సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్.. 23 నియోజకవర్గాలు.. ఇప్పుడు ప్రధాన పార్టీల దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ నియోజకవర్గాల్లో వచ్చే ఫలితం ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుందనే అంచనాల నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఇక్కడే దృష్టి సారించాయి. ఈ నియోజకవర్గాల్లోని ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. కీలక నేతలు చేస్తున్న ప్రచారంతో గత వారం రోజులుగా విశ్వనగరం హోరెత్తుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, అగ్రనేత సోనియాగాంధీలతో పాటు బీజేపీ, టీడీపీ అధ్యక్షులు అమిత్‌షా, చంద్రబాబు, పాటు అన్ని పార్టీలకు చెం దిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు గత వారం, పది రోజులు గా నగరాన్ని చుట్టేస్తున్నారు. ప్రచారానికి రెండు రోజులే ఉం డటంతో గ్రేటర్ పరిధిలో ప్రచారం ఉధృతంగా సాగనుంది. వివిధ రాష్ట్రాలు, జాతులకు చెందిన ఓటర్లు ఇక్కడ ఉండడం, నగర జనాభా ఆలోచన భిన్నంగా ఉంటుందనే అంచనాల మేరకు గ్రేటర్ పరిధిలోనికి వచ్చే నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా అన్ని ప్రధాన పార్టీలు ముందుకెళుతున్నాయి.
ఆ స్థానాలివే: ఎల్బీనగర్, మలక్‌పేట, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, అంబర్‌పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, యాకుత్‌పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మల్కాజ్‌గిరి, ఉప్పల్, మహేశ్వరం, బహుదూర్‌పుర, గోషామహల్, సనత్‌నగర్, కార్వాన్, కుత్బుల్లాపూర్‌లతో పాటు పటాన్‌చెరు, మేడ్చల్‌లలోని కొంత భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అత్యధికంగా టీడీపీ 9 చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత ఎంఐఎం 7, బీజేపీ 5, టీఆర్‌ఎస్ 4 (మేడ్చల్, పటాన్‌చెరు కలిపి) స్థానాల్లో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం.
సీన్ మారిందంటున్న టీఆర్‌ఎస్..
2014 ఎన్నికలతో పోలిస్తే సంస్థాగతంగా టీఆర్‌ఎస్ గ్రేటర్ పరిధిలో బలపడింది. టీడీపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 కార్పొరేటర్లను గెలుచుకోవడంతో ఈసారి కొండంత ధీమాతో గులాబీదళం ఎన్నికలకు వెళ్తోంది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన 8 మంది తాజా మాజీలకు టికెట్లిచ్చిన కేసీఆర్.. మేడ్చల్, మల్కాజిగిరి, అంబర్‌పేటలలో అభ్యర్థులను మార్చారు. బీజేపీ గెలిచిన ఖైరతాబాద్‌లో మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్‌ఎస్ తరఫున పోటీచేస్తున్నారు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాల్లో గత ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులనే బరిలోకి దింపారు. పార్టీ బలోపేతం కావడంతో పాటు గత నాలుగున్నరేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి పనులు, ఐటీ కంపెనీల ఏర్పాటు, మెట్రోరైలు, అండర్‌పాస్ రోడ్లు, మైండ్‌స్పేస్ జంక్షన్ లాంటి కార్యక్రమాలు ప్రజల్లో తమ పట్ల సానుకూలతను పెంచాయనే అంచనాలో గులాబీ శ్రేణులున్నాయి. అయితే కొందరు తాజా మాజీలపై ఉన్న వ్యతిరేకత, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థుల వ్యవహార శైలిలాంటి అంశాలు టీఆర్‌ఎస్ గెలుపోటములపై ప్రభావితం చూపుతాయని విశ్లేషకులంటున్నారు.
ఖాతా తెరిచి తీరుతాం
కాంగ్రెస్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయిన ఆ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు టీడీపీతో పొత్తుపై ఆశలు పెట్టుకుంది. సంస్థాగతంగా పార్టీ ఎప్పటిలాగే ఉందని, సంప్రదాయ ఓటుబ్యాంకు చెక్కుచెదరలేదనే ధీమాతో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. మహేశ్వరం, మేడ్చల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, గోషామహల్, జూబ్లీహిల్స్‌లలో గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకే అవకాశం ఇవ్వగా, కంటోన్మెంట్‌లో కేంద్ర మాజీ మంత్రి సర్వేను రంగంలోకి దింపింది. ఖైరతాబాద్, ముషీరాబాద్, నాంపల్లిలలో యువ నేతలు శ్రవణ్, అనిల్, ఫిరోజ్‌ఖాన్‌లను నిలబెట్టింది. ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తుందనే అంచనాలున్నాయి. అయితే, పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఉప్పల్‌లలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏమవుతుందనే దానిపై ఇక్కడి ఫలితాలు ఆధారపడబోతున్నాయి. టీడీపీతో పొత్తు తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నా అది వికటించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం చేస్తాడని, ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకుంటాడని టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారం గ్రామీణ నేపథ్యం కలిగిన నగర ఓటర్లపై ఎంతోకొంత ప్రభావం చూపనుంది. ఈ పరిస్థితుల్లో టీ డీపీ, కాంగ్రెస్‌ల పొత్తు ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మరింత వికసిస్తాం..
గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 5 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి అసెంబ్లీలో తమ ప్రాతినిథ్యం పెంచుకోవాలని భావిస్తోంది. గతంలో గెలిచిన ఖైరతాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్, ఉప్పల్, గోషామహల్‌లో తాజా మాజీలే బరిలో నిలవగా, మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావును బరిలో దింపింది. మేడ్చల్, కూకట్‌పల్లిలో కూడా పార్టీ తరఫున బలమైన అభ్యర్థులే పోటీలో ఉన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మోదీ చరిష్మా, హిందుత్వ ఎజెండా, అమిత్‌షా వ్యూహంపై ఆధారపడిన కమలనాథులు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండంకెల సంఖ్యలో ఎమ్మెల్యేలుండాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. కాగా, పలు సర్వేలు కూడా ఓటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అభివృద్ధి, అభ్యర్థుల వ్యక్తిగత రికార్డు, పార్టీల ప్రభావంతో పాటు ఈ సర్వేల ప్రభావం కూడా రాజధాని ఓటరుపై పడుతుందనే అంచనాలున్నాయి. 23 నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది.. వచ్చే తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మావి మాకే..
పాతబస్తీలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఎంఐఎం తమ స్థానాలు తమవేననే ధీమాలో ఉంది. ఆ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన మలక్‌పేట, నాంపల్లి, యాకుత్‌పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌పుర, కార్వాన్ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు రాజేంద్రనగర్‌లో సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. తాను గెలవడంతో పాటు టీఆర్‌ఎస్‌ను గెలిపించి తీరాలని కంకణం కట్టుకున్న ఒవైసీ సోదరులు ముస్లిం ఓటు బ్యాంకును ఆ పార్టీ వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment