
సాక్షి, అమరావతి/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో పట్టు సాధించి, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీకి చెందిన ముఖ్య నాయకులందరినీ హైదరాబాద్‌లో మోహరించారు. టీడీపీ పోటీచేసే స్థానాలతోపాటు కాంగ్రెస్ నియోజకవర్గాలకు కూడా ‘దేశం’ బలగాలను తరలించారు. 40మంది ఎమ్మెల్యేలు, అనేకమంది మంత్రులు, ఎంపీలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఏపీలోని ప్రతి జిల్లా నుంచి 50–60మంది ముఖ్య నేతలను కూడా హైదరాబాద్‌కు తరలించారు. వీరు కాకుండా వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు సుమారు 200 మందిని అక్కడికి పంపించారు. మొత్తంగా ఏపీ నుంచి వెయ్యి మందిని బృందాలుగా ఏర్పాటుచేసి తెలంగాణలోని ఎంపిక చేసిన నియోజకవర్గాలకు పంపించారు. వీరందరూ కూకట్‌పల్లిలోని లాడ్జీల్లో దిగారు. కొద్దిరోజుల ముందే వీరందరికీ గుంటూరు జిల్లా మంగళగిరిలోని హ్యాపీక్లబ్‌లో ఒకరోజు శిక్షణ కూడా ఇచ్చినట్లు గుంటూరుకు చెందిన ఒక ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణ సమయంలో నంద్యాల ఉపఎన్నికలో అవలంబించిన ఫార్ములాను వివరించి తెలంగాణలో ఏంచేయాలో చెప్పినట్లు ఆయన వివరించారు. శిక్షణ తీసుకున్న ఈ వెయ్యి మంది కాకుండా ప్రచారం కోసమే మరో రెండువేల మందిని ఆయా నియోజకవర్గాలకు పంపించారు. మరోవైపు.. ఏపీ నాయకులంతా తమకు పట్టున్న ఏదో ఒక నియోజకవర్గంలో కనీసం రెండురోజులు పనిచేయాలని తమకు ఆదేశాలు అందినట్లు ఒక ఎంపీ తెలిపారు.
కూకట్‌పల్లిపై ప్రత్యేక దృష్టి
కాగా, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీచేస్తున్నందున ఈ నియోజకవర్గంపై టీడీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ నియోజకవర్గ బాధ్యతను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. ఇక్కడున్న 380 బూత్‌లకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేసే దిశగా ‘దేశం’ ముఖ్య నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో టీడీపీ పోటీచేస్తున్న ముఖ్యమైన ఏడు నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్ వంటి వారికి ప్రత్యేకంగా కొన్ని పనులు అప్పగించినట్లు తెలిసింది.
ఉదయం ప్రచారం.. రాత్రి ప్రలోభాల పర్వం
ఇదిలా ఉంటే.. ఉదయం వేళల్లో తమకు అప్పగించిన ప్రాంతంలో తమ సామాజికవర్గం ఓటర్లను కలుసుకుంటున్న వీరు.. రాత్రివేళల్లో తమకు కేటాయించిన అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, టీఆర్‌ఎస్‌లో కీలకంగా పనిచేసే నాయకులు, బూత్‌స్థాయి కార్యకర్తలను లొంగదీసుకోవడం.. మీడియా మేనేజ్‌మెంట్ వంటి వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. కాగా, టీడీపీ కుయుక్తులను టీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ఆధారాలతో సహా ఎన్నికల సంఘం ముందుంచేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment