలు చేస్తున్నారు.
బీజేపీకి టీఆర్‌ఎస్ బీ–టీం అని, ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసిపోతాయని రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నారు కదా?
రాహుల్‌కు ఆయన స్టేట్‌మెంట్లే గుర్తుండవు. ఆయనకు ఆయన పార్టీ గురించే తెలియదు. జేడీఎస్ సైతం బీజేపీ బీ–టీం అన్నారు. ఇప్పుడు జేడీఎస్ నేతను ముఖ్యమంత్రి చేసి కర్ణాటకలో ప్రభుత్వం నడుపుతోంది కాంగ్రెస్ కాదా? ఇప్పుడు కాంగ్రెస్ దానికి బీ–టీఎంగా మారింది.
ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సైతం ఇలాంటి పొత్తులకు అవకాశముంటుందని భావిస్తున్నారా?
అది కాంగ్రెస్ పార్టీకే తెలియాలి. ఎన్నికల తర్వాత మేం మాత్రం కీలకపాత్ర పోషించబోతున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అడుగుతున్నారు. మీరేమంటారు?
రాష్ట్ర నాయకులు ఈ విషయాన్ని చూసుకుంటారు.
రూ.30 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందా?
విఫలం కాలేదు. అభివృద్ధి అనే నినాదంతో ముం దుకు వెళ్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు ఘనత ఎన్డీఏ, మోదీలకే దక్కుతుంది.
రాష్ట్రంలో బీజేపీకి రెండు సీట్లు రావడం కూడా అనుమానమే అని మంత్రి కేటీఆర్ అంటున్నారు కదా?
ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. ఆయనకు అంతా గులాబీ కనిపిస్తోంది. కానీ, 11 తేదీ తర్వాత అంతటా కాషాయ రంగు కనిపించనుంది. ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలను రెఫరెండమ్‌గా భావిస్తారా?
ఏ ఎన్నికలనైనా మరో ఎన్నికలకు రెఫరెండంగా భావించను. 2019లో ఒక్క లోక్‌సభ సీటు కూడా తమకు దక్కదని కేసీఆర్‌కు తెలుసు. ఇక్కడి లోక్‌సభ సీట్లన్నీ బీజేపీ గెలుచుకోబోతోంది. ఆ విషయం తెలిసే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
రాజీవ్‌గాంధీ తెలుగువారిని అవమానించారని ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది. దీనిపై మీరేమంటారు. ?
ఇది అపవిత్ర కూటమి. అవకాశవాద కూటమి. ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మద్దతుదారులు పరస్పరం ఓటేసుకోవడం లేదు. కెమిస్ట్రీ కుదరడం లేదు.
నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అంటున్నారు కదా ?
బీజేపీ ఓ ప్రబలశక్తి అని గుర్తించడం వల్లే వారు ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మళ్లీ కేంద్రంలో అధికారం మాదే.
కమలానిదే కీలకపాత్ర !
Published Wed, Dec 5 2018 4:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment