
ఆదాయ లోటు, ప్రభుత్వ సబ్సిడీ నిధుల మధ్య పొంతన లేదు
లోటు భర్తీకి భవిష్యత్తులో ట్రూఅప్ చార్జీలు అనివార్యం
అవసరానికి మించి పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు వద్దు
ఈఆర్సీ బహిరంగ విచారణలో విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాలరావు
పరిహారం చెల్లింపు, లైన్లు, టవర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి
అధికారులకు కమిషన్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భవిష్యత్తులో ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) ముప్పు పొంచి ఉందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాలరావు ఆందోళన వ్యక్తంచేశారు. రెండు డిస్కంలకు రూ.20,151 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని అంచనా వేయగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కింద బడ్జెట్‌లో రూ.11,500 కోట్లు మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. మిగతా లోటును పూడ్చుకునేందుకు ట్రూఅప్ చార్జీలు విధించాల్సి వస్తుందని తెలిపారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన 2025–26 వార్షిక ఆదాయ అవశ్యకత(ఏఆర్‌ఆర్), టారిఫ్ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. డిస్కంల ఆర్థిక నష్టాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల బకాయిల కలిపి రూ.98,053 కోట్లకు ఎగబాకాయని ఆందోళన వ్యక్తంచేశారు.
గరిష్ట డిమాండ్ ఉండే సమయంలో పునరుత్పాదక విద్యుత్ అందుబాటులో ఉండదని, అందువల్ల తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన కనీస మొత్తం కంటే అధికంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనటం ఏమాత్రం సరికాదని అన్నారు. అలా చేస్తే గరిష్ట డిమాండ్‌ను తీర్చడానికి బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు అనవసర ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన కొనుగోళ్లకు అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకుంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించడానికి బ్యాకింగ్ డౌన్ చేసి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వచ్చే ఏడాది ఏకంగా 28,504 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మిగులు విద్యుత్ ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయని, అవసరం లేని ఈ విద్యుత్‌కు చెల్లించే ఫిక్స్‌డ్ చార్జీల భారం వినియోగదారులపై పడుతుందని అన్నారు. సమ్మతి తెలిపిన వినియోగదారులకే ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని సూచించారు. టైమ్ ఆఫ్ డే పేరుతో రాత్రి పూట విద్యుత్ వినియోగించే హెచ్‌టీ వినియోగదారులకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని కోరారు. బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే విద్యుత్ ధర యూనిట్‌కు రూ.11కి పెరిగిపోతుందని చెప్పారు.
వినతులు, ఫిర్యాదులు..
» రైల్వే ట్రాక్షన్ విద్యుత్ చార్జీలను హైదరాబాద్ మెట్రో రైలు కేటగిరీతో సమానంగా తగ్గించాలని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్.మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు.
» విద్యుత్ బిల్లులను నెల పూర్తికాక ముందే జారీ చేసిన సందర్భాల్లో సగటున 30 రోజుల వాడకాన్ని అంచనా వేసి టారిఫ్ శ్లాబులను వర్తింపజేస్తుండటంతో బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయని కిరణ్‌కుమార్ అనే వినియోగదారుడు ఫిర్యాదు చేశారు.
» విద్యుత్ ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ప్రశ్నించారు. దరఖాస్తులు చేసుకోవడానికి నిర్దేశిత గడువు ఏమీ లేనప్పుడు గడువు పేరుతో దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తున్నారని నిలదీశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో సంజీవరెడ్డి అనే వ్యక్తి 2019లో విద్యుదాఘాతంతో మరణిస్తే ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని అతడి భార్య సరిత ఫిర్యాదు చేయటంతో అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíÙయా చెక్కును ఇప్పించారు.
» కొత్త వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం డీడీలతోపాటు లంచాలు ఇచ్చినా సకాలంలో జారీ చేయడం లేదని పలువురు రైతులు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై జస్టిస్ దేవరాజు నాగార్జున్ అక్కడికక్కడే టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని వివరణ కోరారు.
లైన్లు, టవర్ల ఏర్పాటులోనిబంధనలు పాటించాలి
పంట పొలాల్లో విద్యుత్ లైన్లు, టవర్ల ఏర్పాటు విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఈఆర్సీ చైర్మన్ ఆదేశించారు. నోటిసులు ఇవ్వకుండా, తమ సమ్మతి లేకుండా పొలాల్లో లైన్లు వేస్తున్నారన్న రైతుల ఫిర్యాదులపై వివరణ కోరారు. టవర్ ఏర్పాటు చేస్తే స్థలం మార్కెట్ విలువ తో పోల్చితే 200 శాతాన్ని, లైన్లు వేస్తే 30 శాతాన్ని పరిహారంగా ఇవ్వాలని జీవో ఉందని ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు.
రైతుల సమస్యలను పరిష్కరించడానికి వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్షేత్ర స్థాయిలోని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఫారూఖీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment