
అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపయోగించుకోవడంలో భారతీయ పరిశ్రమలు, సంస్థల వెనుకడుగు
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక వెల్లడి
జెన్ ఏఐ ప్రయోజనాలను 80% డెవలపర్లు గుర్తించినా, ఉపయోగిస్తున్నది 39 శాతమే
భద్రతపై సందేహాలు, ఉద్యోగాలు పోతాయనే భయమే కారణమంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ‘జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’(జెన్ ఏఐ) వల్ల కలిగే ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో భారత పరిశ్రమలు, సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. గ్లోబల్ ఐటీ పవర్‌హౌస్‌గా గుర్తింపు పొందడంతో పాటు టెక్నాలజీ ట్రేడ్‌లో 250 బిలియన్ డాలర్ల పరిశ్రమగా 50 లక్షల మంది ఐటీ నిపుణులతో విరాజిల్లుతున్న భారత ఐటీ పరిశ్రమ ‘జెన్ ఏఐ’కీలక మలుపు వద్ద నిలిచింది.
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి అవుట్ సోర్సింగ్ రంగంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్న దశలో ఎల్‌ఎల్‌ఎం ఫైన్ ట్యూనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాల్లో యువతరం (నెక్స్‌్ట–జనరేషన్) ‘51 శాతం మేర స్కిల్డ్ టాలెంట్ గ్యాప్’ను ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో కృత్రిమ మేథ ఏఐ సంబంధిత ఆవిష్కరణల్లో తమ ప్రాధాన్యతలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన భారత నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
‘జెన్ ఏఐ’వల్ల కలిగే ఉత్పాదకత వృద్ధి ప్రయోజనాలను 83 శాతం డెవలపర్లు గుర్తించినా, వారు దీనిని ఉపయోగిస్తున్నది 39 శాతమేనని, దానిని అనుసరిస్తూ, తమకు తగ్గట్టుగా వర్తింప చేసుకునే నవయువ డెవలపర్లు 31 శాతానికే పరిమితమవుతున్నట్టు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తాజా అధ్యయనంలో తేలింది.
ఈ సవాళ్లను సరైన పద్ధతుల్లో సమాధానాలు వెతుక్కోవడంతో పాటు వాటిని అధిగమించే దిశలో చర్యలు చేపట్టకపోతే గ్లోబల్ ఏఐ లీడర్లుగా ఉన్న యూఎస్‌ఏ, చైనాల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ రంగంలో మధ్యస్థ శక్తులుగా ఎదిగిన దక్షిణ కొరియా, జపాన్, సౌదీ ఆరేబియా కూడా పైస్థాయికి చేరుకునే ప్రయత్నాలు చురుగ్గా సాగిస్తున్న సమయంలో భారత్‌కు ఇది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రస్తుత పరిస్థితులను అధిగమించి కృత నిశ్చయంతో ముందుకు సాగేందుకు అవసరమైన శిక్షణ కొరవడడం, ఈ అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్న క్రమంలో ఎదురవుతున్న భద్రతాపరమైన సందేహాలు, జెన్ ఏఐ వంటి వాటితో ఉద్యోగాలు పోతాయనే భయం తదితర కారణాలతో వివిధ కంపెనీలు ఆచితూచి స్పందిస్తున్నాయని తెలిపింది. మారుతున్న సాంకేతికతలకు తగ్గట్టుగా ఐటీ సర్వీసుల్లో జెన్ ఏఐ వర్తింపును వేగవంతం చేయడం ద్వారా పైచేయి సాధించాలంటే భారత్ వివిధ చర్యలు చేపట్టాలని అధ్యయనం సూచించింది.
రెండేళ్లు గడుస్తున్నా వెనుకబాటే..
2022 చివర్లో ఏఐ, జెన్ ఏఐ అనేవి పరిశ్రమల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాయి. అయితే రెండేళ్లు గడుస్తున్నా జెన్ ఏఐను అందిపుచ్చుకుని, వర్తింపజేసుకునే విషయంలో అధిక శాతం పరిశ్రమలు వెనుకబడ్డాయి. ఇందుకు కారణం టెక్నాలజీ కాదని మానవ స్వభావం, ప్రవర్తనదేనని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మొదలు డెవలపర్లలో ఉద్యోగాలు కోల్పోతామనే భయం వెంటాడుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ అధునాతన టూల్స్‌ను ఉద్యోగులు ఉపయోగించి మంచి ఫలితాలను సాధించేలా చేయడమనేది పెద్ద సవాల్‌గా మారుతోందని అంటున్నారు. ఈ సాంకేతికతను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయంలో కస్టమర్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్నట్టుగా కంపెనీలు పేర్కొంటున్నాయి.
భారత్ ఏం చేయాలంటే..
» వివిధ ప్రావీణ్యాలు, నైపుణ్యాల ఆధారిత శిక్షణా పద్ధతులు (ట్రైనింగ్ మోడళ్లు) చేపట్టాలి.
»ఏఐ, జెన్ ఏఐలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న దానిపై ‘ప్రొఫిషియెన్సీ బేస్డ్ ట్రైనింగ్ మోడల్స్ తీసుకురావాలి.
» మేనేజ్‌మెంట్, వర్క్‌ఫోర్స్ తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రోత్సాహకాలు అందించడంతోపాటు, ఉత్తమ శిక్షణ నిమిత్తం ‘ఎగ్జిక్యూటివ్ స్పాన్షర్‌షిప్’ చేపట్టాలి.
» భద్రతా పరమైన ఆందోళనలు, సమస్యలు అధిగమించేందుకు పరిశ్రమ క్లయింట్లతో దృఢమైన బంధాలు కొనసాగించేలా వ్యూహాలు రూపొందించుకోవాలి.
జనరేటివ్ ఏఐ అంటే..
జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) అనేది యూజర్ కోరుకున్న కంటెంట్ లేదా విజ్ఞప్తికి తగ్గట్టుగా సాఫ్ట్‌వేర్ కోడ్‌ను రూపొందించుకుంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్, ట్యూనింగ్, జనరేషన్ అనే మూడు దశలుగా పనిచేస్తుంది. టెక్ట్స్, ఇమేజేస్, ఆడియోల రూపంలో ఒరిజనల్ కంటెంట్‌ను తయారు చేయగలదు. అధునాతన మెషీన్ లెర్నింగ్ మోడళ్లు మరి ముఖ్యంగా డీప్ లెరి్నంగ్ మోడళ్లపై ఆధారపడి ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఇది మనుషుల మెదళ్ల మాదిరిగా నేర్చుకోవడం, నిర్ణయం తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.