అజేయుడు.. అద్వితీయుడు | DevulaPalli Amar Article On Telangana Elections Results | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 1:16 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

DevulaPalli Amar Article On Telangana Elections Results - Sakshi

ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్, టీడీపీలు మూకుమ్మడిగా దాడి చేసినా.. ఓ వర్గం మీడియా చంద్రబాబుకు దన్నుగా తనపై తీవ్ర ప్రచారానికి దిగినా... మొక్కవోని దీక్షతో టీఆర్‌ఎస్‌ని అధికార పథంలో నిలబెట్టిన అద్వితీయ నాయకుడు కె. చంద్రశేఖర్‌రావు. ప్రజల నాడిని పసిగట్టడంలో, గెలుపు ఓటములను అంచనా వేయడంలో తన అనుభవాన్ని మొత్తంగా రంగరించిపోసిన కేసీఆర్‌ అటు కాంగ్రెస్‌ను, ఇటు చంద్రబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. తెలంగాణలో కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ మరొక్కసారి కాలర్‌ ఎగరేసుకోవాలనుకున్న చంద్రబాబు ప్రయత్నం ఘోరంగా బెడిసికొట్టింది. తెలంగాణ ఆత్మను తట్టిలేపిన కేసీఆర్‌కే ఈ ఘన విజయం దక్కుతుంది.

తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అద్భుత విజయం సాధించింది. ఈ వార్తావ్యాఖ్య పూర్తి చేసే సమయానికి టీఆర్‌ఎస్‌ 88 స్థానాలు సాధించి ప్రజల్లో తన బలాన్ని చాటుకున్నది. టీఆర్‌ఎస్‌కు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు అభినందనలు. అద్భుత విజయం అనడానికి కారణం ఆ పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్యను బట్టి కాదు, ప్రత్యర్ధి కూటమిలో హేమాహేమీలు అందరినీ దాదాపుగా మట్టి కరిపిం చినందువల్ల. కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రముఖులు జానారెడ్డి, జీవన్‌ రెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనరసింహ, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్‌రెడ్డి మొదలైన వారంతా ఓటమి పాలయ్యారు. కేసీఆర్‌ వ్యవహార శైలి, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆయనకు ఉన్న వైముఖ్యం, అప్రజాస్వామిక ధోరణి వెరసి టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం అనుకున్న వారందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గులాబీ జెండా తెలంగాణ శిఖరాగ్రాన మరొక్కసారి రెపరెపలాడింది.  

ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని మేధావులూ, మీడియా కచ్చితంగా టీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడం ఖాయంగా భావించారు. వాళ్ళకు ప్రజల నాడి తెలుసుకునే అవకాశం తక్కువ అనుకుందాం. ప్రజాక్షేత్రంలో నిత్యం తిరుగుతూ తమ విజయావకాశాలను పరీక్షించుకుంటున్న రాజకీయ నాయకులకు, క్రియాశీల కార్యకర్తలకూ ఎందుకు అర్థం కాలేదు? టీఆర్‌ఎస్‌ అనుకూలత చాపకింద నీరులా ప్రవహించిం దనుకోవాలా? దానికి కారణం ఉంది. ప్రజల నాడి తెలుసుకునే పని మానేసి ప్రతిపక్ష రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్న మీడియాను నమ్ముకోవడమే. నిన్న మొన్నటి దాకా కేసీఆర్, ఆయన ప్రభుత్వ కనుసన్నల్లో మెలుగుతూ తమ పత్రికలనూ, చానళ్లనూ అధికార పక్షం కరపత్రికలుగా, బాకాలుగా మార్చేసి హఠాత్తుగా యూటర్న్‌ తీసుకోవడం, తెలంగాణలో అధికార పక్షం ఓడిపోబోతున్నదని ప్రచారం మొదలుపెట్టడం వెనక దాగిన ఒక కుట్రను ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గుర్తించలేక పోవడం అందుకు కారణం. మీడియా ఎత్తులూ, జిత్తులూ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి తాము ఇవ్వదలచిన తీర్పు స్పష్టంగా ఇచ్చారు. తన స్వప్రయోజనాలను ఆశించి ‘‘పార్టీలు ఫిరాయించే’’ మీడియాను నమ్ముకున్న ప్రతిపక్షం తెలంగాణలో తగిన ఫలితాన్నే అనుభవించింది.

నాలుగేళ్ళ మూడు నెలలు అధికారంలో ఉండి టీఆర్‌ఎస్‌ మూటగట్టుకున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఒక పెద్ద తప్పిదం ఇవాళ మళ్ళీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి గల కారణాల్లో ఒకటి అయింది. ఓటింగ్‌ సరళి, ఫలితాల సరళీ చూసినప్పుడు ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ గెలుపునకు వివిధ రకాల పెన్షన్‌లు, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు కారణంగా చెప్పుకోవాలి. టీఆర్‌ఎస్‌ అనుకూల ఓట్లన్నీ నిశ్శబ్దంగా ఉంటే, కేసీఆర్‌ వ్యవహార శైలిని వ్యతిరేకించిన వర్గాలు బలమైన గొంతు కలిగి ఉండటం వల్ల టీఆర్‌ఎస్‌ వోటమి తప్పదనే అభిప్రాయం కలిగింది. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ మరి కొన్ని పార్టీలతో కలిసి కూటమి కట్టాలన్న ఆలోచన చేసేసరికి టీఆర్‌ఎస్‌ తన గెలుపు పట్ల సందేహంలో పడిపోయింది. తెలంగాణ జనసమితి, భారత కమ్యూనిస్ట్‌ పార్టీతో కలిసి కూట మిగా ఎన్నికలకు పోవాలనుకున్నంతవరకూ కాంగ్రెస్‌ ఆలోచన బాగానే ఉంది. తెలంగాణలో అంతవరకూ టీఆర్‌ఎస్‌ ్రçపభుత్వానికి కరపత్రాలుగా ఉన్న మీడియా సంస్థలు, చంద్రబాబు రాకతోనే ప్లేట్‌ ఫిరాయించి టీఆర్‌ఎస్‌ వ్యతిరేక వైఖరి తీసుకున్నాయి. అప్పుడే కాంగ్రెస్‌ బలహీనపడటం మొదలైంది.

చంద్రబాబు తన పార్టీ టీడీపీని కూటమిలో చేర్చేవరకూ నిజానికి టీఆర్‌ఎస్‌కు ప్రతిపక్షాలను విమర్శించడానికి సరైన ఆయుధం లేదు. బాబు కూటమిలో చేరడమే కాకుండా ఆ కూటమి అంతటినీ తానే నడిపిస్తున్నాననే అభిప్రాయం జనంలో కలిగించే దాకా కూడా టీఆర్‌ఎస్‌ ఆయుధం కోసం వెతుక్కుంటూనే ఉంది. బాబు ఆలోచన వేరు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే ఆ ఘనత తనదే అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా కూటమిలో చేరడానికి ముందు జాతీయ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే రెండు బ్రహ్మ పదార్థాలను తీసుకుని రాహుల్‌ని మచ్చిక చేసుకున్నాడు. దీని వెనక ఎన్నికల కోసం బాబు అందించబోయే నిధులు ఆర్థికంగా దివాలా తీసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడిని మరింత ఆకట్టుకున్నాయి. ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ వెళ్లి పత్రికా గోష్టి నిర్వహించి తిరిగి అమరావతి వెళ్ళిపోయే చంద్రబాబు నిజంగానే ఆకర్షణీయంగా కనిపించి ఉంటాడు రాహుల్‌ గాంధీకి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆయన ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో భ్రష్టు పట్టించిన తీరు రాహుల్‌ గాంధీ దృష్టికి రాలేదో లేక ఆ పార్టీ రాష్ట్ర బాధ్యులు ఆయనకు చెప్పలేదో కానీ బీజేపీయేతర పక్షాలన్నిటినీ కాంగ్రెస్‌ గూటికి చేర్చే పని తానే చేస్తానని నమ్మించిన బాబు ఉచ్చులో పడిపోయింది కాంగ్రెస్‌. 

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు తెలంగాణ ప్రజల్లో భయాలు తొలగించి భరోసా కల్పించే విధంగా కాకుండా ప్రసంగాలన్నీ తన గొప్పలు చెప్పుకోడానికి, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుని తద్వారా అధికారంలోకి వచ్చిన పార్టీని నిందించడానికే వెచ్చించారు. చంద్రబాబు ఆలోచన ఏమిటంటే తెలంగాణలో తాను పొత్తు కూడిన కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో చక్రం తానే తిప్పాననీ, జాతీయ స్థాయిలో కూడా తిప్పుతాననీ చెప్పుకుని ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న దుష్పరిపాలన నుంచి, ప్రజావ్యతిరేకత నుంచి అందరి దృష్టి మళ్ళించాలి. ఆయన ఆలోచనకు కొందరు మీడియా యజమానులు, మాజీ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ వంటి వారు తోడయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ ముఠా ఒక్క దగ్గర చేరి టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి అవసరం అయిన ప్రణాళికలు కూడా వేసుకుందని వార్తలు వచ్చాయి. ఇదంతా బెడిసి కొట్టింది. బాబు కంటే రెండాకులు ఎక్కువే చదువుకున్న కేసిఆర్‌ దాన్నే ఆయుధంగా మలుచుకుని జనంలోకి వెళ్ళారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెడదామా, ఢిల్లీ వీధుల్లో అమ్ముదామా అని ప్రశ్నించే సరికి ఆయనను, ఆయన పరిపాలనను వ్యతిరేకిస్తున్న వర్గాలు కూడా చంద్రబాబునాయుడును నిలువరించేందుకు టీఆర్‌ఎస్‌కు ఓటేసే పరిస్థితి ఏర్పడింది. దాని పర్యవసానమే ఇవ్వాల్టి తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితం. తన పార్టీ తరఫున కూటమి అభ్యర్థులుగా నిలబెట్టిన కొద్ది మందిని కూడా గెలిపించుకునే పరిస్థితి చంద్రబాబుకు లేకుండా పోయింది. నందమూరి కుటుం బాన్ని మచ్చిక చేసుకోడానికన్నట్టు దివంగత హరికృష్ణ కుమార్తెను కూకట్‌ పల్లిలో పోటీ చేయించి ఘోర పరాజయం పాలుచేశారు చంద్రబాబు. చంద్రబాబు పేరు కూడా తెలియని మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలవడం, అదే సమయంలో బాబు వేలు పెట్టిన తెలంగాణలో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూడటం కాంగ్రెస్‌ పెద్దలకు, ముఖ్యంగా రాహుల్‌ గాంధీకి కనువిప్పు కావాలి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలను కళ్ళప్పగించి చూస్తూ, చెవులు అప్పగించి వింటూ కూర్చున్న కాంగ్రెస్‌ పెద్దలు తప్పకుండా పునరాలోచనలో పడతారని ఆశిద్దాం. బీజేపీకి దూరం అయ్యాక జాతీయ రాజకీయాల్లో దూరి తన అస్తిత్వాన్ని చాటుకోవాలనుకున్న చంద్రబాబుకు తెలంగాణ ఫలితాలు పెద్ద దెబ్బ. తెలంగాణాలో కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరొక్కసారి కాలర్‌ ఎగరేసుకోవాలన్న ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది. కూటమిలో చంద్రబాబు చేరిక కారణంగా తెలంగాణ ఉద్యమ పెద్దగా ఇంతకాలం గౌరవం పొందిన ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజాయుద్ధ నౌకగా పేరుపొందిన గద్దర్‌ వంటి వారి ప్రతిష్ట కూడా మసకబారిందనడంలో సందేహం లేదు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా తమ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్‌ను, ఓటర్ల జాబితాలో అవకతవకలను కారణాలుగా చూపించే ప్రయత్నం చేయడం, కుంటిసాకులు వెతుక్కోవడం సరికాదు. దానికి బదులుగా స్థిమితంగా కూర్చుని ప్రజాకూటమి ఓటమికి కారణాలను విశ్లేషించి, ఆత్మ విమర్శ చేసుకుని, అధిష్టానవర్గానికి ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్‌ చేస్తే, వాళ్ళు దాన్ని నిజాయితీగా అమలు పరిచి చంద్రబాబు వంటి వారిని దూరం పెడితే ముందు ముందు కాంగ్రెస్‌ కొంచెం అయినా బాగుపడటానికి, బలపడటానికీ ఉపయోగపడుతుంది.

2014లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిన సీట్లు 63, కాగా సుస్థిరత సాకుతో ఆ పార్టీ ఫిరాయింపులను  ప్రోత్సహించి చేర్చుకున్న వారితో కలిపి మొన్న ఎన్నికలకు పోయేనాటికి 90 సీట్లు అయ్యాయి. ఈసారి ఆ అవసరం లేకుండానే జనం సుస్థిర పాలన చెయ్యడానికి అవసరం అయిన సంఖ్యాబలం ఇచ్చారు కాబట్టి కేసీఆర్‌ ఇక అవతలి పార్టీల వారికి కండువాలు కప్పే అనైతిక  కార్యక్రమానికి స్వస్తి చెపితే మంచిది.
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికల ఫలితాన్ని గౌరవించడంతో బాటు, ప్రజలనూ, ప్రజాస్వామిక విలువలనూ, పౌర హక్కులనూ గౌరవించే వాళ్లకు అందుబాటులో ఉండే ప్రయత్నం ఈ రెండో పదవీ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలవరుచుకుంటే కూడా బాగుంటుంది. 

దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement