
హ్యాకర్ల దాడులకు గురైన దేశాల్లో మొదటిస్థానంలో భారత్
ప్రపంచవ్యాప్త దాడుల్లో 13% ఇండియాలోనే..
విద్యాసంస్థలు, ప్రభుత్వరంగ, ఆర్థికసేవల నెట్‌వర్క్‌లే లక్ష్యం
హైటెక్ క్రైమ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రతీ రంగంలో సాంకేతికత అత్యంత కీలకంగా మారింది. అదేస్థాయిలో సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంటోంది. ఏదైనా సంస్థ నెట్‌వర్క్‌ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్‌వాల్ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే, హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌లు బలహీనమని గ్రూప్–ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్ క్రైం ట్రెండ్స్ రిపోర్ట్–2025లో వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్ దాడుల్లో అత్యధికంగా 13 శాతం ఘటనలు భారత్‌లోనే జరిగినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్‌లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది.
ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల నెట్‌వర్క్, మిలిటరీ, ఆర్థికసేవల సంస్థల నెట్‌వర్క్‌లు హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. హ్యాకర్లు ఫైర్‌వాల్స్‌ను ఛేదించి సదరు నెట్‌వర్క్‌లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అ«దీనంలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు తెలిపింది.
డేటా లీకేజీలో అమెరికాది తొలిస్థానం
పబ్లిక్ డొమైన్‌లో ఉండే డేటా లీకేజీలో అమెరికా తొలిస్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2024లో ఈ తరహా ఘటనలు అమెరికాలో 214 నమోదైనట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో రష్యా (195 ఘటనలు) ఉండగా.. భారత్ (60) మూడో స్థానంలో నిలిచినట్టు గ్రూప్–ఐబీ నివేదిక పేర్కొంది. ఈ–మెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు ఈ డేటా లీకేజీలో ఉంటున్నాయి. 2024లో ఈ–మెయిల్ అడ్రస్‌లు, పాస్‌వర్డ్‌లను డార్క్‌వెబ్‌లో విక్రయించడం ద్వారానే సైబర్ నేరగాళ్లు రూ.248.9 కోట్లు కొల్లగొట్టారు.
ఫైర్‌వాల్స్ అంటే?
అనధికారికంగా నెట్‌వర్క్‌లోకి చొరబడకుండా, హానికరమైన డేటాను నెట్‌వర్క్‌లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఫైర్‌వాల్. ఇది హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ కావొచ్చు. నెట్‌వర్క్ ప్యాకెట్‌లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అనేదాన్ని ఫైర్‌వాల్ నిర్ణయిస్తుంది. ఫైర్‌వాల్స్ ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయకుండా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను నిరోధించగలవు.
Comments
Please login to add a commentAdd a comment