Cyber attacks
-
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్‌గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్‌లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్‌ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్‌తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్‌లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్‌లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్‌గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్‌కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్‌ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
సైబర్.. సైరన్..!
పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు(Cyber Crime) సైతం పెచ్చుమీరుతున్నాయి. రోజుకొక మోసంతో కేటుగాళ్లు కోట్లలో కొళ్లగొడుతున్నారు. ఒకరికి ఒకరు కనిపించకుండా, ముఖ పరిచయం లేకపోయినా లింక్ సిస్టమ్‌లా వీళ్లు పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్న వర్గాలు, యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయక ప్రజలంతా వీరి బాధితులే. సెల్లో లింకే కదా అని క్లిక్ చేస్తే మిమ్మల్ని బుక్ చేస్తారు. ఇలాంటి మోసాలతో రూ.లక్షలు పోగొట్టుకుని పరువు సమస్యతో పోలీసులకు ఫిర్యాదులివ్వలేక అనేకమంది సతమతం అవుతున్నారు. ఈ సైబర్ నేరాలపై అవగాహనకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్అందమైన వల.. చిక్కారో విలవిలమనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పద్ధతి ఎక్స్‌టార్సన్. అలాగే అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు దోచుకోవడం సెక్స్‌టార్సన్. వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ (డేటింగ్ యాప్), ఇన్‌స్ట్రాగామ్ (Instagram) వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా మనలో ఉండే బలహీనతలను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు సెక్స్‌టార్సన్ పద్ధతిలో మోసాలు చేస్తుంటారు. వీరు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల నుంచి నెట్వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతుండటం విశేషం. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు.ఎలా చేస్తారంటే.. సైబర్ కేటుగాళ్లు అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ (ఇతర యాప్స్) ఐడీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్.. అలా నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఆ తర్వాత వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం (వ్యక్తిది) తెలుసుకుని అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునేవరకు కథ తీసుకెళ్తారు. అనంతరం చాట్ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగి అవతలివైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్‌చాట్‌లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు.అప్రమత్తతే ఆయుధం » సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్‌లో తక్షణమే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. » www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్లైన్ ఫిర్యాదివ్వాలి. సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి ఖాతాలను ఫ్రీజ్ చేయించాలి. పరిధి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. » ఎవరైనా బ్యాంకులో మ్యూల్ ఖాతా తమకు తెలియకుండా వేరే వ్యక్తులు తెరవాలనుకుంటే వెంటనే 1930 సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకాక ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్‌కు బదిలీ చేస్తే ఖాతాదారులను అప్రమత్తం చేయాలి. ఈ మోసాలు పరిశీలిస్తే.. » శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి తనకున్న బలహీనతతో ఫేస్బుక్లో అమ్మా యి పరిచయం కాగానే మాటామాటా కలిపాడు. ఆమె కూడా వీడియో కాల్ మాట్లాడటం, న్యూడ్ గా కనిపించడంతో తనూ న్యూడ్‌గా మారి కొంతకాలం ఆనందం పొందాడు. అక్కడికి కొద్దిరో జులకు ఆ అమ్మాయి న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ భయపెట్టి రూ.5 లక్షలు కావా లని బ్లాక్ మెయిల్ చేసింది. బయట తెలిస్తే పరు వు పోతుందని చేసేదేమీలేక డబ్బులు వేసేశాడు. » జిల్లాలోని ఒక ప్రముఖ వైద్యుడు తెలియని లింక్ క్లిక్ చేయడంతో హాయ్ అని ఓ అమ్మాయి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. రిప్లయ్ ఇవ్వడంతో న్యూడ్ వీడియో కాల్స్ తరచూ చేసేది. అక్కడికి కొద్దిరోజులకు వీడియోలు బయటపెడతామంటూ, డిజిటల్ అరెస్టు అవుతావంటూ ఢిల్లీ పోలీస్ సెటప్‌తో కొందరు వ్యక్తులు స్కైప్కాల్లో దర్శనమవ్వడంతో వాళ్లడిగిన రూ.18.50 లక్షలు చదివించేశారు. » శ్రీకాకుళం రూరల్ మండలంలో సంపన్న వర్గానికి చెందిన ఓ వృద్ధుడు అశ్లీల వీడియోలు చూసే అలవాటుండడంతో అందులో ఓ మెసేజ్ రావడంతో ఆన్సర్ చేశాడు. ఓ ఇద్దరు యువతుల ముఖాలతో ఉన్న పురుషులు వీడియో కాల్లో కనిపించి వృద్ధునికి మత్తెక్కే మాటలతో మైమరిపించగా వృద్ధుడు న్యూడ్‌గా మారాడు. తక్షణమే ఆ వీడియోలు వృద్ధునికి పంపించి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా. రూ.6 లక్షల వరకు సమర్పించేశాడు. » ఇదే తరహాలో ఏఐ సాయంతో జిల్లాలో ఓ మహిళా అధికారికి మోసం చేసే క్రమంలో ఆమె అప్రమత్తం అవ్వడంతో త్రుటిలో సైబర్ ఉచ్చునుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండాలి ఏ బ్యాంకు కూడా ఆన్లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింక్‌లు ఓపెన్ చేయరాదు. వాళ్లు మన ఫోన్‌ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత మాయం చేస్తారు. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. ఎప్పటికప్పుడు మన ఖాతాను పరిశీలిస్తుండాలి. సెక్స్‌టార్షన్‌కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడి పరువు సమస్యతో ఫిర్యాదు చేయకపోతే సైబర్ నేరగాళ్లకు మీరే బలమైన ఆయుధాన్ని ఇచ్చిన వారవుతారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే ఆపద నుంచి బయటపడవచ్చు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా -
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
4.5 లక్షల ‘మ్యూల్’ ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం
సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణంI4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్‌లో 7,000 (సిండికేట్ బ్యాంక్‌తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6,000, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. -
సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్‌ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్వేర్ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్‌క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఎదురవుతున్న సవాళ్లు..ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్‌ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్లు, వైరస్‌లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కొత్త అప్డేట్.. యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!రక్షణ వ్యవస్థలపై ఫోకస్ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.సైబర్ నేరాల లెక్కలివీ..వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది. -
బ్రిక్స్ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్ దాడి
మాస్కో: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.‘‘రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై ఈ బుధవారం ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్‌టాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది. అయితే బుధవారం చేసిన సైబర్ దాడి మాత్రం చాలా తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా మాస్కో ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్ 22-24 తేదీల్లో రష్యాలోని కజాన్‌లో జరుపుతోంది.Russian Foreign Ministry suffers ‘unprecedented’ #cyberattack - spox ZakharovaSpecialists are working to restore the functionality of the Russian Foreign Ministry's website after a large-scale DDoS attack, ministry spokesperson Maria Zakharova told TASS.The attack...RTNews pic.twitter.com/RS2ilmEhVJ— TifaniesweTs (@TifaniesweTs) October 23, 2024 రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.చదవండి: PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు -
టెక్ హైరింగ్‌లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్‌కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్‌కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్‌లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్‌లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్‌లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్‌కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘తప్పు జరిగింది..క్షమించండి’
సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందు క్షమాపణలు చెప్పారు. జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో కలిగిన అంతరాయం గుర్తుంది కదా. అందుకు సంబంధించి సెక్యూరిటీ సేవలందించిన క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ప్రతినిధులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందుకు వచ్చింది. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ క్షమాపణలు కోరారు.మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘జులైలో జరిగిన సంఘటనకు సైబర్ అటాక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణం కాదు. కొత్త థ్రెట్ డిటెక్షన్ కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేస్తున్నపుడు ఫాల్కన్ సెన్సార్ రూల్స్ ఇంజిన్ తప్పుగా కమ్యూనికేట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ అప్డేట్ వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాల్లో సెన్సార్లు సరిగా పనిచేయలేదు. తిరిగి కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేసేంతవరకు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి యూఎస్ సైబర్‌సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సబ్‌కమిటీ ముందు విచారణ జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చాం. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!జులై 19న సంభవించిన ఈ అంతరాయంతో విమానయాన సంస్థలు, బ్యాంకులు, హెల్త్‌కేర్, మీడియా, హాస్పిటాలిటీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ప్రభావితం చెందాయి. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా దాదాపు 85 లక్షల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాలపై దీని ప్రభావం పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దానివల్ల 13 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. -
శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్‌గా డూప్లికేట్ వెబ్సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి.. “వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది. మీరు వెంటనే మా ఫోన్ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించండి. ఆ తర్వాత మీ గది బుకింగ్ డిటెయిల్స్ పంపిస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేట్ సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు. పేమెంట్ అంతా ఆన్లైన్ గేట్‌వే ద్వారానే జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో ఆర్జితసేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ (మల్లన్న స్పర్శ దర్శనం) టికెట్లను వందశాతం ఆన్లైన్ చేసింది. అలాగే వసతి గదులను సైతం ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. ఇదే ఆసరాగా సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. ఏపీ టూరిజంకూ తప్పని బెడద భక్తుల సౌకర్యార్థం వీఐపీ కాటేజీలు, గణేశ సదన్, మల్లికార్జున సదన్, గంగా–గౌరీ సదన్, కుమార సదన్, పాతాళేశ్వరసదన్ తదితర పేర్లతో వసతి గదులను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. వీటి బుకింగ్ విషయంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించింది. సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి దేవస్థానం వసతి గదుల పేర్లతో సమానంగా నకిలీ వెబ్సైట్లు తయారుచేసి వాటి ద్వారా భక్తులను మోసం చేస్తున్నారు. కేవలం దేవస్థానానికి మాత్రమే కాకుండా శ్రీశైలంలో ఉన్న ఏపీ టూరిజం, శ్రీశైలంలోని ప్రైవేట్ సత్రాలకు సైతం ఫేక్ వెబ్సైట్ల బెడద తప్పడం లేదు. ఆయా సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించి డబ్బు చెల్లించిన భక్తులు శ్రీశైలం వచ్చి సదరు సంస్థ రిసెప్షన్లో వారికి వచి్చన మెసేజ్‌ను చూపించగా అది ఫేక్ అని తేలిపోతుండటంతో లబోదిబో మంటున్నారు. ఆ తర్వాత గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సైబర్‌క్రైం పోలీసులు నకిలీ ఐడీలపై విచారణ చేయగా రాజస్థాన్, జైపూర్ వాటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అసలైన వెబ్సైట్లను గుర్తించండిలా.. శ్రీశైల దేవస్థానం అధికారికంగా www.srisailadevasthanam.org (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్జీ) వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు, వసతి గదులు పొందవచ్చు. అలాగే aptemples.ap.gov.in (ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్) ద్వారా కూడా లాగిన్ అయి శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్లి తమకు కావాల్సిన సేవలను, వసతి గదులను పొందవచ్చు.అలాగే srisailadevasthanam (శ్రీశైలదేవస్థానం) మొబైల్ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని తద్వారా ఆయా సేవలను పొందవచ్చు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే స్వయంగా వసతి, ఆర్జిత సేవా టికెట్లను పొందాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయించి ఆయా సేవలను పొందితే ఫేక్ ఐడీల బారిన పడకుండా ఉండవచ్చు. – డి.పెద్దిరాజు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
లావోస్‌లో సైబర్ బానిసలు..
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్‌కు చేరుకొని, సైబర్ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్‌కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్‌లో బొకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటైన సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్‌లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచ్చులోకి యువత ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్ నేరగాళ్లు లావోస్‌కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్‌పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్‌లలో, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. జాబ్ ఆఫర్ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు ఉద్యోగాల కోసం లావోస్ వెళ్లి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్‌కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో లావోస్‌లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్ రప్పించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుండడంపై లావోస్ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భారత్, యూఎస్ కంపెనీల సర్వర్లపై చైనా దాడి?
చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ ఇండియాతోపాటు అమెరికాలోని కొన్ని కంపెనీల సర్వర్లపై దాడికి పాల్పడినట్లు లుమెన్ టెక్నాలజీస్‌కు చెందిన బ్లాక్ లోటస్ ల్యాబ్స్‌లోని భద్రతా పరిశోధకులు తెలిపారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం వోల్ట్ టైఫూన్ అని పిలువబడే చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ అమెరికా, ఇండియాలోని ఇంటర్నెట్ కంపెనీలపై దాడికి పాల్పడింది. అందుకోసం కాలిఫోర్నియాకు చెందిన వెర్సా నెట్వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.చైనీస్ గ్రూప్ చేసిన ఈ సైబర్ దాడివల్ల అమెరికాకు చెందిన నాలుగు ఇంటర్నెట్ కంపెనీలు, భారత్‌లోకి ఒక కంపెనీ ప్రభావితం చెందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీలు నెట్వర్క్ కాన్ఫిగరేషన్ల నిర్వహణకు సహాయపడే వెర్సా నెట్‌వర్క్‌ల సాఫ్ట్‌వేర్‌లో లోపం కనుగొన్నారు. గతంలో వెర్సా బగ్‌ను గుర్తించి జూన్ 2023లో పరిష్కారాన్ని విడుదల చేసినప్పటికీ, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల తిరిగి దాడికి గురయ్యాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ సర్వర్లు యూఎస్‌లోని నీటి వసతి, పవర్ గ్రిడ్ వంటి కీలక సేవలందించే సాఫ్ట్వేర్లలో చొరబడ్డాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వోల్ట్ టైఫూన్ నిజానికి ‘డార్క్ పవర్’ అని పిలువబడే ఒక క్రిమినల్ గ్రూప్ అని, దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సైబర్అటాక్ల పేరుతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. -
పని ప్రదేశమే ప్రాణాంతకమైతే?
ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన అనేక కథనాలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం మునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్ లో కూడా జరుగుతోంది. ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కలవరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి ఎంతమాత్రమూ వీలు లేదు. మార్పు ఇప్పటికే మొదలు కావాల్సింది!ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో ఇటీవలి కేసు... మహిళల భద్రత విషయంలో ఉన్న సమస్యల తీవ్రతనూ, అత్యంత సురక్షితంగా భావించే పరిస రాలలో కూడా వారు ఎదుర్కొంటున్న సర్వవ్యాప్త హింసనూ గుర్తు చేస్తోంది.శిక్షణలో ఉన్న ఒక యువ వైద్యురాలు అనేక గంటలపాటు విధి నిర్వహణను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, తగిన భద్రత ఉంటుందని భావించిన ఆసుపత్రి ఆవరణలోనే ఆమెపై లైంగికదాడి జరిపి హత్య చేశారు. ఈ భయానక నేరం ఒక విడి సంఘటన కాదు. మన సమాజంలోని ప్రతి అంశంలోనూ విస్తరిస్తున్న, మహిళ లపై హింసకు సంబంధించిన విస్తృతమైన అంటువ్యాధిలో ఇదొక భాగం. ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన వార్తలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం అంతకుమునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. ఇవి వార్తలలోని కేవలం పాదసూచికలు కాదు. సగం జనాభా భద్రత విషయంలో విఫలమైన సమాజంపై ఇవి స్పష్టమైన నేరారోపణలు. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్లో కూడా జరుగుతోంది.మహిళలపై నేరాలు దారుణంగా పెరుగుతున్నాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’(ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క 2022లోనే 4,45,256 కేసులు నమోదయ్యాయి. ఇది ప్రతి గంటకు దాదాపు 51 ఎఫ్ఐఆర్లకు సమానం. 2020, 2021 సంవత్సరాల నుంచి భయంకరమైన పెరుగుదలను ఈ డేటా వెల్లడిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు మహిళలపై నేరాల రేటు 66.4గా ఉంది. అయితే ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’ నివేదిక ప్రకారం, అలాంటి కేసులలో ఛార్జ్‌షీట్ రేటు 75.8గా నమోదైంది. నమోదైన మొత్తం కేసులలో, 18.7 శాతం వరకు మహిళలపై దౌర్జన్యానికి పాల్పడే ఉద్దేశ్యంతో దాడికి పాల్పడినవే. కాగా 7.1 శాతం అత్యాచారం కేసులుగా నమోదయ్యాయి. ఈ భయంకరమైన గణాంకాలు వాస్తవ ఘటనల్లో అతి చిన్న భాగాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. భయం, అవమానం లేదా సామాజిక ఒత్తిడి కారణంగా అసంఖ్యాకమైన కేసులు వెలుగులోకే రావు.మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తాయి. స్త్రీలు సరుకులుగా కుదించబడినప్పుడు, హింస అనేది రోజు వారీ సంఘటనగా మారుతుంది. ఈ హింస భౌతిక దాడికి మాత్రమే పరిమితమైనది కాదు; ఇది ఆర్థికపరమైన, భావోద్వేగపరమైన వేధింపు వరకు విస్తరించింది. ముఖ్యంగా పని స్థలాల్లో అధికార చలన సూత్రాలు తరచూ మహిళలకు వ్యతిరేకంగా ఉంటాయి.సాధారణంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టంగా పిలుస్తున్న, ‘‘పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం, 2013’ వంటి చట్టాలను మహిళల రక్షణ కోసం రూపొందించారు. కానీ వాస్తవికత దానికి భిన్నమైన చిత్రాన్ని చూపు తోంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించినప్పటికీ, ఈ కమిటీల నిర్మాణం సహజంగానే లోప భూయిష్టంగా ఉంది.అదే సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులతోపాటు ఒక ఎన్జీవో లేదా అలాంటి సంస్థకు చెందిన బయటి సభ్యులతో కూడిన ఈ కమిటీలు, బాధితురాలికి న్యాయం చేయడం కంటే కూడా కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికే తరచుగా ప్రాధాన్యత ఇస్తాయి. అధికారిక చలనసూత్రాలు (కమిటీ సభ్యులు కంపెనీలో స్వార్థ ప్రయో జనాలను కలిగి ఉండవచ్చు) నిజమైన విచారణను, జవాబుదారీ తనాన్ని నిరుత్సాహపరిచే వాతావరణాన్ని సృష్టిస్తాయి.అయితే ఈ సవాళ్లు నేడు పని స్థలాలను దాటి విస్తరించాయి. ప్రారంభంలో అవకాశాలు, అనుసంధానం కోసం ఉద్దేశించిన ఇంట ర్నెట్, ఇప్పుడు మహిళలకు సంబంధించిన కొత్త యుద్ధభూమిగా మారింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021లో సైబర్ క్రైమ్ సంఘటనల సంఖ్య 2019తో పోలిస్తే 18.4 శాతం పెరిగింది. మహిళలను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు గణనీయంగా 28 శాతానికి పెరిగాయి. 2021లో నమోదైన 52,974 సైబర్ నేరాల్లో 10,730 అంటే 20.2 శాతం మహిళలపై నేరాల కేసులు. వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం వంటి వాటి నుండి ప్రతీకారం తీర్చుకునే పోర్న్, ఆన్ లైన్ వేధింపుల వరకు, పాత రకాల హింసలను కొనసాగించడానికి డిజిటల్ రంగం కొత్త మార్గాలను అందిస్తోంది.ఇంటర్నెట్లో అజ్ఞాతంగా ఉండటం అనేది నేరస్థులకు ధైర్యాన్నిస్తుంది. కాగా, కఠినమైన సైబర్ చట్టాలు లేకపోవడం, చట్టపరమైన సహాయం నెమ్మదిగా ఉండటం బాధితులకు హాని చేస్తున్నాయి.మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము? ప్రస్తుత పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కల వరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. లైంగికదాడి కేసులలో 95 శాతం అపరిష్కృతంగా ఉంటున్నాయని ‘ఎన్ సీఆర్బీ’ 2021 నివేదిక నొక్కి చెబుతోంది. ఈ గణాంకాలు స్త్రీల దుఃస్థితి పట్ల వ్యవస్థ అలసత్వంతో పాటు, తరచుగా ఉదాసీనతను కూడా సూచిస్తు న్నాయి. న్యాయ విచారణలో జాప్యం, సానుభూతి లేని పరిపాలనా వ్యవస్థ అనేవి బాధితులు ముందుకు రాకుండా వారిని మరింత నిరుత్సాహపరుస్తాయి.లైంగిక వేధింపుల నిరోధక చట్టం, దానిని పోలి ఉండే ఇతర చట్టాలు అవసరమైనప్పటికీ, అవి సరిపోవు. హాని సంభవించిన తర్వాత మాత్రమే సమస్యను పరిష్కరిస్తాయి. పైగా పనికి సంబంధించిన దైహిక, లింగ స్వభావాన్ని సవాలు చేయడంలో విఫలమవు తాయి. ఇది మహిళలకు మొదటి దశలోనే హాని చేస్తుంది. కాబట్టి నిష్పాక్షికత, న్యాయబద్ధతను నిర్ధారించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూర్పు విషయంలో పునః మూల్యాంకనంతో ప్రారంభించి, తక్షణ సంస్కరణలు అవసరం. సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించి, అది కొనసాగేలా చూడడం యజమానుల బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే వారిపై కఠినమైన జరిమానాలు విధించాలి.ఇది చట్టపరమైన వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక వైఫల్యం కూడా! సమానత్వం కోసం మాత్రమే కాకుండా ప్రాథమిక గౌరవం కోసం పోరాడుతుండే మహిళలు తరచుగా బాధామయ జీవితాల్లో నిశ్శబ్ద శృంఖలాల పాలవుతుంటారు. ప్రతీకారం, ఉద్యోగ నష్టం, వ్యక్తిత్వ హననాల భయం చాలామందిని నోరు విప్పకుండా చేస్తుంది. ఇది శిక్ష పడుతుందనే భయం లేని సంస్కృతి వృద్ధి చెందడానికి వీలు కలిగిస్తుంది. అధికార శక్తులు దోపిడీకి పాల్పడుతూనే ఉండటం, బాధితులు తరచుగా ఎటువంటి సహాయం లేకుండా మిగిలిపోవడం అనేది ఒక విష వలయం.చట్టపరమైన రక్షణలు, పెరుగుతున్న అవగాహన పురోగతిని సూచిస్తున్నప్పటికీ, సంఖ్యలు మాత్రం మరో కథను చెబుతున్నాయి. అది ఆచరణలో కంటే సిద్ధాంతంలోనే ఎక్కువగా ఉనికిలో ఉంటున్న చట్టాలతోపాటు, ప్రతి మలుపులోనూ మహిళల విలువను తగ్గించే సామాజిక వ్యవస్థ వైఫల్య గాథ. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి వీలు లేదు. అవి మన శ్రద్ధను, మన ఆగ్రహాన్ని, మరీ ముఖ్యంగా మన చర్యను డిమాండ్ చేస్తున్నాయి. మార్పు ఎప్పుడో మొదలు కావాల్సింది!వి. విజయ సాయి రెడ్డి వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు;వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్‌కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్‌కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్‌కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్‌లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్‌లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్‌లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్‌ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్‌లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్‌దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్‌తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్‌నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్‌సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్‌ను సైబర్‌నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్‌ను సైబర్‌నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్‌ను హెచ్చరిస్తాం. ఐఫోన్‌ను సైబర్‌భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్‌కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్‌ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్‌లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్‌లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్‌లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్‌లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్‌లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్‌హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు కృత్రిమ మేధను వాడుతున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించి.. సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనేది వారి ఆలోచన. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అండతో నేరాలకు పాల్పడుతున్నవారికి అదే ఆయుధంతో చెక్ పెట్టనున్నారు. ప్రత్యేక ముఠాలు ఏర్పాటు సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవి సామాన్యులనే కాదు పోలీసులనూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎన్ని రకాలుగా చైతన్యపరుస్తున్నా.. నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి మరీ.. ఇక్కడి వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్ కాల్‌తో బురిడీ కొట్టించి.. ఖాతాలో ఉన్న సొత్తు అంతా ఊడ్చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో సిమ్‌కార్డులు తీసుకొని, బోగస్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి.. కొల్లగొడుతున్నారు. ఒక్కో నేరగాడు వందల సంఖ్యలో సిమ్‌కార్డులు సమకూర్చుకుంటున్నాడు. సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా ముఠాలే ఉన్నాయి. నిరక్షరాస్యులు, నిరుద్యోగులను నమ్మించి.. బ్యాంకు ఖాతా వాడుకునేందుకు అనుమతి ఇస్తే మంచి కమీషన్ ఇస్తామని ఆశపెడుతున్నారు. బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాల్లోకి, వాటిలో నుంచి వేరే ఖాతాలోకి మార్చి.. డ్రా చేసుకుంటున్నారు. కష్టమ్మీద ఆచూకీ కనిపెట్టినా.. నేరగాళ్ల ఆచూకీని పోలీసులు అతికష్టమ్మీద కనిపెట్టినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు వాడుతున్న సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి.. వాటిని రద్దు చేయించగలిగితే వారిని కట్టడి చేయచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్‌కార్డు లేకపోతే మోసం చేసేందుకు కాల్ చేయలేరు. బ్యాంకు ఖాతా లేకపోతే మళ్లించిన డబ్బు దోచుకోలేరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్ల సిమ్‌కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 28,610 సిమ్‌కార్డులను బ్లాక్ చేయించగలిగారు. వాటిని వాడిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్‌ను గుర్తించి, వాటిని కూడా బ్లాక్ చేయిస్తున్నారు. దాదాపు 2 వేల బ్యాంకు ఖాతాలనూ రద్దు చేయించారు. తమకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఇవన్నీ చేయించారు. ప్రక్షాళన షురూ.. సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి. బాధితులకు వచ్చిన ఫోన్ కాల్స్, డబ్బు మళ్లించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇక్కడ నమోదవుతుంటాయి. ఈ సమాచారంతోపాటు బ్యాంకింగ్ డేటా ఆధారంగా అనుమానాస్పద ఖాతాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం కృత్రిమమేధ సాయం తీసుకోనున్నారు. ఇదీ చదవండి: బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..? చాలాకాలంగా పనిచేయని బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయినా, ఒక ఖాతాలోకి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బు జమ అవుతున్నా అటువంటి వాటిని గుర్తించి, ఆయా బ్యాంకులను అప్రమత్తం చేయనున్నారు. అలాగే సిమ్‌కార్డుల విషయంలో సర్వీస్ ప్రొవైడర్లను ఇప్పటికే అప్రమత్తం చేశారు. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా లింక్‌లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్‌పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్‌లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఆన్లైన్లో ఆవులు.. ఊరించిన ఆఫర్.. తీరా చూస్తే..
ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లు ఊరిస్తుంటాయి.. ముందూ వెనక ఆలోచించకుండా నచ్చిన ఐటమ్ బుక్ చేసేస్తుంటారు. ఓ లాటరీ తగిలిందంటే లేదా ఓ ఆఫర్ ఇస్తున్నారంటే ఎందుకు, ఏంటి, ఎలా అన్న కనీస ఆలోచన లేకుండా సంబంధిత లింక్‌పై క్లిక్ చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తీర ఏదైనా లింక్‌పై క్లిక్ చేసి సైబర్ సేరస్థుల ఉచ్చులో చిక్కుకుంటారు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది భారత్ డిజిటల్ రంగంలో పురోగమిస్తోంది. గాడ్జెట్ల నుంచి కిరాణా సామగ్రి వరకు అన్నీ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దాంతో విక్రయదారులు కస్టమర్లను ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. స్మార్ట్పోన్లు వచ్చినప్పటి నుంచి చదువు ఉన్నవారు, లేనివారనే తేడా లేకుండా వాటిని ఉపయోగించి ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామందికి సైబర్‌నేరాలకు సంబంధించిన అవగాహనలేక కొందరు నేరస్థుల చేతుల్లో బలవుతున్నారు. తాజాగా గుర్గావ్కు చెందిన ఒక పాడి రైతు ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేయాలనుకుని సైబర్ నేరస్థులకు చిక్కి మోసపోయిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్లోని పాండాలాలో నివసిస్తున్న సుఖ్బీర్(50) అనే పాడి రైతు ఆవులను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆఫ్‌లైన్ రేట్లతో పోలిస్తే ఆన్లైన్లో భారీ రాయితీ ఉండడం గమనించాడు. దాంతో ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి మోసపోయాడు. ఈ మేరకు తన తండ్రి డబ్బు పోగొట్టుకున్న సంఘటనను తన కుమారుడు ప్రవీణ్ (30) వివరించాడు. ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్బీర్ నిత్యం పర్వీన్ ఫోన్‌ను ఉపయోగించేవాడు. యూట్యూబ్ వీడియోలను చూసేవాడు. గూగుల్‌లోని ఓ వెబ్సైట్లో ఆవులను చాలా తక్కువ ధరకు రూ.95,000కు అందజేస్తుందని గ్రహించాడు. ఇది సాధారణ ఆఫ్‌లైన్ ధరతో పోలిస్తే చాలా తక్కువని తెలుసుకున్నాడు. ఆన్లైన్లో ఆవులకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆవుల కోసం ఆరాతీస్తున్న విషయాన్ని తెలుసుకున్న సైబర్ సేరస్థులు ఫోన్ నంబర్ ద్వారా వాట్సప్‌లో ఆవుల ఫోటోలను పంపడం ప్రారంభించారు. మొదట ఒక్కో ఆవు ధర రూ.35,000 అని పేర్కొన్నారు. నాలుగు ఆవులను కొనుగోలు చేసేందుకు సుఖ్బీర్ ఆసక్తి చూపగా, గోశాల కింద ఆవులను రిజిస్టర్ చేస్తామని అబద్ధపు హామీ ఇచ్చారు. పైగా ధరను రూ.95,000కు తగ్గించారు. దాంతో అది నమ్మి ప్రవీణ్ తండ్రి జనవరి 19, 20 రోజుల్లో మొత్తం రూ.22,999 నగదు వారికి పంపించాడు. స్కామర్లు ముందుగా నిర్ణయించిన దానికంటే మరింత అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆవులను పంపించలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన సుఖ్బీర్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420 కింద ఫిర్యాదు చేశాడు. ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. ఆన్లైన్ మోసాలకు బలవకుండా ఉండాలంటే కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా లింకులపై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. మీకు తెలియని వాటిని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే షాపింగ్ చేయడం ఉత్తమం. అడ్రస్ బార్లో https (http కాదు) ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. ఆఫర్లు ఉన్నాయంటూ కనిపించే నకిలీ వెబ్సైట్ల జోలికివెళ్లొద్దు. ఈ కామర్స్ వెబ్‌సైట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ధర, డెలివరీ డేట్ లాంటి కొన్ని వివరాలు చూసి.. పేమెంట్ చేసేయకూడదు. ఆ ప్రోడెక్ట్ ఎప్పుడొస్తుంది, దాని ఎక్స్ఛేంజ్ పాలసీ, రిటర్న్ పాలసీ లాంటివి కూడా చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంత కఠినంగా ఉంటే.. అంత మంచిది అని చెబుతుంటారు. -
‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు..
నిత్యం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైళ్లను వినియోగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లుంటాయి. అసలు వేర్ అంటే ఏమిటో తెలుసా.. సాధనమని అర్థం. కంప్యూటర్లో మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్ వంటి భాగాలన్నీ హార్డ్వేర్లు. ఈ హార్డ్వేర్లను పనిచేయించేవి సాఫ్ట్వేర్లు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లో చాలారకాలు ఉంటాయి. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాన్సమ్వేర్ ఇది హానికర సాఫ్ట్వేర్. పీసీలో ఇన్స్టాల్ అయ్యి, లోపలి భాగాలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. పరికరాన్ని, డేటాను తిరిగి వినియోగించుకోనీయకుండా చేస్తుంది. రాన్సమ్ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. మనకు సంబంధించిన ఏ వివరాలు కనిపించవు. రాన్సమ్వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్/ యాంటీ మాల్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు. స్పైవేర్ ఇదొక మాల్వేర్. ఒకసారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్లైన్ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్వేర్’ అంటారు. ఇవి డౌన్లోడ్ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్స్టాల్ అవుతాయి. ఈమెయిల్ ఐడీలు, వెబ్సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్ ద్వారా థర్డ్ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్, పాస్‌వర్డ్‌ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్వేర్లను ‘కీలాగర్స్’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్ స్టోరేజినీ, నెట్వర్క్ ట్రాఫిక్‌నూ వాడుకుంటాయి. నాగ్వేర్ ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్‌ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్, నోటిఫికేషన్ మెసేజ్‌లతో లేదా కొత్త విండో ఓపెన్ చేస్తుండడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్‌పేజీ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నామనుకోండి. ఏదో యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని న్యూవిండోలో అడగొచ్చు. ప్రోగ్రామ్‌ను లోడ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్‌లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్ఇన్స్టాల్ చేయటం ఉత్తమం. ఇదీ చదవండి: పేటీఎంపై నిషేధం.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు క్రాప్వేర్ ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ముందే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్వేర్ను ఇన్స్టాల్ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్ స్పేస్‌ను వాడుకున్నా క్రాప్వేర్ హాని చేయదు. -
వాట్సప్‌లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. దానికితోడు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. సామాన్యులు, చదువురానివారు, బాగా చదువుకున్నవారు, పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు సైబర్‌దాడికి బలవుతున్నవారే. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం వాట్సప్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాక దాదాపు గరిష్ఠకాలం వాట్సప్‌లోనే గడుపుతుంటాం. అందులో వివిధ వ్యక్తులతో అన్ని వివరాలు చర్చించుకుంటాం. గోప్యంగా ఉండాల్సిన చాలా వివరాలు స్కామర్లు తెలుసుకుని ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మనల్ని వేదిస్తే చాల ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సప్‌కాల్స్‌తో జాగ్రత్త.. తెలియని నంబర్ల నుంచి సైబర్ నేరస్థులు నేరుగా కాకుండా వాట్సప్‌లో మిస్డ్ కాల్ చేస్తుంటారు. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేసేంతవరకు రింగ్ అవుతుంది కదా. ఈ స్పామ్ కాల్స్ రెండు మూడు రింగ్‌ల తరువాత కాల్ కట్ అవుతుంది. అన్నోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఈ విషయాన్ని గ్రహించాలని చెబుతున్నారు. హ్యాకర్స్ యాక్టివ్ వినియోగదారులను గుర్తించేందుకు ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రిసెర్చ్(బీపీఆర్డీ) పేర్కొంది. నిరుద్యోగులకు ఎర.. ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఒక సమస్య అయితే. వారిని సైబర్ నేరస్థులు ట్రాప్ చేసి వేదింపులకు గురిచేయడం మరో సమస్యగా మారుతుంది. నిరుద్యోగులకు గుర్తించి స్కామర్లు వారికి వాట్సప్‌లో మెసేజ్‌లు పంపుతారు. అప్పటికే ఎన్నో ఒత్తిడులతో ఉన్న నిరుద్యోగులు వాటిని నమ్మి వాటికి రిప్లై ఇస్తున్నారు. దాంతో మన ఫోన్లోని వివరాలు వారికి చేరుతున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరిట విభిన్ని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరమై వివరాలు పంపించాల్సి వస్తే క్రెడబిలిటీ ఉన్న ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే వీలైతే నేరుగా వెళ్లి కలిసి సదరు కంపెనీలతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు చోరీ.. వాట్సప్‌లో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్‌ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్లో భాగంగా తమ స్క్రీన్‌ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం ఖాతాలోని డబ్బు కొల్లగొడుతున్నారు. ఇదీ చదవండి: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ట్రేడింగ్ సలహాలతో.. కరోనా తర్వాత మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో ఆ లాభాలు చూపించి సామాన్యులకు ఎరవేస్తున్నారు. ట్రేడింగ్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లో లేని అనధికారిక అప్లికేషన్ లింక్‌లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు కొట్టేస్తున్నారు. -
PM Narendra Modi: దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో సైబర్ దాడుల కలకలం!
మైక్రోసాఫ్ట్‌లో సైబర్ దాడుల కలకలం రేపుతున్నాయి. రష్యాకు చెందిన హ్యాకర్లు తమ సంస్థపై సైబర్ దాడులు చేశారంటూ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన చేసింది. జనవరి 12న రష్యా హ్యాకర్స్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ సిస్టమ్స్‌పై దాడులు చేసి ఈమెయిల్స్‌ను దొంగిలించారు. వాటి సాయంతో సిబ్బంది అకౌంట్లలోని పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రష్యాలో సుపరిచితమైన హ్యాకింగ్ గ్రూప్స్ నోబెలియం, మిడ్నైట్ బ్లిజార్డ్ సభ్యులు నవంబర్ 2023 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థపై ‘పాస్వర్డ్ స్ప్రే అటాక్స్’ పాల్పడినట్లు తన బ్లాగ్‌లో పేర్కొంది. సంస్థకు చెందిన కంప్యూటర్లపై సైబర్ దాడులే లక్ష్యంగా ఒకే పాస్‌వర్డ్‌ను పలు మార్లు ఉపయోగించడంతో హ్యాకింగ్ సాధ్యమైనట్లు వెల్లడించింది. అయితే రష్యన్ గ్రూప్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ఇమెయిల్ అకౌంట్స్‌ను చాలా తక్కువ శాతం యాక్సెస్ చేయగలిగింది. ఆ ఈమెయిల్స్‌లో సీనియర్ లీడర్షిప్ టీమ్ సభ్యులు, సైబర్ సెక్యూరిటీ, లీగల్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని మైక్రోసాఫ్ట్ నిర్ధారించింది. మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ బృందం హ్యాకర్స్ దాడులు ఎందుకు చేశారో ఆరా తీసింది. ఇందులో రష్యన్ హ్యాకర్స్ గ్రూప్ మిడ్నైట్ బ్లిజార్డ్ గురించి సమాచారం ఉన్న ఈమెయిల్స్ సేకరించే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
‘డిజిటల్ అరెస్ట్’ గురించి తెలుసా..?
పదేళ్ల కిందట క్రైమ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా.. క్రైమ్ జరిగేతీరు, దాని విధానం, రూపం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి షాపింగ్ చేయటం తెలిసిందే. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగడం మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం..డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. అయితే తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే.. సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఇలాంటిదే. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్ అరెస్ట్’. డిజిటల్ అరెస్ట్ కొత్త సైబర్ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం. నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్‌ను ట్రాన్స్ఫర్ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్ కాల్ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక గానీ కాల్ కట్ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. మరేం చేయాలంటే.. భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్‌ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు. -
రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
సైబర్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేస్తున్నారు. రుణయాప్‌ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్‌లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే.. వస్తువులు విక్రయిస్తామంటూ.. ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటూ.. మోసగాళ్లు పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్‌లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్‌ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. పార్సిళ్ల పేరుతో.. సైబర్ నేరస్థులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. అప్‌గ్రేడ్ చేస్తామంటూ.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు.