Telangana Election Result 2018
-
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
కేబినెట్లోకి ఇద్దరు మహిళలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మంత్రివర్గంలోకి గరిష్టంగా 17 మందిని తీసుకోవచ్చని, రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని (సీఎం కాకుండా ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు) తీసుకునేది ఉందన్నారు. అందులో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయబోమని... వారిపట్ల గౌరవం ఉందన్నారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని.. వారి మద్దతే లేకపోతే తాము అధికారంలోకి రాగలిగేవారం కాదన్నారు. తాజాగా ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ ఒక మహిళకు స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించాలంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సూచనకు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఈ మేరకు బదులిచ్చారు. అలాగే వివిధ అంశాలపై సమాధానమిచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రైతులకు రుణమాఫీ చెక్కులు... కేంద్రం పీఎం–కిసాన్ పథకం కింద ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఇచ్చే రూ.6వేల నగదుతో సంబం ధం లేకుండానే రైతుబందు కింద రైతులకు ఎకరాకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తాం. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నాం. రైతులకు వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు ఇస్తాం. రైతులకు 4–5 దఫాలుగా రుణమాఫీ చేస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దు. ఒకవేళ కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ముందుగానే మాఫీ చేస్తాం. ఈ విషయంపై రైతులకు నేనే లేఖ రాస్తా. కిందటిసారి తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ కాగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రూ. 1.60 లక్షలలోపు రుణాలపై రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ధరణి వెబ్సైట్ చూసి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూములను ఆక్రమించిన వారిలో అనర్హులనే ఖాళీ చేయిస్తాం. రైతులకు ఇంకొకరి అజమాయిషీ ఉండనీయం. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వలేం... కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం సాధ్యం కాదు. రైతుబంధు సొమ్ము తీసుకునే రైతులే ఉదారంగా కౌలు రైతులకు ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాత పాస్‌బుక్కుల్లో ఉన్న 33 అనవసర కాలమ్‌లను ఎత్తివేశాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఆరు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. భూముల విషయంలో అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమస్యలు ఉన్నాయి. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. రెండు, మూడు నెలల్లో ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తాం. గంట గంటకు రికార్డులు అప్డేట్ అవుతాయి. భూపాలపల్లిలో ఒక రైతు కుటుంబం ఎమ్మార్వోకు లంచం కోసం భిక్షాటన చేయడం చూసి వెంటనే చర్య తీసుకున్నాం. అమెరికా అప్పులున్న దేశం కూడా! ప్రపంచంలో ఏదైనా అత్యంత ధనిక దేశం ఉందంటే అది అమెరికానే. అదే సమయంలో అత్యంత అప్పులున్న దేశం కూడా అదే. అటువంటి అమెరికా తెలివిలేక అప్పులు చేసిందా? మన కంటే పెద్ద దేశమైన చైనా జీఎస్డీపీ మన కంటే తక్కువ. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉండేది. చైనాలో కరువు వస్తే ఒకేసారి 7–10 లక్షల మంది చనిపోయారు. అక్కడి పాలకుల విధానాల వల్ల 2, 3 దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందింది. జపాన్ జీఎస్డీపీ కంటే 300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుంది. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు కట్టడం కోసమే. రాష్ట్రానికి చెందిన 25 సంవత్సరాల బాండ్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీపడి కొన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పులు చేస్తున్నాం. వాటిని తీర్చే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని ఎక్కడా దాటలేదు. అప్పుల విషయంలో ఆర్బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రైవేటు అప్పుల్లా ఉండవు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సంస్థలు అప్పులు ఇస్తాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఐదారు రోజుల్లోనే రూ. 15 వేల కోట్ల అప్పు ఇస్తామని పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. రూరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 50 వేల కోట్ల వరకు రుణం ఇస్తామని చెప్పింది. కాళేశ్వరం చివరి దశలో ఉన్నందున దానికి అప్పు ఇవ్వాలని కోరాం. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి... రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లకుపైగా నిధులు పోతున్నా రాష్ట్రానికి రూ. 24 వేల కోట్లే తిరిగి వస్తున్నాయి. మిగిలిన రూ. 26 వేల కోట్లు కేంద్రమే ఉపయోగించుకుంటోంది. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ట్రాల పరిధిలోని అనేక శాఖల అధికారాలు కేంద్రానికి ఇచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల గురించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలా? రోజువారీ కూలీకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలా? ప్రధాని మోదీ చెబుతున్న సహకార సమాఖ్య ఎక్కడా లేదు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఉమ్మడి జాబితాలోని అంశాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. దళితులు, గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నారు. రెడ్డి, వైశ్యులు, వెలమలు కూడా కార్పొరేషన్లు కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కేంద్రం నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకి నిధులు వచ్చేవి. మోదీ వచ్చాక అవి ఆలస్యమవుతూ 15వ తేదీకి వచ్చే పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తాం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ తర్వాత రుణాల రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలు ఇస్తాం. లోక్‌సభ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం మాకు లేదు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు. త్వరలో కొత్త మున్సిపల్ చట్టం... మనిషి కులం మారదు. అయినా ప్రజలు పలుమార్లు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండటం శోచనీయం. ఈ పరిస్థితి మారాలి. రాబోయే కొన్ని నెలల్లోనే పలు సంస్కరణలు అమలు కాబోతున్నాయి. పుట్టిన వెంటనే కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో ఉన్న లొసుగులను సరిచేస్తాం. మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే రోజులు రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం. త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ప్రతినెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తాం. కంక్లూజివ్ టైటిల్‌ను తీసుకొస్తాం. దీనివల్ల ఆక్రమణలు జరగవు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూములను కూడా గుర్తిస్తాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు రాని వారు లక్ష మంది ఉన్నారు. వారందరికీ పట్టాలు ఇస్తాం. మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టాలని కోరాం... లోక్‌సభ ఎన్నికలను రాష్ట్రంలో మొదటి విడతలో పెట్టాలని కోరాం. ఎందుకంటే ఎప్పుడో చివరి దశలో ఎన్నికలు పెడితే అప్పటివరకు ఎన్నికల కోడ్ వల్ల పనులేవీ చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది. ముందే ఎన్నికలు పెడితే మున్సిపాలిటీలు, జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం 4–5 వేల సిబ్బందిని భర్తీ చేసి వాటిని పరిపుష్టం చేస్తాం. ప్రతి జిల్లాలో సెషన్ కోర్టులు అవసరం. ఈ విషయంపై సీజేతో మాట్లాడతా. దేశంలో ఆరు పెద్ద నగరాలకు కేంద్రం ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయించి అంతే మొత్తంలో ఆయా రాష్ట్రాలు కూడా కేటాయింపులు చేస్తే రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి. ఈ విషయాన్ని ప్రధానికి కూడా చెప్పా. చైనాలోని బీజింగ్‌లో ఐదు ఔటర్ రింగ్‌రోడ్డులు ఉన్నాయి. మరొకటి కూడా కడుతున్నారు. అయినా అక్కడ ట్రాఫిక్‌జాం అవడానికి ప్రధాన కారణం బీజింగ్‌లో 70 లక్షల కార్లు ఉండటమే. ఢిల్లీలోనూ కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్ ఇందిరా పార్కు లాంటి చోట్ల ఆక్సిజన్ సెల్లింగ్ సెంటర్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఒక పరిమితి దాటితే ప్రజలను పట్టణాలకు వలస రానీయకూడదా అన్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ విషయంలో మనం జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలేవీ? ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు, సలహాలు రాలేదు. నాలుగేళ్లుగా చెబుతున్నవే మరోసారి చెప్పాయి. రూ. 80,200 కోట్లను సభ మంజూరు చేయాల్సి ఉంది. బడ్జెట్‌ను గుణాత్మకంగా చూడాలి.. గణాత్మకంగా కాదు. 31 మార్చి తర్వాతే ఎకనామిక్ సర్వే పెడతారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వస్తే అప్పటి పరిస్థితినిబట్టి జూన్–జూలైలలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడతాం. విపక్షాలు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయి. ముందుస్తు ఎన్నికలపై శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు వాస్తవం కాదు. నా అంచనా ప్రకారం గత జూలై–ఆగస్టులలోనే ఎన్నికలు జరగాల్సింది. ఎన్నికల సంఘం మాకు సహకరించలేదు. కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షలు రుణమాఫీ అని చెప్పింది. మేము మాత్రం నాలుగు విడతల్లో రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాం. దానికి ఆమోదంగానే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి రుణాలను మాఫీ చేస్తానని నేను చెప్పలేదు. రాజీవ్ గృహకల్పకు సంబంధించి రూ. 4 వేల కోట్లు మాఫీ చేశాం. రైతు అంటే ఎవరు? ముఖ్యమంత్రి ప్రసంగం ముగిశాక కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కౌలు రైతుకు రైతుబంధు సొమ్ము ఇవ్వడానికి సాంకేతిక సమస్య ఉందంటున్న ప్రభుత్వం భూమి ఉన్నవాడే రైతా? పంట సాగు చేసే వాడు రైతా? నిర్వచనం చెప్పాలని కోరారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ వ్యవసాయ భూమిని పట్టాగా హక్కున్న వాడే రైతు అన్నారు. భూటాన్ దేశంలో నేచురల్ హ్యాపినెస్ అంటూ శ్రీధర్‌బాబు అంటున్నారనీ, పక్క రాష్ట్రం వారు కూడా ఏదేదో చేశారంటూ ఎద్దేవా చేశారు. రెండు బిల్లులకు ఆమోదం... శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ ఆమోదంతో ముగిసింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2018–19 సవరించిన అంచనాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. -
ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అహ్మద్ ఖాన్‌తో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జనవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. (ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్) కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. రేపు స్పీకర్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటన విడుదల చేస్తారు. ఎల్లుండి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై 20 తేదీన అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. -
కుట్రల వల్లే ఓటమి: మాజీ మంత్రి
అశ్వారావుపేటరూరల్: స్వార్థ రాజకీయాలు, కొన్ని కుట్రల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రెండింటినీ సమానంగా చూడాలని, ఉభయ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, వేరే వాళ్లను నిందించవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వినాయకపురం గ్రామంలో ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ విసృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నష్టపోవడంపై తమతోపాటు సీఎం కేసీఆర్ గుండెల్లో కుడా బాధ నెలకొందన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుస్తామని ఆశపడ్డానని, అలాగే అశ్వారావుపేట అసెంబ్లీ సీటు మొదట గెలవాల్సిన స్థానమని, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాల కోసం బలి పెట్టుకున్నారని, ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఈ స్థానాన్ని చేజేతులారా పొగట్టుకున్నామని, ఇప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని, జరిగింది మనస్సులో పెట్టుకోవద్దని, జరగాల్సినది చూడాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి కొనసాగే బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడిచిన నాలుగేళ్లలో మిగిలిన జిల్లాల కంటే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. జిల్లాలో ఇప్పటికే 800 మెగావాట్లతో కేటీపీఎస్‌ను, 12వందల మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్లను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేయాలని, కొట్లాడుకొని వేరే పార్టీల వద్ద చులకన కావద్దని కోరారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ అంతా సిద్ధం కావాలని, సర్పంచ్ టికెట్ల కోసం పొట్లాడుకోవద్దన్నారు. గ్రామ నాయకులు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిపించుకోవాలని కోరారు. అన్ని సర్పంచ్ స్థానాలనూ గెలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్, మండలాధ్యక్షుడు బండి పుల్లారావు, నాగమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ బాధ్యులు జూపల్లి రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి రావాలి: తాటి నియోజకవర్గస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, ఆయనకు మంత్రి పదవి వస్తేనే జిల్లా లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. సస్పెండ్ డిమాండ్‌తో రసాభాస టీఆర్ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ ఇన్చార్జ్ రవీందర్ ప్రసంగిస్తున్న క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్గీయులు, ఖమ్మం ఎంపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెంచ్ చేయాలంటూ.. ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. ఒకరినొకరు నెట్టుకుంటున్న క్రమంలో స్థానిక నేత జూపల్లి రమేష్ ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. 10 నిమిషాలపాటు సభలో గందరగోళం నెలకొంది. తోపులాట, మాటల యుద్ధం సాగింది. పార్టీ ఇన్చార్జ్ హెచ్చరించడంతో వారంతా శాంతించారు. -
‘టీడీపీతో లాభం లేదు.. మరోసారి పొత్తు వద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆపార్టీ నేతలతో సమావేశమైయ్యారు. ఆదివారం గండిపేటలోని ఆమె ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశాంలో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో సహా పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కేవలం కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపిందని అన్నారు. అన్ని జిల్లాల్లో పొత్తు ఉపయోగం ఉండదని తాము ముందు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఆమె వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తాను లోక్‌సభకు పోటీచేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అరుణ తెలిపారు. ఓడిపోవడానికి అనేక కారణాల్లో టీడీపీతో పొత్తు కూడా ప్రధానమన్నారు. టీఆర్ఎస్ ఒక్కొక్క నేతను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ను ఓడించిందని, పాలమూరులో ఓటమిపై అనేక అనుమనాలున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, రాజగోపాల్ రెడ్డి, హరిప్రియానాయక్, హర్షవర్ధన్, జానారెడ్డి, దామోదర, సునీతా లక్ష్మారెడ్డి పొన్నాల తదితరులు హాజరైయ్యారు. -
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
-
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎంఐఎం సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం హిందూధర్మానికి వ్యతిరేకమైన పార్టీ అని, అందుకే ఆ పార్టీ నేత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయరాదని నిర్ణయించానని ఆయన ఒక వీడియోలో తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్ తెలిపారు. -
‘ఓటరు ఆలోచన మారింది..పార్టీ థింకింగ్ కూడా మారాలి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అభిప్రాయపడ్డారు. ఓటర్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, దానికి అనుగుణంగా పార్టీ తీరు కూడా మారాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావంపై గాంధీభవన్‌లో సమీక్షా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానంగా మూడు, నాలుగు కారణాలున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసీ నిర్ణయాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజాసమస్యలపై పోరాటం చేయ్యలేకపోయ్యామని దామోదర తెలియజేశారు. అభివృద్ధికి ఓట్లకు సంబంధంలేదని, చివరి ఇరవై రోజులు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. -
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 17 నుంచి 20 వరకు నూతనంగా ఏర్పడిన సభ తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు నియమితులుకానున్నారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనచే గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మర్నాడే (జనవరి 17న) నూతనంగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం జూబ్లీహాల్లో సభ్యులకు విందు కార్యక్రమం ఉంటుంది. అదే రోజున శాసనసభ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ స్వీకరణ కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 18న సభ్యులు శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఎన్నిక అనంతరం నూతన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. అనంతరం స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. జనవరి 19న నూతనంగా ఏర్పడిన సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ మర్నాడే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం కార్యక్రమం జరుగుతుంది. కాగా డిసెంబర్ 11న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాల వల్లన శాసన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. -
ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్ చేశారు. -
ఏడాదంతా రాజకీయ రికార్డులే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’ ఎన్నికల నగారాకు మన జిల్లానే వేదికగా నిలిచింది. జైత్రయాత్రకు ఇక్కడే అంకురార్పణ చేసిన గులాబీ నాయకత్వం.. ఊహకందని విజయాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో బలీయశక్తిగా ఎదిగింది. గతంలో కేవలం షాద్‌నగర్ సీటుకే పరిమితమైన ఆ పార్టీ.. తాజాగా ఆరు సీట్లలో విజయం సాధించి ఆజేయశక్తిగా ఆవతరించింది. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఏఐసీసీ దూతలపైనే అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించి పార్టీకి దూరమవగా.. ఎల్బీనగర్ సీటు అడిగితే ఇవ్వకుండా ఇబ్రహీంపట్నం కట్టబెట్టడంతో సామ రంగారెడ్డి ఏకంగా తెలంగాణ టీడీపీ పెద్దలపై విరుచుకుపడ్డారు. దాదాపు టికెట్ ఖాయమైందని భావించిన బీజేపీ సారథి బొక్క నర్సింహారెడ్డికి చివరి నిమిషంలో టీఆర్ఎస్ జైత్రయాత్రకు జిల్లాలోనే అంకురార్పణనిరాశే మిగలడం ఈ ఏడాది పొలిటికల్ రౌండప్‌లో కొసమెరుపు. ‘ముందస్తు’ కుదుపు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో గులాబీ దళపతి మాత్రం ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆగస్టులో మొదలైన ఈ ప్రచారంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో ‘ప్రగతి నివేదన సభ’ దేశ రాజకీయాల్లో కీలక మార్పునకు నాంది పలికింది. లక్షలాది మంది తరలివచ్చిన ఈ బహిరంగసభలోనే ముందస్తుకు శంఖారావం పూరించిన గులాబీ బాస్ కేసీఆర్.. సెప్టెంబర్ ఆరో తేదీన శాసనసభను ఆర్థాంతరంగా రద్దు చేసి సమరానికి సై అన్నారు. అదే రోజు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారు. శాసనసభ రద్దుతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్, టీడీపీలు అప్రమత్తమైనా అభ్యర్థుల ఖరారులో ఎడతెగని జాప్యం పాటించాయి. ప్రజాకూటమిగా జతకట్టి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నాయి. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం స్థానాలను టీడీపీకి సర్దుబాటు చేసిన ఒక్కచోట కూడా బోణీ కొట్టకుండానే బొక్కబోర్లా పడింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఎల్బీనగర్, మహేశ్వరం సీట్లను గెలుచుకొని బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకుంది. ఇక బీజేపీ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. తొలిసారి బలమైన అభ్యర్థులో బరిలో దిగిన బీఎస్పీ మాత్రం షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో గణనీయ ఓటు బ్యాంకు సాధించి ఔరా! అనిపించింది. కొండా తిరుగుబాటు ఈసారి జిల్లా రాజకీయాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా హాట్ టాపిక్‌గా మారింది. అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపించిన కొండా.. టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన ఎన్నికల వేళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ను ఓడించాలని కసితో పనిచేసిన ఆయనకు అది సాధ్యపడలేదు కానీ, తాను విభేదించే మహేందర్‌రెడ్డి ఓడిపోవడం.. అదీ తన సన్నిహితుడు రోహిత్‌రెడ్డి చేతిలో మంత్రి చావుదెబ్బ తినడం సంతోష పరిచింది. అదే సమయంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చేదు గుళికగా మారింది. ఇక కొండాను అనుసరించిన యాదవరెడ్డికి ఈ ఏడాదే ఖేదాన్నే మిగిల్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే గంపెడాశతో సొంతగూటికి చేరిన ఆయనకు నిరాశే మిగిలింది. దీనికితోడు ఫిరాయింపు చట్టం కింద ఆయనపై వేటు కత్తి వేలాడుతుండడం యాదవరెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిని అనుసరించిన జెడ్పీటీసీ సభ్యులకు కూడా ఈ సారి అంతగా కలిసిరాలేదు. కాంగ్రెస్‌లో ముడుపుల కల్లోలం అంతర్గత కలహాలు కాంగ్రెస్‌ను నట్టేట ముంచాయి. టికెట్లను అమ్ముకున్నారంటూ ఏకంగా డీసీసీ సారథి క్యామ మల్లేశ్ ఆడియో టేపులను విడుదల చేయడం కలకలం రేపింది. అంతేగాకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని బహిరంగ విమర్శలకు దిగడంతో ఆయనపై వేటు పడింది. ఈ పరిణామంతో మల్లేశ్ కాస్తా కారెక్కగా.. ఇబ్రహీంపట్నం రాజకీయం మాత్రం ఆధ్యంతం రక్తి కట్టించింది. పొత్తులో ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ల రోజున కాంగ్రెస్ బీ–ఫారం ఇచ్చిందని ఆర్భాటం ప్రదర్శించి.. చివరకు బీఎస్పీ తరఫున నామినేషన్ వేయడం చర్చకు దారితీసింది. ప్రచారం చివరి రోజున మెట్టుదిగిన కాంగ్రెస్ అధిష్టానం మల్‌రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించినా ఆయన మాత్రం గెలుపు వాకిట బొల్తా పడ్డారు. అగ్రనేతల రాకపోకలతో జిల్లాలో ప్రచారపర్వం తారాస్థాయికి చేరినా టీఆర్ఎస్ గెలుపును మాత్రం ఆపలేకపోయారు. ఆరంభం నుంచే హడావుడి ఈ ఏడాదంతా ఎన్నికల హడావుడే కొనసాగింది. తొలి త్రైమాసికంలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ఏర్పాట్లను కూడా చేసింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆక్షింతలు వేయడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొలువుదీరింది. ఇక ఫిబ్రవరితో కాలపరిమితి ముగిసిన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం.. పాత కమిటీలను కొనసాగిస్తూ వస్తోంది. వివిధ కారణాలతో పంచాయతీ, సొసైటీ ఎన్నికలపై కేసీఆర్ సర్కారు వెనుకడుగు వేసింది. -
కాంగ్రెస్‌కు దాసోహమంటారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్‌లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి. స్థానిక ఎన్నికలతోసహా లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీర్మానాలు... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు. -
నిజమైన పని ఇప్పుడే మొదలైంది : హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘ఎన్నికలు వచ్చాయంటే డబ్బు, మద్యంతో ప్రలోభాలు ఉంటాయి.. అయితే ఇవేమీ సిద్దిపేట నియోజకవర్గంలో పనిచేయలేదు. మీ వద్దకు నేను ఓట్లు అడగడం కోసం కూడా రాలేదు. అయినా నాకు ఘనవిజయం తెచ్చిపెట్టారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. పార్టీ అప్పగిం చిన పనిని విజయవంతంగా నిర్వర్తించాను’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పత్తిమార్కెట్ యార్డులో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేం దుకు ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడా రు. కొడంగల్, కొల్లాపూర్, అలంపూర్ తదితర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిం చేందుకు ప్రచారం చేశానని చెప్పారు. తనతోపాటు సిద్దిపేట నియోజకవర్గంలోని పలువురు ముఖ్య కార్యకర్తలు కూడా వివిధ నియోజకవర్గాల్లో పనిచేశారని, అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలో పాలుపంచుకున్నారని తెలిపారు. తాను ఇతర నియోజకవర్గాల పర్యటనలో ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గం కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని.. చరి త్రను తిరగరాసేలా గెలుపు సాధించి పెట్టారన్నారు. ఈ విజయం తన ఒక్కడిది కాదని, ఇది ప్రజల విజయమన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారని, అందుకోసమే దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ప్రజల కోసం వినియోగిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవచేస్తానని చెప్పారు. ఎవరికి కష్టం వచ్చినా అది తన కుటుంబ సభ్యులకు వచ్చినట్లే అనుకుంటానని అన్నారు. నాయకులంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారని, కానీ తాను ఎప్పుడూ మీ వెంటే ఉన్నానని, మీకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరెక్కడా లేదని పేర్కొన్నారు. ఇంత మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. నిజమైన పని ఇప్పుడే మొదలైంది.. నిజమైన పని ఇప్పుడే మొదలైందని, తన బాధ్యత మరింత పెరిగిందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచామని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దేందుకు ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వెలుస్తాయని అన్నారు. దీంతో యువతకు ఉపాధి మార్గాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దేశ, విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించడం, ఇక్కడి పనులను వారి ప్రాంతాల్లో అమలు చేసేందుకు వివరాలు తీసుకువెళ్లడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. ఈ ప్రాంతం ప్రజాప్రతినిధిగా ఇంతకన్నా గౌరవం ఏముంటుందన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, దీంతో ప్రతీ గ్రామానికి రూ.10 లక్షల పురస్కారంతోపాటు, గౌరవం కూడా పెరుగుతుందని అన్నారు. భేషజాలకు పోయి డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ శర్మ, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ సంపత్, ఎంపీపీ మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సిల్ గులాబీమయం.. కాంగ్రెస్ ఖాళీ!
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్... శాసనమండలిలో పూర్తిస్థాయి ఆధిక్యం దిశగా వేసిన రాజకీయ వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్‌కు చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయించుకోవడంతో ఒక్క రోజులోనే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. కాంగ్రెస్‌కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్ వైపు రావడంతో అధికార పార్టీ వెంటనే వ్యూహం సిద్ధం చేసింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ కార్యాలయానికి రాగానే ఆయ నను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. ‘శాసనమండలి ఆవరణలో మేము నలుగురం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని నాలుగో పేరా ప్రకారం మా వినతిని పరిశీలించగలరు’అని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఒక పార్టీ తరఫునన గెలిచిన చట్టసభ్యులలో మెజారిటీ సంఖ్యలో ఉన్న వారు వేరే పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడదనే నిబంధన ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నాలుగో పేరా పేర్కొంటోందని వివరించారు. అనంతరం నలుగురు ఎమ్మెల్సీల లేఖను శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ పరిశీలించారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలిపక్షంలో విలీనం చేస్తూ సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్, కె. దామోదర్‌రెడ్డిలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున మహమ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మిలిగారు. ఇద్దరు సభ్యులే ఉండటంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఎమ్మెల్యేలూ జంప్ చేస్తే మండలిలో కాంగ్రెస్ సున్నాయే... శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. తాజా పరిణామాల అనంతరం టీఆర్ఎస్కు 31 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు... మజ్లిస్, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. దైవార్షిక ఎన్నికల్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి, మార్చిలో శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలో దాదాపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కె. యాదవరెడ్డిపై వేటు వేస్తే ఈ సంఖ్య ఏడుకు చేరుతుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఒక స్థానం వస్తుంది. అయితే ఎన్నికల నాటికి సమీకరణలు మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పులు జరిగితే ఆ ఒక్క సీటూ హస్తం పార్టీకి దక్కే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే శాసనమండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం సైతం లేకుండా పోయే పరిస్థితి ఉండనుంది. రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం: ఎం.ఎస్.ప్రభాకర్ కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. నలుగురం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావాలని ముందుకొచ్చాం. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండోవంతు మంది సభ్యులు ఇలా నిర్ణయం తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. కాంగ్రెస్‌లో మాకు ఎన్నో అవమానాలు జరిగాయి. టీడీపీతో పొత్తు ముంచింది: టి. సంతోష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కొంపముంచింది. మా ఎవరితో చెప్పకుండా పొత్తు ఎలా పెట్టుకున్నారు? కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఉంది. అందుకే టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రజల వైపు: ఆకుల లలిత మేము ప్రజలవైపు ఉండాలనుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం. నేడు కొండా మురళీ రాజీనామా... ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు శనివారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. శుక్రవారమే మురళీ రాజీనామా చేయాల్సి ఉంది. అయితే శానసమండలి చైర్మన్ కార్యాలయం శనివారం సమయం ఇచ్చినందున మురళీ రాజీనామా నిర్ణయం వాయిదా పడినట్లు తెలిసింది. కొండా మురళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. -
మంత్రివర్గ విస్తరణ: ముహూర్తం కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటుతున్నా ఈ వ్యవహారంపై ఇంకా సందిగ్ధత నెలకొనడంతో ఆశావహుల్లో టెన్షన్ అధికమవుతోంది. మంత్రిపదవులు ఆశిస్తున్నవారంతా ముహూర్తపు లెక్కలు చూసుకుంటున్నారు. సంక్రాంతిలోపు మంచి రోజులున్నాయా? ఉంటే ఎప్పుడు? ఒకవేళ సంక్రాంతిలోపు ముహూర్తాలు లేకుంటే తర్వాత ఎప్పుడున్నాయి వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు అధికార వర్గాల్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. సాధారణంగా సంక్రాంతికి ముందు నెల రోజులు మంచి రోజులు ఉండవనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి సంక్రాంతికి పది రోజుల ముందు వరకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్గశిర అధిక మాసం వచ్చిందని, అందువల్ల జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ తర్వాత పుష్యమాసం మొదలై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఆ రోజులలో ముహూర్తాలు ఉండవు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీలోపే మంత్రివర్గ విస్తరణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు జరగకపోతే ఫిబ్రవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీలుపడదు. కాంగ్రెస్ నుంచి చేరికలున్నాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకుని భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్ టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 90కి చేరింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికల తర్వాత ఉండే జిల్లాల సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్‌కు రానున్నారు. మూడు రోజుల బస అనంతరం 24న తిరిగి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పాల్గొనే కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా పలు కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో నాలుగు రోజులు, జనవరి మొదటి వారంలో నాలుగు రోజులు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేయడానికి అనువుగా కనిపిస్తున్నాయి. 4న పంచాయతీ నోటిఫికేషన్? హైకోర్టు తీర్పు నేపథ్యంలో జనవరి 10వ తేదీలోపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం జనవరి 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే అప్పటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఇక అది ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి వీలుండదు. అంటే ఎలా చూసినా, జనవరి 4లోపు మాత్రమే కేబినెట్ విస్తరణకు అవకాశం కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరిలో ఎలాగూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, వాటి కోసం అనివార్యంగా కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద మరో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
వేగంగా హామీల అమలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ప్రకటించిన హామీలను వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో ఇచ్చిన హామీ ల వివరాలను అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పొందుపరచాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను కేటీఆర్ ఆదేశించారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జనవరి మొదటి వారంలో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలు మొదలుపెట్టాలన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చోట్ల ఓట్లు గల్లంతుపై అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. ఓట్ల గల్లంతుతో టీఆర్ఎస్ అభ్యర్థులకు రావాల్సిన మెజారిటీ కొంత మేరకు తగ్గింది. కొన్ని చోట్ల ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా ఓట్లు వేయలేక బాధపడిన వారు ఉన్నారు. ఇలాంటి సమస్యలను టీఆర్ఎస్ తరఫున పరిష్కరించేందుకు ప్రయత్నిం చాలి. ఎన్నికల ప్రధానాధికారిని కలసి ఈ అంశాలపై విజ్ఞప్తి చేయాలి. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిం చాలి. ఒక్క ఓటరు పేరు కూడా గల్లంతు కాకుండా చర్యలు తీసుకోవాలి. అర్హతగల ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్‌లతో కూడిన కమి టీ ఓటరు నమోదు అంశాలను సమన్వయం చేస్తుం ది. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కారణా లను తెలుసుకుని అవసరమైన చర్యలు ఏమిటనేది కమిటీ ద్వారా పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు జారీ ఇస్తాం. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పుచేర్పుల కార్యక్రమం ఉంది. ప్రతి ఓటరు పేరు నమోదు లక్ష్యంగా పని చేయాలి. ఓటరు నమోదు కార్యక్రమం కోసం ఈ నెల 22 నుం చి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిం చాలి. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి. ఎకరానికి తక్కువ విస్తీర్ణం కాకుండా స్థలాలను ఎం పిక చేయాలి. సమావేశాలు నిర్వహించుకునేలా ఈ స్థలాలు ఉండాలి. ఇప్పటికే ఎంపిక చేసిన స్థలం ఎకరం విస్తీర్ణంకంటే తక్కువగా ఉంటే వేరే వాటిని పరి శీలించాలి. పార్టీ జిల్లా కార్యాలయాల స్థలాలు అనువుగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని వెంటనే కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. కార్యాలయ భవనాల నమూనాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమోదిస్తారు. వెంటనే నిర్మాణాలను ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలి. జనవరి మొదటి వారం నుంచి అన్ని జిల్లాల్లో కార్యాలయ నిర్మాణాలు మొదలుకావాలి. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లాలకు ఇన్‌చార్జీలుగా గతంలో నియమించిన వారే కొనసాగుతారు. రాష్ట్ర కమిటీ నుంచి వైదొలగిన వారి స్థానాల్లో కొత్త వారిని త్వరలో నియమిస్తాం. కేసీఆర్ అనుమతితో దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు ఎప్పటికప్పుడు సమావేశమవుదాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు సిరిసిల్లకు... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మొదటిసారి బుధవారం సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీతో ఈ కార్యక్రమం ఉండనుంది. అనంతరం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటన మంగళవారమే జరగాల్సి ఉన్నప్పటికీ బుధవారానికి వాయిదా పడింది. -
గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేష్
సాక్షి, తిరుపతి : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడి చేసిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ హల్చల్ చేశారు. పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ కూడా విసిరారు. అయితే ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో సదరు టీవీచానెళ్లు బండ్ల గణేశ్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాయి. కానీ అతను మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్ఎస్కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. అరే కోపంలో వంద అంటాం సార్.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని గొంతు కోసుకోవడంపై తనదైన శైలిలో స్పందించారు. అంతేకాకుండా ఓటమి రేపు విజయానికి పునాదని చెప్పుకొచ్చారు. -
అరే కోపంలో వంద అంటాం సార్.!
-
లెక్క తేలుతోంది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. మరి జిల్లావ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది? ఎవరి అధీనంలో ఉంటుంది? తిరిగి బాధితులకు అందజేస్తారా? లేక ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారా? సామాన్యుల్లో ఈ తరహా ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ లెక్కలు తేలుతున్నాయి. తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లో నోట్ల కట్టలు స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. ఓట్లు దండుకోవడానికి ఆయా పార్టీల నేతలు పోటీపడి మరీ కోట్ల రూపాయలు గుమ్మరించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన నిర్దేశిత మొత్తానికి మించి ఎటువంటి ఆధారాలు లేకుండా వివిధ మార్గాల్లో.. పలు రూపాల్లో డబ్బును రాజకీయ నాయకులు తరలించారు. విస్తృతంగా తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు, స్టాటిక్ సర్వీలేన్స్ బృందాలు (ఎస్ఎస్టీ) పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కేసులు వీగిపోగా.. మరికొన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఇంకొన్ని కేసులు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్లాయి. వీగిన కేసులు 13 రూ.10 లక్షలు లోబడి స్వాధీనం చేసుకున్న సొమ్మును జిల్లా ట్రెజరీ అధికారి (డీటీఓ) వద్ద భద్రపరిచారు. ఇటువంటి కేసులు జిల్లావ్యాప్తంగా 26 నమోదయ్యాయి. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఎండార్స్ చేసిన పత్రం, పంచనామా, ఎన్నికల సంఘానికి వివరాలు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాన్ని కూడా డీటీఓకు అందజేశారు. డబ్బు వ్యవహారంపై డీఆర్ఓ అధ్యక్షతన ఏర్పడిన ప్రత్యేక కమిటీ చర్చించనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికే తరలిస్తున్నారా? ఇతర అవసరాలకు తీసుకెళ్తున్నారా? అని ఆరా తీస్తుంది. వ్యక్తిగత సొమ్మే అని తేలితే.. సదరు కేసులను అక్కడితో మూసేస్తారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 13 కేసులు వీగిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ వ్యక్తగత, వ్యాపార లావాదేవీల నిమిత్తం నగదు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో స్పష్టమైంది. మిగిలిన కేసులపై త్వరలో విచారణ జరగనుంది. రూ.పది లక్షలకు పైబడి పట్టుబడిన కేసులన్నీ ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్తాయి. పదుల సంఖ్యలో నమోదైన ఈ తరహా కేసులను ఆ శాఖ అధికారులకు అప్పగించడంతో విచారణ చేపడుతున్నారు. ఆ నగదుకు సంబంధించి గతంలో పన్ను చెల్లించారా? లేదా హవాలా మార్గంలో వచ్చిందా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఉంటే డబ్బును యజమాని తీసుకోవచ్చు. లేకపోతే సర్కారు ఖజానాలో జమచేస్తారు. భారీగా నగదు స్వాధీనం.. ఎన్నికలు పూర్తయ్యే నాటికి జిల్లావ్యాప్తంగా రూ.3.84 కోట్లను సీజ్ చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు చేయడంతోపాటు ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సివిల్ పోలీసులూ ఎక్కడికక్కడ సోదాలు చేసి పెద్దమొత్తంలో డబ్బులను సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో రూ. 40 వేలు, ఆపైబడి మొత్తం ఎవరి వద్దనైనా లభ్యమైతే అందుకు సంబంధించిన లెక్కలు చూపడంతోపాటు తగిన ఆధారాలను సైతం అందజేయాలి. ఈ ఉల్లంఘనను అతిక్రమించి నగదు తరలిస్తున్న వారిని అదుపులోకి డబ్బును సీజ్ చేశారు. -
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చీఫ్ విప్, మిగతా విప్‌లు సోమవారం మండలి చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, రాములు నాయక్, కొండా మురళి, భూపతిరెడ్డిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయనుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నాగర్‌కర్నూల్‌కు చెందిన దామోదర్‌రెడ్డి ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. అయితే చర్యలు తీసుకోవాల్సి వస్తే దామోదర్‌రెడ్డిపై ముందు తీసుకుంటారా? లేకా ఈ నలుగురిపై తీసుకుంటారా అన్న దానిపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. -
బ్యాలెట్ ద్వారానే ఎంపీ ఎన్నికలు జరపాలి
నల్లగొండ: వచ్చే పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొం డలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో పెద్దఎత్తున ట్యాంపరింగ్ జరిగిందని సోషల్ మీడియాతో పాటు బహిరంగం గా చర్చించుకుంటున్న విషయం తెలిసిందేనని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో 84 శాతం పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. నల్లగొండ, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వేలల్లో తేడా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సర్వేలు నిర్వహించినా గట్టి పోటీ ఉంటుందని తేలిందని, కానీ టీఆర్ఎస్ వాళ్లంతా 50 నుంచి 70 వేల మెజార్టీతో గెలిచారంటే.. ట్యాంపరింగ్ జరి గినట్లు అనుమానం కలుగుతోందన్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డికి ప్రజలతో సంబంధాలు లేవని, అలాంటిది ఆయన 50 వేల మెజార్టీతో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రజ ల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిందని, ఆయన కూడా 50 వేల మెజార్టీతో గెలిచారంటే అనుమానం మరింత పెరుగుతోందన్నారు. కొండా సురేఖ, డీకే అరుణ తప్పక గెలుస్తారని సర్వేల్లో తేలితే ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు పెట్టకపోవడానికి కారణమేంటని నిలదీశారు. వీటిపై ఇప్పటికే పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో గోల్మాల్ చేసి గెలిచారనే అనుమానం తమకు కలుగుతోందని, అందుకే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి సహకారంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, బండమీది అంజయ్య, భిక్షంయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పథకాలు కాంగ్రెస్‌వే: జానారెడ్డి
గుర్రంపోడు: టీఆర్ఎస్ అమలు చేస్తున్నవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ లాంటి పథకాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినవేనని, ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చేసిందేమి లేదన్నారు. ఈ పథకాలు తీసేసే ధైర్యం ఎవరకీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని ఎవరూ అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తమ ఎన్నికల హామీలను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. -
ఆద్యంతం ధన ప్రవాహమే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగిందని తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక పేర్కొంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని తెలిపింది. అధికారుల తనిఖీల్లోనూ రికార్డు స్థాయిలో నగదు దొరికిందని, ఇంత పెద్దమొత్తంలో ధన ప్రవాహం ఇప్పటివరకూ జరగలేదని వ్యాఖ్యానించింది. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం సైతం పూర్తిగా విఫలమైందని నిఘా వేదిక అభిప్రాయపడింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు ఎం.పద్మనాభ రెడ్డి, డాక్టర్ రావు చెలికాని, బండారు రామ్మోహన్రావు, బి.శ్రీనివాస్‌రెడ్డి, వై.రాజేంద్రప్రసాద్ పాల్గొని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన అంశాలను జిల్లాల వారీగా నివేదించారు. ఓటరు జాబితాలో భారీగా అక్రమాలు ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని, కొత్తగా ఓటర్లు నమోదై స్లిప్పులు పొందినప్పటికీ చివరి నిమిషంలో వారి ఓట్లు గల్లంతయ్యాయని నిఘా వేదిక సభ్యులు తెలిపారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే సీఈఓ రజత్‌కుమార్ క్షమాపణ చెప్పి చేతులెత్తేశారన్నారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు నమోదు కాగా...పాత ఓటర్లు భారీగా తొలగించబడ్డారని, కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు కనిపించిందన్నారు. నగదు, మద్యం పంపిణీ, ఓటరు జాబితాలో అవకతవకలపై కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాను ఆన్లైన్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెడితే డ్యూయల్ ఓట్లు తగ్గిపోతాయని, ఓటరు కార్డును ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ఖర్చుపై సీలింగ్ విధించాలని, నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ, పార్లమెంటు, సహకార, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్కాగా పనిచేయాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, ఓటర్లలో అవగాహన పెంచడంతో పాటు ఓటు వేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నివేదిక ప్రతులను త్వరలో జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. -
అన్ని ‘పంచాయతీ’లను గెలవాలి
ప్రత్యేక చాంబర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.తారక రామారావు సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేటీఆర్ కోసం తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే ఆరేడు నెలల్లో గ్రామపంచాయతీ, సహకార, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా ఉన్న నేపథ్యంలో తెలంగాణభవన్ కేంద్రంగా కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండువారాల్లో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీలను గెలిచేలా వ్యూహం రచిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, బాధ్యులకు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షల గ్రాంట్ వస్తుందని, వీలైనన్ని పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలని సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియపై కేటీఆర్ ఈ సమావేశంలో ప్రసంగిం చారు. 2006 నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్లో తన రాజకీయ అనుభవాలను వివరించారు. డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు పదిరోజుల గడువున్న నేపథ్యంలో అందరూ గట్టిగా పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మార్చి నుంచి లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లోక్సభస్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు గా ఉంటారని తెలిపారు. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణభవన్‌లో ప్రజల ఫిర్యాదు విభాగం(పబ్లిక్ గ్రీవెన్స్ సెల్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవిశంకర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలను టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పదవుల నుంచి ఉపసం హరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్లో వైరా ఎమ్మెల్యే చేరిక వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్య రాములునాయక్ శనివారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అనంతరం రాములునాయక్ తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి రాములునాయక్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో మొదటి చేరిక వైరా నుంచి కావడం ఆనందంగా ఉంది. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ అంతటా అనుకూల పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తయితే టీఆర్ఎస్ అజేయశక్తిగా మారుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటుదాం. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు శ్రమించాలి. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది టీఆర్ఎస్ శాసించాలి. మనం చెబితే ఏర్పడే ప్రభుత్వం ఢిల్లీలో కావాలంటే టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలి. యాచించే స్థితి నుంచి ఢిల్లీలో శాసించే స్థితికి తెలంగాణ ఎదగాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉండబట్టే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన బెట్టింది. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే బయ్యారం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఖమ్మంలో అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తాం. బంగారు తెలంగాణ దిశగా చిత్తశుద్ధితో పని చేస్తాం’అన్నారు. రాములు నాయక్‌ను కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో పొంగులేటి