ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ అడుగంటిపోయి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో తేల్చుకునే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. అటు ఎన్డీఏ నుంచి వైదొలగడం, ఏపీలో ప్రజాగ్రహం ఆకాశానికంటడం, తెలంగాణలో రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారటం నేపథ్యంలో 35 ఏళ్ల శత్రుత్వాన్ని వదిలి కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధం కావడం ద్వారా బాబు అతిపెద్ద రాజకీయ జూదానికి తెరతీశారు. తెలంగాణలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే జాతీయ నాయకుడు కావాలనే ఆశలు మిగలడం, ఓడితే తీవ్రంగా దెబ్బతినిపోవడం బాబుకు మిగిలిన అవకాశాలు ఇవే. ఇక టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి.
అయిదు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం) శాసనసభ ఎన్నికల ఫలితాలు 2018 డిసెంబర్ 11న వెల్లడి కానున్నాయి. వీటిలో తొలి మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బీజేపీ చేతిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మిజోరంలో, టీఆర్‌ఎస్ తెలంగాణలో అధికారం చలాయిస్తున్నాయి. సంవత్సరం క్రితం వరకు బీజేపీ నేతృత్వంలోని ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ సురక్షిత స్థానంలో ఉందని, దాన్ని సవాలు చేసేవారే లేరనే అభిప్రాయం ఉండేది. కానీ ఉత్తర భారతదేశంలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడంతో వ్యతిరేక వాతావరణం బలపడింది. పైగా బీజేపీలో ఇతర భయసూచికలు కూడా కనబడుతున్నాయి. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక చాలా క్లిష్టతరంగా సాగడమే కాకుండా బీజేపీ అతికష్టం మీద దాన్ని నిలుపుకుంది. బీజేపీ గుజరాత్‌ని 30ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా పాలిస్తోందన్నది నిజమే కానీ, ప్రధాని మోదీ గుజరాత్‌లో ఇంత గడ్డు స్థితిని ఎదుర్కొంటారని ఎపరూ ఊహించలేదు. గుజరాత్ తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని అంచనా. త్రిముఖ పోటీ జరిగిన కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. బీజేపీ చాలా కాలంగా రాజ్యమేలుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రాజస్తాన్‌లో ఒక పార్టీ ఒక దఫా మాత్రమే ప్రభుత్వంలో ఉండటం ఆనవాయితీ. దీంతో వ్యక్తిగతంగా అప్రసిద్ధిని మూట గట్టుకున్న సీఎం వసుంధరారాజే ఇక్కడ ఓడిపోవచ్చు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ 2003 నుంచి అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లు ఎంతో తెలివైన రాజకీయ నేతలు. వీరిని రాజస్తాన్ సీఎం వసుంధరా రాజేతో పోల్చి చూడలేం. ఈ సీఎం లిద్దరూ మళ్లీ అద్భుతాలు సృష్టిస్తారని బీజేపీ ఆశాభావంతో ఉంది.
తెలంగాణలో చతుర్ముఖ పోటీ నెలకొంది. కేసీఆర్ నేతృత్వంలోని అధికార టీఆర్‌ఎస్ ఏక్‌దమ్మున కాంగ్రెస్ కూటమితో, బీజేపీతో, వామపక్ష ఫ్రంట్‌తో తలపడనుంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో చతుర్ముఖ పోటీ తీవ్రంగా జరుగుతున్నందున ఇక్కడ విజేత ఎవరో ఊహించడం కష్టం. భవిష్యత్తును అంచనా వేయడం చాలా కష్టమన్న నానుడి నేపథ్యంలో ఈ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ఎదుర్కొనే సంభావ్య సమస్యలను మనం అంచనా వేయవచ్చు.
కాంగ్రెస్ పార్టీకి అసలైన అగ్నిపరీక్ష!
కాంగ్రెస్ పార్టీ ఏరకంగా చూసినా ఈ 5 రాష్ట్రాల్లో గెలుపొందగలదని భావిద్దాం. అదే జరిగితే రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద వరం అవుతుంది. మోదీ ప్రభుత్వ పతనం గురించి కూడా మీడియాలో అంచనాలు మొదలవుతాయి. బీజేపీ ప్రతిచోటా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోందని పోల్స్ చెబుతున్నాయి. ఇక తెలంగాణలో కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు తిరుగులేని వాతావరణమే ఇటీవల వరకూ ఉండేది. కానీ కాంగ్రెస్, టీడీపీ మధ్య అనూహ్యంగా కుదిరిన పొత్తు ఎన్నికల దృశ్యాన్ని మార్చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి కొన్ని నష్టాలు ఉన్నాయి. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎంత ఎక్కువగా అంచనాలు ఉన్నాయంటే, ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో అయినా అది గెలవకపోతే, అప్పుడది తలదించుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ వీలయితే విస్తృత స్థాయిలో గెలుపొందాలి లేకపోతే తీవ్ర ఆశాభంగం తప్పదు.
ప్రభుత్వ స్థాపన కేసీఆర్‌కి అత్యవసరం!
ముందస్తు ఎన్నికలకు అసలు వెళ్లవద్దన్నది రాజకీయ సూత్రాల్లో ఒకటి. 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి, 1989లో ఎన్టీఆర్ ఈ పనిచేసి ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని 8 నెలలు ముందుగా రద్దు చేసిపడేశారు. ప్రతిపక్షం చీలికలు, పేలికలుగా ఉందని ఎన్నికలకు సన్నద్ధం కావడానికి వారికి ఏమంత సమయం లేదని కేసీఆర్ భావించి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈరోజుల్లో రాజకీయ కలయికలకు పెద్ద సమయం అవసరం లేదు. దాదాపు 35 ఏళ్ల బద్ధ శత్రుత్వం తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఐక్యం కావడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపిస్తేనే, టీఆర్‌ఎస్ మనుగడ సాధించడంతోపాటు, దాని విధానాల అమలుకు పూర్తి హామీ ఉంటుంది. అందుకే ఈ డిసెంబర్ 11 కేసీఆర్‌కి చాలా కీలకమైన దినం. మరోవైపు అనేక అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కనుక తెలంగాణలో గెలుపు సాధించలేకపోతే, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో లాగే తెలంగాణలోనూ ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోవచ్చు.
చంద్రబాబు జీవితంలో అతిపెద్ద రాజకీయ జూదం!
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకంటే ఈ డిసెంబర్ 11 బాబుకి చాలా కీలకమైన దినం. ఎందుకంటే తెలంగాణతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుందని బాబు భారీ అంచనాలతో ఉన్నారు. బీజేపీకి ప్రస్తుతం బద్ధవ్యతిరేకిగా మారిన బాబు, కాంగ్రెస్ గెలుపొందితేనే కాంగ్రెస్ ఫ్రంట్‌కి తాను నాయకత్వం వహించగలనని, జాతీయ నాయకుడిగా అవతరించవచ్చని చాలా ఆశలే పెట్టుకుని ఉన్నారు. డిసెంబర్ 11న మూడు కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినట్లయితేనే బాబుకు రాజకీయంగా ఒత్తిడి తగ్గిపోతుంది.
ఏపీలో బాబు ప్రజాదరణ విషయంలో ఘోరంగా దిగజారిపోయారు. కాబట్టి బీజేపీ పరాజయం ఈ నేపథ్యంలో తనకు మేలు చేకూర్చవచ్చు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి కేసీఆర్‌ను ఓడించటం బాబుకు అన్నిటికంటే ముఖ్యమైన అంశంగా మారిపోయింది. కేసీఆర్ గెలిస్తే బాబు తీవ్రంగా దెబ్బతింటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలోనే అతిపెద్ద శత్రువుతో బాబు తలపడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తాను బలహీనపడ్డ విషయం బాబుకు తెలుసు. అందుకే తెలంగాణలో విజయం సాధించడం ద్వారా తాను మహా వ్యక్తినని ఆంధ్ర ప్రజలకు చూపించాలని బాబు కోరుకుంటున్నారు.
తీవ్ర సంకట స్థితిలో బీజేపీ
ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యంత గడ్డుపరిస్థితిని ఎదుర్కుంటోంది. తాను అధికారంలో ఉన్న ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ తీవ్ర వ్యతిరేకతను చవిచూస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్‌లో ముందంజలో ఉంది. పైగా ఆ రాష్ట్రాల సీఎంల కంటే ప్రధాని మోదీపైనే కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రధానంగా జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం వంటి అంశాల్లో మోదీ ఘోరంగా వైఫల్యం చెందారని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో తొలిసారిగా బ్యానర్లు, హోర్డింగుల్లో నరేంద్రమోదీ సైజును తగ్గించివేశారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓడిపోతే, మోదీ ఆత్మవిశ్వాసంతో పాలించడం కష్టమవుతుంది. రాజ కీయ మిత్రులు కూడా పలాయనం చిత్తగిస్తారు. పైగా పార్టీలోనే అంతర్గతంగా మోదీపై దాడులు పెరుగుతాయి. ఇక 2019లో గెలుపే కష్టం.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందినట్లయితే, బీజేపీ పునరుత్థానం చెందిన కాంగ్రెస్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో గెలుపు సాధ్యమైతే కాంగ్రెస్‌కి అది అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే కనీసం ఒక రాష్ట్రంలో అయినా అది గెలవగలగాలి. పైగా తెలంగాణలో టీఆర్‌ఎస్, కేసీఆర్ తప్పక గెలుపొందుతారని బీజేపీ ఆశాభావంతో ఉంది. అదే జరిగితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాహసంగా తలపడుతుంది. ఇతర 4 రాష్ట్రాల కంటే తెలంగాణనే బీజేపీకి చాలా కీలక రాష్ట్రం కానుంది.
రాజకీయవాదులు కూడా ఇతర మానవుల్లాంటి వారే. తమ సన్నిహిత మిత్రులు పెద్దగా సంపన్నులు కాకపోతేనే మనుషులు వారిని ఇష్టపడతారు. తమకు తెలిసినవారు మంచిగా పనులు చేసుకుంటూంటే, మంచి సంబంధాలను కుదుర్చుకుంటూ ఉంటే, మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే సాధారణంగా మనుషులు అసూయపడుతుంటారు. అలాగే రాజకీయ నేతలు కూడా తమ సహాయంతోటే తమ పొత్తు పార్టీలు గెలవడాన్ని ఇష్టపడతారు. కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ తక్కువ విజయాలు సాధిస్తేనే మిత్రపక్షాలకు సంతోషం. అత్యధిక స్థానాల్లో గెలుపొందితే అది మరీ శక్తిమంతంగా మారుతుందని వారి భయం. కాంగ్రెస్ ఈసారి ప్రతిచోటా గెలిచిందనుకోండి, అప్పుడు అది మాయావతి, మమతా బెనర్జీ వంటి ఇతర నేతలందరినీ చిన్న చూపు చూస్తుంది. శత్రువు శత్రువు నాకు మిత్రుడు అనేది పాతనానుడి. కానీ నేటి రాజకీయాల్లో మనం ఇలా చెప్పవచ్చు. ‘‘నా మిత్రుడి శత్రువు కూడా గెలుపొందాలి, అప్పుడే నేను మనగలుగుతాను.’’
ఈ ఎన్నికల ప్రచారం నుంచి తీయవలసిన అతిపెద్ద గుణపాఠం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థను సులభంగా నడపగలిగిన పరిస్థితిని ప్రధాని నరేంద్రమోదీ చేజార్చుకోవడమే. విదేశీ వ్యవహారాలు, స్వచ్ఛభారత్ వంటి క్లిష్ట రంగాలలో మోదీ విజయం పొంది ఉండవచ్చు కానీ చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోయి, రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్న కాలంలో కూడా ఆర్థిక రంగాన్ని మోదీ ముందుకు తీసుకోలేకపోయారు. పైగా మోదీ తన తప్పుల పట్ల ఇంతవరకూ ఎలాంటి పశ్చాత్తాపమూ ప్రకటించలేదు. తాను చేసిన హిమాలయ సదృశమైన తప్పులను మహాత్మా గాంధీ అంగీకరించేవారు. కానీ నరేంద్రమోదీ కేవలం ప్రధాని మాత్రమే. ఆయనేం మహాత్ముడు కాదు కదా!
వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in
Published Wed, Dec 5 2018 1:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment