మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తన బృందం సభ్యులతో కలసి మాట్లాడుతున్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, వృద్ధిపథంలో ముందుకు సాగనుందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో దార్శనికతగల రాజకీయ నాయకత్వం, రాజకీయ స్థిరత్వం నెలకొనడం గొప్ప ప్రయోజనకరమన్నారు. తెలంగాణ ప్రజలు ఆశాజనక దృక్పథంతో ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిరాశాజనక ఆర్థిక విధానాలను అనుసరించకపోవడం వల్లే దేశంలో మరెక్కడా లేనివిధంగా ఇంటింటికీ, గ్రామగ్రామానికీ మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటి సరఫరా కల సాకారమైందని కొనియాడారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారిందని, ఒడిశాలో కాలియా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుండటం దీనికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో సాహసోపేతంగా, తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. అయితే ద్రవ్యలోటు, రుణాలు పెరిగిపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమన్నారు. ద్రవ్యలోటు, రుణాల నియంత్రణకు మధ్యంతర ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన ముగింపు సందర్భంగా మంగళవారం తన బృందంతో కలసి ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పర్యటన విశేషాలు, తమ పరిశీలనకు వచ్చిన అంశాలను వెల్లడించారు.
దార్శనికతకు ప్రతిరూపం...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచే వృద్ధిపథంలో ముందుకు సాగుతోందని ఎన్.కె.సింగ్ తెలిపారు. దార్శనికతగల రాజకీయ నాయకత్వంతోపాటు మంచి ఆర్థిక వనరులు ఉండటమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రం గణనీయంగా ఆర్థికావృద్ధి సాధిస్తోందని, మూలధన వ్యయం సైతం అదే రీతిలో పెరుగుతూ పోతోందన్నారు. రాష్ట్రం మిగులు బడ్జెట్ కలిగి ఉందని, అయితే దీనిపై కాగ్‌తోపాటు ఆర్థిక విశ్లేషకుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 14 శాతానికి మించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వృద్ధిరేటు సాధించిన కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సింగ్ కితాబిచ్చారు. జీఎస్టీని అమల్లోకి తెచ్చిన అనంతరం కొన్ని నెలలు మినహా రాష్ట్రానికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం రాలేదన్నారు. రాష్ట్రం 20 శాతానికి మించి జీఎస్టీ వృద్ధి రేటు సాధిస్తోందన్నారు. రాష్ట్రం సులభతర వాణిజ్య(ఈఓడీబీ) ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలవడం చిన్న విషయం కాదన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ విధానం బాగుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సాగునీటి వసతుల కల్పన, సంక్షేమ పథకాలు వినూత్నంగా ఉన్నాయన్నారు.
మిషన్ భగీరథ పథకం గొప్ప దార్శనికతకు నిదర్శనమన్నారు. ఇలాంటి ఘనతను మరే రాష్ట్రం సాధించలేదన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎత్తిపోతల పథకాలు, రక్షిత నీటి సరఫరా వంటి సంక్షేమ పథకాలతో గరిష్ట సంక్షేమం అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆర్థికాభివృద్ధి తోడైతే రాష్ట్ర ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు రానుందని ప్రశంసించారు. రాష్ట్రానికి రాబడి సైతం రెట్టింపు కానుందన్నారు. నీటిపారుదల సదుపాయంతో పంట దిగుబడులు పెరగనున్నాయని, జనాభాలో అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిన వారికి జీవనోపాధి లభించనుందని వ్యవసాయ రంగ నిపుణుడైన తమ సభ్యుడు రమేశ్‌చంద్ అభిప్రాయపడ్డారని ఎన్.కె. సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని, ప్రభుత్వం పారదర్శకంగా, దాపరికం లేకుండా వ్యవహరించిందన్నారు.
నిధుల కేటాయింపుపై సిఫారసులు..
‘ద్రవ్యలోటు, అప్పులు కొంత వరకు ఒత్తిడి కలిగిస్తున్నాయి. అయినప్పటికీ సంక్షేమ పథకాలు గొప్ప ప్రయోజనం కలిగించనున్నాయి. విద్యాభివృద్ధి, వ్యవసాయ దిగుబడి, ఆరోగ్యం మెరుగు కానుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం కలిగించనున్నాయని సీఎం తెలిపారు’ అని ఎన్.కె.సింగ్ వెల్లడించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై సిఫారసులు చేస్తామన్నారు. రాజకీయ దార్శనికత, ఆర్థిక వనరుల లభ్యత వల్లే రాష్ట్రం పురోగమిస్తోందని ఆర్థిక సంఘం సభ్యుడు రమేశ్ చంద్ పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటుతో పోలిస్తే 60 శాతం అధికంగా ఉందన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్మించడాన్ని కమిషన్ కార్యదర్శి ఆరవింద్ మెహతా ప్రశంసించారు.
నాలుగు సవాళ్లు!
రాష్ట్రం నాలుగు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ పేర్కొన్నారు. అందులో అసమతౌల్య అభివృద్ధి ప్రధానమైదన్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల నుంచే 52 శాతం జీఎస్టీ అందుతోందన్నారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని రాష్ట్ర సగటుకు ఎగువన, మరికొన్ని దిగువన ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమతౌల్య అభివృద్ధిని సాధించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పెరిగిపోతున్న ద్రవ్యలోటు, రుణాలు కొంతవరకు సమస్యాత్మకంగా మారాయని, వాటి నియంత్రణపై మధ్యంతర ప్రణాళిక రూపొందించి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.
ఈ ప్రణాళిక అమలు 15వ ఆర్థిక సంఘం కాలవ్యవధికి వీలుగా ఉండాలన్నారు. కేంద్రం 2018 బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ లక్ష్యాలకు లోబడి ద్రవ్యలోటు, రుణాలు ఉండేలా రాష్ట్రం పరిమితులు విధించుకోవాలని, స్థూల ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ రెండు అంశాలతో వృద్ధికి ఆటంకం కలగకుండా పటిష్ట, ఆచరణీయమైన ప్రణాళికను చూడాలనుకుంటున్నామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రణాళికలు కోరామన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల రుణాల పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకం లక్ష్యాలను అమలు చేయడంలో రాష్ట్రం వెనకబడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment