extra
-
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మను ఎప్పుడైనా చూశారా!
ఆటబొమ్మల ఖరీదు ఎంత ఉంటుంది? పది రూపాయల నుంచి కొన్ని వందల రూపాయల్లో రకరకాల ఆటబొమ్మలు దొరుకుతాయి. మరీ ఖరీదైన ఆటబొమ్మలైనా సరే, కొన్ని వేల రూపాయలకు మించి ఉండవు.ఇది మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మ. ఇది అలాంటిలాంటి ఆటబొమ్మ కాదు, టాయ్ రోబో! పిల్లలు ఆడుకునేందుకు వీలుగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘గింజా తనాకా’, ఆటబొమ్మల తయారీ సంస్థ ‘బందాయి కంపెనీ’ కలసి ఈ టాయ్ రోబోను రూపొందించాయి. జపానీస్ సూపర్‌హిట్ కార్టూన్ సీరియల్ ‘గండామ్’లో కథానాయక పాత్ర పోషించిన రోబో నమూనాను అచ్చంగా పోలి ఉండేలా దీన్ని తీర్చిదిద్దాయి. ఈ రోబో ఎత్తు పదమూడు సెంటీమీటర్లు, బరువు 1.400 కిలోలు ఈ టాయ్ రోబో కూడా అసలు సిసలు రోబోల మాదిరిగా కొన్ని పనులు చేయగలదు. చిత్రవిచిత్రమైన విన్యాసాలతో, ఆటపాటలతో పిల్లలను అలరించగలదు. ఈ టాయ్ రోబో తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్‌ను ఉపయోగించారు. దీని ఖరీదు 41,468 డాలర్లు (రూ.34.69 లక్షలు)ఇవి చదవండి: కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు! -
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.ఈ లోటును తీర్చడానికే పారిస్‌లోని ‘అర్మాత్వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? -
'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా?
పుష్పవజ్రమా? అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? గని నుంచి తవ్వి తీయకపోయినా, అచ్చంగా వజ్రంలాగానే ఉంటుంది. చైనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూలతో వజ్రాన్ని తయారు చేశారు. గులాబీల మాదిరిగా కనిపించే ఎర్రని పీయనీ పూల నుంచి వేరుచేసిన కార్బన్ అణువులతో మూడు కేరట్ల వజ్రాన్ని తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.ఈ వజ్రం తయారీ కోసం హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లువోయాంగ్ నగరంలోని నేషనల్ పీయనీ గార్డెన్స్ నుంచి సేకరించిన పూలను ఉపయోగించారు. కృత్రిమ వజ్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన లువోయాంగ్ ప్రామిస్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనతను సాధించారు. పూలతో వజ్రాన్ని తయారుచేయాలని సంకల్పించినట్లు లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ చెప్పడంతో ఆ కంపెనీకి కావలసిన పీయనీ పూలను సరఫరా చేసేందుకు నేషనల్ పీయనీ గార్డెన్ అంగీకరించింది.బయోజెనిక్ కార్బన్ ఎక్స్‌ట్రాక్టింగ్ టెక్నాలజీతో ఈ పూల నుంచి కార్బన్ అణువులను వేరుచేసి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అత్యధిక పీడనకు గురిచేయడం ద్వారా ఈ వజ్రాన్ని తయారు చేయగలిగామని లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. ఈ వజ్రం విలువను మూడు లక్షల యువాన్లుగా (రూ.35.19 లక్షలు) అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇవి చదవండి: వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ.. -
ఈ అలవాట్లను మార్చుకున్నారో.. విజయం మీదే..!
జీవితంలో విజయాన్ని సాధించాలని, అన్నింటిలోనూ సక్సెస్ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. అంతదాకా ఎందుకు, మీరు సక్సెస్ కోరుకుంటున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరూ అవుననే అంటారు. అయితే మనం అనుకున్నంత సులువేం కాదు విజయాన్ని సాధించడం. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం... సక్సెస్‌ని చవిచూద్దాం...విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉండే ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా... ఆ కన్నీటిని పన్నీటిగా స్వీకరిస్తేనే వారు విజయాన్ని సొంతం చేసుకుని ఉంటారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.సమయాన్ని సద్వినియోగం... అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారన్న సూత్రమే సాఫల్యాన్ని సూచిస్తుంది. అందుకోసం చేసుకోవాల్సిన మొదటి అలవాటు ఉదయాన్నే త్వరగా నిద్ర మేల్కొనడం. కనీసం ఉదయం ఐదింటికల్లా నిద్రలేవడాన్ని అలవాటు చేసుకుంటే... రోజంతా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత సమయం మిగులుతుందో మనకే అనుభవంలోకి వస్తుంది.బుక్ రీడింగ్..విజయం సాధించే వారిలో ఉండే మరో మంచి లక్షణం పుస్తక పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను, గొప్పవారి జీవిత కథలను, ఆత్మకథలను చదవడం వల్ల మనసు పొరలు తెరుచుకుంటాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే సరి... ఆ తర్వాత పుస్తకాలు చదవకుండా ఉండలేరు.ఆరోగ్యం... ఆకృతి!జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్ర΄ోతారు. ఆరోగ్యం బాగున్న వారే అహరహం శ్రమించగలిగే శక్తిని కలిగి ఉంటారనే విషయాన్ని మరచి ΄ోకూడదు.సరైన స్నేహం..మనం ఎప్పుడూ మంచి స్నేహితులనే ఎంచుకోవాలి. శల్య సారథ్యం చేసేవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. శల్య సారథ్యం అంటే నువ్వు ఆ పని చెయ్యలేవు, నీ వల్ల అది సాధ్యం కాదు అంటూ వెనక్కి లాగడం. అందువల్ల మన పక్కన సానుకూల దృక్పథంతో ఉండేవారే ఉంటే మనకు చాలా మంచిది. అందువల్ల అలా పాజిటివ్‌గా ఉండే వారినే ఎంచుకోవడం, అలాంటి వారితోనే స్నేహం చేయడం చాలా మంచిది. కొందరు నిత్యం నెగిటివ్ ఆలోచనతో, నెగిటివ్ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్ దారిలోనే వెళ్తారు.వాదనలకు దూరంగా ఉండటం..జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా మౌనంగా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.ఇవి చదవండి: మీ బ్రెయిన్ ఆక్టివ్ ఉండాలంటే.. ఇలా చేయండి! -
Rosa Shruti Abraham: సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనర్..
సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనింగ్ కష్టమైనదిగా భావిస్తూ మహిళలు ఈ కళను ఎంచుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. అలాంటి ఈ కళను ఎంతో ఇష్టంగా ఎంచుకొని, అందులో రాణిస్తోంది తిరువనంతపుర వాసి రోసా శ్రుతి అబ్రహాం. సాధారణంగా పెద్ద పెద్ద కర్మాగారాల నుంచి భారీగా ఉత్పత్తి అయ్యే సిరామిక్ వస్తువుల గురించి మనకు తెలిసిందే. అత్యంత వేగవంతమైన ప్రపంచంలో ప్రాచీన కళారూప్రాల వెనక దాగి ఉన్న నైపుణ్యాన్ని ఈ తరానికి పరిచయం చేస్తోంది రోసా శ్రుతి.‘‘మురికి పట్టిన ఏప్రాన్, మట్టితో నిండిన చేతులు, చిక్కుబడిపోయినట్టు చిందర వందరగా ఉండే జుట్టు.. రోజులో ఎక్కువ పనిగంటలు ఇలాగే కనిపిస్తాను. అయితే, కొంతకాలంగా వరసగా ఆర్డర్లు పొందుతున్నాను. అందుకే రోజులో ఎక్కువ గంటలు స్టూడియోలోనే ఉండిపోతున్నాను. అందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను.నేను ఓ స్టూడియో ఓనర్ అనేకంటే నా స్టూడియోలో నిరంతరం పనిచేసే ఒక శ్రామికురాలిని అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను. స్టూడియో అంటే పెద్దదేమీ కాదు ఒక గది. అయితే, బయట పచ్చదనం ఉంటుంది. నాదైన ఈ ప్రపంచంలో అందమైన సిరామిక్స్, గ్లాస్ డిజైన్స్ రూపొందిస్తుంటాను. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఏడేళ్లుగా ఈ తయారీని చేపడుతూనే ఉన్నాను. నిజానికి ఇది ప్రతిరోజూ ఒక కొత్త ప్రాఠమే. నా స్టూడియోలో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది.యజ్ఞంలా.. కళారూప్రాలు!సిరామిక్స్ అండ్ గ్లాస్ డిజైనింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాక కొన్ని కంపెనీలలో వర్క్ చేశాను. ఏడేళ్లప్రాటు వివిధ కంపెనీలలో చేసిన ఉద్యోగాలు నాకు అంతగా సంతృప్తినివ్వలేదు. దీంతో ఉద్యోగంలో సంప్రాదించిన కొద్ది మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంటి దగ్గరే ‘కొసావో’ పేరుతో ఓ స్టూడియోను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇదే నాకు జీవనాధారం అయ్యింది. కళాకారిణి నుంచి వ్యవస్థాపకురాలిగా ఎదగడం, నేర్చుకోవడం ... నా ప్రయాణం ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను.ఐదేళ్లుగా ఈ పని ఓ యజ్ఞంలా కొనసాగుతూనే ఉంది. కళారూప్రాల సృష్టిలోనే కాదు ఇతరులకు బోధించడంలోనూ ఆనందాన్ని, ఆదాయాన్నీ పొందుతున్నాను. అందుకే నా స్టూడియోలో ప్రతిరోజూ అన్ని సీజన్లలోనూ క్లాసులు ఉంటూనే ఉంటాయి. ‘ఐదేళ్ల కిందటి వరకు మీరెక్కడ ఉంటారో మాకు తెలియదు, ఇప్పుడు ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు’ అని క్లాసులకు వచ్చినవారు అంటుంటే చిరునవ్వే నా సమాధానంగా ఉంటుంది.దేనికదే ప్రత్యేకం..!బయట మనకు ఎన్నో రకాల మిషన్ మేడ్ కళారూప్రాలు లభించవచ్చు. కానీ, వాటిలో ఒక ఆత్మ అంటూ ఉండదు. ఈ కళను ఏ డిజిటల్ పరికరాలతోనూ భర్తీ చేయలేం. వీటి తయారీలో ఓర్పు, పట్టుదల అవసరం. అందుకు మంచి ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో మరొకరి కోసం పనిచేస్తున్నప్పుడు మనకు పరిమితులు ఉంటాయి. సొంతంగా ఏదైనా ్రప్రారంభించాలంటే అందులో నైపుణ్యం అవసరం. వివిధచోట్ల పనిచేసిన అనుభవం కూడా నాకు చాలా సహాయపడింది.అలాగే, విభిన్న వ్యక్తుల నుంచి వారి ప్రవర్తనల నుండి రకరకాల పద్ధతులు, మార్గాలను అర్థం చేసుకోగలిగాను. ఇవన్నీ నన్ను నేను కొత్తగా మలుచుకోవడానికి సహాయపడ్డాయి. వస్తువుల తయారీని ఫొటోలుగా తీసి, వాటిని ఆన్లైన్ ద్వారా కస్టమర్లకు షేర్ చేస్తుంటాను. ఆ తర్వాత రకరకాల పద్ధతుల్లో అనుకున్న రూప్రానికి తీసుకువస్తాను. ముఖ్యంగా ప్రాత సినిమాలు, డైలాగ్‌ల నుండి ప్రేరణ పొందిన థీమ్లతోనూ వస్తువుల తయారీకి ΄్లాన్ చేస్తుంటాను. ఇవి చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. సిరామిక్ అండ్ గ్లాస్ డిజైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను’ అని వివరిస్తుంది రోసా శ్రుతి.ఇవి చదవండి: Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స -
ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?
‘మంత్రాలకు, శాపాలకు ఏదైనాసరే.. రాయిగా మారిపోతుంది’ అనే మాటను పురాణగాథల్లో, జానపద కథల్లో వింటుంటాం. కానీ ఈ బావిలోని నీళ్లు దేన్నైనాసరే నిలువునా రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఇంగ్లండ్‌లోని ‘పెట్రిఫైయింగ్ వెల్’ చరిత్ర ఓ మిస్టరీ. దీన్నే ‘మదర్ షిప్టన్ కేవ్’ అని కూడా పిలుస్తారు.నార్త్ యార్క్‌షైర్‌లోని అందమైన ప్రాంతాల్లో నేజ్బ్ర ఒకటి. దానికి అతి చేరువలో ఉన్న ఆ నుయ్యి నిరంతరం పొంగుతూనే ఉంటుంది. వర్షపు చినుకుల్లా పైనుంచి నీళ్లు కిందున్న ప్రవహంలోకి పడుతుంటాయి. ఈ ప్రవాహం కాలాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా.. మరికొన్ని సార్లు తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు పడే చోటే బొమ్మలు, టోపీలు, దుస్తులు, మనిషి పుర్రెలు, ఎముకలు, టీ కప్పులు, టెడ్డీబేర్ ఇలా ప్రతిదీ తాళ్లకు కట్టి వేలాడదీస్తారు ఇక్కడి నిర్వాహకులు. శీతాకాలంలో అవన్నీ మంచుతో గడ్డకట్టి రాళ్లుగా మారిపోతుంటాయి. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులను ఇలా, ఇక్కడ రాళ్లుగా మార్చి మ్యూజియమ్స్‌లో దాచిపెడుతుంటారు. ఈ నీటిలో కొన్నినెలల పాటు ఉంచిన సైకిల్ రాయిగా మారిపోవడం గతంలో ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది.నిజానికి ఇక్కడి అందాలను చూడటానికి రెండు కళ్లూ్ల చాలవు. నిడ్ నదికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రదేశం..1630 నుంచి పర్యాటకేంద్రంగా వాసికెక్కింది. అప్పటి నుంచి ఇక్కడి నీళ్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో ఖనిజ పదార్థాలు, టుఫా, ట్రావెర్టైన్ వంటి శిలాసారం ఎక్కువ శాతం ఉండటంతో ఈ నీరు దేని మీద పడినా అది రాయిగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే పక్కనే ఉన్న మదర్ షిప్టన్ గుహకు సంబంధించిన కథ హడలెత్తిస్తుంది.ఆ గుహలోనే.. 1488లో అగాథ సూత్టేల్ అనే 15 ఏళ్ల పాప ఓ బిడ్డకు జన్మనిచ్చిందని.. ఆ బిడ్డ పేరు ‘ఉర్సులా సౌథైల్’ అని, ఆ పాప పుట్టగానే ఏడవకుండా పెద్దపెద్దగా అరిచిందని, చూడటానికి విచిత్రమైన రూపంతో పెద్ద ముక్కతో హడలెత్తించేలా ఉండేదని, దాంతో ఆమెను సమాజంలో తిరగనిచ్చేవారు కాదని, అందుకే ఆ గుహలోనే పెరిగిందని, ఆమెకు ఎన్నో మంత్ర విద్యలు వచ్చని స్థానిక కథనం. అంతేకాదు ఆమె భవిష్యవాణి చెప్పగలిగేదట.హెన్రీ Vఐఐఐ (1547) మరణం, గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ (1666) వంటి ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో మన బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరిగానే ఆమె చెప్పే జోస్యాన్ని చాలామంది నమ్మేవారు. ఆ తరుణంలోనే ఆమె పేరు ‘మదర్ షిప్టన్ ’గా మారింది.ఇక ఆమెను దేవత అని పూజించేవారు కొందరైతే, ప్రమాదకరమైన మంత్రగత్తె అని దూరంపెట్టేవారు ఇంకొందరు. ఈ రెండవ వర్గం వాదన అక్కడితో ఆగలేదు. ఆమె ప్రభావంతోనే అక్కడి నీరు అలా మారిపోతోందని ప్రచారం సాగించారు. అయితే ఆమెను దైవదూతగా భావించినవారంతా ఆ నుయ్యి దగ్గర కోరిన కోరికలు తీరతాయని నమ్మడం మొదలుపెట్టారు.ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే 1561లో తన 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందట. అయితే ఆమె మృతదేహం కూడా రాయిగా మారిపోయిందని, అది ఆ గుహలోనే శిల్పంలా ఉందనే ప్రచారమూ సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ గుహలో ఆమె రూపంలో ఒక శిల్పం ఉంటుంది.. ఆ గుహను పడిపోకుండా ఆపుతున్నట్లుగా! అయితే అది నిజంగా ఆమె మృతదేహమేనా అనేదానిపై స్పష్టత లేదు.మదర్ షిప్టన్ చనిపోయిన 80 ఏళ్లకు ఆమె రాసిన పుస్తకం ఒకటి బయటపడిందట. అందులో ఆమె 1881లో ప్రపంచం అంతం అవుతుందని రాసిందంటూ 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. ఆమె చెప్పిన జోస్యం జరిగి తీరుతుందని, మనకు చావు తప్పదని చాలామంది వణికిపోయారు. అయితే ప్రపంచం అంతం కాకపోయేసరికి ఆ జోస్యం ఆమె చెప్పింది కాదనే ప్రచారమూ ఊపందుకుంది.ఏది ఏమైనా ఇక్కడి నీళ్లను ఎవరూ తాకకూడదని ఎక్కడికక్కడ నింబధనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అసలు ఈ నీరు ఎప్పటి నుంచి అలా మారింది? ఉర్సులా సౌథైల్ చనిపోతూ నిజంగానే శిల్పంగా మారిందా? అసలు ఉర్సులా పూర్వీకులు ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆమె తల్లి ఏమైపోయింది? లాంటి ఏ వివరాలూ ప్రపంచానికి తెలియవు. అందుకే నేటికీ ఈ గుహ వెనకున్న కథ మిస్టరీనే మిగిలిపోయింది. — సంహిత నిమ్మనఇవి చదవండి: మధిర టు తిరుపతి.. 'సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!' -
మనలో ఇలా జరుగుతుంటే.. ఏం చేయాలో మీకు తెలుసా!?
మెదడుకు పదును..!బజారులో నడిచి వెళ్తున్నప్పుడు తెలిసిన వ్యక్తి ఎదురు పడితే వెంటనే పేరు గుర్తురాదు. పలకరింపుగా నవ్వి ఏదో ఒక రకంగా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇలా తరచూ జరుగుతుంటే మెదడు బద్దకంగా ఉంటోందని, మతిమరుపు పెరుగుతోందని జాగ్రత్త పడాల్సిందే. వార్థక్య లక్షణాలను దూరంగా ఉంచడానికి దేహానికి వ్యాయామం చేసినట్లే మెదడు చురుగ్గా ఉండడానికి తగినంత వ్యాయామం కావాలి.రోజూ కనీసం ఒక్క పజిల్నైనా పరిష్కరించడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి మంచి మార్గం. అలా మెదడును కూడా చురుగ్గా ఉంచినప్పుడే మతిమరుపు అనే వార్థక్య లక్షణం దూరమవుతుంది. రోజూ ఈప్రాక్టీస్ ఉంటే డెబ్బై ఏళ్లు నిండినా సరే జ్ఞాపకశక్తి తగ్గదు. మతిమరుపు దరిచేరదు. దరి చేర్చుకోకూడని మిత్రుడు మతిమరుపు, మెదడు వాడదాం... మెదడును ‘వాడి’గా ఉంచుకుందాం.చక్కెర తగ్గిస్తే కలిగే ప్రయోజనాలివి..చక్కెర ఉన్న పానీయాలు, స్వీట్లు, ఇతర పదార్థాలను తినడం మానేస్తే శరీరంలోకి అధికంగా చేరే కేలరీల పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.చక్కెరను దూరం పెట్టడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు సహా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది.నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ కోసం చక్కెరను దూరం పెట్టడం చాలా మంచిది.చక్కెరతో కూడిన ఆహార పదార్థాలను దూరం పెడితే నోటి సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.చక్కెర తినడం మానేయడం వల్ల టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం తగ్గుతుంది. చర్మం త్వరగా ముడతలు పడటం తగ్గి కాంతిమంతంగా మారుతుందిజీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.ఇవి చదవండి: 'నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా'.. -
Tech Talk: స్మార్ట్‌గా పనిచేసే ఈ సరికొత్త ఫీచర్స్ మీకోసమే..!
టెక్నాలజీ పరంగా మార్కెట్లోకి ఫీచర్స్ కలిగిన పరికరాలు ఎన్నో వస్తున్నాయి. మారుతున్న కాలానికనుగుణంగా.. కంప్యూటర్, మొబైల్, వాచ్‌లే కాకుండా, స్మార్ట్ ఫీచర్లు కలిగిన ఇతర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త టెక్నాలజీ విధానం సంతరించుకుని స్మార్ట్ థింకింగ్లా పనిచేసే వీటి తీరుని గురించి తెలుసుకుందాం.విండోస్ 11లో ఏఐ ఎక్స్‌ప్లోరర్..విండోస్ 11లో ‘ఏఐ ఎక్స్‌ప్లోరర్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. కన్వర్సెషన్స్, వెబ్‌పేజీలు, ఈమెయిల్స్‌ను సమరైజ్ చేయడం నుంచి ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ను రిమూవ్ చేయడంలాంటి కాంప్లెక్స్ టాస్క్‌ల వరకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.ఇది స్క్రీన్ టాప్‌పై కనిపిస్తుంది. ‘ఏఐ ఎక్స్‌ప్లోరర్’ అనేది సెర్చ్ ఇంజిన్లాగే కాదు స్క్రీన్కు సంబంధించిన విషయాలను అనలైజ్ చేయడానికి, సూచనలు ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇక మరో ఫీచర్ ‘స్క్రీన్ అండర్స్టాండింగ్’ ఇమెయిల్ రిప్లై్స జెనరేట్ చేయడానికి యూజర్లకు ఉపయోగపడుతుంది.స్పీకింగ్ ప్రాక్టీస్..గూగుల్ సెర్చ్ ‘స్పీకింగ్ ప్రాక్టిస్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే ఈ ఫీచర్ ప్రస్తుతం ఇండియా, అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో, వెనిజులాలలో అందుబాటులో ఉంది. యూజర్లు ఏఐ–పవర్డ్ ఇంటర్యాక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్సర్‌సైజ్‌లలో పార్టిసిపేట్ చేయవచ్చు.నథింగ్ ఫోన్ (2ఏ)..సైజ్: 6.7 అంగుళాలురిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్ కలర్: డార్క్ బ్లూర్యామ్: 8జీబి స్టోరేజ్: 128జీబిఏఐ ఫీచర్స్: వాల్‌పేపర్ జెనరేటర్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్ఇంపార్టెంట్, అర్జంట్ లేబుల్స్ క్రియేట్ చేయడానికి..∙ జీమెయిల్. కామ్‌లోకి వెళ్లి కంపోజ్ మెయిల్ ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి.∙ 3–డాట్ మెనూ ఐకాన్ (బాటమ్ రైట్ కార్నర్ మెయిల్ కంపోజ్ విండో) క్లిక్ చేయాలి.∙ లేబుల్ ఆప్షను సెలెక్ట్ చేయాలి. ∙ న్యూ కస్టమ్ లేబుల్ క్రియేట్ చేయడానికి ‘క్రియేట్ న్యూ’ ఆప్షన్ క్లిక్ చేసి నేమ్ ఆఫ్ ది లేబుల్(అర్జంట్, ఇంపార్టెంట్)లోకి వెళ్లాలి.∙ లేబుల్ క్రియేట్ అయిన తరువాత... ఇమెయిల్ రైట్ క్లిక్ చేయాలి. ఇంపార్టెంట్, అర్జంట్కు సంబంధించి మార్క్ చేయాలి. నెక్స్ట్ జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు స్పెసిఫిక్ లేబుల్ హైలెట్ అవుతుంది. -
Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన హరి ప్రసాద్. ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) మేనేజ్మెంట్కు సంబంధించి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, కార్పోరేషన్లకు సహాయపడడానికి ‘బియాండ్ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు.పది మందికి మేలు చేసే వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి విన్నప్పుడు, చదివినప్పుడు హరి ప్రసాద్ భావోద్వేగంతో కదిలిపోయేవాడు. ఫ్రీడమ్ ఫైటర్స్‌కు సంబంధించిన సినిమాలను చూసినప్పుడల్లా ‘నా వంతుగా సమాజానికి ఏదైనా చేయాలి’ అనుకునేవాడు.జీవితానికి పరమార్థం ఉండాలనే భావన చిన్న వయసులోనే హరి ప్రసాద్లో మొలకెత్తింది. కాలేజీ సెకండ్ ఇయర్లో వాతావరణ మార్పులపై వచ్చిన ఎన్నో డాక్యుమెంటరీలను చూశాడు. ‘ఇలా చూస్తూ బాధ పడాల్సిందేనా! నా వంతుగా ఏమీ చేయలేనా’ అనుకుంటూ ‘తప్పకుండా ఏదైనా చేయాలి’ అనే పట్టుదలతో క్లైమెట్ యాక్షన్ వైపు అడుగులు వేశాడు.ఆ పచ్చటి అడుగులు ‘బియాండ్ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేశాయి. ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) ప్రకారం పర్యావరణానికి సంబంధించి ఉన్నతస్థాయి ప్రమాణాలను సాధించడానికి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, పెద్ద సంస్థలకు ఈ స్టార్టప్ తోడ్పడుతోంది.‘ఆర్గనైజేషన్స్‌కు నాలెడ్జి పార్ట్‌నర్స్‌గా వ్యవహరిస్తాం’ అంటున్నాడు హరి ప్రసాద్. సస్టెయినబిలిటీ, బాటమ్–లైన్ చాలెంజెస్‌కు సంబంధించి సంస్థల విజన్‌ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కార్బన్ మేనేజ్మెంట్పై దృష్టి పెడుతోంది బియాండ్ సస్టెయినబిలిటీ. కంపెనీల పర్యావరణ ప్రమాణాలకు సంబంధించి బేస్‌లైన్ స్టడీని నిర్వహిస్తోంది. కర్బన ఉద్గారాలు, వ్యర్థాల ఉత్పత్తి, మెటీరియల్ వినియోగం, కంపెనీ ఉద్యోగులలో వైవిధ్యం... మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.రకరకాల విషయాను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తారు. కంపెనీలకు సంబంధించి షార్–్ట టర్మ్, మిడ్–టర్మ్, లాంగ్–టర్మ్ టార్గెట్లను సెట్ చేస్తారు. కెపాసిటీ డెవలప్మెంట్, కార్బన్ మేనేజ్మెంట్, ఈఎస్జీ మేనేజ్మెంట్, క్లెమేట్ చేంజ్....మొదలైన వాటిపై ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించింది బియాండ్ సస్టేనబిలిటీ.అవగాహన సదస్సుల ద్వారా 65కు పైగా కంపెనీలకు, వందలాది మంది ప్రజలకు దగ్గరైంది. తయారీ ప్రక్రియలో వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ సదస్సులు కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి.‘బియాండ్ సస్టెయినబిలిటీ వోఎస్’ పేరుతో టెక్ ప్లాట్‌ఫామ్ కూడా బిల్ట్ చేశారు. కంపెనీల పాస్ట్ పర్ఫార్మెన్స్తో పోల్చుతూ విశ్లేషణ చేయడమే కాదు సస్టెయినబిలిటీ పర్ఫార్మెన్స్ను మెరుగుపరుచుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే... కంపెనీల మైండ్‌సెట్ మార్చడంలో, పర్యావరణ స్పృహ వైపు నడిపించడానికి ‘బియాండ్ సస్టేనబిలిటీ’ కీలక పాత్ర పోషి స్తోంది.స్టార్టప్‌కు ముందు..డిగ్రీ పూర్తి చేసిన తరువాత వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకోవడానికి నెదర్‌ల్యాండ్స్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ట్వంటే’లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేశాడు హరి ప్రసాద్. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన స్టార్టప్ మొదలు పెట్టడానికి ముందు ‘ఎస్పీ ఎడ్జ్’ అనే సోషల్ స్టార్టప్‌లో పనిచేసి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. – హరి ప్రసాద్ -
కొత్త టెక్నాలజీ పరికరాలతో ఆరోగ్య సమస్యలకు చెక్! ఎలా అంటే?
మారుతున్న టెక్నాలజీ పరంగా.. మానవ అవసరాలను, ఆరోగ్య సమస్యలను తీర్చే సరికొత్త టెక్నాలజీ పరికరాలు కూడా చాలానే వస్తున్నాయి. అందులో ఎన్నోరకాల పరికరాలను చూసుంటాం. మోకాళ్ల నొప్పులను, వినికడి లోపాలను సరిచేసేటువంటి వీటిని మీరెప్పుడైనా వాడటంగానీ, చూడటంగానీ చేశారా..! అవేంటో మరి చూద్దామా..మోకాలి నొప్పులకు చెక్!ఆటలాడేటప్పుడు గాయాలు కావడం వల్ల కొందరు మోకాలి నొప్పుల బారినపడుతుంటారు. ఇంకొందరు కీళ్ల అరుగుదల వల్ల మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నొప్పులు తగ్గడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కాపడాలు పెట్టించుకుంటుంటారు. వీటి వల్ల వచ్చే ఉపశమనం అంతంత మాత్రమే! మోకాలి నొప్పుల నుంచి సత్వర ఉపశమనం కలిగించేందుకు అమెరికన్ కంపెనీ ‘నీ ఫ్లో’ హెల్మెట్ ఆకారంలో ఉన్న ఈ మసాజర్‌ను రూపొందించింది.ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. మోకాలికి దీనిని బిగించి కట్టుకుని, దీనికి ఉన్న స్విచ్‌ను ఆన్ చేసుకుంటే చాలు– దీని లోపలి వైపు నుంచి కాంతి, వేడి వెలువడటమే కాకుండా, లయబద్ధంగా వెలువడే ప్రకంపనలు మోకాలి కీళ్లకు కండరాలకు మర్దన చేస్తాయి. దీని వల్ల వాపు, నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే కీళ్ల కదలికలు త్వరగా చురుకుదనాన్ని పుంజుకుంటాయి. ‘నీ ఫ్లో’ మసాజర్ మోకాలి ఉపరితలానికి మాత్రమే కాకుండా, లోపలి భాగాలకు కూడా ఫిజియో థెరపీ అందిస్తుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,775) మాత్రమే!కళ్లకు జోడు.. చెవులకు తోడు..ఇది కళ్లజోడులా కనిపిస్తుంది. అలాగని కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, వినికిడి సమస్యలు ఉన్నవారి చెవులకు తోడు కూడా. అంటే, ఇది స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్ అన్నమాట! జర్మన్ కంపెనీ ‘ఆడియా అకాస్టిక్’ ఈ స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్‌ను ‘బ్రకాఫ్’ బ్రాండ్ పేరుతో ‘స్పెక్టకిల్ ఎయిడ్’గా రూపొందించింది.దృష్టి లోపాలు, వినికిడి సమస్యలు రెండూ ఉన్నవారికి ఇదొక వరమనే చెప్పాలి. ఇందులోని కళ్లద్దాలు దృష్టిని స్పష్టం చేస్తాయి. కళ్లజోడు చెవులకు పెట్టుకునే భాగంలో చివరివైపు ఉన్న హియరింగ్ ఎయిడ్ శబ్దాలను స్పష్టంగా వినేందుకు దోహదపడుతుంది. మిగిలిన హియరింగ్ ఎయిడ్ పరికరాల మాదిరిగా దీనిని చెవి లోపల పెట్టుకోనవసరం లేదు. మామూలు కళ్లజోడు తొడుక్కున్నట్లే పెట్టుకుంటే సరిపోతుంది.దృష్టి లోపాలు లేకుండా వినికిడి సమస్యలు మాత్రమే ఉన్నవారు జీరో పవర్ గ్లాసెస్‌తో తీసుకుని, దీనిని తొడుక్కుంటే చాలు. కోరుకున్నంత ధ్వనిలో శబ్దాన్ని వినేందుకు వీలుగా ఇందులో అడ్జస్ట్మెంట్స్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ధర 495 పౌండ్ల (రూ. 51,593) నుంచి ప్రారంభం. ఎంపిక చేసుకున్న ఫ్రేమ్ మోడల్స్ బట్టి కొంత ఎక్కువ కూడా ఉంటుంది.ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత -
ఈ వంటకాలను ఎప్పుడైనా ట్రై చేశారా..!
మారుతున్న అభిరుచులనుబట్టి వంటకాలలో కూడా కొత్త కొత్త పద్ధతుల అనుసరిస్తున్నారు. ఆ పద్ధతులనుగుణంగా రుచులలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. ఎన్నడూ ఇటువంటి కమ్మని రుచులను చూడలేదనే విధంగా సరికొత్త వంటలు ఎదురుపడుతున్నాయి. మరి ఆ విధానాలననుసరించి మనం కూడా తయారుచేద్దామా.. స్వీట్ కార్న్ రైస్ కేక్..కావలసినవి..స్వీట్ కార్న్ – 2 (మెత్తగా ఉడికించి.. చల్లారక గింజలు ఒలిచి పెట్టుకోవాలి); బియ్యప్పిండి – 2 కప్పులు; జొన్న పిండి– పావు కప్పు; గుడ్డు – తెల్లసొన (అభిరుచిని బట్టి); చీజ్ తురుము – కొద్దిగా; బటర్ – కొద్దిగా; పంచదార – ఒకటిన్నర కప్పులు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు); చిక్కటి పాలు – పావు లీటర్ (కాచి చల్లార్చినవి).తయారీ..ముందుగా స్వీట్ కార్న్ గింజల్ని.. పాలతో కలిపి మిక్సీ పట్టుకోవాలి.అందులోనే జొన్నపిండి, బియ్యప్పిండి, చీజ్ తురుము, బటర్ వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి.ఆ మిశ్రమం పలుచగా ఉంటే కొద్దిగా బియ్యప్పిండి, గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని కేక్ బౌల్లో వేసుకుని బేక్ చేసుకోవాలి.అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకుని తినొచ్చు.లేదంటే.. క్రీమ్స్ సాయంతో బర్త్‌డే కేక్‌లా కూడా చేసుకోవచ్చు.మీల్మేకర్ సమోసా..కావలసినవి.. మీల్మేకర్ – పావు కప్పు (వేడి నీళ్లల్లో శుభ్రం చేసుకుని, ఉడికించి, చల్లారాక తురుములా చేసుకోవాలి); మైదా పిండి – పావు కిలో; రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్; సోయాసాస్ – 2 టీ స్పూన్లు; వాము – అర టీ స్పూన్; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్; క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడ ముక్కలు – 3 టీ స్పూన్ల చొప్పున; మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్ (కొద్దిగా నీళ్లు కావాలి); ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక కళాయిలో నూనె వేసుకుని, వేడి కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారట్ తురుము, ఉల్లికాడ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి బాగా వేయించాలి.తర్వాత సరిపడా ఉప్పు, కొద్ది నీళ్లల్లో కలిపిన మొక్కజొన్న పిండి, మీల్ మేకర్ తురుము వేసుకుని.. గరిటెతో నిమిషం పాటు అటూ ఇటూ తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి.పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల ఆ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసెయ్యాలి.అలా తయారు చేసుకున్న సమోసాలను నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.రా బనానా – కోకోనట్ కట్లెట్..కావలసినవి.. కొబ్బరి కోరు – పావు కప్పు; అరటికాయ ముక్కలు – పావు కిలో (బాగా శుభ్రం చేసుకుని మెత్తగా ఉడికించి, చల్లారక ముద్దలా చేసుకోవాలి); అల్లం తరుగు – కొద్దిగా; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 3, పెరుగు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత, నూనె – సరిపడా;తయారీ..ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో.. అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరం మసాలా, నిమ్మరసం, ఉడికించిన అరటికాయ గుజ్జు, కొబ్బరి కోరు వేసుకుని బాగా కలిపి.. ముద్దలా చేసుకుని.. కట్లెట్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.అభిరుచిని బట్టి వీటిలో కొన్ని ఇన్‌గ్రీడియంట్స్ కలుపుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు.ఇవి చదవండి: Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్‌లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్..! -
Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి..
సెక్స్–ట్రాఫికింగ్ సర్వైవర్స్‌కు అండగా నిలబడి వారికి ఒక దారి చూపుతోంది రుచిర గుప్తా. యాంటీ–ట్రాఫికింగ్ యాక్టివిస్ట్, యూఎన్ అడ్వైజర్, విజిటింగ్ ప్రొఫెసర్, ‘అప్నే ఆప్’ కో–ఫౌండర్, రైటర్ రుచిర ఎందరో బాధితులకు అక్కగా, అండగా నిలబడింది. యువ జర్నలిస్ట్‌గా రుచిర గుప్తా నేపాల్‌కు వెళ్లింది. ‘సహజ వనరులను గ్రామాలు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయి’ అనే అంశంపై కథనాలు రాయడానికి ఎన్నో గ్రామాలకు వెళ్లింది. సహజవనరులకు సంబంధించిన సమాచారం మాట ఎలా ఉన్నా చాలా గ్రామాల్లో వినిపించిన మాట.. ‘మా ఊళ్లో కొందరు అమ్మాయిలు కనిపించడంలేదు. వారి ఆచూకి తెలియడం లేదు’ మారుమూల హిమాలయ కుగ్రామం అయిన సిందుపాల్చౌక్లో పేకాట ఆడుతున్న వారిని అమ్మాయిల అదృశ్యం గురించి అడిగింది రుచిర. ‘వాళ్లు ముంబైలో ఉన్నారు’ అని అసలు విషయం చెప్పారు వాళ్లు. నేపాల్ నుంచి మన దేశానికి వచ్చిన తరువాత ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాటిపురాకు వెళ్లింది రుచిర. అక్కడ చిన్న చిన్న గదుల్లో అమ్మాయిలు బంధించి ఉండటాన్ని గమనించింది. బాధగా అనిపించింది. అయితే ఆమె బాధ దగ్గరే ఆగిపోలేదు. ‘ వారికోసం ఏదైనా చేయాలి’ అని మనసులో గట్టిగా అనుకుంది. నేపాల్ గ్రామాల నుండి ముంబైలోని వ్యభిచార గృహలకు యువతులు, బాలికల అక్రమ రవాణాను బహిర్గతం చేయడానికి కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కోసం ‘ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్’ అనే డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ కోసం ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది. వారు చీకటికూపాల్లో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం.. కటిక పేదరికం. ఈ డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు ఆమైపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒకడు కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆమెను రక్షించారు. అవుట్ స్టాండింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం ఇచ్చే ఎమ్మీ అవార్డ్‌ను ‘ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్’ గెలుచుకుంది. అవార్డ్ అందుకుంటున్నప్పుడు చప్పట్ల మధ్య, ప్రకాశవంతమైన దీపాల మధ్య ఆమెకు కనిపించిందల్లా చీకటి కొట్టాలలోని బాధితుల కళ్లు మాత్రమే. ‘జర్నలిజంలో నేను మరో మెట్టు పైకి చేరడానికి కాకుండా మార్పుకోసం ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడాలని కోరుకున్నాను’ అంటుంది రుచిర. అక్రమ రవాణాపై కఠిన చట్టాలు తీసుకురావడానికి సహాయపడాల్సిందిగా అప్పటి యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డోనా షలాలాతో మాట్లాడింది రుచిర. డోనా ద్వారా ఐక్యరాజ్య సమితి సమావేశంలో తన డాక్యుమెంటరీని ప్రదర్శించడమే కాదు వివిధ దేశాలకు చెందిన 180 మంది ప్రతినిధులతో మాట్లాడింది. ఇరవై రెండు మంది మహిళలతో కలిసి ‘అప్నే ఆప్–ఉమెన్ వరల్డ్ వైడ్’ అనే స్వచ్ఛంద సంస్థను ్రపారంభించింది రుచిర గుప్తా. అక్రమ రవాణ నిరోధించడానికి, బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ఈ సంస్థ అలుపెరుగని కృషి చేస్తోంది. వ్యభిచారాన్ని‘కమర్షియల్ రేప్’గా పిలుస్తున్న ‘అప్నే ఆప్’ బాధితులకు సంబంధించి విద్య, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ స్కిల్స్, చట్టపరమైన రక్షణ, ప్రభుత్వ పథకాలు... మొదలైన వాటిపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఇరవై రెండు వేలమందికి పైగా మహిళలు, బాలికలను వ్యభిచార కూపాల నుంచి బయటికి తీసుకురావడంలో సహాయపడిన రుచిర ఎంతోమంది అమ్మాయిలు చదువుకునేలా చూసింది. సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డ్లు అందుకుంది రుచిరా గుప్తా. అయితే వాటి కంటే కూడా చీకటి కూపం నుంచి బయటికి వచ్చిన బాధితుల కంట్లో కనిపించే వెలుగే తనకు అతి పెద్ద అవార్డ్‌గా భావిస్తానంటుంది రుచిర. ఇవి చదవండి: Thodu Needa Founder Rajeswari: సీనియర్ సిటిజన్స్‌కు భరోసా ఏది? -
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం'
'వారంలోని ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా ఏ ప్రత్యేకతా లేని గురువారం. చలి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తన ప్రభావం చూపుతోంది. బూడిదరంగు ఆకాశంలో కృశించిపోయిన సూర్యుడు సన్నని వెలుతురు పంచుతున్నాడు. మునుపెన్నడో చెత్తకుండీలోంచి ఏరుకొచ్చిన ఓ నడిపాత తివాచీపై కూతురు దగ్గుతో లుంగలు చుట్టుకుపోవడాన్ని మజీద్ నిస్సహాయంగా గమనించసాగాడు. పనార్ ఎడారిలోని సంచారతెగలు వుండే ఒకే ఒక్క గది ఉన్న ఇంటికి అదే కాస్త వెచ్చదనాన్ని సమకూరుస్తోంది. బైట న్యుమోనియా ప్రబలిపోతుండడంతో మజీద్ తన కూతుర్ని ఎన్నో ఆస్పత్రులకు తిప్పితే చివరికి ఓ డాక్టర్ ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు. ఆయన మందులిచ్చి వ్యాధి మరింత ఎక్కువ కాకుండా పిల్లని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచమన్నాడు.' ‘ఇలా రండి, కాస్త టీ, రొట్టీ, ఓ గుడ్డు తీసుకుందురు గానీ’ భార్య ఫరీదా అంది. తన కొడుకులు బైట సంతోషంగా ఆడుకోవడాన్ని, ఫరీదా అతని చుట్టూ ఆందోళనగా తిరగడాన్ని అతను నిశ్శబ్దంగా చూడసాగాడు. ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మొరటుగా మారిన చేతివేళ్లు, కాయలు గాచిన అరచేతులు.. పెళ్ళైన కొత్తల్లోని ఫరీదాకీ, ఈమెకు ఎంతో తేడా చూపుతున్నాయి. ఆగది మధ్యకు ఆమె మూలనున్న ఓ బల్లని జరిపింది. అదే వాళ్ళకి వంటగదీ, పడకగదీ, భోజనాలగదీ, అన్నీ. స్నానాల గది, పాయిఖానా ఇంటి బైటెక్కడో, అవి మాత్రం సామూహికం. వాటిని ఎన్నో కుటుంబాలవాళ్ళు వాడుకుంటుంటారు. ఇంట్లో కూడా ఈ బల్లతో పాటే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు.. అంతే! ఓ టీవీ, దాన్ని ఎక్కడో దొరికిన ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అదో మూలన చిన్న స్టూల్ మీద ఉంటుంది. నీళ్ళ కోసం వాడి పారేసిన కోకాకోలా బాటిల్స్ వాడుకుంటుంటారు. ప్రతిరోజూ వాళ్ళు మాంసం వండుకుని తినడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా చిన్న ముక్క కూడా మిగలదు. అందుకని వాళ్ళకి ఫ్రిజ్ అవసరం కూడా ఉండదు. తన భార్య కూతురి ఆరోగ్యం గురించిన చింతతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని మజీద్‌కి బాగా తెలుసు. ఓవారం రోజుల్లోనే ఆమె మొహం ఎంత నీరసించిపోయి పీక్కుపోయిందో అర్థమవుతోంది. అయితే తను ఏరోజూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేసింది లేదు. ఆ విషయంలో తను అదృష్టవంతుడే, కానీ లోపల్లోపల అతనేదో అపరాధిలా బాధపడుతుంటాడు. తమ కష్టాలు తీరిపోయే రోజు ఒకటి వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ‘జమీలా! నాన్నగారు బైటికి వెళుతున్నారు, టాటా చెబుదాం రా!’ అంటూ ఆ చిన్నబిడ్డని ఫరీదా తివాచీ పైనుంచి లేపేటప్పటికి ఆ పిల్ల గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. దాంతో కలవరపడిపోయిన ఆ తల్లి పాపని ఊరుకోబెట్టడానికి చిన్నగా పాడసాగింది. ‘ఈవేళ తొందరగా వచ్చేస్తానులే’ టీ ముగించిన మజీద్ అన్నాడు ఆమెతో. ‘ఇన్షా– అల్లాహ్!’ మజీద్ నెమ్మదిగా నడుస్తూ హైవే మీదకొచ్చి సిటీ బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అతని చుట్టూ ఎడారే, అక్కడక్కడా ముళ్ళజెముడు మొక్కలు రోడ్డుకిరువైపులా పెరిగిపోయున్నాయి. వీస్తున్న చల్లగాలికి అతను వేసుకున్న జుబ్బా ఊగుతుంటే, తలపై టోపీ చలి నుండి, దుమ్ము నుండి అతనికి రక్షణ కల్పిస్తోంది. చలికి పగిలిన అతని పాదాలు తక్కువ ధరలో కొన్న పాత ఉన్ని మేజోళ్ళలోనూ, నకిలీ తోలుబూట్లలోనూ తలదాచుకున్నాయి. నిజం చెప్పాలంటే సంచార జాతుల వాళ్ళకు కుటుంబం గడవాలంటే చెప్పినంత సులువు కాదు. తను ఏదో ఒక పని చేస్తున్న కారణంగా అధికారులు తనని అరెస్టు చేయకుంటే చాలని ప్రతిరోజూ అతను ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రాంతాల్లో అడుక్కు తినడాన్ని నిషేధించారు కాబట్టి తమలాంటి వాళ్ళు ఏ పని దొరికితే అది చాలావరకు అవి చట్టవ్యతిరేకమైనవే అయుంటాయి. చేయడానికి సిద్ధంగా ఉంటారు. సంచార జాతివాడిగా ముద్రవేయబడ్డ అజీజ్ కానీ, అతని తండ్రి, తాత, ఎవరూ కూడా బడికి వెళ్ళి చదువుకున్నదేలేదు. నేటి సమాజంలో చదువు రాకపోవడమంటే ఎంత దుర్భరమో అతనికి బాగా తెలుసు. ఏదో అజీజ్ తన మీద దయతో తన పనిముట్లను అతని షాపులో ఉంచుకోనిస్తూ తనకి సహకరిస్తున్నాడు. ‘జమీలా ఎలా ఉంది?’ అడిగాడు అజీజ్. ‘ఇప్పుడు ఫర్వాలేదు’ చెప్పాడు మజీద్. ‘రెండు రోజుల పాటు నువ్వు రాకపోయేసరికి కాస్త కంగారుగా ఉండిందిలే.’ ఆ ఊళ్ళో అజీజ్ ఒక్కడే తనతో ఈ మాత్రం దయతో ఉంటాడు. అతనికో చిన్న ఎలక్ట్రిక్ షాపు ఉంది. అందులోనే అతను ఏ ప్రతిఫలం ఆశించకుండా మజీద్ పనిముట్లను ఉంచుకోవడానికి పెద్ద మనసుతో అనుమతినిచ్చాడు. ఎప్పుడైనా ఓ మంచిరోజున అజీజ్ అతనికి ఐదారు దీనారాలను ఇస్తుంటాడు. కానీ ఆ మంచిరోజులనేవి చాలా చాలా అరుదు. ప్రతిరోజూ మజీద్ కేవలం రొట్టె, పెరుగులతో భోజనం చేస్తుంటాడు. అప్పుడప్పుడు అజీజ్ తను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం పెట్టేవాడు. కోడిమాంసం, కట్లెట్.. ఇలా. ఎప్పుడైనా ఒక్కోసారి మహబూబ్ హోటల్ నుంచి భోజనం తెప్పించేవాడు. అజీజ్ కబాబ్ కానీ మరోటి కానీ మజీద్‌కి తినమని ఇచ్చినప్పుడల్లా ఏదో అపరాధభావన మజీద్‌ని తొలిచేసేది..అనవసరంగా అతనికి భారమౌతున్నానని. ‘తిను మజీద్, నువ్వు తినకుంటే నాకు బావుండదు’ మెల్లిగా నచ్చజెప్పేవాడు అజీజ్. ‘షుక్రియా’ ఔదార్యంతో అతనిస్తుంటే, అతన్ని నొప్పించకూడదని మజీద్ తీసుకునేవాడు. అజీజ్ మంచితనానికి తను ఏ విధంగానూ, ఎన్నటికీ ఋణం తీర్చుకోలేనని మజీద్‌కి తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిగి తన దశ తిరిగిపోతే తను కూడా అజీజ్లాగే ఇతరులకి సహాయపడాలని అతనెప్పుడూ కోరుకుంటుంటాడు. ప్రతిరోజూ మక్కా వైపుకు తిరిగి ఐదుసార్లు ప్రార్థన చేసేటప్పుడు అటువంటి అద్భుతమొకటి తన జీవితంలో జరగాలని భగవంతుని ప్రార్థిస్తుంటాడు. ఇప్పుడతని వయసు నలభై ఐదు.. తనపై ఆధారపడ్డ వాళ్ళు మరో నలుగురు. ఓ విధంగా అతను తన తల్లిదండ్రులు ఈ ‘ఆపరేషన్ లెనిన్ బోల్ట్’ ఆరంభమై ఈ కష్టాలన్నీ అనుభవించకుండా దాటుకెళ్ళిపోవడాన్ని అదృష్టంగా భావిస్తుంటాడు. అప్పట్లో అతని వయసు ఇరవై మూడు. మనిషిగా తననెప్పటికీ గుర్తించలేని ఈ మాతృభూమి పట్ల దేశభక్తి అతని కణాల్లో అగ్నిని రగిల్చేది. సైన్యంలో చాలా చిన్న ఉద్యోగంలో చేరి యుద్ధం చేసే బీభత్సాన్ని ఓ సాక్షిలా తన కళ్ళారా చూశాడు. ‘యుద్ధంలో వీరమరణమన్నదే లేదు.. రక్తపాతం తప్ప! వీధుల్లో యుద్ధట్యాంకులు నడుస్తుంటే మనసులో ఆనందం ఎలా ఉంటుంది.. ఏదో ఖాళీ అయిన భావన తప్ప! యుద్ధంలో విజయం అంటే ఈ మనసు ఖాళీ అయిందానికా లేక ఈ భయంకరమైన పరిస్థితులకా? దేన్ని విజయం అంటారు? అంతా కల్పితం, అంతా మాయ కాకపోతే!’ మసాలా టీ తాగుతూ ఎన్నోసార్లు మజీద్ యుద్ధమంటే తన ఏవగింపును కవితాత్మకంగా తన మిత్రునితో పంచుకునేవాడు. ఈ యుధ్ధంలోనే అజీజ్ తన సర్వస్వాన్ని, తన కుటుంబంతో సహా కోల్పోయాడు. నెలల తరబడి అతను తనలాంటి వాళ్ళతో కలిసి ఎంతో బెంగగా, తన దగ్గరికి రాని చావు కోసం ఎదురు చూస్తూ టెంట్లలో నివసించాడు. ఒక్కొక్కరుగా తన తోటివారి మరణాలు అతన్ని నెమ్మదిగా ఇహలోకంలోకి తెచ్చాయి. ‘పోయిందేదో పోయింది, ఇకనైనా నేను ఇతరులకి ఉపయోగపడేలా జీవించాలి’ తన్ను తానే సమాధానపర్చుకున్నాడు. అది మొదలు ఎవరికి ఏ సహాయం కావాలన్నా, శవాలు పూడ్చడంతో సహా చేయందించేవాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన సంచార జీవులు, వారికి సంబంధం లేని ఈ దేశం పట్లా, ఆ దేశపౌరుల పట్లా వారికున్న భక్తిభావం, అంకితభావం.. అన్నీ అతనికి ఎంతో విస్మయం కలిగించాయి. అప్పటి నుండి ఈ సంచారజాతుల పట్ల అతని దృక్పథం ఎంతో మారిపోయింది. అటువంటి వారికి తన హృదయంలో భగవంతుని తర్వాత అంతటి స్థానం కల్పించాడు. ఉద్రిక్తతలకు నెలవైన సరిహద్దుల నుంచి యుద్ధట్యాంకులు వెనక్కి వెళ్ళాక, వీళ్ళు కూడా తమ తమ ఆవాసాలకి.. గుర్తింపు లేని, అణచివేయబడ్డ తమ జీవితాల్లోకి తిరిగి వెళ్ళిపోవడాన్ని గమనించాడతను. తమ దేశానికి కొత్తగా వచ్చిన స్వాతంత్య్రానికి ప్రతీకగా ఎగిరే జెండాను ఎక్కడ చూసినా సరే అతన్ని ఏదో అపరాధభావనతో చీల్చేసేది. ఈ విజయానికి ఇతర మిత్రదేశాలు సంబరాలు చేసుకుంటుంటే త్యాగాలు చేసిన ఈ సంచార జీవులు మాత్రం అజ్ఞాతంగా ఉండిపోయారు. ‘ఈ కపటనాటకాలతో నా మనసు అవమానంతో దహించుకుపోతోంది, నిస్సహాయుడినైపోయాను!’ అజీజ్ అన్నాడు. ‘ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు!’ విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్. ‘అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్!’ ‘స్వర్గమా!’ బుస కొట్టాడు అజీజ్. ‘నిజమే! ఒక్కడివే భారీ మార్పులు తేలేకపోవచ్చు, కానీ నువ్వు నాపై చూపే మంచితనం నా జీవితానికెంత ముఖ్యమో తెలుసా! నువ్వు ఆ అల్లా దూతవని నేనెప్పుడూ నమ్ముతాను.’ ‘అబ్బా, మజీద్! పొగడ్డానికైనా ఓ హద్దుండాలయ్యా!’ ‘ఇదేం పొగడ్త కాదు, నిజమే కదా?’ అజీజ్ తన ఖాళీ కప్పుని పక్కన పెట్టి, తలపైని టోపీ తీసేసి కౌంటర్ వెనక్కెళ్ళి కూచున్నాడు. ‘అస్సలామలేకుమ్!’ నీలిరంగు కోట్లు ధరించి, వయసులో ఉన్న ఇద్దరు ఈజిప్షియన్లు అక్కడికొచ్చి వైరింగ్ కేబుల్స్ కోసం అడిగారు. అజీజ్ వాళ్ళడిగిన వస్తువుల కోసం అరల వెనక్కి వెళ్ళగానే ఈజిప్షియన్లలో ఒకడు అటూఇటూ చూసి మజీద్ దగ్గరికెళ్లి తన కుడికాలి బూటుని అతనికిచ్చాడు. ‘దీన్ని కుట్టాల్సుంటుంది.. కొంత సమయం కావాలి’ పళ్ళూడి బోసినోరులా కనిపిస్తున్న ఆ బూటుని పరీక్షించి అన్నాడు మజీద్. ‘పర్లేదులే’ మజీద్ తన పనిలో తానుంటే అతను అక్కడున్న ప్లాస్టిక్ స్టూలుపై కూచున్నాడు. మరొకడు అజీజ్ తెచ్చిన వైరు సామానుని పరిశీలిస్తున్నాడు. ఐదారు నిమిషాల్లో మజీద్ తన పని ముగించేశాడు. ఆ యువకుడు బూటుని పరీక్షించి, కాలికి తొడుక్కుని, సంతృప్తిగా మజీద్ వైపు చూశాడు. ‘ఎంతివ్వాలి?’ ‘ఎంత బాబూ, యాభై షిల్స్ అంతే!’ ‘అంతే! చెత్తగాళ్ళు, ఈ దేశదిమ్మరులు కూడా ఎంత ఖరీదు చెబుతున్నారో!’ ప్యాంట్ జేబులని వెతుకుతూ అన్నాడతను. మజీద్ అతనివంక ఏ భావమూ లేకుండా సూటిగా చూశాడు. ఈ చుట్టుపట్ల చెప్పులు కుట్టే వాళ్ళలో తనే చాలా చౌక అని అతనికి బాగా తెలుసు. ‘కుక్కా! తీసుకో!’ నాణాన్ని అతనివైపుకి విసురుతూ, గారపట్టిన పళ్ళని బైటపెడుతూ హేళనగా నవ్వాడా యువకుడు. అతని మాటలని పట్టించుకోనట్టు ఉండిపోయాడు మజీద్. లోలోపల మనసు మండిపోతుంటే పళ్ళు గిట్టకరిచాడు. ఇప్పుడు తనేం మాట్లాడే పరిస్థితిలో లేడని అతనికి తెలుసు. ‘జరిగినదానికి చాలా బాధగా ఉంది మజీద్’ అన్నాడు అజీజ్. తలపైని బట్ట సవరించుకుంటూ నిస్సత్తువగా ఒక్క నవ్వు నవ్వాడు మజీద్. ‘జీవితంలో మనకు బలం, అధికారం లేనప్పుడు ఓర్పు, క్షమ అలవర్చుకోవాలని నేర్చుకున్నాను. ఇప్పుడు వాడు నన్ను కుక్కా అన్నాడు.. కానీ ఈ దేశం దహనమైపోతుంటే వీళ్ళలో ఒక్కడైనా ముందుకు రావడం మనం చూశామా?’ రెప్పల వెనుక కన్నీటిని దాచేశాడు మజీద్. అంగీకారంగా తలూపి అజీజ్ ఓ వార్తాపత్రికను తీసుకుని హెడ్ లైన్స్ చదువుతుండగా ఓ విషయం అతన్ని ఆకర్షించింది. ‘పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం.’ ‘మజీద్! శుభవార్త! సంచారజాతులకు పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ప్రయత్నిస్తోందట! ఇకపై నువ్వు దేశదిమ్మరివని అనిపించుకోనక్కరలేదు.’ ‘హు! ఈ సర్కస్ ఎన్నిసార్లు చూడలేదు అజీజ్! పార్లమెంటులో బిల్లు పెట్టాము అన్న మాటలతో చాలా అలసిపోయాను. ఈ వారంలో నేను జమీలాను తీసుకుని ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. కేవలం సంచారజాతి వాడినైనందుకు డాక్టర్లు ఆమెకు చికిత్స చేయలేదు తెలుసా? మేమలా పుట్టడం నేరమా? మేము మనుషులం కామా?’ ‘నిజమే కానీ, అసలు మీ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. మీలో కొంతమంది మాలాంటి పౌరులకన్నా ఎక్కువ కాలంగా ఇక్కడుంటున్నారు. కానీ ఎడారి ప్రాంతాలలో మిమ్మల్ని వలసదారులుగా చూస్తారు. మరికొందరు సాధారణ పౌరుల్లా తాము కూడా ప్రయోజనం పొందాలని తమ కాగితాలను కాల్చిపడేసి దేశంలోకి చొచ్చుకుని వచ్చేశారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారినీ, చట్టాన్ని గౌరవించేవారినీ ఎలా తెలుసుకోవాలని? ఈ సమస్యకు పరిష్కారం సాల్మన్ రాజు కూడా చూపలేడేమో!’ ‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, కానీ ఈ నిరీక్షణ, ఇంత అన్యాయం.’ ‘చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి!’ ‘1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం గురించి మా నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తు. ఆర్మీలో చేరి, అందులో పనిచేయడానికి సంచారజాతులవారిని ఉపయోగించుకుంటారు కానీ యుద్ధమైపోయాక మాదారి మాదే.. ఎడారి వైపే. దీనివల్ల మానాన్న ఏ మాత్రం ప్రయోజనం పొందలేదు, కేవలం వాళ్ళకి ఉపయోగపడ్డారంతే! కొంతమందికి కంటితుడుపుగా ఏవో కొన్ని అవార్డులిచ్చారే కానీ పౌరులు యుద్ధంలో పాల్గొంటే ఇచ్చేదాని ముందు ఇదెంత? ఎంత దారుణంగా వివక్ష చూపుతున్నారో, మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఇంక మాకు గౌరవం ఏముంటుంది!’ నిట్టూరుస్తూ, ‘నిన్న పుచ్చకాయలు అమ్ముతున్నాడని బద్రుని అరెస్టు చేశారట తెలుసా?’ అన్నాడు మజీద్. అద్దాలు సరిచేసుకుంటూ పత్రికలోంచి తలెత్తి చూశాడు అజీజ్. అతనికేం చెప్పాలో తోచలేదు. అతని అదృష్టం కొద్దీ మధ్యాహ్న ప్రార్థనల కోసం మసీదు నుంచి వచ్చిన పిలుపు గాలిని నింపేసింది. ఇద్దరూ తమ తమ చాపల్ని పరుచుకొని మక్కావైపుకు తిరిగి ప్రార్థించసాగారు. లయబద్ధంగా ప్రార్థన చేస్తున్నవారి కంఠం నుండి వస్తున్న శ్లోకాలు ఆ మధ్యాహ్నవేళ నిశ్శబ్దాన్ని కరిగించసాగాయి. ఓ పదిహేను నిమిషాల పాటు వీధులన్నీ స్తబ్ధుగా మారినా, వెంటనే మళ్ళీ మామూలే.. ఉరుకులు, పరుగులు. ఆ ఇద్దరూ ఒకరు దేశపౌరుడు, మరొకరు సంచార జాతివారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే భగవంతుని ముందు మోకరిల్లారు. బహుశా ఆయనకి స్వర్గానికి, మనుషుల మనసులకు తేడా తెలియదేమో! చాప మడుస్తూ ఎందుకనో మజీద్ ఆలోచనలో పడ్డాడు. ‘ఏమిటంత ఆలోచన మజీద్?’ ‘మా సంచారజాతుల వాళ్ళమంతా కూడా సంచారజాతి దేవుడినే ప్రార్థించాలేమోనని!’ ‘ఛ! ఏమిటా మాటలు?’ గట్టిగా అరిచాడు అజీజ్. ‘ఒక్కోసారి భగవంతుడు గుడ్డివాడు, చెవిటివాడు అనిపిస్తుంది. సిగ్గుతో తన ముఖం చూపించలేక దాచుకున్నాడనిపిస్తుంది. ఎంత కాలమిలా? మా ప్రాణాలు విసిగిపోయాయి! అందుకే నేను..’ ‘నిరాశతో దైవదూషణకు పాల్పడవద్దు మజీద్! మరి నేను ఏ దేవుడిని ప్రార్థించాలని? ఏ దేవుడైతే నాకు ఇంటినీ, కుటుంబాన్నీ ఇచ్చాడో అదే దేవుడు వాటిని నాశనం కూడా చేశాడు. అంత మాత్రాన నేను మరో దేవుడిని ప్రార్థించాలా? మన జీవితాలే మనకు పాఠాలు కావాలి అంతే!’ స్నేహితుని భుజం తడుతూ అన్నాడు అజీజ్. ‘అంటే, ఇదే న్యాయమంటావా?’ ‘కావచ్చేమో! అయితే అది తెలుసుకోవడానికి మనం తెరవాల్సింది కళ్ళు కాదు, మనసు! ఒక్కోసారి ఎంత తరచి చూసినా ఇవన్నీ మనకు అర్థంకావు కూడా. యుద్ధక్యాంపులోని నా జీవితం ఇతరులకి సహాయం చేయడంలో తప్ప మరెందులోనూ అర్థం లేదని తెలిపింది.’ అర్థం లేని నిరీక్షణలో, నిరాశతో కుంగిపోయిన తన స్నేహితుడివైపు జాలిగా చూశాడు అజీజ్. మజీద్ తన పౌరసత్వం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నాడో అతనికి బాగా తెలుసు. జీవితంలో ఏ హక్కులూ, అంతెందుకు ఓ గుర్తింపు కూడా లేకపోవడమంటే మనిషినెంత వేధిస్తుందో అజీజ్‌కి బాగానే అర్థమవుతోంది. అతనికి మజీద్ పరిస్థితి తలలేని మొండెంలా అనిపిస్తోంది. మజీద్ స్థితిగతుల్ని ఏ మాత్రం మార్చలేని తను చూపించే జాలి, సానుభూతి ఎంత వరకు ఉపయుక్తమో తల్చుకున్న కొద్దీ బాధ కలిగిస్తోంది అతనికి. ‘మంచిరోజులు వస్తాయిలే మజీద్!’ ఆశావహంగా అన్నాడు అజీజ్. ‘నాకు మా తండ్రి మరణించిన రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు మా నాన్న శవం అనామకంగా.. ఆయన తండ్రిలాగే ఎక్కడో పూడ్చిపెట్టామే తప్ప ఆయనకో గుర్తింపు లేదని గ్రహించలేకపోయాను. రేప్పొద్దున నేనైనా అంతే! అదేమంత బాధ కాదు కానీ, రాబోయే తరాలు తమ తాతముత్తాతలని ఎక్కడ పూడ్చిపెట్టారో కనీసం తెలుసుకుంటారు. అవి తమకు చెందినవేనని అర్థంచేసుకుంటే అదో తృప్తి, అంతే! మాలాంటి వాళ్ళంతా అంతే, ఎక్కడ పుట్టామో, ఎక్కడికి వెళుతున్నామో, మాకంటూ ఓ ఉనికీ, దానికో నిదర్శనమూ ఏదీ ఉండదు’ అన్నాడు మజీద్. ‘సరే, ఇక భోంచేద్దాం పద’ మనసుని తొలిచే ఈ అంశం నుండి మజీద్ దృష్టి మరల్చడానికి అజీజ్ అన్నాడు. కళ్ళద్దాలని సరిచేసుకుంటూ అజీజ్ తన భోజనాన్ని తీసుకొచ్చాడు. రొట్టె, పెరుగు తెచ్చుకోవడానికి మజీద్ బైటికెళ్ళాడు. ప్రతిరోజూ అతను అలీబాబా బేకరీ వాళ్ళు వందమందికి చేసే దానంలో ఈ రొట్టె, పెరుగు తెచ్చుకుని భోంచేస్తుంటాడు. ఈజిప్టు దేశ కార్మికులు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, భారతీయులు ఎక్కువ భాగం ఈ అలీబాబా వారి ఔదార్యంతోనే జీవిస్తుంటారు. ప్రతిఒక్కరికీ వెచ్చని నాలుగు రొట్టెలు, ఓ సీసాడు పెరుగు.. దీనికోసం ఎంతోమంది క్యూ కడుతుంటారు. అదేం పోషకాహారం కాకపోయినా ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది మరి! ప్రత్యేకమైన రోజుల్లోనూ, రంజాన్ మాసంలోనూ అతను మసీదులో పెట్టే భోజనంతోనే గడిపేస్తుంటాడు. వీలైతే తన ఇంట్లోవారి కోసం ఓ ప్లాస్టిక్ సంచిలో అక్కడి నుండి భోజనపదార్థాలు తీసికెళుతుంటాడు. తన రొట్టె, పెరుగు తీసుకుని మజీద్ గబగబ అజీజ్ దుకాణానికి పరిగెట్టాడు. అక్కడ అజీజ్ తన కోసం ఎదురు చూస్తుంటాడు మరి! ప్రతిరోజూ తెల్లవారే అజీజ్ తన మధ్యాహ్న భోజనాన్ని వండుకుని తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైనా మాంసం వండుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే వండి మజీద్ కోసం తెస్తుంటాడు. అజీజ్ తన డబ్బా మూత తెరిచేసరికి వంటకాల ఘుమఘుమలు షాపంతా అల్లుకున్నాయి. దాంతో ఇంటి గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు మజీద్. ఫరీదా కుట్లు అల్లికల్లో ఎంతో నిష్ణాతురాలు. అలా సంపాదించిన డబ్బుతో ఆమె మాంసమూ, ఎప్పుడైనా పిల్లలు జబ్బు పడినప్పుడు మందులకూ ఉపయోగిస్తుంటుంది. బాగా డబ్బున్న ఓ అరబ్బీ ఆవిడకు ఫరీదా చేసే ఎంబ్రాయిడరీ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఫరీదాని తన కోసం మరిన్ని ఎంబ్రాయిడరీ పనులు చేసివ్వమని అడుగుతుంటుంది. తన చేతివేళ్లు నొప్పి పుట్టినా, కళ్ళకు శ్రమ కలిగినా సరే, వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయాన్ని ఫరీదా వదులుకోదు. పిల్లలు ఎలాగూ బడులకు వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనో, ఆ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంటిపనీ, ఎంబ్రాయిడరీ పనీ, పిల్లలని చూసుకోవడంతో ఆమెకు పొద్దు చాలదు. అయినా ఎంతో నేర్పుతో అన్నీ సంబాళించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ధనికురాలు పిల్లలకోసం పాలపొడి, పిండి.. జమీలా, సిరాజ్, ఒమర్‌లకు తన పిల్లల పాతబట్టలను కూడా ఇస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకదే కాస్త ఊరట కలిగించే విషయం. ‘మాంసం చాలా చక్కగా వండావు అజీజ్, కాస్త నా రొట్టె కూడా తీసుకో. దీంతో పాటే అది కూడా బాగుంటుంది’ అన్నాడు మజీద్. ‘అయితే ఈ అన్నాన్ని ఎవరు తింటారు? ఈసారి నీ రొట్టె కోసమే వస్తాన్లే’ చిన్నగా నవ్వాడు అజీజ్. వెన్నెల్లాంటి ఆ నవ్వును చూస్తూ మజీద్ ‘నిజమే, దేవుడున్నాడు’ అనుకున్నాడు. ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. ఆ రాత్రి చీకటి దట్టంగా పరుచుకున్న ఆకాశంవైపు చూడసాగాడు మజీద్. గాలి ఈలలు వేస్తూ వచ్చి ఇసుక తిన్నెలపై వాలి అక్కడే ఆగిపోతోంది. ఒంటెలు వాళ్ళుంటున్న పరిసరాల్లో అటూ ఇటూ బద్ధకంగా తిరుగుతున్నాయి. కిటికీ దగ్గరగా కూచుని అతను మనసారా ప్రార్థన చేసుకుని ఆకాశం వైపు చూశాడు. మేఘాలన్నీ దక్షిణం వైపు జరిగిపోవడంతో ఓ నక్షత్రం ఆ ప్రదేశాన తళుక్కుమంది. చంద్రుని చూసిన చకోరంలా అతని ఎద ఎగిసిపడింది. ఇంతకుముందు ఒకసారి అజీజ్ తన షాపులో సామాను ఉంచుకోవడానికి అనుమతినిచ్చినపుడు ఇలాగే.. ఓ తార నీలాకాశంలో తళుక్కుమంది! ఆశనిరాశల ఈ ఊగిసలాటలో తన కుటుంబాన్ని చంపేసి, తను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులవి. తన పనిముట్లున్న సంచిని పట్టుకుని ఇల్లిల్లూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా ఓ షాపు ముందు అలిసిపోయి కూచుంటే.. అప్పటికది అజీజ్దని తనకి తెలియదు. మధ్యాహ్నపు ఎండకు సోలిపోతుంటే అజీజ్ తనని లోనికి రమ్మని మంచినీళ్ళిచ్చి వివరాలు కనుక్కున్నాడు. అప్పటి నుండే తన జీవితం చిన్న మలుపు తిరిగింది మరి! ‘ఎందుకు నాన్నా నవ్వుతున్నారు?’ తండ్రితో పాటు ఆకాశంలోకి చూస్తూ అడిగాడు ఒమర్. తాము కూడా కళ్ళువిప్పార్చుకుని చూస్తూ తండ్రిని చుట్టుముట్టేశారు సిరాజ్, జమీలాలు. ఫరీదా భర్త వైపు చిరునవ్వుతో ఓసారి చూసి తన పనిలో పడిపోయింది. మజీద్ తన పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్న అతను పిల్లలను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఏదో శుభసూచకం అతని మనసుకి తోస్తోంది. కచ్చితంగా మంచిరోజు వస్తోంది! శుక్రవారం గాలిలో ఏదో మత్తు జల్లినట్టు తెల్లవారింది. ఎందుకనో ఆ వేళ ప్రార్థనలకు మసీదుకు వెళ్ళాలనిపించింది మజీద్ మనసుకి. మధ్యాహ్న ప్రార్థనలయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్లో ఎవరో బోర్లా పడి ఉండడం కనిపించిందతనికి. ఆ అబ్బాయిని తిప్పి చూసిన మజీద్ అతని ముఖం మీద రక్తపు చారికలు కనిపించేసరికి నివ్వెరపోయాడు. స్ప్పహ తప్పిన అతన్ని చేతుల్లోకి తీసుకుని దారేపోతున్న ఓ లారీని ఆపి దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. క్యాజువాల్టీ వార్డులో ఆ అబ్బాయిని అప్పగించి, ఆతృతగా బైట నిలబడి ఎదురుచూడసాగాడు. ఎందుకనో తను ఇబ్బందుల్లో పడబోతానేమో అనిపించింది అతనికి. ఇక ఇంటికి వెళదాం అనుకున్నంతలో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న ఓ డాక్టర్ అతన్ని ఆగమని సైగ చేశాడు. గుండె దడ పుట్టి, ఏదో కడుపులో తిప్పుతున్న భావన అతనిలో! నొసలంతా చెమటలు పట్టి, కంఠం పొడిబారిపోయింది అతనికి. ఇంతలో తళతళలాడే ఓ నల్లని జాగ్వార్ కారు ఆస్పత్రి ముందు ఆగింది. అందులోంచి కలవరపాటుతో మొహం ఉబ్బిపోయిన ఓ అరబ్ దిగాడు. ఆందోళనకు చిరునామాలా ఉన్నాడతను. పైబట్టని సర్దుకుంటూ, జారిపోతున్న నల్లని దుస్తులని సరిచేసుకుంటూ లోనికి అడుగుపెట్టాడు. శరీరం వణికిపోతుండగా అతను మజీద్‌ని దాటి క్యాజువాల్టీ వార్డులోపలికి వెళ్ళాడు. మనసు లోపల్లోపల తను ఏ తప్పూ చేయలేదని తెలిసినా, అతన్ని ఏదో తెలియని భయం ఆవరించింది. శక్తినంతా కూడగట్టుకుని పారిపోదామనుకున్నంతలో, ఇంతకు ముందు మొబైల్ ఫోన్లో మాట్లాడిన డాక్టరూ, ఈ అరబ్బూ కలిసి బైటికొచ్చారు. కొంతసేపు వాళ్ళేం మాట్లాడుకున్నారో కానీ.. ఆ డాక్టరు మజీద్ వైపు చూపించడమూ, ఆ అరబ్బు అతన్ని దగ్గరికి రమ్మని సైగ చేయడమూ జరిగిపోయాయి. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయి మజీద్ కదల్లేకపోయాడు. ఇంతలో ఆ అరబ్బు అతని దగ్గరికొచ్చి కష్టంతో కరకుదేరిన మజీద్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనంతగా మజీద్ మనసు మొద్దుబారిపొయింది. ‘అల్లా హు అక్బర్! నువ్వు లేకపోతే మా అబ్బాయి రోడ్డు మీదే చచ్చిపోయుండేవాడు. ఆ దేవుడే నిన్ను పంపాడేమో! నీ పేరేంటి?’ వణుకుతున్న పెదాలతో అడిగాడా అరబ్బు. ‘మజీద్.’ ‘ఏం చేస్తుంటావు?’ ‘చెప్పులు కుడతాను.’ ‘ఎక్కడుంటావు?’ ‘పనార్లో, నేనో సంచారజాతివాడిని.’ క్షణంపాటు స్థాణువైన అరబ్బు మాటలకోసం వెతుక్కున్నాడు. ‘నీతోపాటు ఎవరెవరున్నారు?’ ‘నా భార్య, ముగ్గురు పిల్లలు.’ ‘వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చేయకూడదూ! నువ్వు మా ఇంట్లో తోటపని చేద్దూగానీ. మీ పిల్లల్ని చదివిస్తాను, నీ భార్యని కాస్త తేరుకోనీ!’ మజీద్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఉన్నట్టుండి అతనికి మిలమిల్లాడే ఆ నక్షత్రం గుర్తుకొచ్చింది. ఎంత కాకతాళీయం! దేవుడు తన కష్టాలని కడతేర్చ నిశ్చయించాడేమో! కన్నీళ్ళతో ముఖం తడిసిపోతుండగా మజీద్ మక్కా వైపుకు తిరిగి మోకరిల్లాడు. ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు! విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్. అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్! చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి! ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. — మూల కథ : ది సైన్ (ఇంగ్లిష్) రచయిత్రి : స్నేహ సుసాన్ షిబు తెలుగు అనువాదం: డాక్టర్ యు విష్ణుప్రియ. ఇవి చదవండి: Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం! -
డాక్టర్ గీతారెడ్డి బోర: స్టార్టప్ దిశగా అంకురం!
'సమాజం మారాలి.. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు తేవాలి. ఈ ప్రసంగాలు వింటూనే ఉంటాం. మారాలని అందరూ కోరుకుంటారు. మార్పు కోసం ఏం చేయాలో తెలిసిన వాళ్లెందరు? సమాజం మారాలంటే ఏం చేయాలో తెలిసి ఉండాలి. ఆ మార్పు మనతోనే మొదలు... అనుకోవాలి. మార్పు దిశగా తొలి అడుగు వేయగలిగిన చొరవ ఉండాలి. అలా డిజిటల్ ఎరాలోకి అడుగుపెట్టారు డాక్టర్ గీత. తన పాదముద్రలతో అభివృద్ధి దారి చూపిస్తున్నారు.' ఈ డిజిటల్ యుగంలో దాదాపుగా అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. ఇలాంటి డిజిటల్ ఎరాను ముందుగానే ఊహించి సమాజాన్ని ప్రభావితం చేసిన సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ గీతాబోర. ప్రపంచదేశాలన్నీ ఒక తాటిమీదకు వచ్చి ఒకేరకమైన నైపుణ్యాలతో గ్లోబల్ వేదిక మీద పోటీ పడుతున్న తరుణంలో మన గ్రామీణ విద్యార్థుల్లో ఎంతమంది ఈ పోటీలో నిలవ గలుగుతున్నారనే ప్రశ్న వేసుకుని అందుకు సమాధానంగా కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్‌లో శిక్షణ అవసరాన్ని గుర్తించారామె. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ప్లేస్మెంట్ దొరక్క మిగిలిపోయిన పిల్లలు బీపీవోల్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగాల్లో ఉపాధిని వెతుక్కోవాల్సి రావడం, క్రమంగా నైట్‌లైఫ్‌కు అలవాటు పడిపోవడం, యువశక్తి నిరీ్వర్యం కావడంతోపాటు సమాజంలో చాపకింద నీరులా వ్యసనాలు విస్తరించడాన్ని గ్రహించారు. అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరూ పట్టా చేతపట్టుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు సొంతంగా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలని, స్టార్టప్ దిశగా నడవడానికి విద్యార్థి దశలోనే ఈ ఆలోచనకు అంకురం వేయాలని ఆలోచించారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో సరి్టఫికేట్ కోర్సుకు రూపకల్పన చేశారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా సమాజానికి తన కంట్రిబ్యూషన్ గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారామె. 'మన సమాజం ఉద్యోగాలు వెతుక్కునే సమాజంగానే ఉండిపోవడానికి కారణం కూడా పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు యువత ఆలోచనలను చిదిమేయడమే. పెద్దవాళ్ల కంటే యువత ఒక తరం ముందు ఉంటుంది. ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఆలోచనలకు ఒక అండ దొరికితే వాళ్లు అద్భుతాలు చేస్తారు'. – డాక్టర్ గీతారెడ్డి బోర, ఫౌండర్, యష్మి సొల్యూషన్స్, యష్మిత ఈ టెక్నాలజీస్, చైర్పర్సన్, సీఐఎమ్ఎస్ఎమ్ఈ, ఆంధ్రప్రదేశ్ ‘‘నేను పుట్టింది, పెరిగింది వైజాగ్‌లో. ఎంసీఏ తర్వాత హైదరాబాద్‌లో పన్నెండేళ్లపాటు ఉన్నాను. ఇప్పుడు నా కంపెనీ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలను వైజాగ్ నుంచే నిర్వహిస్తున్నాను. సమాజం మారాలని వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం కాదు, విద్యావ్యవస్థను గాడిలో పెడితే, యువత ఆలోచనలను అభివృద్ధి వైపు మరలి్చనట్లయితే సమాజం దానంతట అదే మారుతుంది. సరిగ్గా నేను అదే చేస్తున్నాను. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 41 ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రసంగించి, నాలుగువందల మంది విద్యార్థులను ప్రభావితం చేయగలిగాను. వారిలో 150 మంది తమ సొంత ఆలోచనలతో ఎంటర్ప్రెన్యూర్ షిఫ్ వైపు అడుగులు వేస్తున్నారు. పెద్దవాళ్లు అనుభవం పేరుతో యువత ఆలోచనలకు పరిధులు విధిస్తుంటారు. ఇది చాలా తప్పు. యువత ఆలోచనలను బయటకు చెప్పగలిగేలా వాళ్లను ్రపోత్సహించాలి. పెద్దవాళ్లు ఎప్పుడూ యువత ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి తమ అనుభవం నుంచి కొన్ని సూచనలు చేయవచ్చు. అంతేతప్ప యువత ఎలాంటి ఉపాధిని వెతుక్కోవాలనే ఆలోచనలు కూడా తామే చేయాలనుకోకూడదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మెంటార్, రీసోర్స్ పర్సన్, మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాను. చైల్డ్ అబ్యూజ్, మహిళల పట్ల వివక్ష, మహిళల కుటుంబ, వైవాహిక పరమైన చిక్కులకు న్యాయసలహాలతో కౌన్సెలింగ్ ఇస్తున్నాను. మా వైజాగ్‌లో భూబకాసురుల చేతిలో చిక్కుకున్న భూమి వివరాలను, ఒరిజినల్ డాక్యుమెంట్ల ఆధారాలను ప్రభుత్వానికి తెలియచేసి, బాధితులకు అండగా నిలిచాను. ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉమన్‌గా సమాజానికి ఇస్తున్న సేవకుగాను ‘నారీప్రెన్యూర్’ గుర్తింపును అందుకున్నాను. ఇప్పుడు నా మీద మహిళల కోసం పని చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గ్రామీణ మహిళలను ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి కార్యక్రమాల మీద పని చేస్తున్నాను. పరిమితమైన వనరులు, సాధారణ విద్యార్హతలు కలిగిన గ్రామీణ మహిళ తన మేధను ఉపయోగించి ఎదగడానికి అవసరమైనట్లు శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తున్నాను. ఆడవాళ్లు అభ్యుదయ కోణంలో ఆలోచించనంత కాలం సమాజం అభివృద్ధి దిశగా నడవదు. అందుకే మహిళ మారాలి, ఆమె మారితే పిల్లల ఆలోచనలు మారుతాయి. ఆ భావితరం మనం కోరుకున్న సమాజాన్ని నిర్మిస్తుంది’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి బోర. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. ఇవి చదవండి: వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే.. -
Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..!
‘బెహనో.. ఔర్ భాయియో..’ ఈ గొంతుతో ప్రేమలో పడని రేడియో శ్రోత ఉండేవాడు కాదు. ‘బినాకా గీత్మాల’ టాప్ 13లో ఏ పాట నిలుస్తుందో చూద్దామని వారమంతా ఎదురుచూపులు. నవ్వుతూ నవ్విస్తూ గుంజిపారేసే ఆకర్షణీయమైన గొంతుతో దశాబ్దాల పాటు పాటలను పంచిన రేడియో ప్రెజెంటర్ అమిన్ సయానీ తన 91వ ఏట బుధవారం వీడ్కోలు తీసుకున్నాడు. ఇకపై భారతీయ సాంస్కృతిక ఆనవాలై అతను వెలగనున్నాడు. పాటలు విరబూస్తాయి. అదిగో అల్లంత దూరాన ఒక చామంతి పూస్తుంది. ముళ్లను వెనక్కు నెడుతూ ఒక రోజా మెడ నిక్కి చూస్తుంది. గుబురు చాటున మల్లెమొగ్గ ఒకటి సిగ్గుతో మొహం దాచుకుంటుంది. గరిక పచ్చతావులో గడ్డిపూవు వర్ణనకు అందని రంగుతో కాంతిలీనుతుంది. వాటి మానాన అవి ఉన్నప్పుడు మన చూపు పడకపోవచ్చు. పడినా వాటి సౌందర్యమేమిటో తెలియకపోవచ్చు. అప్పుడొక పూలమాలి వస్తాడు. ఒక పువ్వు సువాసన ఎంత ప్రత్యేకమైనదో చెబుతాడు. మరో పూలరెక్క వయ్యారాన్ని చూపి విస్మయపడతాడు. ఒక పువ్వును నాసిక దగ్గర చేర్చడమే భాగ్యమంటాడు. ఒక పువ్వునలా కొమ్మకు వదిలిపెట్టమని మారాము చేస్తాడు. అప్పుడా పూల మీద మనకు ప్రేమ కలుగుతుంది. మనమూ వాటికి మాలిగా మారాలనుకుంటాము. గుండెకు దగ్గరగా చేర్చుకుంటాము. హృదయంతో వాటి పోషణకు పూనుకుంటాము. అమిన్ సయానీ చేసింది అదే.. రేడియో సిలోన్లో హిందీ సినిమా పాటలను శ్రోతలకు చేర్చడం. వాటిపై ప్రేమను పంచడం. వాటిని పాడుకుంటూ, కూనిరాగాలు తీస్తూ, ఆ మనోహర మాయలో చిక్కుకుంటూ జనం తమ బతుకు బాదరబందీని కాసేపు మరచిపోయేలా చేయడం. 1952 డిసెంబర్లో మొదటి షోగా మొదలైన ‘బినాకా గీత్మాల’ బినాకా టూత్‌పేస్ట్ వారి స్పాన్సర్డ్ప్రోగ్రామ్. ప్రతి బుధవారం సాయంత్రం రేడియో సిలోన్లో ప్రసారమయ్యేది. టాప్ 13తో మొదలయ్యి టాప్ 1 వరకూ కౌంట్‌డౌన్‌గా పాటలు ప్రసారమయ్యే ఆ షో చివరలో తర్వాతి వారం కోసం ‘లిస్ట్’ అయిన పాటలను చెప్పి వాటిని శ్రోతలు ఏ వరుసలో మెచ్చుతారో రాసి పంపమనేవారు. టాప్ వన్‌గా నిలిచే పాటను ఎక్కువమంది దేనిని ఎంపిక చేస్తారో దానికి ఆ ర్యాంక్ ఇచ్చేవారు. టాప్ 1ను సూచించిన వారి పేర్ల నుంచి జాక్‌పాట్ తీసి ఒక శ్రోతకు 100 రూపాయల బహుమతి ఇచ్చేవారు. అమిన్ సయాని మొదటి షో చేసేసరికి ఎంత హిట్ అయ్యిందంటే మరుసటి వారానికి 9 వేల ఉత్తరాలు స్పందనగా అందాయి. సంవత్సరం గడిచే సరికి వారం వారం వచ్చే ఉత్తరాల సంఖ్య 65 వేలకు చేరుకుంది. పోస్టాఫీసు వాళ్లు, రేడియో స్టేషన్ వారూ పిచ్చెత్తి పోయేవారు. తర్వాత ఈ రెస్పాన్స్ తంతును ఆపేసి సయానీ ఎంపిక మీద, రికార్డుల అమ్మకాలను బట్టి టాప్ 1ను డిసైడ్ చేసేవారు. ఏ జందగీ ఉసీకి హై.. అమిన్ సయానీ చేసిన బినాకా గీత్ మాలాలో ఏ వారం ఏ సింగర్ పాడిన పాట టాప్ సాంగ్‌గా నిలుస్తుందో తెలుసుకోవడం శ్రోతలకే కాదు సినీ రంగ దిగ్గజాలకు కూడా పెద్ద ఆసక్తిగా ఉండేది. బినాకా చార్ట్‌లో చోటు చేసుకోవడం గౌరవంగా భావించేవారు. ఇక కొన్ని పాటలైతే వారాల తరబడి టాప్ 1గా నిలిచి ఆ గాయకులకు, సంగీత దర్శకులకు క్రేజ్‌ను సంపాదించి పెట్టేవి. సంవత్సరం చివరలో అమిన్ సయానీ ‘సాంగ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ ఒక పాటను ప్రకటించేవాడు. ఆ రోజుల్లో ‘ఏ జందగీ ఉసీకి హై’ (అనార్కలీ– 1953), ‘జాయెతో జాయె కహా’ (టాక్సీ డ్రైవర్ – 1954), ‘మేరా జూతా హై జపానీ’ (ఆవారా – 1955), ‘ఏ దిల్ ముష్కిల్ జీనా యహా’ (సి.ఐ.డి – 1956)... ఇలా పాటలు శ్రోతల మెచ్చుకోలుతో వెలిగేవి. బినాకా గీత్మాలాలో ఎక్కువసార్లు టాప్ ΄÷జిషన్‌లో నిల్చున్న గాయని లతా. ఆ తర్వాత రఫీ. ఆ మృదుత్వం.. ఆ దగ్గరితనం.. అమిన్ సయానీ గొంతు, వాడే సులభమైన భాష, ఉచ్చారణ, మధ్య మధ్య జోకులు, కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఇవన్నీ కలిసి షోను విపరీతంగా హిట్ చేశాయి. అమిన్ రేడియో అనౌన్సర్లకు మార్గదర్శి అయ్యాడు. ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో’ అనిపించుకున్నాడు. జీవితాంతం ఫ్రీలాన్సర్‌గానే అమిన్ రేడియో సిలోన్లో, వివి«ద్ భారతిలో షోస్ చేశాడు. అలాగే ఎన్నో అడ్వర్టైజ్మెంట్లలో ఆయన గొంతు వినిపించేది. సినిమా వాళ్ల అవార్డు ఫంక్షన్లలో, మ్యూజిక్ ప్రోగ్రాముల్లో అమినే యాంకర్. అంటే ఇవాళ దేశంలో ఉన్న పాపులర్ అనౌన్సర్లకు, యాంకర్లకు సయానీ సిలబస్ సెట్ చేసి వదిలాడు. ‘సినిమా పాటలే మన దేశంలో సగటు ప్రజలందరినీ కలిపి ఉంచాయి’ అంటాడు అమిన్ సయానీ. బొంబాయిలో పుట్టి పెరిగి ముంబైలోనే తుదిశ్వాస వదిలిన అమిన్ సయాని ఆల్ ఇండియా రేడియో ఉజ్వల రోజులను, గోల్డెన్ ఎరా ఆఫ్ హిందీ మ్యూజిక్‌ను ప్రస్తావించినప్పుడల్లా తన ప్రియమైన గొంతుతో పునరుత్థానం చెందుతూనే ఉంటాడు. ఇకపై కూడా అందమైన పూలు ఎన్నో పూయవచ్చు. కాని వాటిని ఊరికూరికే చూస్తూ పదేపదే సంబరపడిపోయే ఒక మాలి మరి ఉండడు. అదంతా గతం. సుందరమైన గతం. ఎంతో శ్రావ్యంగా పదిలపరుచుకునే గతం. అది సినీ సంగీతాన్ని ఇష్టపడే వారి సొంతమైన జ్ఞాపకం. ఇవి చదవండి: Karishma Mehta: కథలు మార్చగలవు -
ఓ సారి ఇటు చూడండి బ్రదర్..! మీకోసమే ఈ చాయ్..!!
మారుతున్న కాలానుగుణంగా మానవ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా కొత్తగా, వింతగా, తక్కువ ఖర్చు, సులభంగా ఉండేట్లుగా ఆలోచిస్తున్నారు. విషయంలోకి వెళితే.. టీ తాగని వారు.., ఆ రుచి ఇష్టపడని వారు కూడా ఈ సరికొత్త టీ-స్టాల్‌ని చూశారో ఓసారైనా ట్రై చేద్దామనుకుంటారు. ఇక అదేంటో చూసేద్దాం! వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద కంపెనీలు ప్రవేశించి జిల్లాలు, మండలాల వారీగా ప్రాంచైజీలు ఇస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టీ స్టాళ్లూ ఏర్పాటువుతున్నాయి. ఈమేరకు పాత ఆటోలను మొబైల్ టీ స్టాళ్లుగా హైదరాబాద్‌లో సిద్ధం చేయించిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తూ ఖమ్మంలో ఆగారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం వద్ద ఆపిన ఈ టీ స్టాల్ వాహనాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇవి కూడా చదవండి: పాత జీన్స్‌ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా? -
ప్రతిష్టాత్మక అగ్రి షో ‘కిసాన్ 2024’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్‌తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్‌లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్‌ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు." 3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!
శుభకార్యం ఏదైనా వధూవరులు, మహిళలు, పురుషులు, పిల్లలు అని తేడా లేకుండా అందరూ పట్టు వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఉట్టిపడుతుంది. దీంతో మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర, డిమాండ్ ఉంది. వస్త్ర దుకాణాల్లో లైట్ల వెలుగులో పట్టు వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. కానీ, అందులో ఏది అసలు, ఏది నకిలీ పట్టు వస్త్రమనేది వినియోగదారులు కనిపెట్టడం చాలా కష్టం. వస్త్ర దుకాణాదారులు కూడా వినియోగదారుడిని బురిడీ కొట్టించే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్వచ్చమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్, మగ్గంపై నేసిన వస్త్రాలకైతే హ్యాండ్లూమ్ మార్క్‌ను అందజేస్తుంది. సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్ ఉన్నట్లయితే అది స్వచ్చమైనదిగా గుర్తించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న వస్త్ర వ్యాపారులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి లోగోలను అందజేస్తారు. పట్టులో పలు రకాలు.. పట్టులో అనేక రకాలున్నాయి. అందులో సహజసిద్ధమైన మల్బరీ సిల్క్‌ను ‘క్వీన్ ఆఫ్ టెక్స్టైల్’గా పిలుస్తారు. ఇది మల్బరీ పట్టు పురుగైన బాంబేక్స్ మోరె నుంచి తయారవుతుంది. ఇది చాలా ఖరీదైనది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 90 శాతం వినియోగిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలన్నీ మల్బరీ పట్టుతోనే తయారవుతున్నాయి. ‘టస్సార్ సిల్క్’ కాపర్రంగులో ఉంటుంది. అడవుల్లో ఉండే పట్టు పురుగుల నుంచి తయారు చేస్తారు. టస్సార్ పట్టును ఎక్కువగా హోం ఫర్నీషింగ్, ఇంటీరియర్ డెకరేషన్లో వినియోగిస్తారు. ఇందీ పట్టు పరుగుల నుంచి ‘ఈరీ సిల్క్’ తయారవుతుంది. ఈరీ పట్టును కాటన్, ఉన్ని, జనపనారతో కలిపి ఫ్యాషన్, ఇతర అస్సెస్సరీస్, హోం ఫర్నీషింగ్ తయారు చేస్తారు. ‘ముంగా పట్టు’ బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిని తయారు చేసే పట్టు పురుగులు అడవుల్లో ఉంటూ సోమ్ అండ్ సోఆలు అనే చెట్ల ఆకులను తింటాయి. అసలైన పట్టును ఇలా గుర్తించవచ్చు.. పట్టు పోగుని వెలిగించినప్పుడు నిరంతరంగా కాలకుండా ఆరిపోతుంది. పట్టు కాలినప్పుడు వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది. పోగు కొనలో చిన్న నల్లపూసలా మారుతుంది. పూసను నలిపినప్పుడు పొడి అయ్యి పోగు గరుకుగా మారుతుంది. పట్టు వస్త్రాలను ఎల్లప్పుడు సిల్క్‌మార్క్ అధీకృత షాపుల్లోనే కొనాలి. పట్టు వస్త్రాలకు ఉన్న సిల్క్‌మార్క్ లేబుల్ 100 శాతం పట్టు ప్రామాణికతను సూచిస్తుంది. పట్టు వస్త్రాలని సిల్క్‌మార్క్ వారిచే ఉచితంగా పరీక్షింప జేసుకోవచ్చు. స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్ ఉంటుంది. మగ్గంపై నేసిన పట్టుకు హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
జపాన్‌లో మంచుగూళ్ల సంబరాలు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా!?
జపాన్‌లో ఏటా మంచుగూళ్ల సంబరాలు జరుగుతాయి. నెల్లాళ్ల పాటు జరిగే ఈ సంబరాల్లో జపాన్ ప్రజలు బాగా హిమపాతం జరిగే ప్రదేశాల్లో మంచుగూళ్లు నిర్మించుకుని, వాటిలో గడుపుతూ విందు వినోదాలతో ఓలలాడతారు. ‘యునిషిగవా ఓన్సెన్ కమకురా’ పేరిట జరుపుకొనే ఈ సంబరాలు ‘స్నో హౌస్ ఫెస్టివల్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందాయి. ఈ ఏడాది ఈ సంబరాలు జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో మంచు దట్టంగా పేరుకునే ప్రదేశాల్లో ‘ఇగ్లూ’ల మాదిరిగా మంచుతోనే చిన్న చిన్న గూళ్ల వంటి ఇళ్లు నిర్మించుకుని, వాటిలోనే తాత్కాలికంగా బస చేస్తారు. రాత్రివేళ వాటిలో పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి, పరిసరాలను దేదీప్యమానం చేస్తారు. జపాన్‌లోని షింటో మతస్థుల దేవుడు ‘కమకురా దైమ్యోజిన్’ గౌరవార్థం ఈ సంబరాలను జరుపుకొంటారు. ఈ సంబరాల్లో షింటో మతస్థుల జలదేవత ‘సుయిజిన్’కు ప్రత్యేక పూజలు జరుపుతారు. జపాన్ను పన్నెండో శతాబ్ది నుంచి పద్నాలుగో శతాబ్ది వరకు పరిపాలించిన ‘కమకురా షొగునటే’ పాలకుల కాలం నుంచి షింటో మతస్థులు ఈ వేడుకలను జరుపుకొంటూ వస్తున్నారు. ఆనాటి రాచరిక ఆచార వ్యవహారాలను తలపించేలా ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంబరాల్లో భాగంగా యోకోటే నగరంలో ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జరిపే కార్యక్రమాలను జానపద సాంస్కృతిక వారసత్వ కార్యక్రమంగా జపాన్ సాంస్కృతిక శాఖ గుర్తించింది. ఇవి కూడా చదవండి: కొంపముంచిన స్టంట్: ఏకంగా 29వ అంతస్థు నుంచి -
రిపబ్లిక్ డే స్పెషల్.. 'మూడు రంగుల ముస్తాబు'
దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్‌లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్ కాన్సెప్ట్‌తో స్పెషల్‌గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్‌ను ఎంపిక చేసుకునే స్పెషల్ డే కి స్పెషల్ లుక్. యాక్ససరీస్.. ► ఔట్ఫిట్స్లో ట్రై కలర్స్‌కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్ గాజులు, బ్రేస్లెట్స్ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్‌లో నెయిల్‌పాలిష్ డిజైన్‌నూ ఎంచుకోవచ్చు. ► వైట్ కుర్తా మీదకు ట్రై కలర్ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది. ► పూర్తి వైట్ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు. ► ఆరెంజ్ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజ్ లేదా సేమ్ ఆల్ ఓవర్ ఒకే కలర్‌ని ఎంచుకోవచ్చు. ► జీన్స్ మీదకు గ్రీన్ కలర్ కుర్తా లేదా లాంగ్ ఓవర్ కోట్, ట్రై కలర్ జాకెట్ ధరించినా చాలు. ప్రఖ్యాత డిజైనర్స్ సైతం తమ డిజైన్స్‌లో తెలుపు, పచ్చ, ఆరెంజ్‌ల ఒకే కలర్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఔట్‌ఫిట్‌ను మనమే సొంతంగా రీ డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
'రిపబ్లిక్ డే' పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా ఏఐ శకటం!
'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.' శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్‌ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది. శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్ల ద్వారా ఏఐ అప్లికేషన్ల ఉపయోగం, నావిగేషన్‌కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
మామిడిపిందె అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..
'మనం సాధారణంగా కోడిగుడ్లల్లో పెద్దవిగానో, చిన్నవిగానో చూసి ఉంటాం. అలాగే కొన్నింటినీ గండ్రంగా గానీ, పొడవుగా గానీ, తోలుగుడ్లలాంటివి కూడా చూసుంటాం. కానీ ఇలాంటి అసలు సిసలైన, గమ్మత్తైన కోడిగుడ్డును చూశారా! మరెందుకు ఆలస్యం.. అదేంటో చూద్దాం!' ఈ ఫొటోలో చూస్తుంది.. మామిడిపిందె అనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాదు కాదు.. తప్పులో కాలేసినట్లే.. అవును ఇది నిజం.. ఇది మామిడిపిందె కాదు.. మామిడి పిందె ఆకారంలో ఉన్న అసలు సిసలైన ‘కోడిగుడ్డు’.. ఇది నమ్మాల్సిన నిజమే.. మామిడి పిందెలాంటి గుడ్డు కథలోకి వెళ్తే.. హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఎదురుగా ఉన్న దుమ్మల శ్రీనివాస్‌యాదవ్ కిరాణంలో గురువారం ఈ మామిడిపిందె ఆకారంలో ఉన్న కోడిగుడ్డు కనిపించింది. అప్పుడే వచ్చిన కోడిగుడ్ల నిల్వను దుకాణంలో ఓ చోట పెడుతూ ఉండగా ఒక్కసారిగా గుడ్ల ట్రేలో తేడా కనిపించడంతో పరీక్షించి చూడగా కోడిగుడ్డు రూపం గమ్మత్తుగా అగుపించింది. కోడిగుడ్డు అచ్చంగా ‘మామిడిపిందె’ ఆకారంలో విచిత్రంగా కనబడటంతో ఆ గుడ్డును అంతా విచిత్రంగా చూస్తూ ఔరా.! ఇదేంటీ ఈ విచిత్రం సుమా.. అనుకోవడం కొసమెరుపే. ఇవి చదవండి: ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ! కానీ ఆమెకు..