హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది.
ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్‌తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్‌లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు.
ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు."
3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే!
Comments
Please login to add a commentAdd a comment