ఓట్ల పంట | Rythu Bandhu Given the power to KCR | Sakshi
Sakshi News home page

ఓట్ల పంట

Published Wed, Dec 12 2018 6:57 AM | Last Updated on Wed, Dec 12 2018 6:57 AM

Rythu Bandhu Given the power to KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు తెలంగాణ రైతాంగం పూర్తి అండగా నిలిచింది. రైతుబంధు పథకం లబ్దిదారులు ఆ గులాబీ పార్టీకే మళ్లీ పట్టం గట్టారు. ఖరీఫ్, రబీలలో ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇవ్వడంతో తమకు అన్నదాతల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఆశించిన టీఆర్‌ఎస్‌ వర్గాలకు ఓటు రూపంలో ఆశీర్వాదం లభించింది. సీజన్‌ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఎంతో అక్కరకు వచ్చిందన్న భావన రైతు వర్గాల్లో నెలకొంది. పైగా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ రైతుకు వారికున్న భూమిని బట్టి ఎకరాకు రూ. 4వేల చొప్పున ఇవ్వడంతో అది ఓటు రూపంలోకి మారింది. రైతు బీమాతోనూ  లబ్ది పొందుతున్నారు. రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తున్న తీరు కూడా ఓటుగా మారిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

రూ.10 వేల కోట్లు.. కోటి ఓట్లు 
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్లు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఏకంగా 58.98 లక్షల చెక్కులను ముద్రించింది. చివరకు ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. వారికి రూ. 5,256 కోట్లు అందజేశారు. అంటే ఒక్కో రైతుకు సరాసరి రూ.10,322 అందాయి. 50.91 లక్షల మంది రైతులకు ఇచ్చారంటే, ఆ కుటుంబంలో భార్య, 18 ఏళ్లకు పైబడిన వయసున్న కొడుకును కలిపినా దాదాపు 1.25 కోట్ల మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు రైతుబంధుతో ప్రయోజనం పొందారు. ఒకవేళ కుమారులు విడిగా రైతుబంధు పథకం కింద లబ్ధిపొందారని అనుకున్నా రైతు, ఆయన భార్యతో కలిపినా కోటి మందికిపైగా నేరుగా లబ్దిపొందినట్లే. అంటే రాష్ట్రంలో 2.70 కోట్లకు పైగా ఓటర్లుంటే, అందులో హైదరాబాద్‌ ఓటర్లను మినహాయిస్తే 30 జిల్లాల ఓటర్ల సంఖ్య 2.33 కోట్ల మంది. అందులో రైతుబంధు ద్వారా లబ్దిపొందిన వారు కోటి మంది. అంటే ఏకంగా 42% మంది గ్రామీణ ఓటర్లు రైతుబంధు లబ్ధిదారులని తేలింది.

ఇక ప్రస్తుత రబీ సీజన్‌లో ఇప్పటివరకు 44 లక్షల మంది రైతులకు రూ.4,725 కోట్లు రైతుబంధు సొమ్మును సర్కారు పంపిణీ చేసింది. అంటే సరాసరి ప్రతీ రైతుకు రూ.10,738 ఇచ్చారు. ఇలా రెండు సీజన్లకు కలిపి ఒక్కో రైతుకు దాదాపు రూ.21 వేలు ఇచ్చినట్లయింది. మొత్తంగా రెండు సీజన్ల కు కలిపి ఇప్పటివరకు దాదాపు రూ.10 వేల కోట్ల రైతు జేబుల్లోకి వెళ్లాయి. పైగా వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10 వేలు ఇస్తా మని టీఆర్‌ఎస్‌ హామీ ఇవ్వడంతో రైతులు వారి వైపు మొగ్గుచూపారు. ఇటు రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదెకరాల్లోపు రైతులే 68% మంది ఉన్నారు. అంటే వారంతా కూడా సన్న, చిన్నకారు రైతులేనని స్పష్టమవుతోంది. అందులో ఎకరాలోపున్న రైతులు 7.39%, 1–2 ఎకరాల మధ్య రైతులు 15.62%, 2–3 ఎకరాల మధ్య ఉన్న రైతులు 16.67%, 3–4 ఎకరాల మధ్య ఉన్న రైతులు 14.78%, 4–5 ఎకరాల మధ్య ఉన్నవారు 13.59% మంది ఉ న్నారు. ఐదెకరాల్లోపున్న రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే కావడంతో వారంతా టీఆర్‌ఎస్‌కే గంపగుత్తగా ఓట్లేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement