అందని రబీ పెట్టుబడి | Rythu Bandhu Scheme Farmers Not Getting Rabi Season Money | Sakshi
Sakshi News home page

అందని రబీ పెట్టుబడి

Published Mon, Feb 18 2019 12:35 PM | Last Updated on Mon, Feb 18 2019 12:35 PM

Rythu Bandhu Scheme Farmers Not Getting Rabi Season Money - Sakshi

భూపాలపల్లి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం జిల్లాలో కొంతమంది రైతులకే పరిమిత మవుతోందనే వాదన వినిపిస్తోంది. రబీ సీజన్‌ ప్రారంభమై జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది రైతులకు సాయం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌లో చెక్కుల అందజేసి బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా డబ్బులు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రబీలోనూ చెక్కు లు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టగా ముందస్తు ఎన్నికలతో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే జిల్లాలో ఇంకా దాదాపు 23వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

పెట్టుబడి పైసలు వస్తాయా రావా? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. తమ తోటివారికి డబ్బులు వచ్చి తమకు రాలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ రైతుబంధు రైతన్న దరికి చేరడం లేదు. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే కొద్దిరోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కాలం వెల్లదీస్తున్నారు. మరో నెల గడిస్తే రబీ ముగియనుంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులకు సాయం అందకపోవడంతో బ్యాంకుల, వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

నిరీక్షణ..
ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి 23,113 మంది రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందలేదు. 20 మండలాల్లో భూమి కలిగిన రైతులు 1,36,718 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం రూ.120,74,92,810 పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 97,433 మంది రైతులకు రూ.90,29,26,930  డబ్బులు చెల్లించారు. మొత్తం 136718 రైతులకు గాను అధికారులు 1,21,268 మంది రైతుల వివరాలు సేకరించి అన్‌లైన్‌లో నమోదు చేశారు. పరిశీలన అనంతరం 1,18,918 మంది రైతులను గుర్తించారు. 15450 మంది రైతులు అందుబాటులో లేరని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు  

తప్పని ఎదురుచూపులు..  
పెట్టుబడి సాయం అందని రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అధికారులు ప్రభుత్వానికి నివేదించామని, బ్యాంకుల్లో జమకానున్నాయని సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే మీ ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తుందని ఆ తర్వాతే  రావాలని చెబుతున్నారు. పెట్టుబడి సొమ్ము వస్తుందని చాలా మంది రైతులు రబీలో అప్పులు తెచ్చి మరీ పంటను సాగు చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అప్పుకు వడ్డీ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పుకార్లతో ఆందోళన..
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రైతుబంధుపై దుష్ప్రచారం నెలకొంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైతుబంధు తాత్కాలికమే అని వస్తున్న పుకార్లతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇవి కేవలం గాలి వార్తలే అని కొట్టిపారేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దశల వారీగా అందరి రైతుబంధు డబ్బులు ఖాతాలో జమవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
సాయం అందడంలేదు
నాకు 5 ఎకరాల సాగు భూమి ఉంది. వారసత్వంగా వచ్చింది. ఆభూమిని నా పేరుపై ఇవ్వడానికి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. నాకు పాస్‌ పుస్తకాలు ఇవ్వకపోవడంతో మెదటి విడత చెక్కులు అందలేదు. రెండో విడత కూడా వచ్చేలా లేదు. నాలాంటి వాళ్లు మండలంలో చాలమంది ఉన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పాస్‌ పుస్తకాలు అందించాలి.
– వామనరావు, రైతు, మహదేవ్‌పూర్‌

వారంలో సాయం అందిస్తాం..
వారంలో రైతులకు సాయం అందనుంది. ట్రెజరీకి  వివరాలు  పం పించాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి సబంధించి రైతుల నుంచి ఏఈఓలు వివరాలు సేకరిస్తున్నారు. ఈనెల చివరలో కేంద్ర సాయం కూడా అందనుంది.
– గౌస్‌ హైదర్, ఏడీఏ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement