Rythu Bandhu Scheme
-
పెట్టుబడి.. మొక్కుబడి..!
సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్‌కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్‌కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది. నెలాఖరుకు ఖాతాల్లో జమ రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం. –నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి -
రైతులకు గుడ్ న్యూస్: నేటి నుంచి రైతుబంధు జమ
నల్లగొండ టౌన్ : యాసంగి సీజన్ రైతుబంధు డబ్బుల జమ నేటి నుంచి వేగవంతం కానుంది. గత డిసెంబర్ 12న రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనా నిధుల లేమితో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ప్రక్రియ ప్రారంభమై 26 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న మీమాంసలో ఉన్నారు. ప్రతి రోజు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడుతాయన్న రైతుబంధు డబ్బులు జమకాకపోవడంతో పెట్టబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు.. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా ప్రతి సీజన్లో ప్రభుత్వం రూ.624,14,84,629 వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 1,14,542 మంది ఖాతాల్లో మాత్రమే రూ.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో రైతుబంధు పథకం డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెపుతున్నాయి. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మిగిలిన నాలుగు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్నాం యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నందున రైతుబంధు పథకం డబ్బులను జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలి. రైతుబంధు జమకాకపోవడం వల్ల పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నాం. – సోమగోని అంజయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
రబీ రంది తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ అయ్యింది. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు సాగు చేశారు. అందులో 1.47 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అప్పులే శరణ్యమని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈనెల 12 నుంచి రైతుబంధు ప్రక్రియ ప్రారంభం కాగా, ఎకరాలోపు భూమి ఉన్న రైతుల్లో.. అది కూడా కొందరికే సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకో ఎకరా చొప్పున మొదటి రోజు ఎకరా వరకు, రెండో రోజు రెండెకరాలు... ఇలా రోజుకు ఎకరం చొప్పున గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తామని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులు అంటున్నారు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలు: అధికారంలోకి రాగానే రైతుబంధు సొమ్ము అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ ప్రకారం రైతుబంధు సొమ్ము జమ ప్రక్రియ ప్రారంభమైంది. అది ఎకరాలోపు కొందరికి మాత్రమే ఇచ్చి నిలిచిపోయింది. మిగిలిన వారికి సొమ్ము పడలేదు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలున్నారు. వారందరికీ కలిపి రూ.7,625 కోట్లు చెల్లించాలి. ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. వారికి రూ. 642.57 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు ఎకరాలోపున్న వారి లో సగం మందికే రైతుబంధు వచ్చింది. మొత్తంగా చూస్తే రైతుబంధు కోసం ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధులు లేకపోవడం వల్లే రైతుబంధు ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకైనా ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తికాకపోవడం, ఇంకా పెండింగ్‌లో ఉండటంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొత్త రుణమాఫీపై కసరత్తు... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు విన్నవించినట్టు తెలిసింది. గత రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటారా? లేక కొత్తగా అదనపు నిబంధనలతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. -
రైతు బంధుపై పరిమితి పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్
-
తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద.. భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నా యి. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. పరిమితి ఐదెకరాలా.. పదెకరాలా? కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని.. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మొత్తంగా 68.99 లక్షల మందికి.. రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25లక్షల మంది రైతులకు రూ.5,236 కోట్లు జమచేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ.72,815 కోట్లు జమ చేశారు. 90శాతంపైగా రైతులు ఐదెకరాల్లోపు వారే.. ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. ♦ రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు అయితే ఉండగా.. వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. ♦ ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. ♦ ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. -
మూడింటిపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తేగా.. ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. రైతు బంధు, రుణమాఫీలను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే యోచనలో రేవంత్ ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఆయన దృష్టి సారించారని అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నుంచి ముఖ్య నేతల పేర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను తెప్పించుకుని.. పదవుల పంపిణీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ హోదాపై స్పష్టత వచ్చిందని, తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. బ్యాంకులకు వాయిదాలు..రైతులకు ఒకేసారి రైతుల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై రేవంత్ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమొత్తాన్ని బట్టి నిధులు విడుదల చేస్తూ దశల వారీగా మాఫీ చేయాలా? లేక ఒకేసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించాలా అన్న దానిపై ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం మొత్తంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై సీఎం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంత మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితుల్లో.. బ్యాంకులతో చర్చించడం ద్వారా రుణమాఫీ అంశాన్ని పరిష్కరించాలనే యోచనలో ఉన్నారని వివరిస్తున్నాయి. మాఫీ కోసం రూ.36 వేల కోట్లు! రూ.లక్ష వరకు రుణమాఫీకి రూ.18–19 వేల కోట్ల వరకు అవసరమని.. రూ.2లక్షల వరకు అయితే రూ.30 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనపై ముందుకెళ్లాలని ఆయన ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లను ఐదేళ్లపాటు వడ్డీతో కలిపి చెల్లించాలంటే.. మొత్తంగా రూ.36 వేల కోట్లు అవుతాయన్న అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు రుణమాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాల్లో చెల్లించినా.. రైతులకు మాత్రం ఒకేసారి మొత్తం రుణమాఫీ చేసేలా బ్యాంకులను ఒప్పించాలన్నది సీఎం ఆలోచన అని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తే.. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 15వ తేదీకల్లా రైతు బంధు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులతో చర్చించిన సీఎం రేవంత్.. వీలైనంత త్వరగా రైతుబంధు సొమ్ము విడుదల చేసేలా నిధులు సమీకరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతించి, తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో తాము డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామని, తర్వాత 10 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమ చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ తేదీనాటికి రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అంతకు నాలుగు రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీకల్లా సుమారు 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లను జమ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పదవులపై కసరత్తు ఓ వైపు పాలన, మరోవైపు పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. వాటికి సమాంతరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమై ప్రభుత్వ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారు, గత ఎన్నికల్లో పోటీ అవకాశం రాని నేతలను నామినేటెడ్ పదవుల్లో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గాందీభవన్ నుంచి ముఖ్య నేతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతల పేర్లను తెప్పించుకున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని నేతలతోపాటు పార్టీకి అండగా నిలిచిన బయటి ముఖ్యుల సేవలనూ వినియోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని వెల్లడించాయి. ఇందులో భాగంగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని వివరించాయి. ఆప్తుడికి తొలి నామినేటెడ్ పదవి? సీఎం రేవంత్‌రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా తొలి పదవిని తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్ హోదా ఉండే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్‌రెడ్డి చాలా కాలం నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు. తెర వెనుక ఉండి ప్రచారం, అభ్యర్థులతో సమన్వయం, కేడర్‌ను కదిలించడం, సభల ఏర్పాటు, నిర్వహణ వంటివి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పట్టుబట్టలేదు. ఈ నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డికి తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారని, త్వరలోనే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
‘రైతు బంధు’ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సీఈసీని కోరడం.. ఈ పథకం గురించి ప్రచార సభల్లో ఎలాంటి ప్రస్తావన చేయకూడదన్న అంశంతోపాటు పలు షరతులను విధిస్తూ సీఈసీ ఈ నెల 25న అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే పోలింగ్‌కు ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం జమకానుందని మంత్రి హరీశ్‌రావు ఈ నెల 25న పాలకుర్తిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీనిని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో రైతుబంధుకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల కోడ్‌ను, షరతులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి సంబంధించి ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ సోమవారం ఉదయం లేఖ రాశారు. రబీ పంటల కోసం రైతుబంధు కింద గత ఐదేళ్లుగా అక్టోబర్–జనవరి మధ్యకాలంలో నగదు సాయం అందిస్తున్నారని, ఇందుకు నిర్దిష్టమైన తేదీలేమీ లేవని సీఈసీ అందులో అభిప్రాయపడింది. నవంబర్ నెలలోనే పంపిణీ చేయాలన్న ప్రాముఖ్యత ఏదీ లేదని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈసీ విధించిన షరతులివే.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా రైతుబంధు అమలుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులను విధించింది. పథకంలోకి కొత్త లబ్ధిదారులను చేర్చరాదని, నగదు బదిలీపై ఎలాంటి ప్రచారం చేయవద్దని పంపిణీ ప్రక్రియలో రాజకీయ నేతలెవరూ భాగస్వాములు కావొద్దని స్పష్టం చేసింది. తాజాగా బీఆర్ఎస్ సర్కారు యాసంగికి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 24 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 2018 నాటి షరతులకు లోబడి నగదు జమ చేస్తామని పేర్కొంది. అయితే సీఈసీ పాత షరతులకు తోడుగా మరిన్ని నిబంధనలు విధిస్తూ అనుమతినిచ్చింది. పోలింగ్‌కు 48గంటల ముందే నగదు జమ పూర్తికావాలని.. దీనిపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ప్రస్తావన చేయవద్దని ఆదేశించింది. మీ వల్లే ఆగింది.. కాదు మీరే ఆపారు! ఎన్నికల ప్రచారంలో రైతుబంధు రచ్చరచ్చ జరుగుతోంది. సీఈసీ రైతుబంధును ఆపేయడానికి కారణం మీరంటే.. మీరంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోస్తున్నాయి. సోమవారం సాగిన ఎన్నికల ప్రచారంలో దాదాపు అన్నిచోట్లా ఈ అంశంపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. రైతులకు సాయం అందడం కాంగ్రెస్ పారీ్టకి ఇష్టం లేదని, ఆ పార్టీ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల సంఘం రైతుబంధును ఆపిందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్వన్నీ అబద్ధాలని కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ముందుగానే ఆర్థికసాయం పంపిణీ చేయాలని మేం సూచించామని, కానీ బీఆర్ఎస్ కావాలని జాప్యం చేస్తూ ఎన్నికల స్టంట్ చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పారీ్టలు రెండూ రైతులను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. -
కాంగ్రెస్‌కు సంబంధం లేదు
నర్సాపూర్: రాష్ట్రంలో రైతుబంధు పథకం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నిలిచిపోవడానికి.. తమ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమ వారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కులలో ఏర్పాటు చేసిన ఆత్మియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ యే అడ్డుపడిందంటూ తప్పుడు ఆరోపణలు, నిందలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు మాటల ను నమ్మొద్దని ఆయన రైతులను కోరారు. హామీల అమల్లో విఫలమైన కేసీఆర్... అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబాన్ని కేసీఆర్ దూ షించడం ఎంత వరకు సమంజసమని ఖర్గే ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టారని... సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ లో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించా రు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని సీఎం చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి విస్మ రించిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, పేపర్‌లీక్ తదితర స్కామ్‌ల ద్వారా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. -
రైతుబంధుని ఈసీ నిలిపివేయడంపై కవిత అసంతృప్తి
-
రైతుబంధుకు ఈసీ బ్రేక్.. మంత్రి హరీశ్‌రావు మాటలతోనే?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఈసీ షాకిచ్చింది. రైతుబంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ ఇచ్చింది. అయితే, అందుకు గల కారణాలను ఈసీ వెల్లడించింది. ప్రత్యక్షంగా మంత్రి హరీశ్ రావు వల్లే రైతుబంధుకు బ్రేక్ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయవద్దని ముందే ఈసీ షరతు విధించింది. కాగా, రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఇదిలాఉండగా.. ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది. కాగా ప్రతీ, ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఈ ఆర్థిక సహయాన్ని అందిస్తుంది. -
బీఆర్ఎస్కు ఊహించని షాక్.. రైతుబంధుకు ఈసీ బ్రేక్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధుకు ఈసీ బ్రేక్ ఇచ్చింది. అయితే, గత వారం బీఆర్ఎస్ అభ్యర్థన మేరకు రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, దీనిపై ఫిర్యాదులు రావడంతో రైతుబంధును నిలిపివేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. -
రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్
-
రైతుబంధుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: మంత్రి హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ అంటూ కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేసిందని ఎద్దేవా చేశారు. అన్నదాతలపై కాంగ్రెస్‌కు కనికరం లేదు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఘాటు విమర్శలు చేశారు. కాగా, మంత్రి హరీష్ రావు గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులకు కేవలం ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎన్నికల్లో తెలంగాణలో 61 లక్షల మంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేస్తారు. రైతుబంధు అనేది కొత్త పథకం కాదు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు సార్లు రైతు బంధు అందించాం. 12వ సారి ఇవ్వబోతుంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కరోనా కష్ట కాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం అంటారు. రైతుబంధును నిలిపివేయాలని ఈసీని కాంగ్రెస్ ఎలా కోరుతుంది?. రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. స్వయంగా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మూడు గంటల కరెంట్ ఇస్తామన్నారు. డిసెంబర్ మూడో తేదీ తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోంది. రైతుల జోలికి వస్తే ఖబర్ధార్ అని హెచ్చరిస్తున్నాము. ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాము’అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్.. 18 మందికి సీటు దక్కేనా? -
యాసంగి సాగుకు సిద్ధం.. అందుబాటులో ఎరువులు, విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. గత సీజన్కంటే ఎక్కువగా పంటలు సాగు చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. దాదాపు 80 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో యూరియా 9.2 లక్షల మెట్రిక్ టన్నులు. గత యాసంగి సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33.53 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 56.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. అంటే 168 శాతం విస్తీర్ణంలో వరి సాగైంది. ఈసారి కూడా పెద్దఎత్తున వరి సాగవుతుందని అధికారులు అంటున్నారు. గత యాసంగి సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.63 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 6.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా మొక్కజొన్న సాగు పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.42 లక్షల ఎకరాల్లోనే (80.17%) సాగైంది. ఈసారి వేరుశనగ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని రైతులకు చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనే రైతుబంధు? ఈ నెల ఒకటో తేదీ నుంచి యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పుడిప్పుడే పంటల సాగు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు రైతుబంధు సాయం కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ ప్రకారం వచ్చే నెలలో రైతుబంధు నిధులు పంపిణీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులకు ఉన్నాయి. అయితే ఇది ఎప్పటి నుంచో అమలవుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికలకు, దీనికి సంబంధం ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధులు విడుదలయ్యే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్లు రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు కూడా అంతేమొత్తంలో ఆ సొమ్ము అందుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ. 72,815 కోట్ల నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. -
సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిశోధన రంగంలో అమెరికా సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిరంజన్ రెడ్డి బృందం మూడో రోజు గురువారం వాషింగ్టన్ డీసీలో వ్యవసాయ శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామన్నారు. ఎన్ఐఎఫ్ఏ డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమన్నారు. కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. ఇది కూడా చదవండి: వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్‌ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్‌బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
TS: గుడ్‌న్యూస్.. నేటి నుంచే రైతుబంధు జమ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వానాకాలం(ఖరీఫ్ సీజన్) పంటకుగానూ.. 1.54కోట్ల ఎకరాలకుగానూ సుమారు 70 లక్షల మందికి సాయంగా దాదాపు రూ.7,720 కోట్లకుపైనే కేసీఆర్ సర్కార్ ఈ దఫా ఆదివారమే విడుదల చేసింది. రైతులకు పంట సాయం రూపంలో.. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిందే ఈ రైతుబంధు. రైతన్నకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తుండగా.. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడత కోసం నిన్ననే నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయగా.. భాగంగా నేడు(జూన్ 26, సోమవారం) నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన ఇవాళ.. గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ కానుంది. ఇక.. ఇక ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అలాగే.. 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ నిధుల్ని నేటి నుంచే అకౌంట్లలో వేయనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వేసే నగదుతో.. ఈసారి సర్కార్ ఖజానా నుంచి సుమారు రూ.300 కోట్ల అదనం కానుంది. 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు రైతుబంధు ద్వారా మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించారు. ఇదీ చదవండి: దళిత బంధు.. క్లారిటీ లేని తీరు! -
ఇప్పటి వరకు రైతుబంధు రాలేదా?.. వారిందరికీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన రైతులకు ఈ వానాకాలం సీజన్లో రైతుబంధుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతీ రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టాదారు పాస్‌బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో సీసీఎల్ఏలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 26 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది కూడా చదవండి: 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు.. -
10 రోజుల్లో ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ రైతుబంధు సొమ్మును వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబి్ధదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకుపైగా ఉన్న భూములకు చెందిన రైతులకు రైతుబంధు వర్తింపజేస్తామని తెలిపాయి. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, మొదటిసారి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొనే రైతులు ఏఈవోలను సంప్రదించి ఆయా వివరాలు సమర్పించాలని సూచించాయి. సమీకరించిన నిధుల్లోంచి నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొ న్నాయి. మొదటి రోజున ఎకరాలోపున్న వారికే మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా మర్నాటి నుంచి ఒక్కో ఎకరా పెంచుకుంటూ నెలాఖరు వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. -
పోడు పట్టాల పండగ!
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కేసీఆర్ ఆదేశించారు. అర్హులైన నిరుపేదలకు భూములు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సూచించారు. కలెక్టర్లతో రేపు సదస్సు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు. -
రైతుబంధు చూపి అన్నిటికీ కోత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవన శైలి మారిపోయిందంటూ సీఎం కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఒక్కో రైతుకు రూ.10 వేల సాయం అందిస్తుంటే, కేంద్రం ఒక్కో రైతుకు ఎరువుల రాయితీ రూపంలో ఎకరానికి రూ.18,254 ఇస్తోందని చెప్పారు. రైతుబంధు పథకాన్ని చూపి పంట నష్టానికి పరిహారం, పంటల బీమా తదితరాలన్నిటికీ కోతపెట్టిన ముఖ్యమంత్రి.. రైతులను తీవ్ర నష్టాలపాలు చేశారని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్ష బాధితులకు అందని సాయం అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కానీ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి సాయం చేయలేదని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల బీమా పథకం ద్వారా సాయం అందుతుండగా.. తెలంగాణలో ఈ పథకం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పరిపాలనను సలహాదారులకు అప్పగించిన సీఎం.. తాను మహారాష్ట్రలోని బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్‌లో బిజీగా గడుపుతున్నారన్నారు కేసీఆర్ తనకు తాను దేశ్ కీ నేత అని చెప్పుకుంటున్నారని, ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన దేశ్ కీ నేత కాలేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని విమర్శించారు. అక్కడ ఒక్క వార్డు మెంబర్ గెలిచినందుకే సంబరపడుతున్నారన్నారు. హామీలన్నీ తుంగలో తొక్కారు..: సీఎం అవ్వకముందు కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కేంద్రమంత్రి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మొదట్లోనే వారిని మోసం చేశారన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, వైద్యం, మౌలిక వసతులు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మున్సిపాలిటీల అభివృద్ధి.. ఏ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేదన్నారు. అలాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ డిజిటల్ విప్లవం తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలు వందకు వంద శాతం పేదలకు అందేలా చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద ట్రాక్టర్లు ఇస్తుంటే వాటిని బీఆర్ఎస్ నాయకులు వారి బంధువులకు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీల వల్ల ఉత్పత్తి పెరుగుతోందని, కేంద్రం నిర్మాణాత్మకంగా సబ్సిడీని అందిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎరువుల సబ్సిడీతో కౌలు రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ఒక్క కేంద్ర ప్రభుత్వం బాధ్యతే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కానీ తెలంగాణలో మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను కేవలం అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని, ఈ నోట్ల రద్దులో తమ ప్లాన్ తమకు ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రస్తుతం దీనికి అవకాశం లేదని చెప్పారు. కవిత అరెస్టు మా చేతుల్లో లేదు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశం తమ చేతుల్లో లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఇది ఈ కేసును పరిశోధిస్తున్న సీబీఐ పరిధిలోని అంశమని చెప్పారు. సీబీఐ వద్ద పక్కా ఆధారాలు ఉన్నందునే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేశారన్నారు. అదే విధంగా అవినీతికి పాల్పడిన కర్ణాటకకు చెందిన బీజేపీ శాసన సభ్యుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. 27న పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షమందితో యోగా మహోత్సవం ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే సాధనంగా యోగాను ప్రపంచం గుర్తించిందని, ఐక్యరాజ్యసమితితో పాటు 200కు పైగా దేశాల్లో యోగా ప్రజల జీవితాల్లో భాగమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్‌గా సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఈనెల 27న ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం టూరిజం ప్లాజాలో మీడియాతో ఆయన మాట్లాడారు. కౌంట్‌డౌన్ యోగా కార్యక్రమానికి హైదరాబాద్ జంట నగరాల నుంచి సుమారు లక్ష మంది వరకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులతో పాటు యోగా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. జూన్ 21 కి వంద రోజుల ముందు నుంచే దేశంలోని ప్రజలందరినీ ఇందుకోసం సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాం మే 27వ తేదీ ఉదయం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కిషన్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఆహా్వనం పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పాతది మాఫీ కాక..కొత్త రుణం రాక.. తెలంగాణ రైతుల అరిగోస
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుంటే, ఆ మొత్తాన్ని కొన్ని బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. రుణాలు రెన్యువల్ కాని వారు డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు పెరిగిపోయాయని పేర్కొంటూ కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. రైతుల లక్షలోపు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రభు త్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రూ.37 వేల వరకు రుణాలు మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.38 వేల వరకున్న రుణాలతో ఒక బిల్లు, రూ.38 వేల నుంచి రూ. 39 వేల వరకున్న రుణాలతో మరో బిల్లును వ్యవసాయ శాఖ తయారు చేసి ఆర్థిక శాఖకు పంపించింది. అయితే రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో సొ మ్ము మంజూరు కాలేదని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. సర్కారు సూచన పట్టించుకోని బ్యాంకర్లు రుణమాఫీని ప్రభుత్వం విడతల వారీగా చేస్తోంది. ఈ విధంగా లక్షలోపు రుణమాఫీలో కేవలం రూ.37 వేల వరకు రుణాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో మిగతా వారికి రెన్యువల్ సమస్య వచ్చింది. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే కొన్నిచోట్ల బ్యాంకులు ప్రభుత్వ సూచనను పట్టించుకోకుండా రైతుబంధు సొమ్మును రుణమాఫీ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో కొందరి రుణాలు రెన్యువల్ అవుతున్నా, అధిక సంఖ్యలో రైతులు రెన్యువల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని సూచించింది. కొందరు రైతులు అలా చెల్లించగా, కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. రుణమాఫీకి అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈసారి బడ్జెట్లో అయినా రుణమాఫీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సొమ్ము కేటాయించి విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.20,164.20కోట్లు కేటాయించినా.. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా 36.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు రుణమాఫీ కోసం రూ.20,164.20 కోట్లు కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా, మరో 31 లక్షల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. 2020లో రూ.25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు పంట పెట్టుబడి కోసం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నా. దిగుబడి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సంతోషపడ్డా. లక్ష రూపాయలు మాఫీ అయిపోతాయని ఆశగా ఎదురుచూశా. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా వడ్డీ లక్షకు పెరిగింది. ఇప్పుడు యాసంగి సాగుకు బ్యాంకులో రుణం ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో బయట అధిక వడ్డీకి అప్పు తీసుకుని 4.26 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశా. - కముటం స్వామి రైతు, కేసముద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా -
రైతుబంధుపై వీడని సస్పెన్స్.. కొత్త రైతులకు కష్టమే?
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : రైతుబంధు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. బయటకు చెప్పకూడదని వ్యవసాయాధికారులను కట్టడి చేసింది. బయటి వ్యక్తులకే కాదు మీడియాకు కూడా వివరాలను వెల్లడించడానికి అధికారులు జంకుతున్నారు. ఉద్యోగాలు పోతాయనేంతగా భయంతో ‘ఆ ఒక్కటి అడక్కు’ అని మాట దాటేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధులు ఎంతమందికి వచ్చాయన్న లెక్కలు తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తుండడమే ఇందుకు కారణమని మాత్రం తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో కొత్తగా 7,176 మంది రైతులను కలుపుకొని లబి్ధదారుల సంఖ్య 2,78,351 మందికి చేరుకుంది. ఇందుకు రూ.274.10కోట్లకు పైగా పెట్టుబడి సాయం అవసరమవుతోంది. తొలుత ఒకటి, రెండు, మూడెకరాలు వారికి పెట్టుబడి డబ్బులు అందగా, నాలుగు నుంచి ఆరెకరాల్లోపు ఉన్న రైతులకు ఆలస్యంగా అందాయి. ప్రస్తుతం ఆరు ఎకరాలకు పైగా ఉన్న వారికి ఇంకొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పక్షం రోజులవుతున్నా తమకు రైతుబంధు రాలేదని రైతులు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. కొంత ఆలస్యమైనా డబ్బులు తప్పకుండా పడతాయని అధికారులు వారికి సముదాయిస్తున్నారు. కానీ, వరినాట్లు దాదాపు పూర్తయినప్పటికీ పంట సాయం అందకపోవడం పట్ల రైతులు ఆందోళనగా ఉన్నారు. ఎరువులు, మందుల కొనుగోలుకు చేతిలో పైసల్లేక అప్పు తెచ్చుకుంటున్నారు. కొత్త రైతులకు అనుమానమే.. జిల్లాలో రైతుబంధు పొందే లబ్ధిదారుల జాబితాలో కొత్తగా పట్టాపాసు పుస్తకాలు పొందిన 7,176 మంది రైతులను చేర్చింది. అర్హత ఉన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తుతో పాటు పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ జిరాక్స్‌లను మండల వ్యవసాయాధికారులకు అందజేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆ రైతుల పేర్లను మాత్రం రైతుబంధు పోర్టల్‌లో ఇంకా నమోదు చేయలేదు. దీంతో వ్యవసాయాధికారులు రైతుల వివరాలను ఎంట్రీ చేయలేకపోతున్నారు. వచ్చిన దరఖాస్తులన్నీ మండల కార్యాలయాల్లోనే పడున్నాయి. తద్వారా కొత్త రైతులకు యాసంగి పెట్టుబడి సాయం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఎల్ఏ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను కొత్త పాస్‌పుస్తకాలు పొందిన రైతుల వివరాలు అందలేదని తెలుస్తోంది. -
వారికి రైతుబంధు రానట్టేనా?
సాక్షి, యాదాద్రి : కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈసారి రైతుబంధు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వ్యవసాయ శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి వచ్చిన డేటాలో వారి వివరాలు లేవు. యాసంగిలో పెట్టుబడి సాయం వస్తుందని ఆశపడ్డ కొత్త రైతులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైనే ఉన్నారు. 5,495 మంది దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత వివిధ రకాల సాంకేతిక సమస్యల వల్ల వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ఇటీవల సమస్యలను పరిష్కరించడంతో జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 8 వేల మందికి పైగా రైతులు కొత్త పాస్ పుస్తకాలు పొందారు. వీరిలో 5,495 మంది రైతుబంధు సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరైన ప్రచారం లేకపోవడం, అవగాహన లేమితో ఇంకా 2,500 మందికి పైగా దరఖాస్తు చేయలేదు. 2022 డిసెంబర్ 20లోపు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటించారు.దరఖాస్తు చేసుకున్న రైతులు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశలో రైతులు వానాకాలం సీజన్లో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యింది. యాసంగిలోనూ అదే విధంగా వస్తుందని కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆశపడ్డారు. కానీ, సీసీఎల్ఏ నుంచి సమాచారం రా కపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాంకు పాస్ పుస్తకం నంబర్‌ను ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ çవెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాలు పంపని సీసీఎల్ఏ నూతనంగా పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతుల వివరాలను సీసీఎల్ఏ వ్యవసాయశాఖకు పంపించలేదు. దీంతో వ్యవసాయ శాఖ కమిషనర్ వెబ్సైట్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు లేవు. గతంలో మాదిరిగానే రకరకాల సాంకేతిక సమస్యలు చూపుతోంది. నూతన పాస్ బుక్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, విస్తీర్ణం వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఏఈఓలు రైతుల బ్యాంకు పాస్‌పుస్తకం వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత రైతుబంధు సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.కానీ, వెబ్సైట్లో వారి వివరాలు చూపడం లేదు. డేటా వస్తే జమ చేస్తాం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారి డేటా సీసీఎల్ఏ నుంచి మాకు రాలేదు. డేటాలో పట్టాదారు పాస్ బుక్ నంబర్, రైతు పేరు ఉంటుంది. ఈ వివరాలు సీసీఎల్ఏ నుంచి మాకు వస్తేనే నిర్ణీత ఫార్మాట్లో రైతుల బ్యాంకు అకౌంట్ నంబర్ అప్లోడ్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం. గత సీజన్లలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి వెంటనే రైతుబంధు సహాయం అందింది. మాకు డేటా రాగానే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
Rythu Bandhu: పదో విడత రైతుబంధు నిధుల జమకు అంతా సిద్ధం
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రేపటి నుంచి(బుధవారం, డిసెంబర్ 28వ తేదీ) నుంచి పదో విడత రైతు బంధు నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి.