
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (పీఎం–కిసాన్) తెలం గాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో విలీనం చేసే ఆలోచన ఏమాత్రం లేదని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా స్పష్టం చేసినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి మూడు విడతల్లో కలిపి రూ. 6 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వేస్తామని రాష్ట్ర అధికారులకు ఆమె పేర్కొన్నారు. కేంద్ర పథకం అమలు కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్.కె. జోషితో సమావేశమయ్యారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజే శ్వర్ తివారీ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, సీసీఎల్‌ఏ డైరెక్టర్ కరుణ, వ్యవ సాయశాఖ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర పథకం విలీనం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. కానీ వేరుగానే ఆ పథకాన్ని అమలు చేస్తామని వసుధా మిశ్రా స్పష్టం చేసినట్లు సమాచారం. ఆమె మాటలతో రెండు పథకాల విలీన అంశం పక్కకు పోయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పీఎం–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, కాబట్టి రైతుబంధుతో కలిపి ఇప్పుడు ఇవ్వడానికి ముందుకు రాదని అధి కారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైతే వేర్వేరుగా రెండు పథకాలు నడుస్తాయని, ఎన్నికల తర్వాత రెండో విడత సాయం జమ చేసే సమయంలో అప్పుడు ఏం చేయాలన్న దానిపై ఆలోచన ఉంటుందని అంటున్నారు.
కుటుంబానికి ఐదెకరాల వరకే
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం చాలా పెద్దదని, రైతులందరికీ వర్తిస్తోందని సీఎస్‌తో సమావేశం అనంతరం వసుధా మిశ్రా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకం కేవలం చిన్న, సన్నకారు రైతులకే పరిమితమైందని, కుటుంబానికి ఐదెకరాల లోపు ఉన్న రైతులకే వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. మార్చి నుంచి ఈ పథకం అమలు చేస్తామని, మార్చి చివరి నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున తొలి విడత సాయాన్ని జమ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన రైతుబంధు పథకానికి సంబంధించిన రైతుల డేటా తీసుకుంటామని, ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాలను రాష్ట్రానికి ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల సమాచారముందని, లేని రాష్ట్రాలకు కేంద్రం వద్ద ఉన్న డేటాను అందిస్తామని చెప్పారు. పీఎం–కిసాన్ పథకానికి, రైతుబంధుకు సంబంధం లేదని వసుధా మిశ్రా స్పష్టం చేశారు. కుటుంబాన్ని ఒక యూనిట్‌గా చేసుకొని ఈ పథకం ఉంటుందన్నారు. రైతులు ఆధార్ లేదా ఏదైనా గుర్తింపుకార్డుతోపాటు బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుందన్నారు. రైతుబంధుతో కలిపి అమలు చేస్తామనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. కాగా, పీఎం–కిసాన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందనే నమ్మకాన్ని వసుధా మిశ్రా చెప్పినట్లు ఎస్.కె. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవేం నిబంధనలు...?
కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకంలో చాలా కొర్రీలున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సాయం పొందేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులూ అర్హులు కారని కేంద్ర పథకంలో తేల్చారు. కేవలం నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. పైగా ఐదెకరాలతోపాటు భార్యాభర్తలను యూనిట్‌గా తీసుకున్నారు. దీని ప్రకారం ఒక కుటుంబం మొత్తానికి కలిపి ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగుభూమి ఉంటే ఈ పథకం వర్తించదు. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలకు కలిపి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే ఈ పథకం వర్తించదు. ఈ ఫిబ్రవరి ఒకటి వరకు ఐదెకరాల భూమి ఎవరి పేరుమీద ఉంటే... రాబోయే ఐదేళ్ల వరకు వారికే వర్తిస్తుంది. ఒక వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు ఎన్నిచోట్ల సాగుభూమి ఉన్నా ఐదెకరాలకు మించి ఉండరాదు. ఇన్ని కొర్రీల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలంటే మళ్లీ రైతుల వివరాలు సేకరించాల్సి ఉంటుందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 47 లక్షల మంది సన్నచిన్నకారు రైతులు ఉంటే ఈ కొర్రీల కారణంగా సగానికిపైగా అర్హుల సంఖ్య పడిపోయే ప్రమాదముందని అంటున్నారు. ముందనుకున్నట్లుగా రూ. 2,800 కోట్లకుగాను సగానికి మించి రాష్ట్రానికి వచ్చే అవకాశం కనిపించడంలేదని వ్యవసాయశాఖ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం డేటా మళ్లీ సేకరించాల్సిందేనని, అందుకోసం నెల రోజుల సమయం పడుతుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment