సిస్టమ్స్‌పై మాల్‌వేర్ దాడులు నిజమే
32 లక్షల కార్డుల వివరాల చోరీ ఉదంతంపై హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్
ముంబై: కార్డు ఆధారిత లావాదేవీల భద్రతపై ఆందోళన కలిగించే విధంగా గతేడాది తమ సిస్టమ్స్ సైబర్ దాడులకు గురైన మాట వాస్తవమేనని హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్(హెచ్‌పీఎస్) వెల్లడించింది. దీని వల్ల వినియోగదారులకు, బ్యాంకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. 2016 మధ్యలో హిటాచీ సెక్యూరిటీ సిస్టమ్స్‌పై మాల్‌వేర్ దాడి జరిగిన సంగతి సెక్యూరిటీ ఆడిట్ సంస్థ ఎస్‌ఐఎస్‌ఏ ఇన్ఫర్మేషన్ నివేదికలో తేలింది. తాము అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ ఊహించని విధంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు హెచ్‌పీఎస్ ఎండీ లోనీ ఆంథోనీ తెలిపారు.
మాల్‌వేర్ చొరబడిన తీరు గురించి తెలిసినప్పటికీ ఎంత మేర డేటా చౌర్యం జరిగిందన్నది నిర్ధారించలేమన్నారు. గతేడాది మే 21–జూలై 11 మధ్యకాలంలో హెచ్‌పీఎస్ సర్వీసులు అందిస్తున్న ఏటీఎంలలో మాల్‌వేర్ చొరబడటంతో దాదాపు 32 లక్షల పైగా డెబిట్ కార్డుల సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు అంచనాలు ఉన్నాయి. 600 మంది పైగా కస్టమర్లు రూ. 1.3 కోట్ల మేర నష్టపోయినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. హెచ్‌పీఎస్‌కి అతి పెద్ద క్లయింట్ అయిన యస్ బ్యాంక్‌కి చెందిన ఒకానొక ఏటీఎం నుంచి ఈ మాల్‌వేర్ .. మొత్తం వ్యవస్థలోకి ప్రవేశించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చాలా మటుకు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త కార్డులు జారీ చేయాల్సి వచ్చింది.