కాంగ్రెస్‌ని నిండా ముంచిన ‘కూటమి’ | Dr AP Vital Article On Telangana Elections | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 28 2018 12:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Dr AP Vital Article On Telangana Elections - Sakshi

మహాకూటమి పేరుతో తెలంగాణలో చంద్రబాబు టీడీపీతో పొత్తుకు సిద్ధమైన క్షణమే కాంగ్రెస్‌ సరికొత్త స్థాయిలో పరాభవం కొని తెచ్చుకున్నదనిపిస్తోంది. కేసీఆర్‌ చేతికి అనుకోని విధంగా ఆయుధాన్ని అందించి వ్యూహాత్మకంగా తప్పు చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణలో మరెవ్వరూ బొంద పెట్టవలసిన అవసరం ఉన్నట్లు లేదు. రెండో దఫా కూడా అధికారాన్ని ఆశిస్తున్న కేసీఆర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌ కలయిక రూపంలో యజ్ఞఫలం సిద్ధించినట్లేనని స్పష్టమవుతోంది. ఇక ఇంటగెలవకున్నా రచ్చ గెలవాలనుకుంటున్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో బలం లేని బీజేపీతో, మోదీతో ఢీ అంటూ లేని శత్రువుతో గాల్లో యుద్ధం చేస్తూ అభాసుపాలవుతున్నారు.

ఇంతమాత్రం ఇంగితజ్ఞానం లేకుండా కాంగ్రెస్‌ వ్యవహరించగలదా? ఇటీవలి మేడ్చల్‌లో జరిగిన బహిరంగసభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రసంగాలను చూసిన తర్వాత నాలో మెదిలిన సందేహం ఇదే! నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే తెలంగాణ సాధనలో తెరాసది మాత్రమే కాదు తమదీ ముఖ్యమైన పాత్రేనని, కాంగ్రెస్‌ ఇలాంటి సభలు ఆత్మవిశ్వాసంతో నిర్వహించినట్లయితే, మరింతగా ఆ పార్టీ తెలంగాణ జనజీవన స్రవంతిలో ఉండి ఉండేదనిపించింది. కానీ ఈ మేడ్చెల్‌ సభ చూసిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నట్లు రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దాదాపు 100 సీట్ల వరకు సాధించి, తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడం అనివార్యం అనిపిస్తోంది.

కేసీఆర్‌కి ప్రజల్లో మమేకమై, వారిని ఆలోచింపజేసి, తమ వెంట నడిపించగల ప్రజల మనిషిగా కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదు. అయినా ఆయన చేతికి అనుకోనివిధంగా ఆయుధాన్ని అందించి, ఆత్మహత్యా సదృశమైన కూటమిని అది కూడా చంద్రబాబు తెలుగుదేశంతో కలిసి ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త స్థాయిలో పరాభవం కొని తెచ్చుకున్నదని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. చంద్రబాబుతో కూటమి కట్టకుండా ఉండివున్నట్లయితే కాంగ్రెస్‌ పార్టీ ఇంత అవమానాన్ని మూటగట్టుకుని ఉండేది కాదేమో! రేవంత్‌ రెడ్డి వంటి చంద్రబాబు నమ్మినబంటు తమలో చేరినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ తనలోకి ఒక ట్రోజన్‌ హార్స్‌ (పంచమాంగదళం) వచ్చి చేరినట్లు గ్రహించలేకపోయింది. ఈ స్థితిలో కాంగ్రెస్‌ను తెలంగాణలో వేరెవ్వరూ బొంద పెట్టవలసిన అవసరం ఉన్నట్లు లేదు. కేసీఆర్‌ ‘యజ్ఞయాగాదుల’ ద్వారా ఆశించిన విజయానికి చంద్రబాబు తెలుగుదేశం, కాంగ్రెస్‌ల కలయిక రూపంలో ఫలం సిద్ధించినట్లే!

అయినా చంద్రబాబుకు మాత్రం వేరే మార్గం ఏముంది? తన తెలుగుదేశాన్ని జాతీయపార్టీగా ప్రకటించుకున్న దుర్ముహూర్తం ఏమిటో గానీ చివరకు ప్రాంతీయపార్టీ పేరు కూడా నిలవడం కష్టంగా మారుతోంది. తెలంగాణలో పాపం.. అన్నెం పున్నెం ఎరుగని సుహాసినిని (నందమూరి హరికృష్ణ కుమార్తె) తన కుట్ర నీతిలో భాగంగా ఎన్నికల బరిలోకి దింపడమే చంద్రబాబు అతితెలివి రాజకీయాలు అని అందరూ గ్రహించే ఉంటారు. పైగా తన జాతీయ తెలుగుదేశం పార్టీ అధికారం చివరి ఘడియలోకి వచ్చిందన్న గ్రహింపు ఆయనకు ఎప్పుడో వచ్చింది. 2014లో మాదిరి మోదీ భజనకు ప్రస్తుతానికి వీలులేదు.

ఇక ఇంట్లో ఈగల మోతను భరించలేక, ఇతర రాష్ట్రాలలో తానేదో చక్రం తిప్పుతున్నట్లు ఫోజు కొడుతూ మోదీ దుష్పరిపాలనకు వ్యతిరేంగా తానేదో కొత్తగా దీక్ష పూని ఆ కృషిలో నిమగ్నమైనట్లుగా రాష్ట్రం బయట తిరుగుతున్న చంద్రబాబును చూస్తే స్వయంకృతంగా తెచ్చుకున్న ఈ దయనీయ స్థితి జాలిగొల్పే స్థాయిలో ఉంది. ఆత్మస్తుతి ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే అయినా, ఇటీవలికాలంలో బాబుకు అదే ఊపిరి అయిపోయింది. హైదరాబాద్‌ను నేనే కట్టాను, ప్రపంచపటంలో దాన్ని నేనే నిలిపాను అంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన తరుణంలోనూ కేసీఆర్‌పై ప్రతిసవాళ్లకు దిగి అవికూడా పనిచేయని స్థితిలో తాను ప్రపంచ పటంలో నిల్పిన ఆ హైదరాబాద్‌నే వదిలి అమరావతికి వెళ్లిపోయాడు.

ప్రజలకు దగ్గర్లో ఉండాలని నూతన రాజధాని నిర్మించుకుందామని వచ్చానని చెప్పుకున్నా, అసలు కారణం వేరే ఉంది. ఏదో సినిమాలో రేలంగిని ‘ఇంత పెద్ద బిల్డింగ్‌ కట్టావు ఎట్లా?’ అని అడిగితే ‘ఆ, ఏముంది ఇద్దరికి రెండు మేడలు కట్టించాను. నాకు ఒక బిల్డింగ్‌ మిగిలింది’ అంటాడు. అయినా రాజధాని నిర్మాణం అని, పోలవరం అనీ ఏదో ఒక పని చేయకపోతే తనకూ, తన అనుయాయులకూ పైసలెలా వస్తాయి? ఇప్పటికే పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకంలోనే వందల కోట్లు మిగుల్చుకున్నారు. ఇక పోలవరం పేరుతో వేలకోట్ల రూపాయలు మిగుల్చుకునేందుకే సినిమా సెట్టింగ్‌ మాదిరిగా పోలవరం నిర్మాణం సాగుతోంది. ఇప్పడు చావుకబురు చల్లగా చెప్పినట్లు గతంలో చేసిన వాగ్దానం మేరకు వచ్చే ఏడాది జూన్‌నాటికి పోలవరం సాధ్యం కాదని తాజాగా చెబుతున్నారు.

రాజ ధాని భూసేకరణ, సమీకరణ, విశాఖ భూకుంభకోణం ఇలా ఎక్కడ భూమి కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్న బాబునూ, ఆయన అనుచరగణాన్నీ చూస్తే పురాణాల్లో భూమిని చాపగా చుట్టి చంకన పెట్టుకుని పోదామనుకున్న హిరణ్యకశిపుని సోదరుడూ హిరణ్యాక్షుడు గుర్తుకు రావడం లేదు. దీనికి తోడు అక్రమసంపాదన యావతో చంద్రబాబు తన చుట్టూతా సుజనా చౌదరి వంటి (లేటెస్టు ఆంధ్రా మాల్యా) వారిని బినామీలుగా చేసుకుని తెలుగు నేల కనీవినీ ఎరుగని అవినీతి, అక్రమార్జన బాగోతం దేశవ్యాప్తంగా తెలిసిందే కదా! 

ఇక ఈయన చక్రం తిప్పి మోదీని ఎదిరిస్తాను అంటూ కూట ములూ, బూటకపు సంఘటనలూ కడుతున్నారు. వాస్తవంగా ఏం జరుగుతోంది? వచ్చి కలుస్తాను అని పదిసార్లు కబురెడుతుంటే రమ్మనక ఏంచేస్తాం అంటూ డీఎంకే నేత స్టాలిన్‌ దెప్పుతున్నారు. ఇక మమతా బెనర్జీ వంటి నేతలు చంద్రబాబును నమ్మే పరిస్థితి ఎలా ఉంటుంది? గత నాలుగున్నరేళ్లుగా మోదీని, ఎన్డీఏని వదలకుంటా పట్టుకుని, ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అంటూ పాడిన యుగళగీతాలు వారెరుగనివా? అయినా ఇప్పుడా చక్రమే లేదు. కుమ్మరిసారె మీద ఈగ నిలబడి తన ప్రభావం వల్లే సారె తిరుగుతోందని అనుకుంటుందట.

చక్రాలు తిప్పే రోజులు నేడు లేవు బాబుగారూ! ఎందుకంటే మాయావతి, మమతా బెనర్జీలు ఆ ప్రయత్నంలో మీకంటే రెండాకులు ఎక్కువే చదివారు. పెళ్లికిపోతూ పిల్లిని చంకన బెట్టుకుని పోయినట్లు టీడీపీతో కూటమి గట్టిన కాంగ్రెస్‌ పార్టీ వారికి కూడా ప్రజల చేతిలో శిక్ష తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూసి ప్రధాని మోదీ నవ్వుకుంటూ ఉండివుండాలి. ఇక్కడ ఉనికే లేని ప్రత్యర్థితో గాల్లో కత్తులు దూస్తూ, తొడగొడుతూ చేసే హాస్యగాడి పాత్రను టీడీపీ పోషిస్తోంది.

పోతే బాబు కూటమిలో చేరి అనవసరంగా అప్రతిష్టపాలయ్యారు కోదండరాం సార్‌. బాబు చక్రం తిప్పుతున్న కాంగ్రెస్‌ కూటమి ఆయనకు ప్రత్యామ్నాయంగా కనిపించడమేమిటి? అంత హడావుడిగా కేసీఆర్‌ని గద్దె దించాలన్న యత్నంలో ఎందుకు భాగస్వామి అయినట్లో ఆయనే పరిశీలించుకోవాలి. ఈ ఎన్నికల వరకైనా స్వయంగా పార్టీ పెట్టి పోటీ చేసి ఉంటే తెలంగాణ హక్కుల కోసం కలిసివచ్చే వారందరినీ ఐక్యం చేయడానికి ఆస్కారం ఉండేది. కాంగ్రెస్, టీడీపీ చక్రవ్యూహంలో బందీ అయి రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. ఇక సీపీఐని చూస్తే చాలా ఆలస్యంగా అయినా అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చిందన్న తృప్తి ఉండేది. కానీ ఈ కూటమిలో భాగస్వామి కావడంతో తనతో పాటు తనవెంట ఇంకా మిగిలి ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని పావులను చేసింది. 40 సీట్లలో పోటీ చేసే సత్తా ఉందని చెప్పి చివరికి 3 స్థానాలతో సంతృప్తి పడిపోయారు. ఇక గద్దర్‌ లాంటివారు మరీ నిరాశపర్చారు.

ఈ సందర్భంలో సీపీఎం ఇతర సామాజిక న్యాయ పోరాట శక్తులతో, వామపక్ష శక్తులతో బహుజన వామపక్ష సంఘటనగా ఏర్పడి మొత్తం 119 స్థానాలకు పోటీ చేయడం హర్షణీయం. నిజానికి ఈ బీఎల్‌ఎఫ్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ ఎన్నికల రంగాన్ని కూడా ఎలా వినియోగించుకోవచ్చో నిరూపించే ఒక సృజనాత్మక బృహత్తర కర్తవ్యాన్ని సీపీఎం తన భుజాన వేసుకుంది. ఎన్నికల్లోనైనా లేక పార్లమెంట రీయేతర పోరాటమైనా ప్రజానీకాన్ని తమవైపునకు తిప్పుకుని బలమైన శక్తిగా ఎదగడం అవసరం. కేసీఆర్‌తో కుమ్మక్కై సీపీఎం అలాచేసింది అని భావించడం సరికాదు.

అలా చేయదల్చుకుంటే తమ సంఘటనకూ కొన్ని స్థానాలివ్వమని కేసీఆర్‌నే బతిమాలి ఉండేవారు. అయితే కేసీఆర్‌ పాలన విశాలాంధ్రలో ప్రజారాజ్యం రచనలో సుందరయ్య ప్రతిపాదించిన నూతన ప్రజాస్వామ్య పాలన కాదు. అందులో సందేహం లేదు. కానీ అది ఇప్పటికే ప్రజల తీవ్ర వ్యతిరేకతకు గురైందని భావిస్తే అంతకంటే స్వీయమానసిక దృక్పథం మరొకటి ఉండదు. పైగా, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, టీడీపీ కూటమిని బలపర్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకోవడం కూడా భ్రమే.

చివరగా 1951లో సాయుధ తెలంగాణ పోరాటం నిర్వహిస్తున్న నాటి ఉమ్మడి సీపీఐ అప్పటి ప్రపంచ విప్లవ కేంద్రంగా భావించబడుతున్న సోవియట్‌ పార్టీ సలహా కోసం వెళ్లింది. ఆ సందర్భంలో స్టాలిన్‌ వారికో విషయం చెప్పాడు. ‘‘మీరు నెహ్రూ గురించి పొరపాటు అంచనా వేశారు. భారత ప్రజానీకం నుంచి నెహ్రూ, ఆయన కాంగ్రెస్‌ పార్టీ వేరుపడిపోయి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్న స్వీయమానసిక దృక్పథంలో ఉన్నారు. నేటికీ జాతీ యంగా, అంతర్జాతీయంగా ప్రజల దృష్టిలో కాంగ్రెస్, ప్రత్యేకించి నెహ్రూ శాంతికాముకుడు, పురోగామి దృక్పథం కలవాడు అనే భావన బలంగా ఉంది. ఈ స్థితిలో, నెహ్రూ ప్రభుత్వానికి కూడా ఎదురొడ్డి నిలిచే ‘విముక్తి’ పోరాటానికి, ప్రజల మద్దతు గురించి పునరాలోచించండి’’ అని చెప్పారు.

తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ వైఖరి సరైనది. అస్తిత్వం కోసం పోరాడుతున్న శక్తులతోపాటు కమ్యూనిస్టులు కలిసి ముందుగా విస్తృత ప్రజానీకంలో తగిన గుర్తింపును పొందాలి. నిజానికి గోషా మహల్‌ అసెంబ్లీ స్థానంలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నిలిపి బీఎల్‌ఎఫ్‌ తన లక్ష్యాన్ని చక్కగా స్పష్టం చేసింది. అందుకే ఈ ఒక్కస్థానమే కాదు, తెలంగాణ ప్రజానీకం మొత్తంగా బీఎల్‌ఎఫ్‌ వైపు నిలబడాలి.


వ్యాసకర్త : డాక్టర్‌ ఏపీ విఠల్‌, మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement