చార్జీల దడ
చార్జీల దడ
Published Mon, Oct 10 2016 11:45 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
మోత మోగుతున్న బస్సు టిక్కెట్టు రేట్లు
తిరుగు ప్రయాణానికి ‘ప్రైవేటు’ బాదుడు
హైదరాబాద్‌కు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ వసూలు
ఆర్టీసీదీ అదే రూటు
అమలాపురం టౌన్ : దసరా సెలవులకు సొంతూరు వచ్చి తిరుగు ప్రయాణమవుతున్నవారికి బస్సు చార్జీలు దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రయాణానికి చార్జీలు మోత మోగుతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా జిల్లాకు చెందిన 10 వేలు పైగా కుటుంబాలు తాత్కాలికంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. వీరిలో దాదాపు 75 శాతం మంది దసరా సెలవులకు స్వగ్రామాలకు వచ్చారు. అక్కడి నుంచి బస్సులో వచ్చేటప్పుడు ఒక్కో టిక్కెట్టుకు రూ.1,200 నుంచి రూ.1,800 వరకూ చార్జీ చెల్లించారు. దసరా సెలవులు ముగుస్తూండటంలో మంగళ లేదా బుధవారాల్లో హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల యజమానులు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. సాధారణ సమయంలో జిల్లా నుంచి రోజూ హైదరాబాద్‌కు దాదాపు 100 ప్రైవేటు లగ్జరీ బస్సుల్లో సుమారు 5 వేల మంది ప్రయాణిస్తున్నారు. అన్ సీజన్‌లో ఒక్కో టికెట్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకూ చార్జి చెల్లిస్తున్నారు. అటువంటిది దసరా పేరుతో ఇప్పుడు వంద శాతం ధరలు పెంచేసి ప్రయాణికులను బాదేస్తున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ హైటెక్ బస్సుల సంఖ్యను 150కి పైగా పెంచారు. టిక్కెట్ల రేట్లను కూడా అమాంతం పెంచేశారు. పెరిగిన చార్జీలతో ఒక్కో కుటుంబం హైదరాబాద్ నుంచి సొంతూరు వచ్చి తిరిగి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు రూ.10 వేల వరకూ అవుతోంది.
కానరాని నియంత్రణ
వాస్తవానికి ప్రైవేటు బస్సుల చార్జీలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. దీంతో ట్రావెల్స్ నిర్వాహకులు ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సుకు రూ.1000 నుంచి రూ.1,200, ఏసీ బస్సయితే రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ టికెట్ ధర వసూలు చేస్తున్నారు. ఇక వోల్వో, స్లీపర్ చార్జీలు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ నిర్ణయించారు.
ఆర్టీసీ ‘ప్రత్యేక’ వడ్డన
ఆర్టీసీ కూడా చార్జీల వడ్డనలో ఏమీ తీసిపోలేదు. దసరా పేరుతో ప్రత్యేక (స్పెషల్) బస్సులు వేసి చార్జీల బాదుడుకు దిగింది. జిల్లాలోని తొమ్మిది ఆర్టీసీ డిపోల నుంచి దసరా తిరుగు ప్రయాణాల కోసం హైదరాబాద్‌కు దాదాపు 200కు పైగా స్పెషల్ బస్సులను అదనంగా నడుపుతోంది. రెగ్యులర్ బస్సులకు తోడు ప్రత్యేక బస్సులు నడుపుతూ టిక్కెట్ చార్జీని రూ.640 నుంచి రూ.900 వరకూ పెంచింది. రెగ్యులర్ బస్సులకు మాత్రమే పాత చార్జీలను ఉంచి ప్రత్యేక బస్సులకు మాత్రం రూ.250 నుంచి రూ.300 వరకూ అదనంగా వడ్డిస్తోంది.
Advertisement
Advertisement