4 త్రైమాసికాల ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతి కోరిన డిస్కంలు
ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు లెక్కించి ముందుగా పత్రికల్లో యాడ్స్ ఇవ్వడంలో డిస్కంల విఫలం
డిస్కంల వెబ్‌సైట్‌లో సైతం పొందుపరచని వైనం
దీంతో డిస్కంల పిటిషన్లకు విచారణ అర్హత లేదని తోసిపుచ్చిన ఈఆర్సీ
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎఫ్‌ఎస్‌ఏల వసూళ్లకు అనుమతి కోరడం ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్‌ఎస్‌ఏ) వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పిఈసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తోసిపుచ్చింది.
ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ 2023 జనవరి 18న ఈఆర్సీ జారీ చేసిన మూడో సవరణ నిబంధనలు–2023ను డిస్కంలు అమలుపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2023– 2024 ఆర్థిక సంవత్సరంలోని నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ డిస్కంలు దాఖలు చేసిన పటిషన్లకు విచారణ అర్హత లేదని తిరస్కరిస్తూ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
2023 ఏప్రిల్–జూన్, 2023 జూలై–సెప్టెంబర్, 2023 అక్టోబర్–డిసెంబర్, 2024 జనవరి–మార్చి త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు రెండు డిస్కంలు చెరో నాలుగు పిటిషన్లు దాఖలు చేయగా, అన్నింటినీ ఈఆర్సీ కొట్టి వేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగదారుల నుంచి ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడం ఇదే తొలిసారి.
ఎందుకు తిరస్కరించిందంటే..?
నిబంధనల ప్రకారం.. N నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను N+2 వ నెలకు సంబంధించిన బిల్లుతో కలిసి N+3వ నెలలో డిస్కంలు జారీ చేయాలి. N+2 నెల 15వ తేదీలోగా ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలను డిస్కంలు తమ వైబ్‌సైట్‌లో ప్రకటించాలి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు ఆ తర్వాతి మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. డిస్కంలు ఒక నెలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను లెక్కించి సంబంధిత నెల ముగిశాక 45 రోజుల్లోగా దిన పత్రికల్లో యాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను అనుమతించరు.
విద్యుత్ బిల్లుల్లో ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతోపాటు వసూలైన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తుంది. యూనిట్ విద్యుత్‌కు గరిష్టంగా 30పైసల వరకు ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు.
ఒకవేళ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు యూనిట్‌కి 30పైసలకు మించితే ముందస్తు అనుమతి లేకుండా ఆపైన ఉండే అదనపు చార్జీలు విధించడానికి వీలులేదు. 30 పైసల సీలింగ్‌కు మించి ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఈఆర్సీ నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఈ నిబంధనలను పాటించకపోవడంతో ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తాజాగా తిరస్కరించింది.
కేంద్రం నిబంధనల ఆధారంగా
ఇంధన/ విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమెటిక్‌గా విద్యుత్ బిల్లుల్లో బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్‌లా) రూల్స్ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా ఎక్కువ కావడంతో ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. దీని ఆధారంగానే గతేడాది ఈఆర్సీ ఎఫ్‌ఎస్‌ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment