ఏఐ ‘బ్రెయిన్‌ డ్రెయిన్’! | Artificial Intelligence Index Report 2024 Released | Sakshi
Sakshi News home page

ఏఐ ‘బ్రెయిన్‌ డ్రెయిన్’!

Published Wed, Feb 19 2025 5:23 AM | Last Updated on Wed, Feb 19 2025 5:23 AM

Artificial Intelligence Index Report 2024 Released

కృత్రిమ మేధ.. మేధో వలసలో మనదే మొదటి స్థానం  

ఏఐ గ్లోబల్‌ పేటెంట్స్‌లో మనవి 0.23 శాతమే  

61.13 శాతంతో టాప్‌లో చైనా 

20.9%తో రెండోస్థానంలో అమెరికా 

వలసలు ఆపేందుకు నిపుణుల సూచనలు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో మేధో వలస (బ్రెయిన్‌ డ్రెయిన్‌) భారత్‌కు పెద్ద సవాల్‌గా మారబోతోంది. యువతలో ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మంచి పురోగతి ఉన్నా, వారు దేశంలోనే స్థిరపడేలా చేయడంలో విఫలమవుతున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ ఏఐ నిపుణులు అమెరికా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. భారీ వేతనాలతోపాటు అత్యాధునిక పరిశోధనలకు మంచి వాతావరణం ఉండడంతో అటువైపు ఆకర్షితులవుతున్నారు. 

‘ఏఐ టాలెంట్‌ కాన్సన్‌ట్రేషన్‌’లో ప్రపంచంలో భారత్‌ 13వ స్థానంలో నిలిచినట్టు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2024’ప్రకటించింది. ప్రపంచంలో ఏఐ మేధో వలసలో మాత్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఏఐ నైపుణ్యాలున్న ప్రతి 10 వేల మంది లింక్డ్‌ఇన్‌ ఖాతాదారుల్లో 0.76 శాతం (నెట్‌ మైగ్రేషన్‌ రేటు) మేధో వలస ఉన్నట్టు తెలిపింది. అంటే ప్రతి పదివేల మంది భారతీయ ఏఐ నిపుణుల్లో దాదాపు ఒకశాతం విదేశాలకు వలసపోతున్నారు.  

ఏఐ పేటెంట్స్‌లోనూ అథమ స్థానమే 
ఏఐ పేటెంట్స్‌ విషయంలోనూ భారత్‌ వెనుకబడే ఉంది. 2022లో ప్రపంచస్థాయి ఏఐ పేటెంట్స్‌లో మనదేశం 0.23 శాతానికే పరిమితమైంది. ఈ విషయంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్లోబల్‌ ఏఐ పేటెంట్స్‌లో 61.13 శాతంతో చైనా మొదటిస్థానంలో నిలువగా, 20.9 శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 

ఏఐ మౌలికసదుపాయాల పటిష్టానికి ‘కంప్యూటింగ్‌ కెపాసిటీ’లో పెట్టుబడులు పెడుతున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏఐ టూల్స్‌ ఫౌండేషన్‌ టెక్నాలజీలో ‘లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌’ అందుబాటులోకి రావడంతో చైనాకు చెందిన డీప్‌సీక్‌–వీ2, అమెరికాకు చెందిన చాట్‌ జీపీటీ వంటివి గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. దీంతో భారత్‌కు సవాళ్లు ఎదురవుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. 

2023 నాటికి భారత్‌ 60 జెనరేటివ్‌ ఏఐ స్టార్టప్‌లు కలిగి ఉన్నట్టు ప్రకటించుకున్నా (2021తో పోల్చితే రెండింతలు పెరుగుదల), ఈ రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగేందుకు మరిన్ని కీలకమార్పులు చేయాల్సిన అవసరముందని అంటున్నారు.  

భారత్‌లో ఏఐ రంగం అభివృద్ధి, మేధో వలసల నిరోధానికి నిపుణుల సూచనలు  
» డేటా సెంటర్లు,కంప్యూటింగ్‌ వనరులు పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఏఐ, డీప్‌టెక్‌ వంటి వాటిలో ప్రపంచస్థాయి రిసెర్చ్‌సెంటర్లు, ల్యాబ్‌లు, ఇన్నోవేషన్‌ హబ్స్‌ఏర్పాటుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలి.  
» అత్యుత్తమ ప్రతిభ,నైపుణ్యాలున్నవారు దేశం వదిలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.  
» ఏఐని సమాజాభివృద్ధికి, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం, పర్యావరణ పరి రక్షణ తదితర రంగాల్లో విస్తారంగా వినియోగించాలి.  
» ప్రస్తుతం అమెరికాలోని సిలికాన్‌వ్యాలీలోఅత్యుత్తమ ఏఐనిపుణుల్లో భారతసంతతివారేఅధికంగా ఉన్నారు. వారిలో కొందరినైనా తిరిగి భారత్‌కు రప్పించి అవసరమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను, సౌకర్యాలను కల్పిస్తే మంచి ఫలితాలుసాధించవచ్చు. 

అవకాశాలు పెంచాలి 
బ్రెయిన్‌ డ్రెయిన్‌ను బ్రెయిన్‌ గెయిన్‌గా మార్చుకునేందుకు దేశంలో మంచి ఏఐ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశం నుంచి ఏఐ మేధో వలస ప్రమాదకర స్థాయిలో ఏమీలేదు. నిపుణులు నైపుణ్యాలు పెంచుకునేందుకు సరైన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉంది. 

ఎంతగా పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తే అంతగా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌లో ఏఐ, మెíషీన్‌ లెరి్నంగ్‌ వంటివి చేర్చాలి. నాణ్యమైన శిక్షణ, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్‌ సెంటర్లను అందుబాటులోకి తెస్తే దేశంలోని అద్భుతమైన నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి.   –వెంకారెడ్డి, వైస్‌ప్రెసిడెంట్, సీనియర్‌ హెచ్‌ఆర్‌ లీడర్, కో ఫోర్జ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement